హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేపథ్యం-1
‘పదిహేను నిమిషాలు పోలీసులను పక్కన పెడితే ఈ దేశంలో మా సత్తా ఏమిటో చూపిస్తాం… ఈ లక్ష్మీదేవి, సరస్వతీ.. వీళ్లంతా ఎవరు? ఎవరికి పుట్టినోళ్లు?’ ఇది హైదరాబాద్ పాతబస్తీని ఏలుతున్న ఒవైసీ కుటుంబ సభ్యుడు, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వాచాలత్వం.
తస్లిమా నస్రీన్ అనే రచయిత్రిని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మజ్లిస్ ఎమ్మెల్యేలు దాడి చేసి కొట్టగలరు. తరువాత అంతా మరచిపోవలసిందే.
మజ్లిస్‌కు ఓటేస్తే విద్యుత్ బిల్లు, కుళాయి బిల్లు చెల్లించే పని ఉండదు` ఇదొక మజ్లిస్ గల్లీ నాయకుడి హామీ.
మమ్మల్ని నెగ్గిస్తే ట్రాఫిక్ పోలీసులు వేసే చలాన్ల గురించి ఆలోచించనక్కరలేదు. ఇది మరొక ముస్లిం నేత హామీ.
అక్కడ పోలీసు అడుగు పెడితే నీకు ఇక్కడేం పని అన్న కరకు ప్రశ్న వస్తుంది. వేళ మించిపోయింది కాబట్టి దుకాణం కట్టేయమంటే దాడికి దిగుతారు. విద్యుత్ మీటర్లను తనిఖీ చేయడానికి వెళ్లిన ఉద్యోగుల మీద దాడులు సర్వసాధారణం.
ఇలా చెప్పవలసి రావడం బాధాకరమే అయినా, దేశంలో ఎక్కడ ముస్లిం మతోన్మాదుల ఆగడాలు జరిగినా తర్జని హైదరాబాద్ వైపే చూపుతుంది.
అక్కడ అభివృద్ధి వాసనలు ఉండవు. పిల్లలకు సరైన చదువులు ఉండవు. మహిళలకు హక్కులు ఉండవు. ముక్కుపచ్చలారని బాలికలను దుబాయ్ షేక్‌లు వారం పదిరోజుల కాపురం కోసం పెళ్లిళ్లు చేసుకుంటారు. వీరిని ఆదుకునే నాథుడే లేడు.
ఇది హైదరాబాద్ పాతబస్తీ దుస్థితి. అయితే ప్రత్యేక పరిస్థితులలో ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ ఫలితాన్ని నిర్దేశించేది పాతబస్తీయే. ఇప్పుడేమిటి? గడచిన నాలుగు దశాబ్దాలుగా ఆ ఫలితాన్ని పాతబస్తీయే నిర్దేశిస్తున్నది. ఇంకా చెప్పాలంటే ఆ ఫలితాన్ని ఎప్పుడూ దారి మళ్లిస్తున్నది.
నాలుగు దశాబ్దాలుగా ఇదే దృశ్యం మారకుండా కొనసాగడానికి కారణాలు రెండు. మొదటిది` పాతబస్తీ మీద ఆధిపత్యం కొనసాగిస్తున్న మజ్లిస్ ఇత్తేహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం). రెండు. ఉదారవాదుల, సెక్యులరిస్టుల ద్వంద్వ వైఖరి. తమ బుజ్జగింపు ధోరణితో ఇక్కడ మజ్లిస్ గెలవడానికి దశాబ్దాలుగా ఈ పార్టీలన్నీ బలహీన అభ్యర్థులను నిలుపుతున్నాయి. ఒకప్పుడు మాత్రం ఇక్కడ నుంచి హిందువులు కూడా నెగ్గి లోక్‌సభలో ప్రవేశించారు.
కానీ ఒక శతాబ్దానికి సరిపడా చలోక్తి అక్కడి నుంచి వినిపిస్తుంది. కేవలం మతం పేరుతో ఉన్న పార్టీ, ఎప్పుడూ ముస్లింల కోసం, ముస్లిం చేత, ముస్లింల కొరకు మాత్రమే పనిచేసే ఒవైసీలు సెక్యులరిజం అంటూ గొంతు చించుకుంటారు. మెజారిటీ మతోన్మాదం అంటూ రంకెలు వేస్తారు.
హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఈ పాతబస్తీ ఉంది. 1984 నుంచి ఇప్పటి వరకూ జరిగిన 10 లోక్‌సభ ఎన్నికల్లోనూ మజ్లిస్ ఇత్తేహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) మాత్రమే విజయం సాధించింది. ఆరుసార్లు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, నాలుగు సార్లు ఆయన కొడుకు అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు. 2024 ఎన్నికలలో కూడా అసదుద్దీన్ పోటీ చేయక తప్పదు. హైదరాబాద్ లోకసభ స్థానం పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో శాసన సభ్యులు ఆ పార్టీ వారే. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ విభాగాలకన్నా దారుస్సలాం (ఎంఐఎం ప్రధాన కార్యాలయం) ఇచ్చే హుకుంలే చెల్లుబాటు అవుతాయి. అవి పరోక్షంగా ఫత్వాలే.
దేశమంతా ఏ పార్టీ గాలి వీచినా, రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరిగినా హైదరాబాద్ పాతబస్తీ యథాతథంగా ఉంటుంది. మజ్లిస్ అలవోకగా గెలుస్తుంది. ఫలితం` అభివృద్ది, సుపరిపాలన అక్కడి ప్రజలకు అందని ద్రాక్ష. నాలుగు దశాబ్దాలుగా పాతుకు పోయిన కుటుంబ పాలన ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి, మంత్రులు ఏ జిల్లాకైనా వెళ్లి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తారు. కానీ పాతబస్తీలో మాత్రం స్వతంత్రంగా ఆ పని చేయలేరు. ఆ పార్టీ నాయకుని అనుమతి లేనిదే అక్కడ ఎవరూ పర్యటించలేరు. వారి అంగీకారం లేకుండా ఒక్క పనీ జరగదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది.
అభివృద్దికి దూరంగా
హైదరాబాద్ అంటే దేశ విదేశాల దృష్టిలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న మహానగరం. ప్రపంచ ఐటీ హబ్, విశ్వనగరం. ఇక్కడి కంపెనీల్లో పని చేసేందుకు దేశం నలుమూలల నుంచి సాంకేతిక నిపుణులు వస్తుంటారు. విశాలమైన రోడ్లు, మెట్రోరైలు, ఫ్లయ్ ఓవర్లు ఆకాశాన్ని అంటే భవంతులు, షాపింగ్ మాల్స్ కళ్ల ముందు కనిపి స్తుంటాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపే హైదరాబాద్ పేరుతో కొనసాగుతున్న పార్లమెంట్ స్థానం పరిధిలోని పాతబస్తీ.
పాతబస్తీ జనాభాలో ముస్లింల సంఖ్య సగానికి మించిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు వారే ఉంటారు. మూసీ నదికి ఎగువన ఉన్న కొత్తనగరం శరవేగంగా అభివృద్దికి చెందింది. కానీ నాలుగు శతాబ్దాల చరిత్ర ఉండి, మూసీ నది దిగువన ఉండే పాత నగరం ఇందుకు పూర్తిగా భిన్నం. ఇరుకు గల్లీలు, అధ్వాన్నమైన రోడ్లు, చెత్త కుప్పలు, రోడ్ల మీద పారే డ్రైనేజీ వరదలు, నీళ్ల పైప్‌లైన్ కోసం అక్రమంగా తవ్వుకున్న గుంతలు.. ఇక విద్య, వైద్య వసతులు తగినంతగా అందుబాటులో లేవు.
ప్రభుత్వాలు ఏమైనా అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టినా, కుంటి సాకులతో అడ్డుకుంటారు ఇక్కడి ప్రజాప్రతిధులు. హైదరాబాద్ న్యూసిటీ, సికింద్రా బాద్, శివారు ప్రాంతాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తున్నా.. పాత నగరంలో కనీసం పిల్లర్లు కూడా పడలేదు. పురాతన కట్టడాలు దెబ్బతింటాయనే కుంటి సాకుతో అడ్డుకున్నారు. రోడ్ల విస్తరణ కూడా ముందుకు సాగడంలేదు. ఫలితంగా రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్థంగా మారిపోయింది.
