తెలంగాణలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ హాట్ టాపిక్ అయ్యింది. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ పెద్దలు, ముఖ్యులు అనుసరించిన పద్ధతులు, విచ్చల విడిగా ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఆ పార్టీ మెడకే చుట్టుకునే పరిస్థితి ఏర్పడిరది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పరిశీలిస్తే.. అధికారం తమకే శాశ్వతం అని, దానికి తమను ఎవరూ దూరం చేయలేరన్న అత్యుత్సాహం, అతి ఆలోచన ఎంతగా గూడుకట్టుకొని ఉందో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓ రకంగా ప్రజాస్వామ్యాన్నే పరిహాసం చేసే స్థాయిలో సెల్ ఫోన్ ట్యాపింగ్ లు చేయించిన విధానం తెలుసుకొని దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. ఇక, ఈ అరాచకపు ఆనవాళ్లు తెలుసుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వ పెద్దల స్పందన ఊహించని రీతిలో ఉంది.
రాజకీయ ప్రత్యర్థుల రహస్యాలు తెలుసు కోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. వాళ్ల వ్యూహాలు, ప్రతివ్యూహాలు, విపక్షాల నాయకుల ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలను గ్రహించాలని, వాటికి తాము పై ఎత్తులు వేసేందుకు ఆ సమాచారం పనికొస్తుందని అనుకుంటారు. ప్రభుత్వంలో కొనసాగుతున్న వారూ ఆ తరహాలో ఆలోచిస్తారు. కానీ, దొంగచాటుగా సంభాషణలు వినడం, ప్రత్యర్థుల దినచర్యల గురించి అనైతిక పద్ధతుల్లో తెలుసుకోవడంలాంటివి సరికావు. అదీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన మన దేశంలో ఇది ఏ మాత్రం సమంజసం కాదు. కానీ, భారత రాష్ట్రసమితి పార్టీ అధిష్ట్టానం, కీలక నేతలు వ్యవహరించిన తీరు అసమంజసంగా ఉందన్న ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
అనైతికతకు ఆనవాళ్లు
తమ సామాజిక వర్గానికి చెందిన ఓ కిందిస్థాయి పోలీసు అధికారిని వాహకంగా ఉపయోగించుకొని ఆయనకు అనైతికంగా, అడ్డదారుల్లో పోస్టింగులు, ప్రమోషన్లు ఇచ్చారు. అత్యున్నత స్థాయి అధికారులకు ఇవ్వాల్సిన బాధ్యతలు అప్పగించారు. అంతే.. ప్రభుత్వ పెద్దలే తన వెనక ఉన్నారన్న భరోసాతో ప్రభుత్వంలోని పెద్దలు,ఇతర ముఖ్యులు చెప్పినట్టల్లా చేశాడు.వారి అవసరాలకోసం, వాళ్లకు గిట్టని, కంట్లో నలుసుగా మారిన వారి సెల్‌ఫోన్లు ట్యాపింగ్ చేశాడు. సినిమా ప్రముఖులు, సినీ హీరోయిన్లు సెల్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు వివరాలు బయటకు వస్తున్నాయి.
మూలిగే నక్కపై తాటిపండు పడిరదా?
వాస్తవానికి బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం కడు దయనీయంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా తయారయ్యింది పార్టీ పరిస్థితి. ఇప్పుడేమో లోక్ సభ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఐదునెలలు కాకముందే లోక్ సభ ఎన్నికలు కూడా రావడం ఆ పార్టీకి కనీసం సర్దుకునే పరిస్థితిని కూడా దూరం చేసింది. దీనికి తోడు.. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పదేళ్లలో ఒకరకంగా నియంతృత్వ పోకడలు ప్రదర్శించారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో కీలకంగా వ్యవహరించే ఆయన బంధువులు కూడా ఆయనలానే వ్యవహరించారన్నది నిర్వివాదాంశం. ఆ పరిస్థితులను తట్టుకొని అనివా ర్యంగా ఇన్నాళ్లు ఆ పార్టీలో ఉన్న నాయకులు, ప్రజా ప్రతినిధులు అధికారం చేజారినప్పటి నుంచి పక్కచూపులు చూస్తున్నారు. ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే పార్టీ మారిపోయారు. ఇక, లోక్ సభ పోరులో నిలబడేందుకు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిరది. ఇదే సమయంలో ఇప్పుడు సెల్ ఫోన్ ట్యాపింగ్ బండారం బయట పడటం పార్టీకి, దాని అధినేత కేసీఆర్‌కు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లుగా తయారయ్యింది.
