జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

‘ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమేయం నిజం. డబ్బులు చేతులు మారిన మాటా నిజం. అందుకే ఈడీ అరెస్ట్‌ చట్టవిరుద్ధం కాదు. ఎప్పుడు అరెస్టు చేయాలో, దర్యాప్తు ఎలా జరగాలో ముఖ్యమంత్రి నిర్ణయించలేరు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనకి ప్రత్యేక హక్కులు ఉండవు.’ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌ మీద అక్కడి హైకోర్టు నిష్కర్షగా చెప్పేసిన మాటలు ఇవే. అంటే చట్టం ముందు అందరూ సమానమేనన్న విషయాన్ని స్పష్టం చేయడం వ్యక్తిగతంగా కేజ్రీవాల్‌కే కాదు, అతడి పార్టీకి, వారి వెనుక ఉన్న శక్తులకూ కూడా షాక్‌ ఇవ్వడమే. కింది కోర్టు మొదలుకుని, సుప్రీం కోర్టు వరకూ ఎక్కడా కేజ్రీవాల్‌ పప్పులు ఉడకడం లేదు. గంటకు లక్షలు, కోట్లు తీసుకునే న్యాయవాదులే వాదిస్తున్నా, తమ ఎదుట ఈడీ ఉంచిన ఆధారాల కారణంగా న్యాయస్థానాలు లొంగకపోవడం గమనార్హం. ఢిల్లీ హైకోర్టు చేత బాగా అక్షింతలు వేయించుకున్న వెంటనే విక్రమార్కుడి చందంగా కేజ్రీవాల్‌, అతడి న్యాయవాదులు అర్జెంట్‌ అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించినా, అక్కడ న్యాయమూర్తులు కేసును పక్కకు పెట్టడం కేజ్రీని, అతడి మద్దతుదారులను తీవ్ర నిరాశలోకి నెట్టి వేసింది.

కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఇటీవల యు.ఎస్‌, జర్మనీ, పశ్చిమ దేశాలు, ఐక్యరాజ్యసమితి చేసిన వ్యాఖ్యలు, ఆ దేశాల మీడియా ప్రచారం వెనుక వాటి భారత వ్యతిరేక అజెండా స్పష్టమవుతోంది. భారత్‌పై ఇంతలా విషం కక్కేలా పశ్చిమ దేశాలు సంబంధాలు నెరపుతున్నాయంటే ప్రధాన కారణం వ్యాపారం, భౌగోళిక రాజకీయాల్లో మనదేశం కీలక పాత్ర పోషించడం వల్ల మాత్రమే. వీటికి తోడు పశ్చిమ దేశాల మీడియా కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను ‘విపక్షాలను అణచివేసే చర్య’గా చూపుతూ మోదీపై విమర్శలు గుప్పించడం విచిత్రమే.

