మార్చి 16 టీకా దినోత్సవం

చిన్నారులను ప్రాణాంతక జబ్బుల నుంచి కాపాడి వారిని ఆరోగ్యవంతులయిన పౌరులుగా తీర్చిదిద్దటంలో టీకాలు నిర్వహించే పాత్ర విశేషమైనది. అందుకే ప్రభుత్వం ఏడాదిలో ఒకరోజును జాతీయ టీకా దినోత్సవంగా ప్రకటించి ప్రజలను జాగృత పరుస్తోంది. భారతీయ ఆరోగ్య కేలండర్‌లో దానికి విశేష స్థానం కల్పిస్తోంది. మార్చి 16 జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా దీని పూర్వాపరాలపై కథనం..

దేశంలో పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలనే ప్రధాన ఉద్దేశంతో 1995లో జాతీయ టీకా దినోత్సవాన్ని ప్రకటించారు. 2011లో పోలియో చివరి కేసు నమోదయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లోభారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది. ప్రస్తుతం మశూచికం లేదా తట్టు (మీజిల్స్‌) రుబెల్లా నిర్మూలన దిశగా అడుగులు వేస్తోంది.

శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటి వ్యాక్సినేషన్లు ఇస్తారు. పిల్లలకు స్వతహాగా రోగ నిరోధక శక్తి ఉండదు. తల్లే వారికి కావలసిన రోగ నిరోధక శక్తిని తన శరీరం నుంచి అందిస్తుంది. పుట్టగానే పోలియో వ్యాక్సిన్‌, బీసీజీలు ఇస్తారు. ఇవి కాకుండా 0-10 సంవత్సరాల దాకా వారాలు, నెలలు, సంవత్సరాల వారీగా ఎంఎంఆర్‌ తదితర వ్యాక్షిన్లను ఇస్తారు. పదేళ్లకు టైఫాయిడ్‌, కలరాలకు వ్యాక్సిన్లు ఇస్తారు.

జాతీయ టీకా కార్యక్రమ ప్రణాళిక (నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ షెడ్యూల్‌) ప్రకారం, పిల్లలకు పుట్టినప్పటి నుంచి టీకా ఇవ్వడం వల్ల డిఫ్తీరియా, పెర్ట్యూసిస్‌, టెటనస్‌, పోలియో, మీజిల్స్‌, బీసీజీ, టీబీ,హెపిటైటిస్‌-బి, హిమోఫిలస్‌ ఇన్‌ఫ్లూయెంజా టైప్‌ బి, డయేరియా, మంప్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించవచ్చు. ముఖ్యంగా 12 వాక్సినేషన్లు అత్యంత కీలకం. చికెన్‌పాక్స్‌, డిఫ్తీరియా, టెటనస్‌, పెర్టూసిస్‌ వ్యాక్సీన్‌, హెపటైటిస్‌ ఎ, హెపటైటిస్‌ బి వ్యాక్సీన్‌, ఇన్‌ఫ్లూయెంజా టీకా, హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ వ్యాక్సీన్‌, జపనీస్‌ ఎన్సెఫలిటిస్‌ (బ్రెయిన్‌ ఫీవర్‌) టీకా, మీజిల్స్‌, మంప్స్‌ వ్యాక్సీన్‌, మెనింగోకోకల్‌ వ్యాక్సిన్‌,  న్యూమోకోకల్‌ టీకాలను మరిచిపోకుండా ఇప్పించాలి.

బాక్టీరియాల వల్ల కలిగే డిఫ్తీరియా, పెర్ట్యూసిస్‌, టెటనస్‌ల నుంచి చిన్నారులను డీటీపీఎ వ్యాక్సీన్‌ రక్షిస్తుంది. పెర్ట్యూసిస్‌ శ్వాసకోశ వ్యవస్థకు చెందిన ఇన్ఫెక్షన్‌. ఆరు నెలలలోపు పిల్లలకు ఇది ఎక్కువగా వస్తుంది. ఊపిరి తిప్పుకోలేనంతగా విపరీతంగా దగ్గు వస్తుంది. దీనివల్ల చిన్నారులు తాగలేరు, తినలేరు. తీవ్రమైన దగ్గు వారాల తరబడి బాధిస్తుంది. ఇది కొన్ని సందర్భాలలో బిడ్డ ప్రాణం మీదకు కూడా తెస్తుంది.

