వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘‘అనుకోకుండా మూడు రోజులు సెలవులు కలిసొస్తున్నాయి . ఎక్కడికన్నా ట్రిప్‌కి వెడదాము ‘‘ హుషారుగా అన్నాడు రాకేష్.
‘‘సెలవు కదా అని షికారు వెళ్లిపోతే ఎలాగ?’’ అంటూ నవ్వుతూ కళ్లెగరేసాడు అనంత్.
‘‘మరి ఏం చేస్తాము.. సరదాగా ఎంజాయ్ చేయక’’ విసుగ్గా అన్నాడు సందీప్.
‘‘ఏముంది, రూమ్‌లో కూర్చుని భజన చేద్దాము’’ వ్యంగ్యంగా అన్నాడు రాకేష్.
‘‘ఓయ్.. రేపు సెలవు ఎందుకో మర్చిపోయారా? అందుకే ఇలా మాట్లాడుతున్నారా… రేపుమటుకు క్యాంపస్‌లో ఉందాము. కావాలంటే మిగతా రెండురోజులు ఎటన్నా వెడదాము’’ తేల్చి చెప్పాడు అనంత్.
‘‘ఏమిటి, రేపు అంత ముఖ్యమైన పని క్యాంపస్‌లో’’ ఒకేసారి ప్రశ్నించారు రాకేష్, సందీప్.
‘‘అదేంటి… మర్చిపోయారా? రేపు ‘ఇండిపెండెన్స్ డే’ కదా! మన క్యాంపస్‌లో జరుగుతున్న ‘జండా వందనంకు ‘ఫంక్షన్ ఎటెండ్ అవ్వొద్దా? ఇది క్యాంపస్‌లో మన మొట్టమొదటి స్వాతంత్య్ర దినోత్సవం’’ గొంతులో ఓ ఆరాధనా భావంతో అన్నాడు అనంత్.
‘‘అబ్బా, ఇంకా అలాంటి వేడుకలకి హాజర్ అవ్వటమా? హైస్కూల్ నుండే అలాంటి వన్నీ మాయ మయ్యిపోయాయి ‘‘చేతులతో యాక్షన్ చేస్తూ అన్నాడు రాకేష్.
‘‘నీకు బిస్కట్స్, చాక్లెట్స్ కావాలంటే మేము కొనిస్తాములే’’ అంటూ అనంత్ భుజం విూద గట్టిగా చరిచాడు సందీప్ నవ్వుతూ.
‘‘ఏనాడు కూడా ఆ రోజు పంచే బిస్కట్స్, చాక్లెట్స్ కోసం స్వాతంత్య్రదిన వేడుకలకు నేను వెళ్లలేదు. మా నాన్న చెప్పిన ‘దేశం పట్ల ప్రేమ, ఉండాలి. మనకు స్వాతంత్య్రం సాధించిన ఆనాటి మహ నీయులను స్మరించుకోవటం, జెండా వందనం చేయటం మన కనీస బాధ్యత’’ అనంత్ గొంతు నిండా నిజాయితీ.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇనిస్టిట్యూట్‌లో ఆ ఏడే గ్రాడ్యుయేషన్‌లో చేరిన విద్యార్ధులు వాళ్లు. ఆ ముగ్గురూ రూమ్మేట్స్ కూడా. వారి మధ్య ఇప్పుడిప్పుడే స్నేహం అల్లుకుంటోంది.
‘‘రేపు వేడుకకు ఎటెండ్ అవ్వటం మాత్రమే కాదు..ముందుగా ఆ ఫంక్షన్ ఏర్పాట్లలో కూడా సాయం చేయాలని డిసైడ్ అయిపోయా. మరి ఆ పనులు చూసుకోవాలి కదా… బై’’ అంటూ రూమ్ నుండి బయటకు నడిచాడు అనంత్.
‘‘మా నాన్న రైతు. నాది కృష్ణా జిల్లాలో ఓ పల్లెటూరు’’ అని మొట్టమొదట రోజు, క్లాసులో పరిచయాలప్పుడు అనంత్ గర్వంగా చెప్పుకోవటం ఆ క్షణాన సందీప్ మనసులో మెదిలింది.
‘‘పల్లెటూరిలో పుట్టినవాడు కదా! అందుకే ఇంత మంచి ఇనిస్ట్టిట్యూట్‌లో చేరి, మనలాంటి మోడర్న్ వాళ్లతో కలిసి ఉంటున్నా ఆ పాత తరం ఆలోచనలు, అలవాట్లు పోయినట్లు లేవు’’ అని కిసుక్కున నవ్వాడు.
సందీప్‌తో తనూ జత కలిపాడు రాకేష్.
హైస్కూల్‌కి వచ్చిన దగ్గర నుండి కోచింగులు, పరుగులతో ‘ఆగష్టు 15 అంటే ఓ సెలవు దినంగా ఊపిరి పీల్చుకోవటమే తప్ప స్వాతంత్య్రం వచ్చిన పవిత్రమైన రోజు అనే మాటే మర్చిపోయిన భారత పౌరులు వాళ్లు.
వాళ్లకి అనంత్ ‘పల్లెటూరి వాడు’ అనే చిన్నచూపు ఉంది. కానీ అది అనంత్ ముఖం విూద ప్రదర్శించక పోవటానికి కారణం వాళ్ల సంస్కారం కాదు. అతను క్లాస్‌లో చూపించే తెలివి, దానికి ప్రొఫెసర్స్ చూపే మన్ననే వారికి అడ్డుపడుతోంది.
* * * * *
డైనింగ్ హాల్ విద్యార్ధుల కోలాహలంతో, పక్షులు చేరిన చెట్టులాగా నిండుగా… గలగలగా ఉంది. సందీప్, అనంత్, రాకేష్ కూడా ఓ ప్రక్కన చేరి కబుర్లాడుకుంటూ డిన్నర్ చేస్తున్నారు.
అంతలోనే అనంత్ చటుక్కున లేచి, అప్పుడే డిన్నర్ ముగించి చేయి కడుక్కోవటానికి వెడుతున్న ఓ విద్యార్ధిని ‘ఎక్స్యూజ్ విూ’ అంటూ పిలిచి ఆపాడు. అర్థ్ధం కానట్లు చూశాడు అతను.
‘చూడు మిత్రమా, ఎందుకు ఆహారాన్ని అలా వృథా చేస్తావు? కావలసినంత పెట్టుకు తినొచ్చు కదా’’ అంటూ అతని ప్లేట్‌లో వృథాగా వదిలివేసిన పదార్ధాల కేసి చూపిస్తూ చెప్పాడు అనంత్.
అతను ఏదో జవాబు చెప్పబోయి ఆగిపోయి, ‘ఓకే… ఇకపై అలా వేస్ట్ చేయను’’ అంటూ వాష్ బేసిన్ వైపు అడుగులు వేశాడు. వాళ్లను గమనిస్తున్న కొందరు వింతగా చూశారు.
‘‘ఫుడ్ వేస్ట్ చేయొద్దు’’ అంటూ మమ్మల్ని ఎలాగూ చంపుతావు. కానీ ఎవరో ముక్కూ మొహం తెలియని వాళ్లకి నీ స్పీచ్ ఏంటి బాబు? అందరూ మన వంక ఎలా చూస్తున్నారో చూడు. అయినా, కొంచెం ఫుడ్ వేస్ట్ చేస్తే ఏం కొంప మునిగిపోతుంది’’ చిరాకు పడిపోయాడు సందీప్.
తిరిగి వచ్చి, తన ప్లేట్ ముందు కూర్చుంటున్న అనంత్ ఒక్క క్షణం చుట్టూ చూశాడు.
‘‘రైతు బ్రతుకును విూరు దగ్గరగా చూస్తే, ఒక్క మెతుకు కూడా వృథా చేయలేరు ఎవరూ’’ ఖంగుమంది అనంత్ గొంతు. ఆ తరువాత తెలియని నిశ్శబ్దం అలుముకుంది అక్కడ.
భోజనం ముగించి చెయ్యి కడుక్కుని ‘‘అమ్మ మెసేజ్ చేసింది ఇందాకా, డిన్నర్ తరువాత కాల్ చెయ్యమని. మాట్లాడి వస్తాను.. బై ..’’ అంటూ బయటకు నడిచాడు అనంత్.
‘‘అబ్బా, వీడితో మహా కష్టం రా’’ అనంత్ వెళ్లిన వైపు చూస్తూ అన్నాడు సందీప్.
‘‘మనలాగా రిచ్ బాక్ గ్రౌండ్‌తో సిటీలో పెరగలేదుగా వాడు. పైగా వాళ నాన్న ఓ రైతు. డబ్బులు లేనోళ్లు అలా కాక ఎలా మాట్లాడుతారు’’ రాకేష్ గొంతులో నిరసన.
‘‘అవునురా… వాడు సినిమాకి, షాపింగుకు, బయట డిన్నర్‌కి… దేనికీ ఎప్పుడు పడితే అప్పుడు రాడు. అన్నీ ఓ లెక్కే. చివరకు తినే మెతుకులు కూడా లెక్క పెడుతున్నాడు చూడు. డబ్బులున్న బ్యాచ్ కాదు కదా’’
‘‘అందుకే తన చేతకాని తనాన్ని కవర్ చేస్తూ ఇట్లా స్పీచ్‌లు ఇస్తున్నాడు’’
వెటకారపు మాటలతో అనంత్ గురించి పరోక్షంలో మాట్లాడుకుని ఇద్దరూ సంతృప్తి పడ్డారు.
* * * * *
కొన్ని నెలల కాలం కరిగిపోయాయి.
‘మా ఊరికి రండి ఈ సంక్రాంతి సెలవులకి… పల్లె అందాలు చూద్దురు’ అని అనంత్ మనల్ని తెగ పిలుస్తున్నాడు. వెడితే మంచి భోజనం అన్నా పెట్టగలడా మనకు’ ఎగతాళిగా అన్నాడు రాకేష్.
‘‘ఏమో, నాకు నమ్మకం లేదు. అసలు ఆ పల్లెటూరిలో ఎలా ఉంటామురా బాబు’’‘ అంటూ నుదురు కొట్టుకున్నాడు సందీప్.
‘‘పోనీ, ఓ పని చేద్దాం. అంత ముచ్చట పడుతున్నాడుగా, వెళ్లి ఓ లుక్ వేద్దాము. మనకి వాడిని ఆట పట్టించటానికి మెటీరియల్ దొరుకు తుందేమో’’ హుషారుగా ఈల వేశాడు రాకేష్.
‘‘ఓకే… ఇదేదో బానే ఉన్నట్లుంది’’ అంటూ బొటన వేలు ఎత్తి చూపుతూ తన సంసిద్ధతను వెలిబుచ్చాడు సందీప్.
లైబ్రరీ నుండి అప్పుడే వచ్చిన అనంత్‌తో ‘‘మీ ఊరికి రావటానికి మేము సిద్ధం’’ అని ప్రకటించారు ఇద్దరూ.
‘‘ఇన్నాళ్లుగా మనం రూమ్మేట్స్‌గా ఉన్నాము. స్నేహితులమైపోయాము. విూరు మా ఊరికి రావటం మహా సంతోషంగా ఉంది’’ అంటూ వారిని ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు అనంత్.
* * * * *
తమ క్యాంపస్ నుండి ముందు రోజు రాత్రి బయలుదేరిన ముగ్గురు మిత్రులు, తెల్ల తెల్ల వారుతుండగా రైల్వే స్టేషన్‌లో దిగారు. బయటకు రాగానే ‘‘వచ్చారా బాబు’’ అంటూ ఓ వ్యక్తి వాళ్లను రిసీవ్ చేసుకుని ప్రక్కనే ఉన్న ఎడ్ల బండీ కేసి నడిచాడు.
‘‘బాబోయ్, ఈ బండీలో ప్రయాణమా? మా జీవితంలో ఎప్పుడూ ఎక్కలేదు’’ అయిష్టంగా మొహాలు పెట్టారు రాకేష్, సందీప్.
‘‘ఈ బండిలో ఓపెన్‌గా కూర్చుని, పచ్చటి చెట్లు, పొలాల మధ్య నుండి చల్లగాలి పీలుస్తూ సాగే ప్రయాణం ఎంత బాగుంటుందో తెలుసా… రండి రండి. తొందరగా ఎక్కండి’’ అంటూ వాళ్లకు చెయ్యి అందించి బండీ ఎక్కించాడు.
రాకేష్, సందీప్ ఒకరి కళ్లలోకి ఒకరు చూసు కున్నారు.
వారి కళ్లల్లోని భావం చదవగలిగితే ‘‘తన లేనితనాన్ని కప్పి పుచ్చుకునే కబుర్లు’’ అని అనంత్‌కు అర్థమయ్యేది.
దోవలో తను, తన స్నేహితులతో కలిసి ఆడుకున్న ప్రదేశాల్ని, చదువుకున్న పాఠశాలని… ఆ ఊరి గ్రామ దేవత గుడిని అనంత్ వారికి పరిచయం చేశాడు.
అయిష్టంగా ఎడ్ల బండీలో ప్రయాణానికి సిద్ధపడిన ఆ ఇద్దరూ, ఎక్కిన తరువాత ఎంతో థ్రిల్‌కి గురయ్యారు. మెడలో కట్టిన మువ్వలు మోగుతుంటే, చెంగున చెంగున పరుగులు పెడుతున్న ఎడ్లు, దోవకు ఇరువైపులా స్వాగతిస్తున్నట్లుగా ఊగుతున్న చెట్లు… పచ్చగా కనువిందుచేస్తున్న పొలాలు, విరిసిన పూలతోటలు వారికి ఓ కొత్త అనుభూతిని కలుగ చేశాయి.
అంతలోనే బండి అంత ఎత్తున రాజ ప్రాసా దంలా ఉన్న ఇంటి ముందు ఆగింది. ఇంటి ముందు ఖరీదైనా కార్లు రెండు పార్క్ చేసి ఉన్నాయి.
అది చూసిన రాకేశ్, సందీప్‌లకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు.
‘‘మా నాన్న’’ అని అనంత్ త్రీ ఫోర్త్‌తో, టీ షర్ట్‌తో అప్పుడే అక్కడకు వచ్చిన వ్యక్తిని పరిచయం చేశాడు. రైతు అంటే, ‘పంచే లాల్చీ, తలపాగాతో ఉంటాడు’ అన్న వారి ఊహకి భిన్నంగా ఉన్న ఆయనని చూసి రాకేష్, సందీప్ ఒకింత షాక్‌య్యారు. ఆయన వెనుకే నిండుగా నవ్వుతూ అనంత్ అమ్మ.
‘‘మా అబ్బాయి ‘నాకు మంచి రూమ్మేట్స్ దొరికారు. మంచి ఫ్రెండ్స్ అయిపోయాము మేము’ అని విూ గురించి చెపుతుంటాడు. రండి రండి’’ అంటూ అనంత్ వాళ్లనాన్న, అమ్మ ఎంతో ఆత్మీయంగా ఆ ఇద్దరినీ రిసీవ్ చేసుకున్నారు. కానీ ఆ ఇద్దరిలో ముడుచుకుపోయిన భావన.
‘‘వాళ్లు సిటీ పిల్లలు. కారు పంపుతానురా’’ అంటే వినలేదు. ‘కార్లు వాళ్లకు కొత్త కాదు కానీ ఎడ్ల బండీ ఎక్కే ఛాన్స్ వాళ్లకు లేదుగా. అందుకని ఎడ్లబండీ పంపండి. నాకు తెలుసు… వాళ్లు సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు’ అని విూ ఫ్రెండ్ గొడవ పెడితే పంపాను. ప్రయాణం బానే ఉందా?’’ కరచాలనం చేస్తూ ఆప్యాయంగా అడిగాడు ఆయన.
‘‘చాలా ఎంజాయ్ చేశాం అంకుల్’’ ఇద్దరూ నిజాయితీగా జవాబిచ్చారు.
పల్లెటూరిలో అత్యంత ఆధునికంగా అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు వారిని అబ్బుర పరిచింది.
ఆ మధ్యాహ్నం అనంత్ వాళ్ల నాన్న, విశాలంగా విస్తరించి ఉన్న తన పొలాన్ని, పండిస్తున్న ప్రతి పంట గురించి దగ్గరుండి శ్రద్ధగా వివరించి చూపించాడు.
‘ఇంత సంపద ఉండి, అనంత్ ఎందుకు అంత లెక్కగా ఉంటున్నాడు?’ అనే ప్రశ్న వాళ్ల మనసుల్లో కందిరీగలాగా రొద పెడుతోంది.
ఆ సాయంత్రం ‘మేడ విూద గది చూద్దురు గాని రండి’ అని ఇద్దరినీ వెంట పెట్టుకుని పైకి తీసుకెళ్లాడు. అది గది కాదు పుస్తకాల గుడి… లైబ్రరీ. అలా ఊహించని రాకేష్, సందీప్ గోడ విూద కాన్వకేషన్ డ్రెస్‌లో ఉన్న అనంత్ నాన్న ఫోటో చూసి మరింత షాక్‌కు గురయ్యారు.
‘‘విూ డాడీ ఏనా’’ ఆశ్చర్యంగా అడిగాడు రాకేష్.
‘‘అవును, మా నాన్నే. ‘విజ్ఞానానికి, మానస వికాసానికి చదువు ముఖ్యం’ అని నాన్న నమ్మకం. అందుకే ఎమ్.టెక్. చేశారు. వ్యవసాయం విూద మక్కువతో తిరిగి తన ఊరికి వచ్చి రైతుగా స్థిరపడ్డారు. తను సంపాదించిన విజ్ణానాన్ని తన వ్యవసాయ అభివృద్ధికే కాక ఊరిలోని రైతులకు కూడా అందచేశారు’’ అన్నాడు గర్వంగా అనంత్.
‘‘మరి ఇన్నీ ఉండి, నువ్వు అంత సింపుల్‌గా, ఓ లెక్కగా ఎలా’’ అప్పటిదాకా ఉగ్గ బట్టుకున్న ప్రశ్నని ఇహ ఆపుకోలేనట్లు ఆరాటంగా అడిగాడు సందీప్.
‘‘నేను గ్రాడ్యుయేషన్ కోసం బయలుదేరినప్పుడు నాన్న ఒక మాటన్నారు…’’ ఒక్క క్షణం ఆగాడు ఆలోచనగా అనంత్.
ఊపిరి బిగపట్టి చూస్తున్నారు ఇద్దరూ.
‘‘నువ్వు అక్కడికి వెళ్లేది విద్య కోసం. నీ స్థాయిని చూపెట్టుకోవటం కోసమో, లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవటం కోసమో కాదు. పైగా సరదాలకి, చదువుకీ … రెండిటికీ కూడా ఈ వయసే సరి అయినది. కానీ బాలెన్స్ కోల్పోకు… ధ్యేయాన్ని మరిచిపోకు. అనుభవంతో చెపుతున్నా’’ అన్న నాన్న మాటలు నాకు ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉంటాయి. అందుకే అలా ‘‘అన్నాడు తేలికగా నవ్వేస్తూ అనంత్’’.
– సి. యమున