‘‘దేశంలో చట్టపరమైన కార్యకలాపాలు స్వేచ్ఛా యుత వాతావరణంలో, పారదర్శకంగా కొనసాగా లని కోరుకుంటున్నాం’’, లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత అమెరికా స్పందన ఇది. అమెరికా వ్యవహారశైలిపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. యు.ఎస్‌. సీనియర్‌ దౌత్యవేత్త గ్లోరియా బెర్బెనాను పిలిపించి, ఇది భారత అంతర్గత వ్యవహారమని తీవ్రస్థాయిలో తన నిరసనను తెలియజేసినప్పటికీ, యు.ఎస్‌. తన వ్యవహార శైలి మార్చుకోలేదు. పైగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలు బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్‌ చేసినట్టు ఆ పార్టీ నేతలు వెల్లడిరచిన నేపథ్యంలో ‘‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ సమర్థ వంతంగా ప్రచారం చేయకుండా ఆ పార్టీకి చెందిన పలు బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ప్రీజ్‌ చేసినట్టు వచ్చిన ఆరోపణలు మాకు తెలుసు. ఈ విషయంలో కూడా మేం పారదర్శకత, సమయానుకూల న్యాయ ప్రక్రియను ప్రోత్సహిస్తాం’’ అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మ్యాథ్యూమిల్లర్‌ పేర్కొన్నారు. జర్మనీ కూడా కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై అంతకుముందు స్పందించింది. ఆ దేశ దౌత్యవేత్తను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసిన తర్వాత జర్మనీ వెనక్కి తగ్గడం గమనార్హం. అమెరికా స్పందించిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టెఫాన్‌ డుజారిక్‌ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ‘భారత్‌ సహా ఎన్నికలు జరిగే ప్రతి దేశంలో ప్రజల, రాజకీయ పౌరహక్కులు సురక్షితంగా ఉంటాయని భావిస్తున్నాం. స్వేచ్ఛ, న్యాయమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ రకమైన స్పందనలు భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు చేసే ప్రయత్నాలు తప్ప మరోటి కాదు. అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాలు తమ సహచర ప్రజాస్వామ్య దేశాల్లో కొనసాగుతున్న చట్టపరమైన కార్యకలాపాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని భారత్‌ స్పష్టం చేసింది. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేది రెండు మార్గాల రహదారి వంటిది. ఇది ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుందని భారత్‌ హెచ్చరించింది.

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ నేపథ్యం

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ నేపథ్యానికి వస్తే లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి తొమ్మిదిసార్లు ఈడీ సమన్లు జారీచేసినా హజరు కాలేదు. విలువలు గురించి నిత్యం మాట్లాడే కేజ్రీవాల్‌ విచారణకు హాజరై తన సచ్చీలతను నిరూపించుకోవాల్సింది. కానీ జరగలేదు. చివరకు ఈడీ అధికార్లు ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్‌ చేయాల్సివచ్చింది. నిజానికి 2013లో అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్తగా ఉన్న కేజ్రీవాల్‌ అసలు రాజకీయాల్లోకే అడుగుపెట్టనన్నారు. కాంగ్రెస్‌తో అసలు జట్టు కట్టే ప్రసక్తేలేదన్నారు. ఈ రెండు వాగ్దానాలను ఆయన నిలుపుకోలేదు.

అవినీతి మరకలతో ఏడురోజుల కస్టడీ ముగిసిన తర్వాత మార్చి 28న ఢల్లీి రౌజ్‌ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు ఆయన స్వయంగా నాటకీయ రీతిలో తన వాదనను వినిపించారు. ఇప్పటివరకు ఈడీ 31వేల పేజీలను కోర్టులో ఫైల్‌ చేసిందని, 162 మందిని విచారించిం దని, 25వేల పేజీల నివేదికను ఫైల్‌ చేసిందని, తన పేరు కేవలం నాలుగు స్టేట్‌మెంట్లలోనే ఉన్నప్పుడు తననెందుకు అరెస్ట్‌ చేశారంటూ ప్రశ్నించినప్పుడు, న్యాయమూర్తి ఈ వాదనను అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని ఆదేశించారు.

ఢిల్లీ హైకోర్టు అక్షింతలు

మరోవైపు, లిక్కర్‌ కేసులో ఈడీ అరెస్ట్‌ అక్రమ మంటూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్‌ 9న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సేకరించిన సమాచారం, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ స్థాయిలో వ్యక్తిగతంగా ఇతరులతో కలిసి ఈ కుట్రలో పాలు పంచుకున్నట్టు స్పష్టం చేస్తోందని హైకోర్టు న్యాయ మూర్తి స్వర్ణకాంత శర్మ వెల్లడిరచారు. అందువల్ల ఈడీ అరెస్ట్‌ ‘చట్టవిరుద్ధం’ కాదని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తనను విచారించాలన్న కేజ్రీవాల్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ, ఏవిధంగా విచారించాలనేది కోర్టు నిర్ణయిస్తుందన్నారు. ఢల్లీి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్‌పై విచారణను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ తెలపడం, తక్షణమే విచారణ చేపట్టేందుకు తిరస్కరించడంతో తీహార్‌ జైల్లో జ్యుడిషియల్‌ కస్టడీలో రిమాండ్‌ ఖైదీగా మరికొంతకాలం కొనసాగక తప్పని పరిస్థితి!

ఇదిలావుండగా ఖలిస్తాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌కు చెందిన ఒక వీడియో ఇటీవల విడుదలైంది. 2014`22 మధ్యకాలంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 16 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.133.54 కోట్లు) ఖలిస్తానీ గ్రూపు చెల్లించినట్లు గురు పత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు. అసలే లిక్కర్‌ స్కాంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి, ఈ వీడియో శరాఘాతంగా మారింది.

కాగా కేజ్రీవాల్‌ ప్రైవేట్‌ పర్సనల్‌ సెక్రటరీ బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ విధుల్లోనుంచి తొలగించడం తాజా పరిణామం. 2007లో విధులు నిర్వర్తించకుండా అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారని బిభవ్‌ కుమార్‌తో పాటు మరో ముగ్గురిపై నోయిడా డెవలప్‌మెంట్‌ అథారిటీ మహేష్‌పాల్‌ అనే మరో అధికారి కేసు పెట్టడంతో పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేశారు. దీనికి సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాలనాపరమైన చర్యల్లో భాగంగా బిభవ్‌కుమార్‌ను కేజ్రీవాల్‌ ప్రైవేటు సెక్రటరీగా విధులనుంచి తొలగిస్తూ ఏప్రిల్‌ 11న ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ ఈయన్ను ఏప్రిల్‌ 8వ తేదీన ప్రశ్నించడం గమనార్హం. కోర్టుల నుంచి సానుకూల స్పందన రాకపోవడం తీహార్‌ జైల్లో వున్న కేజ్రీవాల్‌కు మరో దెబ్బ కాగా, ఢిల్లీ రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ ఏప్రిల్‌ 10న తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం కేజ్రీవాల్‌కు అశనిపాతం వంటిది. ఈయన రాజీనామాతో ఆప్‌లో రానున్న కాలంలో ఎటు వంటి పరిణామాలు సంభవిస్తాయో నన్న ఆసక్తి నెలకొంది.

రాఘవ్‌ ఛద్దా వివాదం

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుపడిన రాఘవ్‌ చద్దా లండన్‌లో ఖలిస్తాన్‌ మద్దతుదారు, బ్రిటన్‌ పార్లమెంట్‌లో మొట్టమొదటి సిక్కు మహిళా ఎంపీ ప్రీత్‌ కౌర్‌ గిల్‌తో కలసి దిగిన ఫోటోలు ఆమ్‌ ఆద్మీ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టాయి. ఆప్‌కి చెందిన ఈ వివాదాస్పద రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ ఛద్దా ఇంకా లండన్‌లో ఉన్నారు. ఈ బంధం వెనుక రహస్యం వెల్లడిరచాలని బీజేపీ ఐటీ విభాగం నాయకుడు అమిత్‌ మాలవీయ కోరారు. 2017 బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో ఎడ్‌బాస్టన్‌ సీటునుంచి లేబర్‌ పార్టీ తరపున దిగువ సభకు ఎన్నికైన తొలి సిక్కు మహిళ గిల్‌. ఆమె భారత వ్యతిరేకి, ఖలిస్తాన్‌ అనుకూలవాది అని తెలియజెప్పే ఉదాహరణలు చాలా ఉన్నాయి.