బోర్డెటెల్లా పెర్ట్యూసిస్‌ అనే బాక్టీరియా వల్ల ఇది వస్తుంది. పైగా ఇది అంటువ్యాధి. దగ్గు, తుమ్ముల ద్వారా ఒక చిన్నారి నుంచి ఇంకో చిన్నారికి సోకే అవకాశం ఉంటుంది. దీన్ని నిరోధించడానికి పెర్ట్యూసిస్‌ వ్యాక్సిన్‌ బాగా పనిచేస్తుంది.

టెటనస్‌ విష పదార్ధాలు ఉత్పత్తిచేసే బాక్టీరియా వల్ల వస్తుంది. నరాల వ్యవస్థ ముఖ్యంగా దవడ, మెడ కండరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. టెటనస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. హెపటైటిస్‌`బి ఆందోళనకరమైంది. ఇది కాలేయానికి వచ్చే ఇన్ఫెక్షన్‌. దీనివల్ల లివర్‌ సిరోసిస్‌, కాలేయం క్యాన్సర్‌ తలెత్తే ప్రమాదం ఉంది. టీకాతో వీటిని నిరోధించవచ్చు.

మెనింగోకోకల్‌ బాక్టీరియా శరీరంలోని ఏ భాగం లోనైనా అంటే చర్మం, జీర్ణ కోశం (గాస్ట్రోఇంటస్టైనల్‌ ట్రాక్‌), శ్వాసకోశ వ్యవస్థ ఇలా ఎక్కడైనా ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. మెదడు, వెన్నెముక మీద ఇది ప్రభావం చూపుతుంది. దీనివల్ల కొందరు దీర్ఘకాలి కంగా వినికిడి లోపంతో, మెదడు, నరాల సమస్య లతో బాధపడతారు. అవయవలోపం ఏర్పడే (కాళ్లు, చేతులు పడిపోవడం లాంటి) ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్య రావడానికి బాక్టీరియా, వైరస్‌ రెండూ ప్రధాన కారణాలు. ముఖ్యంగా మెనింగోకో కల్‌ శరీర రోగనిరోధకశక్తిని దెబ్బతీస్తుంది. ఈ వైరస్‌ నుంచి మెనింగోకోకల్‌ వ్యాక్సీన్‌ చిన్నారులను రక్షిస్తుంది.

ఏది ఎప్పుడు ఇస్తారు?

–       చికిన్‌ పాక్స్‌ టీకా రెండు డోసులు ఇస్తారు. మొదటి డోసు 12-15 నెలల మధ్యలో, రెండో డోసు 4-6 సంవత్సరాల వయసులో ఇస్తారు.

–         డిఫ్తీరియా, టెటనస్‌, పెర్ట్యూసిస్‌, డీటీఏపీలకు ఐదు డోసుల డీటీఏపీ టీకా అందిస్తారు. మొదటి డోసు రెండు నెలలకు, రెండో డోసు నాలుగు నెలలప్పుడు ఇస్తారు. తర్వాత ఆరు నెలల వయసులో ఒకటి, 15-18 నెలలున్నప్పుడు ఇంకోకొకటి, 4-6 ఏళ్ల వయసులో ఐదో డోసు ఇస్తారు.

–       పెంటావ్యాక్సిన్‌ కంబైన్డ్‌ వాక్సీన్‌. ఇది పిల్లలను డిఫ్తీరియా, టిటనస్‌, పెర్ట్యూసిస్‌, హెమోఫిలిస్‌ ఇన్‌ఫ్లూయెంజా టైప్‌ బి ఇన్ఫెక్షన్‌, హెపిటైటిస్‌ బి అనే ఐదు జబ్బుల నుంచి రక్షిస్తుంది. ఇది ఇంట్రామస్కులర్‌ వ్యాక్సిన్‌. 6, 10, 14 వారాల వయసు తేడాతో డోసులు ఇస్తారు.

–       ‘రోటా వైరస్‌ డయేరియా’ నుంచి రోటావైరస్‌ వ్యాక్సిన్‌ రక్షణ ఇస్తుంది. దీనిని 6, 10, 14 వారాల్లో వయసుకు అనుగుణంగా ఇస్తారు.