మజ్లిస్ దౌర్జన్యాలు
పాతబస్తీ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేవి మజ్లిస్ దౌర్జన్యాలే. ఇక్కడ పని చేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది స్వతంత్రంగా పని చేసే స్వేచ్ఛ ఉండదు. తెలంగాణ మొత్తం మీద విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు అతి తక్కువ వసూలయ్యేది ఇక్కడే. ఆస్తిపన్ను కట్టరు. కానీ హిందువులు నివసించే ప్రాంతాల్లో ముక్కుపిండి వసూలు చేయించుకునే సిబ్బంది మజ్లిస్ ఇలాకాలకు పొరపాటున కూడా వెళ్లదు. ఎక్కడైనా చిన్న గొడవ జరిగితే ఏకంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ లోకల్ లీడర్లు వచ్చేస్తారు.
ప్రభుత్వ భూములను, ఖాళీస్థలాలను కబ్జా చేసినా చూసీ చూడనట్లు వ్యవహరించాలి. ఎవరైనా ఉద్యోగి కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించ దలిస్తే ఉద్యోగం వదిలిపోవాల్సిన పరిస్థితి. ఇక్కడ చట్టం జాడే ఉండదు. ఇష్టానుసారం వేగంగా వాహనాలు నడపడం, రాంగ్ రూట్‌లో వెళ్లి ఇతరులను ప్రమాదాలకు గురి చేయడం సర్వసాధారణం. ఎవరైనా నేరాల్లో ఇరుక్కొని అరెస్టయితే, వారిని విడిపించేందుకు మజ్లిస్ పార్టీ సిద్దంగా ఉంటుంది. అక్రమ కట్టడాలు, ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగిస్తే మూకుమ్మడి ఆందోళనలకు దిగుతారు. వీరేం చేసినా చూసీ చూడనట్లు వదిలేయాల్సిందే.
పాతబస్తీలో పన్నులు సక్రమంగా చెల్లించే హిందూ బస్తీలు కనీస సౌకర్యాలకు దూరంగా ఉండిపోయాయి. పన్నులు చెల్లించని ప్రాంతాలకు తాగునీరు, విద్యుత్ సరఫరా నిరాటంకంగా కొనసాగు తుంది. చిరకాల ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పొరపాటున కూడా ముస్లిమేతర బస్తీలకు వెళ్లరు. కానీ ప్రోటోకాల్ ప్రకారం తమ పేరు శిలా ఫలకాల మీద ఉండాలని పట్టుపడతారు.
భయపెట్టే మత కలహాలు
ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల వారిలో పాతబస్తీ అంటే ఒక భయం ఉండేది. ఆ వైపు వెళ్లొద్దని జాగ్రత్తలు చెప్పేవారు. కారణం పాతబస్తీ మత కలహాల చరిత్రే. రెండు దశాబ్దాల క్రితం వరకూ దేశంలో మత కలహాలు అత్యధికంగా జరిగే నగరాల్లో హైదరాబాద్ పేరు వినిపించేది. దీనికి తోడు ఉగ్రవాద ఘటనలు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగిన హైదరాబాద్‌తో ఏదో రూపంలో సంబంధాలు కనిపిస్తాయి.. పాతబస్తీలో నిషేధిత, అనుమానిత సంస్థల స్లీపర్ సెల్స్ తలదాచుకున్న సందర్భాలు అనేకం. ఎక్కడో పోలీసులకు సమాచారం అంది, వారు వచ్చి అరెస్టు చేసే వరకూ స్థానికులకు కూడా వారి గురించి తెలిసేది కాదు. ఇంత ప్రమాదకర వ్యక్తుల మధ్య మనం ఇంతకాలం ఉన్నామా అని భయపడేవారు.
చీటికీమాటికీ జరిగే మత ఘర్షణలు, రోజుల తరబడి కర్ఫ్యూలతో పాతబస్తీ సామాన్యుడి బతుకు బండిని దుర్భరం చేసేవి. ఇనుప కంచెలతో పోలీసు పహారా నడుమ నిర్మానుష్యంగా కనిపిస్తున్న దృశ్యాలు. 1978 నుంచి 1985 వరకూ దాదాపు ఏటా మత ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత 1990 నాటి ఘర్షణలు పతాకస్థాయిలో నిలచి వారాల తరబడి కొనసాగాయి. 1978, 1979, 1980, 1981, 1984, 1990ల్లో ఎక్కువగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 11సార్లు 113 రోజులపాటు కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనల్లో 554 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,798 మంది గాయాల పాలయ్యారు.