కేసీఆర్‌కు తలబొప్పి
ఇప్పటికే ఎన్నికల్లో సమస్యలు ఎదుర్కోబోతున్న గులాబీ బాస్ కేసీఆర్.. ట్యాపింగ్ ఆధారాలు బయటపడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రోజులుగడుస్తున్న కొద్దీ సెల్ ఫోన్ ట్యాపింగ్ సంచలనాలు బయటపడుతున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపులు తిరిగింది. ఈ వ్యవహారం వెనక బీఆర్‌ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే, ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. ట్యాపింగ్ వ్యవహారం నడిపించిన డీఎస్పీ ప్రణీత్ రావును మొదట అరెస్టు చేసి, విచారణలో ఆయన నుంచి సేకరించిన వివరాలతో మరో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా కటకటాల్లోకి పంపించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కీలక నేతతో పాటు మరో నాయకుడు కూడా ఉన్నట్లు గుర్తించారు.
పక్కా పకడ్బందీగా…
ముగ్గురు పోలీసు అధికారుల అరెస్ట్‌ల అనంతరం అధికారులు, సూత్రధారులపై దృష్టి సారించారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు ఈ కేసులో కీలక నిందితుడని పోలీసులు మొదటి నుంచి అనుమానించినా, అదనపు ఎస్పీల అరెస్టు తర్వాతే దానిని రూఢీ చేసుకున్నారు.విపక్ష నేతలు, అధికారులు, ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి ప్రభాకర్‌రావు ఆదేశాలే కారణమని భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలమిచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనక బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కీలక నేత ఉన్నట్లు, ఆయన చెప్పిన నంబర్లను ట్యాప్ చేసినట్లు ఎఎస్పీలు అంగీకరించినట్లు స్పష్టం చేశారు. ఆ నేత ఇచ్చే నంబర్లను వీరిద్దరూ ప్రణీత్‌రావుకు చేరవేసేవారు. ఆయన ఇచ్చే ఔట్‌పుట్‌ను ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు తిరిగి బీఆర్‌ఎస్ నేతకు అందజేసేవారు. అప్పట్లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావు ఇచ్చిన నంబర్లన్నీ ట్యాప్ చేసినట్లు ఒప్పుకొన్నారు. వాటి ఔట్‌పుట్‌ను కూడా ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు తిరిగి రాధాకిషన్ రావుకు పంపేవారు. ఎన్నికల సమయంలో వందలాది మంది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశామని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టామని ప్రణీత్‌రావు వెల్లడిరచాడు. వ్యాపార వేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా టాప్ చేశామన్నారు. పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఈ వివరాలను పొందుపరిచారు. ప్రైవేటు వ్యక్తులపై ఫోన్‌లు ట్యాపింగ్ చేసి వారికి సంబం ధించిన ప్రొఫైల్ తయారు చేసినట్లు, అందుకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేసినట్లు తిరుపతన్న, భుజంగరావు విచారణలో అంగీక రించారు. ఈ కేసులో మరో కీలక నిందితుడు, ఐన్యూస్ యజమాని శ్రవణ్‌కుమార్‌రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్‌రావు విదేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ ముగ్గురిపై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ప్రణీత్‌రావు వాంగ్మూలం మేరకు నల్లగొండలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ ధనుంజయ్, వరంగల్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను కూడా దర్యాప్తు అధికారులు విచారించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ కు చెందిన డబ్బులను వీరిద్దరే వాహనాల్లో తరలించారని విచారణలో తేలింది.
స్పెషల్ అరేంజ్ మెంట్స్
2018లో ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్ హోదాలో చేరిన ప్రణీత్‌రావుకు ఫోన్ ట్యాపింగ్ కోసం 2 గదులు, 17 కంప్యూటర్లతో పాటు, ప్రత్యేక అధికారాలు కట్టబెట్టినట్లు సమాచారం. విదేశాల నుంచి తెచ్చిన అధునాతన టెక్నాలజీని ఇందుకోసం వాడినట్లు గుర్తించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, ఆయన సోదరుల ఇళ్ల పరిసర ప్రాంతాల్లో ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. సుమారు 2 కి.మీ. పరిధిలోని ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్స్‌లో అత్యాధునిక టెక్నాలజీతో ఈ పరికరాలు అమర్చినట్లు స్పెషల్ టీమ్ గుర్తించినట్టు తెలిసింది.
