(రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా)
-జాగృతి డెస్క్
‘అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది; ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది’ అన్న నానుడిని విననివారుండరు. చదువు, డబ్బు, సంస్కారంతో పాటు పరోపకారం కూడా మనిషికి అబ్బితే, వారిని అసాధారణ వ్యక్తులుగా మనం చెప్పుకోక తప్పదు. సరిగ్గా అటువంటి వారే ‘పద్మభూషణ్’ సుధామూర్తి. ఏడు గౌరవ డాక్టరేట్లు ఆమె స్వంతం. ఒకపక్కన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటి కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడైన భర్త, మనను పాలించిన యూకేకే ప్రధానమంత్రి అయిన అల్లుడూ ఉన్నప్పటికీ ఆమె మాత్రం సగటు మధ్య తరగతి గృహిణిలా, మన పక్కింటి మహిళలా అనిపిస్తారు. ఎంతో సంప్రదాయంగా కనిపించినప్పటికీ, ఏటికి ఎదురీదగల వ్యక్తిత్వం ఉన్న మహిళ ఆమె. ఎప్పుడూ భర్త నారాయణ మూర్తి చాటున ఉండే వారు. కాగా, ఇటీవలే భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభకు నామినేట్ చేయడంతో ఆమె మరోసారి వార్తలలోకెక్కారు.
ఇంతకు ముందు, అత్యంత సాధారణ వ్యక్తిని తానంటూ ఒక టీవీ షోలో సుధామూర్తి చెప్పినప్పుడు అనేకమంది దానికి ప్రతికూలంగా స్పందించడంతో ఆమె వార్తలలోకెక్కారు. నిజానికి, సుధామూర్తి ఏమీ బంగారు చెంచాతో పుట్టలేదు. ఆమె కూడా ఒక సాధారణ మధ్య తరగతి ఇంటి నుంచి వచ్చిన వ్యక్తే. అయితే, ఆమె పుట్టినింట్లో తండ్రి సహా కుటుంబ సభ్యులు పురోగమనశీల ఆలోచనలు గలవారు కావడంతో ఆమె ఇంజినీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యు యేషన్‌ను పూర్తి చేయగలిగింది. తను ఆడపిల్లననే వివక్షను తల్లిదండ్రులు ఎప్పుడూ చూపించలేదని, అదే తనకు బలమని ఆమె చెప్తుంటారు. తనపై తన నాయనమ్మ ప్రభావం కూడా చాలా ఉందని, ఆ కాలంలోనే ఆమె ఆధునిక భావాలు కలిగిన మనిషిగా తమ పెంపకంపై ప్రభావాన్ని చూపిందని ఆమె చెప్తుంటారు.
ఏమైనప్పటికీ, సంప్రదాయ, ఆధునికతల సమ్మేళనమైన ఆమె మూర్తి ట్రస్టు చైర్మన్‌గా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను చేపడుతుంటారు. ఆమె రచయిత కూడా. ముఖ్యంగా పిల్లలకు వినయాన్ని, వివేకాన్ని బోధించే విధంగా కథలు రాస్తుంటారు. అపారమైన ఉద్యోగ, వ్యాపార అనుభవమే కాక మన సంప్రదాయం పట్ల గౌరవం కలిగిన వ్యక్తి అయిన సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు. సమాజసేవ, పరోపకారం, విద్య వంటి భిన్న రంగాలకు ఆమె చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని, ర్యాసభలో ఆమె ఉనికి ‘నారీ శక్తి’కి బలమైన ఉదాహరణగా నిలుస్తుందంటూ ప్రధాని ఎక్స్‌పై చేసిన పోస్టులో కొనియాడారు.
ఉత్తర కర్ణాటకలోని హవేరీ జిల్లాలోని షిగ్గాంవ్‌లో జన్మించిన సుధామూర్తి బివిబి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇంజినీరింగ్‌ను పూర్తి చేశారు. అన్ని అంశాలలోనూ ఆమె తొలి ర్యాంకును సాధించి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి స్వర్ణ పతకాన్ని పంపారు. అనంతరం ఆమె ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎంఇ ని డిస్టింక్షన్‌తో పూర్తి చేశారు. అనంతరం, ఆమె టెల్కోలో (నేడు టాటా మోటార్స్) లో ఇంజినీరుగా తన జీవితాన్ని ప్రారంభించారు. నేడు ఆమె ఇన్ఫోసిస్ ఫౌండెషన్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆమె అటు ఇంగ్లీషులోనూ, ఇటు మాతృభాష కన్నడలోనూ కూడా పుస్తకాలను రచించారు. నవలలు, నాన్-ఫిక్షన్, పిల్లల పుస్తకాలు, ట్రావెలాగ్‌లు, సాంకేతికత పుస్తకాలు, జ్ఞాపకాలు సహా 200 శీర్షికలతో పాటు 30 పుస్తకాలు రచించారు. ఆమె పుస్తకాలను ప్రధాన భారతీయ భాషలన్నింటి లోకి అనూదితమై, దేశవ్యాప్తంగా సుమారు 26 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి.
ఆమె అనేక సామాజిక సమస్యలపై పోరాటం చేయడమే కాదు, సామాజిక అవగాహనకు ప్రముఖ గొంతుకగా ఆమె విదేశాలలో విస్తృతంగా పర్యటిం చారు. గేట్స్ ఫౌండేషన్ వంటి సంస్థలు చేపట్టిన ప్రజారోగ్య సంరక్షణ చొరవల్లో ఆమె చురుకుగా పాలుపంచుకోవడమే కాదు, అనేక అనాథాశ్రమాలను ఏర్పాటు చేసి ఎంతోమంది పిల్లలకు ఆశ్రయాన్ని కల్పించారు. అంతేనా? ఆమె గ్రామీణాభివృద్ధి పట్ల కూడా ఆసక్తిని ప్రదర్శించి, అందుకోసం కృషి చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యాల కల్పనకు పోరాడారు. కేవలం దేశంలోనే కాదు, విదేశాలలో కూడా ఆమె భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు కృషి చేశారు. అందులో భాగంగానే, హార్వార్డ్ యూనివర్సిటీలో మూర్తీ క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు.
ఆమె చేస్తున్న సమాజ సేవను గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆమెకు ‘పద్మశ్రీ’ని ప్రదానం చేయగా, 2023లో ‘పద్మభూషణ్’ ఇచ్చి సత్కరించింది. ఈ అత్యున్నత గౌరవాన్ని పొందిన అతితక్కువమంది వ్యక్తులలో ఆమె ఒకరయ్యారు. సమాజ సేవ మాత్రమే కాదు, సాహితీరంగంలో కూడా ఆమె సాధించిన విజయాలు తక్కువ కాదు. ఆర్‌కె నారాయణ్ అవార్డ్ ఫర్ లిటరేచర్, కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ సాహిత్యానికి ఇచ్చే అత్తిమబ్బే అవార్డును 2011లో పొందారు. ఇక, 2018లో క్రాస్‌వర్డ్ బుక్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఆమె పొందారు. సాహిత్యంపై ఆమె వేసిన ముద్రకు ఇంతకన్నా ఉదాహరణల అవసరం ఉండదేమో.
అత్యంత సాధారణంగా కనిపించే సుధామూర్తి, ఆస్తుల విలువ సుమారు రూ.5,600 కోట్లు మాత్రమేనట!