–         ‘న్యుమోకోకల్‌ కంజుగేటివ్‌ వ్యాక్సిన్‌’ న్యుమోనియాను నివారిస్తుంది. 6, 14 వారాల వయసప్పుడు ప్రైమరీ డోసులు ఇస్తారు. 9-12 వయసప్పుడు బూస్టర్‌ డోస్‌ ఇస్తారు.

–       హెమోఫిలిస్‌ ఇన్‌ఫ్లూయెంజా టైప్‌ బి (హిబ్‌) రాకుండా వ్యాక్సిన్‌ బ్రాండును బట్టి మూడు లేదా నాలుగు డోసులు ఇస్తారు. మొదటి డోసు రెండు నెలలప్పుడు, రెండో డోసు నాలుగు నెలలప్పుడు, మూడో డోసు (అవసరమైతే) ఆరు నెలల వయసప్పుడు ఇస్తారు. నాల్గో, చివర డోసు 12-15 నెలల వయసు మధ్యలో ఇస్తారు.

–        హెపటైటిస్‌ -ఎకి రెండు డోసుల హెపటైటిస్‌-ఎ టీకా ఇస్తారు. మొదటి డోసు ఒక ఏడాది వయసున్న ప్పుడు, రెండో డోసు 6-18 నెలల వయసు మధ్యలో ఇస్తారు.

–      హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ బ్రాండ్‌ని బట్టి మూడు లేదా నాలుగు డోసులు ఇస్తారు. మొదటి డోసు బిడ్డ పుట్టినప్పుడు, రెండో డోసును 1-2 నెలల మధ్యలో ఇస్తారు. మూడవ డోసును నాలుగు నెలలున్న ప్పుడు (అవసరమైతే) ఇస్తారు. చివరి డోసు 6-18 నెలల వయసు మధ్యలో ఇస్తారు.

–        ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) వ్యాక్సినేషన్‌ ఆరు నెలల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అవసరం. తొమ్మిదేళ్లకన్నా తక్కువ ఉన్న కొద్దిమంది పిల్లలకు రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లల డాక్టర్‌ సలహా మీద రెండో డోసు మీ చిన్నారికి అవసరమో లేదో తెలుసుకుని వేయించుకోవాలి.

–        మీజిల్స్‌, మంప్స్‌, రుబెల్లాకు (ఎంఎంఆర్‌) రెండు డోసుల ఎంఎంఆర్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు 12-15 నెలల మధ్యలో ఇస్తారు. రెండవ డోసు 4-6 సంవత్సరాల మధ్యలో ఇస్తారు.

–         మెనింగోకొకల్‌ వ్యాక్సిన్‌ని కొన్ని ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇస్తారు. ఒకటి లేదా అవసరాన్ని బట్టి రెండు మెనింగోకోకల్‌ డోసులు ఇస్తారు.

–        న్యూమోకోకల్‌కు నాలుగు డోసుల ప్రివనార్‌ (పిసివి13) అవసరం అవుతుంది. మొదటి డోసు రెండు మాసాలున్నప్పుడు ఇస్తారు. రెండవ డోసు నాలుగు నెలలున్నపుడు ఇస్తారు. మూడవ డోసు ఆరు మాసాల వయసులో, నాల్గవ డోసు 12-15 నెలల మధ్యలో ఇస్తారు.

–        పోలియోకి చిన్నారులకు నాలుగు డోసుల పోలియో వ్యాక్సినేషన్‌ (ఐపీవీ) ఇస్తారు. మొదటి డోసు రెండు మాసాలకు, రెండవ డోసు నాలుగు మాసాలకు, మూడవ డోసు 6-18 మాసాల మధ్యలో, నాల్గవ డోసు 4-6 సంవత్సరాల మధ్యలో ఇస్తారు.

–        రోటావైరస్‌ (ఆర్‌వీ)ని నిరోధించేందుకు బ్రాండును బట్టి చిన్నారులకు రెండు లేదా మూడు డోసుల రోటావైరస్‌ వ్యాక్సినేషన్‌ చేయాలి. ఇది డయేరియా వైరస్‌. మొదటి డోసు రెండు నెలలప్పుడు, రెండవ డోసు నాలుగు నెలల వయసులో, మూడవది (అవసరమైతే) ఆరు నెలలప్పుడు ఇస్తారు.

