ఒకప్పుడు కనుచూపుతోనే శాసించారు. సైగలతోనే శాసనాలు చేశారు. ప్రగతిభవన్‌ను గడీలాగా తయారుచేశారు. ప్రజలు ఎన్నుకున్న వారినే కాదు… శాసనాల్లో భాగస్వాములయ్యే మంత్రులను కూడా ఈ గడీలోకి అనుమతించలేదు. తెలంగాణను పదేళ్లపాటు ఒంటిచేత్తో పాలించారు. తమ కుటుంబానికి, తాము అనుకున్నవాళ్లకు మాత్రమే తెలంగాణ అధికార సౌలభ్యాలు, ఫలాలు అందాలనుకునేంతగా ఓ రకంగా నియంతృత్వ పాలన సాగించారు. అంతేకాదు.. ‘తెలంగాణ బాపు’గా పిలిపించుకున్నారు. ఈ వర్ణన అంతా ఒకరి గురించే.. ఆయనకు సంబంధించిన ఒక కుటుంబం గురించే.. అంటే.. ఆ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇంటి నుంచి బయటకు రాలేని, జనాలకు.. కనీసం మీడియాకు కూడా ముఖం చూపించలేని పరిస్థితికి చేరుకున్నారు. కల్వకుంట్ల కుటుంబసభ్యులు కూడా ఢిల్లీలో రోడ్లమీద పడిగాపులు కాయాల్సిన అవస్థలు తెచ్చుకున్నారు. అందుకే అంటారు ‘కాలం బలీయమైనద’ని. పరిస్థితులు పగబడితే తట్టుకోలేరని. ఇప్పుడదే జరుగుతోంది. ఒకప్పుడు ఆ కుటుంబం చెప్పిందే.. శాసనంగా, మాటే.. ఆదేశంగా పాటించాల్సిన అనివార్య పరిస్థితుల నుంచి.. జరుగుతున్న పరిణామాలను ఓ ప్రదర్శన మాదిరిగా చూస్తోంది తెలంగాణ సమాజం.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భ వించిన నాటి నుంచి హైదరాబాద్‌లో తాము ఏది చెబితే అదే జరిగింది. ఏది కావాలంటే అది చెంతకు చేరింది. తాము ఏది చేయాలంటే ఎదుటివాళ్లు అదే చేశారు. ఓ రకంగా హైదరాబాద్‌ను తమ అడ్డాగా అనుకున్నారు. కానీ, అదే హైదరాబాద్ అడ్డాలో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి, అప్పటికప్పుడు రాత్రికి రాత్రే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. మరుసటిరోజు న్యాయస్థానంలో హాజరు పరిచారు.
దాదాపు రెండేళ్లుగా ఢిల్లీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఈడీ, సీబీఐ,ఆదాయపు పన్ను శాఖల అధికారులు హైదరాబాద్‌లో పలు దఫాలుగా సోదాలు నిర్వహించారు. అక్కడి పలువురి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసి, తనిఖీల అనంతరం పలువురిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో వాళ్లు వాడిన పదజాలం ఆధారంగా వాళ్లందరినీ ‘సౌత్ గ్రూప్’ అని ఈడీ పేర్కొంది. అనేక ఆధారాలు సంపాదించి, ఆ మేరకు పలువురిని అరెస్ట్ చేసింది. వారందరిని కేసీఆర్ కూతురు కవితకు వ్యాపార, ఆర్థిక వ్యవహారంలో సన్నిహితులుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి. చివరగా కవిత వంతు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూపునకు చెందిన పలువురి విచారణ సమయంలోనే కవిత ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సంపాదించిన ఈడీ, ఇప్పటికే అరెస్ట్ అయిన పలువురు అప్రూవర్లుగా మారడంతో కవిత పాత్రపై మరిన్ని బలమైన ఆధారాలు సేకరించింది. ఆమెకు ఈడీ,సీబీఐలు పలుమార్లు నోటీసులు జారీ చేశాయి. కానీ, కవిత రెండు,మూడుసార్లు మాత్రమే ఈడీ విచారణకు హాజరయ్యారు. సీబీఐ విచారణకు హాజరుకాకపోగా, అవసరమైతే తనను తన ఇంట్లోనే విచారించాలని, అలా అయితే విచారణకు సహకరి స్తానని జవాబు ఇచ్చింది. దీంతో, సీబీఐ అధికారులు ఓ దఫా అలానే చేశారు. పలు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే పలుమార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులే స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విచారణ బృందం ఆమె ఇంట్లో సోదాలు చేపట్టి, కవితను పలు కోణాల్లో ప్రశ్నించారు. దాదాపు నాలుగు గంటల విచారణ తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. మరుసటిరోజు న్యాయస్థానంలో హాజరు పరచగా, న్యాయస్థానం కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది.
