పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడి మనవడు విరేచనుడి కుమారుడు బలి, ఉత్తముడు, సత్యసంధుడు, అమిత శౌర్యపరాక్రమశాలి. ఆయన పాలన సుభిక్షమైనదని, అన్ని వర్గాల వారు సుఖశాంతులతో జీవించేవారని భాగవతం చెబుతోంది. ఇచ్చిన మాట తప్పడు. తాత ప్రహ్లాదుడి విష్ణుభక్తి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నప్పటికీ సాత్వికాహంకారం వీడలేకపోయాడు. త్రిలోకాధిపత్యం కోసం ఇంద్రునితో పోరాడి పరాజయం పాలయ్యాడు. క••లగురువు శుక్రాచార్యుడి సూచనతో విశ్వజిత్ యాగం నిర్వహించాడు. హోమకుండం నుంచి గుర్రాలు పూన్చిన బంగారు రథం, దివ్య ధనుస్సు, అక్షయమనే అమ్ములపొది, దివ్య కవచం వచ్చాయి. బ్రహ్మ వాడిపోవని పూలహారం బహూకరించాడు. శుక్రాచార్యుడు శంఖాన్నివ్వగా వాటి సహాయంతో, యాగబలం, ఫలంతో ఇంద్రునిపై దండెత్తాడు. ఆయన ధాటికి తట్టుకోలేని ఇంద్రుడు, గురువు బృహస్పతిని కలిశాడు. ‘ఈ పరిస్థితుల్లో బలిని ఎదుర్కోవడం అసాధ్యం.అతను ప్రస్తుతం శక్తి సంప న్నుడు. భృగువంశం బ్రాహ్మణులు క్రతువుల ద్వారా ఈ బలసంవదను సమకూర్చారు. ఆయనను హరి హరులు తప్ప ఇతరులు ఎదుర్కొనలేదు. అనువైన సమయం కోసం నిరీక్షించడమే ప్రస్తుత కర్తవ్యం’ అని హితవు పలకడంతో ఇంద్రుడు, ఇతర దేవతా ముఖ్యులు మారురూపాలతో అజ్ఞాతంలొకి వెళ్లారు.
అలా అనాయాస విజయంతో బలి ముల్లోకాధి పతి అయ్యాడు. ఆయనతో శుక్రాచార్యులు నూరు అశ్వమేధ యాగాలు చేయించాడు. ‘సద్గుణం మాత్రమే రాజ్యపాలన చేస్తుంది’ అన్న తాత ప్రహ్లాదుడి మాటలను ఆదర్శంగా తీసుకున్నాడు. ఆ దానవోత్త ముడి పాలన సుభిక్షంగా సాగుతూ ప్రజలు సంతృప్తులై ఉన్నా, ‘నేను ’అనే దానిని జయించలేకపోయాడు. దానవులు దేవతల కంటే మహా బలవంతులని ఆయన విశ్వాసం. అదే మాటను తాత ప్రహ్లాదుని వద్ద ప్రస్తావించగా, అందుకు ఆగ్రహించిన ఆయన ‘నీ రాజ్యం నశించుగాక’ అని శపిస్తాడు. పశ్చాత్తాపం చెందిన మనవడితో ‘శ్రీమహావిష్ణువువ వల్ల ముక్తి కలుగుతుంది’ అని చెబుతాడు. అటు, దేవమాత అదితి , తన సంతతి దేవతలకు కలిగిన దుస్థితికి కలత చెందింది. బలిని కట్టడి చేయడానికి విష్ణువును ప్రసన్నం చేసుకోవాలన్న భర్త కశ్యప ప్రజాపతి సూచనపై ‘పయోభక్షణం’ అనే వ్రతం చేపట్టింది. శ్రీహరి ప్రసన్నుడై ఆమె కుమారుడిగా (వామనుడు) జన్మించాడు. ఉపనయనం తరువాత, నర్మద నదీ తీరంలోని ‘భృగుకచ్ఛం’ వద్ద బలి అశ్వమేధ యాగం చేస్తున్న ప్రదేశానికి చేరి ‘స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు…’ (‘ముల్లోకాలను శాసించగల నీకు మంగళం’) అని ఆశీర్వదించాడు. దివ్యతేజస్సుతో వెలగొందుతున్న బాలుని చూచిన బలి ‘ఆ సుందర వామనుడు మారువేషంలో వెలుగొందె త్రిమూర్తులలో ఒకరో, సూర్యుడో, అగ్నియో కాదుకదా! అని విస్తు పోయాడు. ఆతనిని సాదరంగా ఆహ్వానించి, ధర్మపత్ని వింధ్యావళి బంగారు కలశంతో తెచ్చిన నీటితో పాదాలు కడిగి, ఆ నీటిని శిరస్సున జల్లుకున్నాడు.
-రామచంద్ర రామానుజ