1990లో జరిగిన మతఘర్షణలు హైదరాబాద్ చరిత్రనే కుదిపేశాయి. ఆనాటి ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య అధికారికంగా 208. అనధికారికంగా ఇంకా ఎక్కువే అంటారు. వారాల తరబడి కర్ఫ్యూ కొనసాగింది. సైన్యం రంగంలోకి దిగాకనే పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. హిందువులు వేలాది సంఖ్యలో పాత నగరాన్ని వదిలి వెళ్లారు. అల్లర్లలో ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన వారంతా హిందువులే. పార్దీవాడలో పండ్ల వ్యాపారం చేసుకునే గిరిజనులు ఉండేవారు. వారిని పిట్టలోళ్లు(పార్దిలు) అని పిలు స్తారు. వీరిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ వర్గం అక్కడ లేదు. నాటి అల్లర్లకు కాంగ్రెస్‌లోని ఒక వర్గం కారణమని, ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని పదవిలోంచి దించేందుకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులు పన్నిన కుట్ర అనే కథనం కూడా ఉంది. కానీ అవి పూర్తిగా మత ఘర్షణలే. హిందు, ముస్లిం పండుగలు ఒకేసారి వస్తే హైదరా బాద్ గడగడలాడేది. వినాయక చవితి రోజులు దుర్భరం. ఈ అల్లర్ల వెనుక శక్తి మజ్లిస్.
ఉగ్రవాద ఘటనలు
1992లో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు టోలీచౌకి దగ్గర అదనపు ఎస్పీ (ఎస్‌ఐబీ) కృష్ణప్రసాద్‌ను హత్య చేశారు. 2002లో దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా గుడి వద్ద లష్కరేతోయిబా జరిపిన బాంబు పేలుళ్లలో ఇద్దరు మృతి చెందగా, 19మంది గాయపడ్డారు. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగి 9మంది మృతి చెందగా, 50 మందికి గాయాలయ్యాయి. అదే సంవత్సరం లుంబినీ పార్కు, గోకుల్‌చాట్‌లలో బాంబు పేలుళ్లు జరిగి 43 మంది చనిపోగా, 47 మందికి గాయా లయ్యాయి. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లలో 17 మంది మృతి చెందగా, 138 మందికి గాయాలయ్యాయి.
హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరేతోయిబా, హర్కతుల్ ఉల్ జిహాద్ అల్, ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ సంస్థలు ఈ ఘటనలకు పాల్పడ్డాయి. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మారణకాండకు పాల్పడ్డ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారికి హైదరాబాద్‌తో గల సంబంధాలు బయటపడ్డాయి. దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌లో విదేశీశక్తులు పాతుకుపోవడం ఆందోళన కలిగించే విషయం. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు, మయన్మార్ నుంచి వచ్చి నివసిస్తున్న రొహింగ్యాలు ఇక్కడ స్థిరపడిపోయారు. వీరికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పాస్‌పోర్టులు ఇప్పిస్తున్నది ఎవరు అనేది బహిరంగ రహస్యమే. పోలీసు ఉన్నతాధికారులను హత్య చేసి శిక్ష అనుభవించిన నిందితులను మజ్లిస్ వెనుకేసుకు వచ్చింది. వారికి క్షమాభిక్ష కోసం ప్రభుత్వంతో బేరసారాలు సాగించింది.
పాలు పోసిన వైఎస్
మజ్లిస్ పార్టీ పాత బస్తీపై పట్టు సాధించడంలో కాంగ్రెస్ సహకారం జగద్విదితం. మజ్లిస్‌కు గట్టిపోటీ ఇచ్చే పార్టీకి మొదటి నుంచీ బీజేపీయే. ఏలె నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి లాంటి నాయకులు ఇక్కడి హిందు వుల్లో విశ్వాసం కలిగించేవారు. వారికి అన్ని వేళలా అండగా నిలిచేవారు. ఈ టైగర్, గోలుకొండ సింహంగా పేరొందిన ఈ ఇద్దరు నాయకులు శాసన సభ్యులుగా గెలిచినా, హైదరాబాద్ ఎంపీగా విజయం సాధించలేకపోయారు. కారణం సుస్పష్టం. ముస్లింల ఓట్లు ఏకపక్షంగా మజ్లిస్‌కు పడేవి. నిజానికి వాళ్లే వేసుకునేవారు. హిందూ ఓట్లు కాంగ్రెస్, టీడీపీల కారణంగా చీలిపోయేవి. కాదు, కావాలని చీల్చేవారు.
గతంలో హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలు ఉండేవి. 1991 లోక్‌సభ ఎన్నికల్లో సలావుద్దీన్ ఒవైసీకి బద్దం బాల్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఒవైసీ 4,54,823 ఓట్లు తెచ్చుకోగా, బాల్ రెడ్డి 4,15,299 ఓట్లు సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో మారిన వ్యూహాలు ఎంఐఎంను మరింత బలోపేతం చేశారు.
2009లో నియోజకవర్గాల పునర్విభన జరిగింది. నాటి ముఖ్యమంత్రి రాజశేఖరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్ లోక్‌సభ పరిధి నుంచి గ్రామీణ ప్రాంతాలను తొలగించారు. హిందు వులు ఎక్కువగా నివసించే ప్రాంతాలను వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలోకి మార్చారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చార్మినార్, చంద్రాయణ గుట్ట, బహదూరపురా, కార్వాన్, యాకుత్‌పురా, మలక్‌పేట, గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇందులో మొదటి ఆరు ముస్లింల ఆధిక్యత ఉంటూ గోషామహల్‌లో హిందువులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మాత్రమే బీజేపీ వరుసగా విజయాలు సాధించగలుగుతోంది. చార్మినార్, చంద్రాయణ గుట్ట, బహదూరపురా, కార్వాన్, యాకుత్‌పురా, మలక్‌పేటలతో పాటు సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని నాంపల్లిల నుంచి 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఆభ్యర్థులు గెలిచారు
ముస్లింలకు చేసిందేమీ లేదు
మజ్లిస్ పార్టీ కేవలం ముస్లింల ఓట్లతో గెలుస్తున్నా, ఆ వర్గం అభ్యున్నతి కోసం చేసిందేమీ లేదని ఎవరైనా అంగీకరించక తప్పదు. పాతబస్తీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. హిందువులతో పాటు ముస్లిం బస్తీలదీ అదే పరిస్థితి. వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ఎంఐఎం ఏనాడూ చొరవ తీసుకోలేదు. తోపుడు బండ్లు, ఫుట్‌పాత్ వ్యాపారాలు, ఆటోలు నడిపేవారంతా ముస్లింలే. నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, బాలికలపై వివక్షతను స్పష్టంగా చూడొచ్చు. ముస్లింలు పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చు కోలేకపోతున్నారు. ఒవైసీ కుటుంబ ఆధ్వర్యంలోని మైనారిటీ విద్యాసంస్థల్లో ఫ్రీ సీట్లను ముస్లింలకు ఇవ్వకుండా బయటివారికి అమ్ముకుంటారనే ఆరోపణలున్నాయి
భారతదేశ ప్రధానిగా బురఖా ధరించిన మహిళను చూస్తామని ప్రగల్బాలు పలికారు అసదుద్దీన్ ఓవైసీ. కానీ ఆయన ఏనాడు మహిళలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నచోట విధిలేక కార్పొరేటర్ టికెట్లు ఇచ్చారు. మహిళలపై బాహాటంగా వ్యతిరేకత ప్రదర్శి స్తారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ మీద బాహాటంగానే చేయి చేసుకున్నారు. ఇలాంటి పరిణా మాలతో మస్లింలలో కూడా మార్పు మొదలైంది.
ఎంఐఎం మీద వ్యతిరేకత పెరుగుతోంది. తాము ఎవరినీ నమ్మలేక విధిలేని పరిస్థితుల్లోనే మజ్లిస్‌కు ఓటు వేస్తున్నట్టు చెబుతున్న వారిని పాతబస్తీలో గమనించవచ్చు..
– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్