జపనీస్‌ ఎన్సెఫలిటిస్‌ వల్ల బ్రెయిన్‌ ఫీవర్‌ వస్తుంది. దీన్ని నిరోధించడానికి 9-12 నెలల వయసులో వ్యాక్సిన్‌ ఒక డోసు, 16-24 నెలల వయసులో రెండవ డోసు ఇస్తారు.

టూకీగా..

మనదేశంలో 1978లో ఎక్స్‌పాండెడ్‌ ప్రొగ్రామ్‌ ఆఫ్‌ ఇమ్యూనైజేషన్‌ (ఈపీఐ)గా ప్రారంభమైంది. 1989-90 నాటికి యూనివర్సల్‌ ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమంగా దశల వారీగా దేశమంతా చేపట్టారు.

ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గ్రామీణ ఆరోగ్య నర్సులు, హెల్త్‌ వర్కర్లు వ్యాక్సినేషన్‌ చేస్తారు. పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా ఇస్తారు. ప్రైవేటు ఆసుపత్రు లలో కూడా ఇమ్యూనైజేషన్‌ వ్యాక్సినేషన్లు అందు బాటులో ఉంటాయి. కానీ వాటికి డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ ఆమోదం పొందిన తయారీదారుల నుంచే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు వాక్సీన్లను తీసుకుంటాయి.

ఇతర వైద్యవిధానాల మాదిరిగానే, ఏ టీకా కూడా నూరుశాతం సురక్షితమైనది, సమర్థవంత మైనది కాదు. అంటే అవి ప్రమాదరకమైనవని చెప్పటం కాదు. దేశంలో దొరికే వ్యాక్సిన్లన్నింటికీ డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా లైసెన్స్‌ ఉంటుంది. కాబట్టి ఇవి సురక్షితమైనవి. కాకపోతే వ్యక్తి శరీర తత్త్వంపైన ఆధారం పడి వాటి ప్రభావం ఉంటుంది. చిన్న పాటి దుష్ప్రభావాలను ఎదుర్కోక తప్పదు.

వ్యాక్సిన్లను వినియోగించటానికి ముందు రకరకాల క్రినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తారు. అవి రోగనిరోధకశక్తిని ఎదుర్కోవటంలో ఏ మేరకు సహాయకారిగా ఉంటాయో పరిశీలిస్తారు. మూడు దశల పరీక్షల అనంతరం పబ్లిక్‌ హెల్త్‌ సెఫ్టీ అథారిటీ ఆమోదం కోసం పంపుతారు. మానవుల మీద ప్రయోగించి ఫలితాలను పరిశీలించిన అనంతరం వ్యాక్సిన్‌ తయారీకి మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రోటాకాల్స్‌ ప్రారంభిస్తారు.

ముందున్న సవాళ్లు

మలేరియా, డెంగ్యూలతో ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. జనవరి 22న మలేరియా వ్యాక్సిన్‌ ఆర్టీఎస్‌ 5ను ప్రయోగాత్మ కంగా పైలట్‌ ప్రాజెక్టుగా ఆఫ్రికాలోని కామెరూన్‌లో ప్రారంభించారు. తర్వాత కొన్ని ఇతర దేశాలు అనుసరించాయి. 20 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించారు. దీని ద్వారా చిన్నారుల మరణాలు 13శాతం తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆర్‌21 అనే మరో వ్యాక్సిన్‌ అందచేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డెంగ్యూని గ్రేడ్‌ 3 ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 4 బిలియన్ల మందికి డెంగ్యూ వైరస్‌ ముప్పు పొంచి ఉందని అంచనా వేశారు. గత ఏడాది 80 దేశాల్లో 50 లక్షల కేసులు నమోద య్యాయి. ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యావరణ మార్పులు, ఎల్‌ నినో ప్రభావం వల్ల దోమల వ్యాప్తి పెరుగుతోంది. ఫలితంగా డెంగ్యూతో పాటు జికా, చికెన్‌ గున్యా, ఎల్లో ఫీవర్‌ లాంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి.

నిరంతరం వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చి సుస్థిరతను కొనసొగించాలంటే ప్రభుత్వాలు, అంతర్జాతీయ, ప్రాంతీయ ఏజెన్సీలు, పౌర సమాజం, వ్యాక్సిన్‌ తయారీదారులు, ఇతరులు తమ వంతు పాత్రను పోషించాలి. అప్పుడే సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధ్యపడుతుంది.

– డాక్టర్‌ పార్థసారథి చిరువోలు, సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE