ఒకవైపు జమ్ము-కశ్మీర్ ప్రాంతం అభివృద్ధిలో అంగలు వేస్తూ దూసుకు పోతుండగా మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రాంతాలు నిరసన ప్రదర్శనలతో అట్టుడికిపోతున్నాయి. గిల్గిత్ బల్టిస్తాన్ వంటి ప్రాంతాలు తమకు స్వయంప్రతిపత్తిని కోరుకుంటుంటే, ఇతర ప్రాంతాలలోనివారు తమను భారతదేశంలోని కశ్మీర్‌లో కలిపేయమని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతాలను ఆక్రమించుకున్న పాకిస్తాన్ తమను ఏరకంగానూ సమానంగా చూడక పోవడం వీరి అసంతృప్తికి కారణం. వారికి ప్రాథమిక హక్కులు కానీ, రాజ్యాంగపరమైన లేదా రాజకీయ హక్కులు కానీ లేకపోవడం. సహజ వనరులతో సుసంపన్నమైన ఈ ప్రాంతంలో ప్రజా జీవితం దయనీయంగా మారిపోవడం. వారికి విద్య, ఉపాధి అవకాశాలు సరే అసలు స్వేచ్ఛ అనేదే మృగ్యం కావడం, భాషాపరంగా, సాంస్కృతికపరంగా అణచి వేతకు గురి కావడం… ఇవన్నీ కూడా అక్కడి ప్రజలలో నిత్య అసంతృప్తి, అశాంతులకు దారితీసి, ఇప్పుడు తమను భారత్‌లో కలిపేయమనే డిమాండ్ వరకూ వెళ్లాయి.
370 రద్దు తర్వాతే నిజం తెలుసుకున్న పీఓకే
ఈ క్రమంలోనే జమ్ము-కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఎత్తివేయడం, తదనంతరం అక్కడ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వస్తూ, అభివృద్ధి పుంజుకోవడంతో, సరి హద్దుకు అటువైపున ఉన్నవారు రెండు ప్రాంతా లలో జరుగుతున్న పరిణామాలను పోల్చుకుని, తమను కూడా భారత్‌లో కలిపేయమనే డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాంతం వారిదే అయినప్పటికీ, రోజుకు 16 గం।।ల విద్యుత్ కోతలను, భారీ విద్యుత్ బిల్లులను కట్టడం వారిని ఆక్రోశింపచేస్తోంది. వారి మానవ హక్కులు, సంస్కృతి, ఆహారం, భాష, వారసత్వం అన్నింటినీ పాక్ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం హననం చేస్తూ వస్తోంది. పీఓకేలోని ముజాఫరా బాద్‌లో 90 శాతం మంది ప్రజలు పంజాబీ మాట్లాడుతున్నారంటే, పీఓకేలో జన సంఖ్య ఎంతగా పరివర్తన చెందిందో అర్థం చేసుకోవచ్చని మానవ హక్కుల కార్యకర్త ఆరీఫ్ ఆజాకియా వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలు కానీ, వైద్య కళాశాలలు కానీ, జాతీయ రహదారులు కానీ, ఉద్యోగావకాశాలు కానీ లేకపోవడం వల్లే పీఓకే వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
నిన్నమొన్నటి వరకూ సాధారణ ప్రజల నిరసనలకు దిగగా, పీఓకేకు చెందిన రాజకీయ పార్టీ అవామీ యాక్షన్ కమిటీ (ఎసిసి) కూడా నిరసనలకు, బంద్‌లకు పిలుపునిచ్చి, రంగంలోకి దిగింది. తమ ప్రాంతాన్ని ఆక్రమించినప్పటినుంచీ, అంటే 1947 నుంచీ తమను ద్వితీయ శ్రేణి పౌరులుగాచూస్తు న్నారని ఆరోపిస్తూ రాజకీయ కార్యకర్తలు పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా బహిరంగ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖ రాజకీయ కార్యకర్త తౌకీర్ గిలానీ ప్రకారం, ‘పాక్ ప్రభుత్వం ఎప్పుడూ మాకు అండగానే ఉంటామని, మా ప్రజల హక్కుల కోసం ఎప్పుడూ పోరాడతామనే హామీ ఇస్తోంది. పాకిస్తానీ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు స్నేహితులైనవారికి ప్రత్యేకంగా శత్రువులు అవసరం లేదు. కావాలంటే ఆఫ్ఘన్లను అడగవచ్చు, పాలస్తీనియన్లను కూడా అడగవచ్చు, వారు మాపై చేస్తున్న దౌర్జన్యాలు, అకృత్యాల గురించి మమ్మల్ని కూడా అడుగవచ్చంటూ’ వ్యాఖ్యానించి, అక్కడి పరిస్థితులకు అద్దంపట్టారు. ముఖ్యంగా, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాక్ యంత్రాంగం చేస్తున్న దౌర్జన్యాలను గురించి కూడా గిలానీ ప్రస్తావించడం గమనార్హం.
పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా పాక్‌లోని సాధారణ ప్రజలలోనే అసంతృప్తి పెరుగుతుండగా, పీఓకేలో మాత్రం ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సైన్యం దేశ ప్రధానులను, అధ్యక్షులను కూడా ద్రోహులని ముద్రవేసి జైళ్లలో పెట్టడమే కాదు, ఇప్పుడు రాజకీయ పార్టీలను చీల్చడం, సంస్కృతిని, సంప్రదాయాలను ధ్వంసం చేయడం, ఎక్కడ భూమి కనపడితే అక్కడ కబ్జా చేసే స్థాయికి దిగజారి పోయిందని గిలానీ మండిపడ్డారు. దీనిని ప్రజా స్వామ్యం అంటారా? ఇస్లాం అంటారా? అని ప్రశ్నిస్తూ, మానవాళి చరిత్రలో ఇంతకు మించిన అబద్ధం మరొకటి ఉండ దని ఆయన అన్న మాటనే పీఓకే ప్రజలు ప్రతిధ్వనిస్తున్నారు. ఎవరి తాత ముత్తాతలు అయితే తమ భూములను ధ్వంసం చేశారో, ఆ వ్యక్తులు తమ ఆర్ధిక పరిస్థితులు మెరుగు పరచుకునే యత్నాన్ని కూడా సహించడం లేదని గిలానీ ఆరోపించారు.
తమపై ఇస్లాం వ్యతిరేక, పాక్ వ్యతిరేక ముద్రవేసి తమ మాటలు వినేందుకు కూడా సైన్యం సిద్ధంగా లేకపోవడంతోనే అక్కడి ప్రజలు భారత్‌తో కలిపేయ మనే డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా పాక్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న పీఓకే వాసులు ఇప్పుడు భారత్‌తో తక్షణమే పునఃఅనుసంధానం కావాలని కోరుకుంటున్నారు. తరతరాలుగా పంచుకున్న చారిత్రిక, సాంస్కృతిక సంబంధాలు, వారసత్వం ఈ డిమాండ్ లేదా కోరిక మూలాల్లో ఉంది. ఈ సామాన్య వారసత్వాన్ని గుర్తించి, వేడుక చేసుకోవడం అన్నది పీఓకే వాసులలో ఐక్యతా భావాన్ని పెంపొం దించగలదు. తమ భారతీయ గుర్తింపును, అస్తిత్వాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా భారత పురోగతిలో పీఓకే వాసులు భాగస్వాములు కావాలనుకుంటున్నారు.
పాక్‌లో ఆర్ధిక పరిస్థితులు కూడా వీరి అప్పీల్‌కు ఒక ప్రధాన కారణంగా భావించవచ్చు. భారత్ గురించిన తప్పుడు సమాచారం, అబద్ధాలతో ఆ ప్రాంత వాసులను మభ్యపెట్టి, లోబరుచుకొని మొన్నటివరకూ పాక్ వారిని పాలించింది. కాగా, ఈ సమాచార తుపానులో వారు కట్టిన అబద్ధాల గోడ కూలిపోయి, భారత్ సాధిస్తున్న అసాధారణ ఆర్ధిక, సామాజిక పురోగతి స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. ఈ ప్రాంత ప్రజలు కూడా భారత్ లోని జమ్ముకశ్మీర్ ప్రాంతంలో ప్రజలు జీవిస్తున్న నాణ్యమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. దీనితో వారికి తాము చేసిన తప్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతేకాదు, తాము పాకిస్తానీ సైన్యం చేతుల్లో రాజకీయ పరికరాలు, బలిపశువుల మయ్యామన్న విషయం వారు అర్థం చేసుకుని, ఆవేదన చెందు తున్నారు. ఈ ప్రాంతంలో పురోగతికి, ఆర్ధిక వృద్ధికి ఉత్ప్రేరకం అయ్యి తమ పూర్తి సామర్ధ్యాన్ని ఉపయోగించాలని పీఓకే కోరు కుంటోంది. అందుకే, భారత్‌లో తిరిగి చేరతామని పదే పదే కోరుతోంది. దాని గొంతుకను పాకిస్తాన్ అధికారులు నొక్కి వేస్తుండగా, అంతర్జాతీయ మానవహక్కుల పోరాట యోధులమని భావించే వారు విస్మరించారు! భారత ప్రజాస్వామ్యం, సెక్యులరిజం ఎంత బలమైనవో, వాస్తవమో పీఓకే వాసుల డిమాండ్లు బహిర్గతం చేస్తున్నాయి.
– డి. అరుణ