‘డీప్‌ స్టేట్‌’ ప్రభావం

యు.ఎస్‌. మొదలైన దేశాల్లో ప్రభుత్వాల విధానాలపై కీలకమైన ప్రభావాన్ని కలిగివుండే ‘అనధికార ప్రైవేటు వ్యక్తులు లేదా ఎన్నికలతో సంబంధంలేని రహస్య ఏజెన్సీలు, మీడియా సంస్థలు’ (వీరినే డీప్‌ స్టేట్‌ అని వ్యవహరిస్తారు) భారత రాజకీయ, పాలనా వ్యవస్థలో ఎప్పటికప్పుడు కలుగ జేసుకుంటూ అస్థిరం చేసే ప్రక్రియలో భాగమే కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై ఆయా దేశాల స్పందనకు కారణమని చెప్పాలి. పుణేకు చెందిన గ్లోబల్‌ స్ట్రాటిజిక్‌ పాలసీ ఫౌండేషన్‌ చీఫ్‌ డాక్టర్‌ అనంత్‌ భాగవత్‌ అభిప్రాయం ప్రకారం, రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం యు.ఎస్‌. నేతృత్వంలోని పశ్చిమ దేశాలకు ఎంతమాత్రం ఇష్టంలేదు. అమెరికాకు చెందిన బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి విపక్ష నేతలకు మద్దతు కొనసాగిస్తుంటాడన్నది చాలామంది అభిప్రాయం. జార్జ్‌ సోరోస్‌కు అనుకూ లంగా భారత జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ వ్యవహారశైలి ఉన్నదనేది మరొక ఆరోపణ. కేజ్రీవాల్‌కు మద్దతుగా జర్మనీ, యు.ఎస్‌. వంటి దేశాలు తమ గళమెత్తాయంటే, వాటిలోని భారత వ్యతిరేకత బయట పడటమే కాదు, కేజ్రీవాల్‌ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా మారింది.

 పశ్చిమ దేశాలు కేజ్రీవాల్‌లాంటి నాయకులకు అవార్డులు వంటివాటి ద్వారా అంతర్జాతీయంగా ఒక గుర్తింపు తెస్తాయి. ఇందులో పాశ్చాత్య మీడియా కూడా పాలుపంచుకుంటుంది. కేజ్రీవాల్‌ అరెస్టయిన వెంటనే వాషింగ్టన్‌ పోస్ట్‌ ‘‘భారత విపక్షాల అణచివేత’’ అనే పెద్ద శీర్షికతో ఒక వార్తను ప్రచురించింది. ఇక బీబీసీ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 మధ్యకాలంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ‘క్షీణించిన ప్రజా స్వామ్యం’ అని వ్యాఖ్యానించడం వంటివి ఇందులో భాగమే. అయినా మోదీకి భారత ప్రజల మద్దతు తగ్గలేదని ఆ దేశాలు గ్రహించాయి.

గత జనవరిలో నాటి జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ను అతిపెద్ద భూకుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేస్తే దీన్ని గురించి విదేశీ పత్రికల స్పందన నామమాత్రం. దీన్నిబట్టి చూస్తే, మనదేశంలో కేజ్రీవాల్‌ను కేంద్రంగా చేసుకొని  బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలన్న డీప్‌స్టేట్‌ దురుద్దేశం స్పష్టమవుతోంది. ఇక్కడ ‘నీతి’, ‘అవినీతి’ కాదు సమస్య. మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే అజెండా! న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ వంటి పత్రికలు అమెరికాకు, అక్కడి వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తాయి.

2020 ఎన్నికల్లో జోబైడెన్‌కు అనుకూలంగా డెమోక్రట్‌లు ఓటింగ్‌ అక్రమాలకు పాల్పడ్డారని డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పాశ్చాత్య మీడియా గురివింద మాదిరి భారత ప్రజాస్వామ్యం, ఎన్నికలపై వ్యాఖ్యలు చేయడం తగనిపని. ఒక్క ప్రశ్న. నిజంగా ప్రజాస్వామ్యం క్షీణిస్తే, విపక్షాలు కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రాగలవా? ఇదంతా ఈ మీడియా ప్రచారం చేసే ‘స్వచ్ఛమైన’ అబద్ధాలు మాత్రమే!

About Author

By editor

Twitter
YOUTUBE