మూడవ ప్రపంచ యుద్ధం జరుగబోతోందా? లేక అది నూతన రూపంలో ఎప్పుడో ప్రారంభమై కొనసాగుతోందా? ప్రారంభమై పోయింది అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ? ఎందుకంటే, మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలోలాగా దేశాలు రెండు బృందాలుగా కూటములు కట్టి కొట్లాడటం లేదు ఇప్పుడు. తమ దేశాలలో యుద్ధం జరుగకుండా మరొక క్షేత్రాన్ని ఎంచుకుని, వారిని రెచ్చగొట్టడం ద్వారా తమకు నచ్చని మరొక దేశంపై యుద్ధానికి పురిగొల్పవచ్చు. మీడియాలో ప్రతికూల వార్తలతో ఒక దేశం ఇమేజ్‌ను ఛిద్రం చేయడం, మతపరమైన, వర్గపరమైన, కులపరమైన బలహీనతలను రెచ్చగొట్టడం, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని స్వచ్ఛంద సంస్థల సాయంతో తిరుగుబాట్లను ప్లాన్ చేసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం నేటి యుద్ధ తంత్రాలు. ఉక్రౖౖెన్ యుద్ధం అటువంటిదే. రష్యా మీద ఉన్న అక్కసును తీర్చుకునేందుకు ఉక్రైన్‌ను రెచ్చగొట్టి దానిని యుద్ధ క్షేత్రం చేసుకొని, అమెరికా సహా ఐరోపా దేశాలన్నీ కూడా ఆయుధాలను సమకూ రుస్తూ యుద్ధం చేయిస్తున్నాయి. అలా చేయడం ద్వారా ఏ నష్టాన్ని అయితే నివారించాలని అవి భావించాయో వాటిని అవి ఇప్పుడు అనుభవిస్తున్నాయి.
ఒక దేశ సైన్యాన్ని బలహీన పరిచేందుకు రకరకాల వ్యూహాలను అనుసరించడం సర్వ సాధారణం. మనం చరిత్రలో చూసినట్టు సైన్యమంతా ఒకే చోట మోహరించి యుద్ధం చేయడం లేదు. సైన్యం మోహరించి పోరాటం చేస్తున్న ఒక ప్రాంతంలోనే కాకుండా మరొక దిక్కున హఠాత్తుగా ఏర్పడే పరిణామాల కారణంగా రెండు లేదా మూడు దిక్కులా చేసే పోరాటాన్నే టూ ఫ్రంట్‌వార్, త్రీఫ్రంట్ వార్ అంటారు. ఇందులో సైన్యం తన మానవ వనరులు సహా అన్ని వనరులను రెండు లేదా మూడు దిక్కులా పంచాల్సి వస్తుంది. ఈ సరళి ప్రపంచ యుద్ధాల సమయం నుంచే ప్రారంభమైంది. తాజాగా, ఆధునీకరించిన పద్ధతి రెజీమ్ ఛేంజ్ ఆపరేషన్లు అనుసరిస్తున్నారు. అంటే ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు స్థానిక మానవహక్కుల సంస్థలను, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలను రెచ్చగొట్టి తమకు నచ్చని ప్రభుత్వాన్ని కూలగొట్టి, తమ చేతిలో కీలుబొమ్మగా ఉండేందుకు అంగీకరించే వారితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, లబ్ధి పొందడం.
తాజాగా, పాక్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం ఆ రెండు దేశాల మధ్య పరస్పర భావవైరుధ్యాల కారణంగా జరుగుతున్నాయంటే నమ్మలేం. నిజమే, రెండూ ఇస్లామిక్ దేశాలు అయినప్పటికీ, వారి మధ్య డ్యురాండ్ రేఖ సహా అనేక విషయాలలో తీవ్రమైన విభేదాలున్నాయి. అయితే, ఇక్కడ జరుగుతున్నది కూడా ప్రత్యక్ష యుద్ధమేం కాదు. స్వయంగా పాకిస్తానే పెంచి పోషించిన తెహ్రెక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి)ని అడ్డుపెట్టుకొని ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ పాక్‌పై యుద్ధం చేస్తున్నది. అసలు తమ ప్రమేయం ఉందన్న విషయాన్ని అంగీకరించడానికి అది సిద్ధంగా లేదు. ఇక ఆఫ్ఘన్ల వెనుక ఎవరున్నారన్న విషయం బహిరంగ సత్యమే. ఇక గ్లోబల్ సౌత్‌గా ప్రపంచానికి తెలిసిన ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న అంతర్యుద్ధాలు, పరస్పర యుద్ధాల వెనుక ఉన్నది కూడా అమెరికా, ఐరోపా శక్తులే.
ఇరాన్ పట్ల వ్యతిరేకత
పొరుగుదేశమైన పాకిస్తాన్ నిన్నటి వరకూ హిందువులతో తమకు సమస్య అన్న పాకిస్తాన్ నేడు ఒకవైపు ఇరాన్ మరొకవైపు ఆఫ్ఘన్ నుంచి దాడులతో అంతర్గత, బహిర్గత సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఆర్ధికంగా కుంగిపోయిన పాక్‌లో ప్రస్తుతం బెలూచిస్తాన్ మొదలు కొని పాక్ ఆక్రమిత కశ్మీర్ వరకూ నిరసనలు, ప్రదర్శనలే కాదు దాడులు కూడా జరుగుతున్నాయి. సందట్లో సడేమియా అన్నట్టుగా ఇరాన్ బెలూచిస్తాన్ తీవ్రవాదులు తమ దేశంలో అశాంతిని సృష్టిస్తున్నారంటూ చడీచప్పుడూ కాకుండా బెలూచిస్తాన్‌లోని జైష్`అల్`అదల్ సంస్థకు చెందిన కొన్ని ఇరాన్ వ్యతిరేక తీవ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసేసింది. ఇందుకు బదులుగా పాక్ కూడా ఇరాన్‌లో కొన్ని ప్రాంతాలపై క్షిపణులనను ప్రయోగిం చడంతో, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్నది. ఇరాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరు దేశాలూ కూడా అమెరికాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడమే కాదు, నాటో తీరులో ఏర్పరచిన సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సెంటో)లో చేరాయి. వాస్తవానికి భారత్‌పై యుద్ధానికి పాక్‌కు ఆయుధాలను కూడా ఇరాన్ సరఫరా చేసింది. కానీ, ఆయతుల్లా ఖొమైనీ నేతృత్వంలో అతివాద షియా పాలన ఏర్పడడంతో, సున్నీ మెజారిటీగా ఉన్న పాక్‌కు సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో పాక్ సైనిక నియంత జియా ఉల్ హక్ నేతృత్వంలో తీవ్రమైన మత ప్రభావానికి గురవుతోంది. ఖొమైనీ చేతిలోకి పగ్గాలు వెళ్లిన మరుక్షణమే అది అమెరికాకు శత్రువు అయింది. దానితో అమెరికా పాక్‌ను మరింత చంకనెక్కిం చుకుంది. పాక్ విశ్వసనీయతను ఇరాన్ అనుమానించడం ప్రారంభించింది. ఇందుకు తోడుగా, చైనా, రష్యాలతో ఇరాన్ స్నేహం అమెరికాను తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా, ఈ మూడు దేశాలు బ్రిక్స్ వంటి కూటమిలో ఉండి, తమ మధ్య ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంచుకోవడం వల్ల అమెరికా ఆధిపత్యం నిర్వీర్యం అవుతుందని అది, దాని మిత్రులు భీతిల్లుతున్నారు. ఆర్ధిక ఆంక్షలు సహా, ఏ ఆంక్షలను లెక్క చేయకుండా వారు తమ దారి మార్చుకొని వ్యాపారాలు చేసుకుంటున్న తీరు దాని అహాన్ని దెబ్బకొడుతోంది. ఈ పరిస్థితుల నడుమ దానికి అటు ఇరాన్‌ను, ఇటు భారత్‌ను నియంత్రించేందుకు పాకిస్తాన్ ఒక్కటే మార్గం. అందుకే అక్కడ జరిగే దారుణాల గురించి పాశ్చాత్య మీడియాలో భారత్ గురించి వచ్చినంతగా ప్రతికూల కథనాలు వెలువడవు.
టీటీపీ దాడులకుతాలిబన్ ప్రోత్సాహం?
ఇదిలా ఉండగా, టీటీపీని అడ్డం పెట్టుకొని, ఆఫ్ఘన్‌లు తమ దేశంలో చిచ్చుపెడుతోందని మొసలి కన్నీరు పెడుతోంది పాకిస్తాన్. హిల్లరీ క్లింటన్ పెరట్లో పాములను పెంచితే అవి పక్కవారినే కాదు మనను కూడా ఏదో ఒకరోజు కాటువేస్తాయన్న మాటలను టీటీపీ తీవ్రవాదులు రుజువు చేస్తున్నారు. ఎందుకంటే, పష్తూన్లు అధికంగా ఉన్న ప్రాంతాలైన తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో కరడుగట్టిన సున్నీ ఇస్లామిస్టులను ప్రోత్సహించింది పాకిస్తానే. అక్కడ పష్తూన్ జాతీయ వాదాన్ని అణచివేసేందుకు ఈ పని చేసింది. ప్రస్తుతం పష్తూన్లు అధికంగా ఉండే ఖైబర్ ఫక్తూన్వా ప్రాంతం వెంట దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. తమపై దాడులు జరుపుతున్నది టీటీపీి తీవ్రవాదులేనని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. కాగా, ఆఫ్ఘనిస్తాన్ 1980వ దశకంలో సోవియట్ నియంత్రణలో ఉన్న సమయంలో తాలిబన్ సృష్టికి ఈ వ్యూహం తోడ్పడిరది. పాక్ స్వంత విధానాలే టీటీపీి సృష్టికి కూడా దోహదం చేయడమే కాదు, తాలిబన్ తిరిగి రాకతో వారు మరింత దుస్సాహ సంతో వ్యవహరించేలా చేస్తున్నాయి. తీవ్రవాదంపై యుద్ధ సమయంలో 2007లో తాను సృష్టించి, పెంచి పోషించిన సంస్థే అయినప్పటికీ పాక్ ఆ సంస్థను తర్వాత నిషేధించింది. టీటీపీి ఇప్పుడు తమను తాము తాలిబన్ విస్తరణగా భావించుకుంటూ, అమెరికా ప్రభావం నుంచి పాక్‌ను తప్పించి, ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పరచడమే తమ లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తోంది. ఇది పాక్‌కు రుచించడం లేదు. ఆఫ్ఘన్‌లో ఉన్నది కూడా ముస్లిం అందునా, సున్నీ ముస్లిం ప్రభుత్వమే కనుక మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంది పాక్ పని. అమెరికా ఆఫ్ఘన్‌ను హఠాత్తుగా వెళ్లిన సందర్భంలో ఏర్పడిన తాలిబన్ ప్రభుత్వంతో నాటి ఇమ్రాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ బహిరంగంగానే చుట్టరికం కలుపుకుని, హర్షాన్ని వ్యక్తం చేశాయి. ఇప్పుడు పరిస్థితి తిరగబడడంతో ఏంచేయాలో తెలియక అల్లాడుతోంది.
హిందువులతో కలిసి ఉండలేమని, ముస్లింల కోసమే ప్రత్యేకంగా దేశం కావాలని పట్టుబట్టి భారత్‌ను విభజించి మరీ ఏర్పడిన పాక్‌లో ఇప్పుడు టీటీపీి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపిస్తానంటుంటే వణికిపోవడమేమిటో వారికే తెలియాలి.
చేతులు దులుపుకుంటున్న తాలిబన్
గత రెండేళ్లగా టీటీపీని అదుపు చేయ వలసిందిగా ఆఫ్ఘన్ తాలిబన్‌ను ఇస్లామాబాద్ కోరుతున్నప్పటికీ, వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని అది మీ అంతర్గత సమస్య అంటూ తాలిబన్ తప్పించుకుంటూ వస్తోంది. టీటీపీి దళాలు పాక్ సైన్యం తమకు ఇచ్చిన శిక్షణను వారిపైననే ఉపయోగించి, దళాలపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘన్ సరిహద్దులలో ఉన్న వాయవ్య ప్రాంతాలకు సమీపంలో ఈ దాడులను చేస్తున్నది. ఇటీవలే, ఆత్మాహుతి దళానికి చెందిన ఒక తీవ్రవాది పేలుడు పదార్ధాలతో నిండిన ట్రక్కుతో నార్త్ వజీరిస్తాన్ జిల్లాలో ఒక సైనిక చెక్ పాయింట్‌లోకి దూసుకుపోవడంతో అనేకమంది పాక్ సైనికులు మరణించారు. కానీ, ఈ దాడి తాము చేశామంటూ జైష్`ఎ`ఫుర్సాన్`ఎ మహమ్మద్ గ్రూప్ ప్రకటించు కుంది. అయితే, ఈ దళంలో అధికంగా ఉన్నది టీటీపీ సభ్యులేనని పాక్ సైనిక అధికారులు అంటున్నారు.
దీనితో విసిగిపోయిన పాక్ ఆఫ్ఘనిస్తాన్‌లో వైమానిక దాడులు చేసింది. అందులో నలుగురు పిల్లలు సహా ఎనిమిదిమంది మరణించడంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం నిప్పులు కక్కుతోంది. తక్షణమే సరిహద్దుల వెంట ఉన్న పాకిస్తానీ దళాలపై తాలిబన్ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఇరుపక్షాలూ కూడా తమ తమ వాదనలకు కట్టుబడి ఉండి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందంటూ తాలిబన్లపై పాక్ నిందలు వేస్తుండగా, వారితో తమకే సంబంధం లేదని, తన భూభాగంపై నియంత్రణ లేకపోవడం, అసమర్ధత, ఇతర సమస్యలకు ఆఫ్ఘనిస్తాన్‌ను నిందించడం పాక్‌కు సరికాదని, ఇలాగే వ్యవహరిస్తే పాక్ నియంత్రణలో ఉండని తీవ్ర దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉందని తాలిబన్ హెచ్చరించింది.
చైనా ఆస్తుల ధ్వంసం ద్వారా పరోక్ష యుద్ధం
ఇదిలా ఉండగా, బెలూచిస్తాన్‌లో చైనా అధీనంలో ఉన్న గ్వాదర్ పోర్టు అథారిటీ కాంప్లెక్స్‌పై అత్యంత తాజాగా దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు హఠాత్తుగా అందులోకి ప్రవేశించి ప్రారంభించిన కాల్పులలో చైనీయులతో సహా పలువురు మరణించారు. ఈ దాడికి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత తీసుకున్నది. ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా చెలరేగుతున్న అసంతృప్తిని అటు పాక్ ప్రభుత్వాలు కానీ, ఐఎస్‌ఐ కానీ పట్టించుకోక పోవడమే నేటి పరిస్థితికి కారణమని చెప్పవచ్చు.
చైనా `పాకిస్తాన్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక చైనా పాకిస్తాన్ ఎకననమిక్ కారిడార్ (సిపిఇసి)లో భాగం గ్వాదర్ పోర్టు. సహజ వనరులు, ఖనిజాలతో సుసంపన్నమైన బెలూచిస్తాన్‌లో తన బెల్ట్ అండ్ రోడ్ చొరవ కింద చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే, అక్కడ దశాబ్దాలుగా కొనసాగుతున్న తిరుగుబాటు కార్యకలాపాలను తక్కువగా అంచనా వేసింది. సహజవాయువు, బొగ్గు, ఇతర ఖనిజాలు అత్యధికంగా ఉన్న బెలూచిస్తాన్ అత్యంత తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతం. అక్కడ నీటికొరత నుంచి మొదలుపెడితే ఏ ఒక్క ప్రాథమిక సదుపాయం కనిపించదు. అందుకే, బెలూచీలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తమ సంస్కృతిని ధ్వంసం చేసి, తమ వనరులను దోచుకొని, తమ కుటుంబ సభ్యులను మాయం చేసే పాక్ సైన్యాన్ని, పాక్ ప్రభుత్వాన్నీ బెలూచీలు ద్వేషిస్తున్నారు.
ముఖ్యంగా గ్వాదర్ పోర్టు అభివృద్ధి పేరుతో వచ్చిన చైనీయులు స్థానికులకు ఉపాధి కల్పించడం సరే, అక్కడ సముద్రంలో వారు చేపలు పట్టుకునే అవకాశం లేకుండా వాటిని కూడా పట్టుకు పోతున్నారు. తమ వనరులను దోచుకొని, తమను అంచుల్లోకి నెట్టి వేశారని, నిరాశ్రయులను చేస్తున్నారనే భావన స్థానికులలో తీవ్రంగా ఉంది. దీనితో ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ (ఇటిఐఎం), తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) లష్కర్ ఎ తయ్యిబా, లష్కర్ శ్రీ జంగ్వీ, దాయిష్, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వంటి అనేక వేర్పాటువాద, మతపరమైన, తీవ్రవాద గ్రూపులు అక్కడ ఏర్పడి పోరాటాలు చేస్తున్నాయి. ఇందులో కొన్ని గ్రూపులు ఏర్పాటులో పరోక్ష సైనిక మద్దతు ఉండటం పాక్ కుటిల బుద్ధికి ఒక మచ్చుతునక. ఈ గ్రూపులన్నీ కూడా ప్రస్తుతం సిపిఇసి ప్రాజెక్టును భంగపరచాలనే లక్ష్యంతో పని చేస్తూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విదేశీ పెట్టుబడిదారులపై, ముఖ్యంగా చైనా జాతీయులు, కార్మికులపె ౖప్రత్యక్ష దాడులు చేస్తూ పాక్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.
ఇది కేవలం పాక్, ఆఫ్ఘన్‌ల మధ్య పోరేనా?
ఆఫ్ఘనిస్తాన్‌ను నిజంగానే అమెరికా విడిచి వెళ్లిందా? వెళ్లాలనే ఉద్దేశ్యం దానికి నిజంగా ఉన్నదా? ప్రపంచం తాలిబాన్‌ను గుర్తించక పోయి నప్పటికీ, వారి ప్రభుత్వం నడిచేందుకు అమెరికా ఎందుకు నిధులు అందిస్తోంది? టీటీపీి తీవ్ర వాదులు అంత నిర్భయంగా దాడులు ఎలా చేయగలుగు తున్నారు? వారి వద్ద నైట్ విజన్ గాగుల్స్ సహా అత్యాధునిక ఆయుధాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఈ కోణంలో ప్రశ్నలు వేసుకొని ఆలోచించినప్పుడు అమెరికా ఇంకా ఆఫ్ఘన్‌లోనే పరోక్షంగా ఉందనే విషయం అవగతం కాకమానదు. వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న ఆఫ్ఘన్, పాక్‌లపై తన పట్టును అమెరికా ఎన్నటికీ వదులుకోదు, వదులుకో లేదు. ఒకవైపు చైనాను, మరొకవైపు రష్యాను, హఠాత్తుగా తలపైకెత్తి నిలుస్తున్న భారత్‌ను నిలువరించడానికి ఈ రెండు దేశాలూ అమెరికాకు అవసరం. అందుకే, వాటితో అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రచ్ఛన్న యుద్ధకాలంలో తమ ప్రయోజనం కోసం చైనాను తమ ఉత్పత్తి కేంద్రంగా వాడుకున్న అమెరికా, ఇప్పుడు ఆ దేశం తమను మించి పోతుందేమోనన్న అనుమానంతో భీతిల్లుతోంది. పైగా, సీపెక్ పుణ్యమా అని పాక్, చైనాలు సన్నిహితమవుతుండడం దానికి నచ్చడం లేదు. అనూహ్యంగా అంతర్జాతీయ యవనికపైకి అభివృద్ధి చెందుతున్న శక్తిగా ప్రత్యక్షమైన భారత్ పట్ల కూడా అసూయతో ఉంది. ఈ నేపథ్యంలో చైనాను, భారత్‌ను నిలవరించడానికి దానికి ఆఫ్, పాక్ రెండూ అవసరం. అందుకే, అటు పాక్‌తోనూ, ఇటు ఆఫ్ఘన్‌తోనూ కూడా అది సత్సంబంధాలు నెరుపుతూ నాటకమాడుతున్నది. పాకిస్తాన్ కూడా తక్కువేం తినలేదు. తమ దేశాన్ని తీవ్రవాదం పట్టి పీడిస్తోందని, తామూ బాధితులమేనని ప్రపంచానికి చూపించుకొని, నిధులు పొందేందుకే ఈ దాడులు జరిపిస్తోందని భావించేవారూ లేకపోలేదు.
ఆఫ్రికాలో యుద్ధాలు, అంతర్యుద్ధాలు
పాశ్చాత్య దేశాలు చేస్తున్న పరోక్ష యుద్ధాలకు ప్రయోగ వేదిక ఆఫ్రికా ఖండం అని చెప్పేందుకు ఏ మాత్రం తడబడనవసరం లేదు. వనరుల పరంగా సుసంపన్నమైన ఈ ఖండంపై పాశ్చాత్య దేశాలు శతాబ్దాల కిందటే కన్నువేసి వాటిని తమ వలస కాలనీలుగా మార్చుకొని వారిని, వారి వనరులను అన్నిరకాలుగా వాడుకున్నాయి. నెల్సన్ మండేలా పోరాటం చేసేవరకూ దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష కొనసాగిందంటే, పాశ్చాత్యులు ఆ ప్రాంతంలో ఎంత పాతుకుపోయి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్రికాఖండంలో పలు ప్రాంతాలు కూడా స్వేచ్ఛను కోరుకుంటున్నాయి. అయితే వారిని ఏ మాత్రం ఎదుగనివ్వకుండా ఉండేందుకు పాశ్చాత్యులకు అలవాటైన సమాజంలోని లోటుపాట్లను ఆసరాగా చేసుకుని, అక్కడి వర్గాల మధ్య చిచ్చు పెట్టి తమ పని తాము చేసుకుపోతున్నాయి.
లిబ్యా, దక్షిణ సూడాన్, సెంట్రల్ ఆఫ్రికనన్ రిపబ్లిక్, ఉత్తర మొజాంబిక్, ఇథియోపియా, కెమరూన్, వాయువ్య, నైరుతి ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా అంతర్యుద్ధాలు, తెగల మధ్య ఘర్షణలు, యుద్ధాలు సాగుతున్నాయి. వారి మధ్య ఉన్న విభేదాలను రెచ్చగొట్టి, వారు కొట్టు కుంటుంటే మధ్యలో వారి వనరులను మాయం చేసి, వారిని శాశ్వత పేదరికంలో ఉంచుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఈ యుద్ధాల గురించి వార్తలలోకి ఎప్పుడో తప్ప రాకపోవడానికి కారణం ప్రపంచ మీడియానే గుప్పిట్లో పెట్టుకున్నవారే అందుకు బాధ్యులు కావడం. అయితే, ఇప్పుడు వారు కూడా పాశ్చాత్యుల కుటిలతను అర్థం చేసుకొని తిరగబడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏకధృవ ప్రపంచం గుప్పిట్లోంచి తప్పించేందుకు బ్రిక్స్ వంటి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలతో అమెరికా, ఐరోపాదేశాలు గిలగిలలాడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలకు దక్షిణ దిశలో ఉండి…అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాలతో కూడిన ప్రాంతాన్నే గ్లోబల్ సౌత్ అంటారు. ఇప్పుడు వారంతా కూడా ఏకమయ్యేందుకు యత్నిస్తున్నారు. భారత్ ప్రస్తుతం గ్లోబల్ సౌత్‌కు గొంతుకగా ఉన్నందున కేవలం ఆఫ్రికాలోనే కాక ఇతర ప్రాంతాలలో జరుగుతున్న పరోక్ష యుద్ధాల నుంచి విముక్తం అయ్యే అవకాశం ఉందని భావిద్దాం.
– డి. అరుణ