ఆనవాళ్లు దొరక్కుండా…
ప్రభుత్వం మారిన తర్వాత ట్యాపింగ్ సంబం ధించిన మెయిన్ డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేసినట్లు, 17 కంప్యూటర్లలో హార్డ్ డిస్క్‌లన్నిటిని ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసినట్లు ప్రణీత్ రావు చెప్పారు. రెండు లాకర్ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని కూడా విచారణలో వెల్లడిరచాడు.
తీగలాగితే.. కదులుతున్న డొంకలు
అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ముగ్గురు కీలక నిందితులు ప్రభాకర్‌రావు చెప్పడంతో ఆయనను కూడా పాత్రధారిగా దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఇక సూత్రధారులు ఎవరనేది తెలియాలంటే ప్రభాకర్‌రెడ్డి అరెస్టు కావాల్సిందేనని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ‘ఐన్యూస్’ యజమాని శ్రవణ్‌కుమార్‌రావు పాత్ర కీలకమని దర్యాప్తు అధికారులు తేల్చారు.ఆయన ఫోన్ ట్యాపింగ్ కోసం తన సంస్థలో ప్రత్యేకంగా సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావుకు అందజేసేవాడని గుర్తించారు. శ్రవణ్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. రెండు ల్యాప్‌ట్యాప్‌లు లు, 4 ట్యాబ్‌లు, 5 పెన్‌డ్రైవ్‌లు, ఒక హార్డ్‌డిస్క్, ఒక డీవీఆం ని సీజ్ చేసి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. పోలీసులు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్ ను రీట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు దొరికిన ఆధారాలతో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ1 గా చేర్చారు పోలీసులు. ఈ కేసులో ఏ1 గా ప్రభాకర్ రావు, ఏ2 గా ప్రణీత్ రావు, ఏ3గా భుజంగరావు, ఏ5గా తిరుపతన్న, ఏ6 గా మరో వ్యక్తి పేరును చేర్చారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అని.. ఆయన కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
నవ్విపోదురు గాక…!
అరెస్టయిన ముగ్గురు పోలీసు అధికారులు కూడా తాము అప్పటి ఇంటిలెజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాల ప్రకారమే తాము చాలామంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించటం సంచలనం కాగా, అమెరికా నుంచి ప్రభాకరరావు చేసిన వ్యాఖ్య మరింత విచిత్రంగా ఉంది. ఆయన టెలిఫోన్లో ఇక్కడి అధికారులతో మాట్లాడుతూ, ‘ఇప్పుడు మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అలానే చేశాం’అని చెప్పటం విచిత్రంగా ఉంది. అంటే పదేళ్ళ బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగులన్నీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే చేయించినట్లు ప్రభాకరరావు అంగీకరించినట్లు అర్థవుతోంది. మరి ప్రతిపక్షాల నేతలతో పాటు అనుమానాస్పందంగా ఉన్న స్వపక్షం నేతల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పెద్దలంటే కేసీయార్, కేటీయార్, హరీష్ రావు, కవితతో పాటు మరికొంత మంది మాత్రమే అని అందరికీ తెలుసు. వీరిలో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపింది ఎవరనే విషయం అరెస్టయిన ముగ్గురు పోలీసు అధికారులు, లేదా దేశానికి తిరిగొచ్చిన తర్వాత ప్రభాకరరావు చెబితే కాని తెలీదు.
బీఆర్‌ఎస్ భవిష్యత్తు?
టెలిఫోన్ ట్యాపింగ్ అంశం లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రతిపక్షాల నేతల ఫోన్ల ట్యాపింగ్‌ను పక్కనపెట్టేస్తే అనుమానంగా ఉన్న సొంతపార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించారని బయటపడటం పార్టీలో సంచలనంగా మారింది. అయితే, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనే విషయాలు పూర్తిగా బయటపడలేదు. అవికూడా బయటపడితే ముందు బీఆర్‌ఎస్‌లో తర్వాత ప్రభుత్వంలో గందర గోళమైపోవటం ఖాయం.
ఒకవైపు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల లీకేజీలు, అవినీతి. మరో వైపు ఔటర్ రింగ్ రోడ్డు కుంభకోణం, ఈ ఫార్ముల రేసులో అవినీతి, ధరణిలో భూ అక్రమాలు, ఢల్లీి లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు లాంటి వివాదాల్లో పార్టీలోని కీలకనేతలు బాగా తగులుకున్నారు. వీటన్నింటి మీద టెలిఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్రమైందనే చెప్పాలి. మరి రాబోయే ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్