కవిత అరెస్టు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా తీవ్ర చర్చను లేవనెత్తాయి. ఇప్పటిదాకా తెలంగాణలో, హైదరాబాద్ గడ్డపై తమకు ఎదురే లేదన్న ధీమాతో ఉన్న కేసీఆర్ కుటుంబసభ్యులు, బంధువులు ఇంకా అదే ఆలోచనలో ఉన్నారు. కవితను ఈడీ అరెస్టు చేస్తున్న ప్పుడూ ఇదే గర్వం కేటీఆర్‌లో కనిపించింది. ‘కవితను ఎలా అరెస్టు చేస్తారు?ఇదంతా కోర్టు ధిక్కరణ? అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు’అంటూ ఈడీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. చివరకు ఈడీ అధికారి ఒకరు ‘ఇతన్ని కూడా అరెస్ట్ చేయండి’ అనేంతదాకా పరిస్థితి వెళ్లింది. ఆ అధికారి అలా వ్యాఖ్యానించడం బయటికి వచ్చిన ఆడియోలో వినవచ్చు.
మరోవైపు, కన్న కూతురును అరెస్టు చేస్తున్న సమయంలో కేసీఆర్ ఇంట్లోంచి బయటకు రాలేదు. తండ్రీ కూతుళ్ల నివాసాల మధ్య కూతవేటు దూరమే అని చెప్పొచ్చు. కేటీఆర్, హరీష్ రావు మాత్రమే అక్కడ కనిపించారు తప్ప కేసీఆర్‌కు వీరాభి మానులం, ఆయన కుటుంబ సన్నిహితులమని చెప్పుకునే ఏ నాయకుడూ అక్కడ కనిపించలేదు. పార్టీ శ్రేణులు కూడా పెద్దగా ఆ ప్రాంతంలో కనిపించ లేదు. అంతేకాదు.. మరుసటిరోజు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనకు పిలుపు నిచ్చినప్పటికీ తూతూ మంత్రంగానే సాగిన పరిణామాలను తెలంగాణ సమాజం చూసింది.
ఇక కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్రసమితి.. ఇప్పుడు భారత రాష్ట్రసమితిగా పేరు మార్చుకోవడం కూడా ఒకరకంగా దయనీయంగానే తయారయ్యింది. సాక్షాత్తూ పార్టీ తరపున గెలిచిన ఎంపీలే కండువాలు మార్చేసుకున్నారు. పార్టీ అధికారం కోల్పోగానే.. వాళ్లలో నివురుగప్పిన నిప్పులా దాగిన అసంతృప్తి బాహాటమయ్యింది. పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా జంపింగ్ జపాంగ్ లయ్యారు. సగానికిపైగాఎంపీలు బీఆర్‌ఎస్ ను వీడి ఇతర పార్టీల్లో చేరిపోయారు. తొలుత పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు ఎంపీ రాములు కూడా బీఆర్‌ఎస్ నుంచి జంప్ అయ్యారు. బీజేపీలో చేరారు. ఇక, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో, మొత్తం తొమ్మిది మంది బీఆర్‌ఎస్ ఎంపీల్లో ఇప్పుడు ఆ పార్టీలో నలుగురే మిగిలారు. అంటే.. ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మరో ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరారు. దీంతో, ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీచేయడానికి లోక్ సభ అభ్యర్థులు కరువయ్యారు.
మరోవైపు.. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం మొదలెట్టారు. కొందరు ఎమ్మెల్యేల ఫిరాయింపులు కూడా మొదలయ్యింది. ఇన్నాళ్లుగా పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇంకా కలుస్తూనే ఉన్నారు.కానీ, వాళ్లందరికీ కాస్త ఆగాలనే సంకేతాలు వచ్చినట్లు సమాచారం. తొలుతగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు పార్టీ మారే అవకాశం లభించింది. ఆ మరుసటిరోజు రేవంత్ తన వంద రోజుల పాలన సందర్భంగా నిర్వహించిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో తాము గేట్లు తెరిచామని, ఇక బీఆర్‌ఎస్ ఖాళీ అవడం ఖాయమని నిర్మొహ మాటంగా వ్యాఖ్యానించారు. దీంతో, ఇన్నాళ్లుగా అధికారం ఉంది కదా అని, కేసీఆర్ దృష్టిలో పడకూడదని కుక్కిన పేనుల్లా పడి ఉన్న ఎమ్మెల్యేలు దాదాపుగా పార్టీ మారిపోవడం ఖాయమయ్యిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారబోతోంది. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కూడా బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులను ఎగరేసుకు పోతున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్-బీజేపీని ఖాళీ చేశానని సంబరపడిన కేసీఆర్.. ఇప్పుడు సొంత పార్టీ ఖాళీ అవుతున్నప్పటికీ గుడ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి. వంద రోజుల క్రితం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కిటకిటలాడింది. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు కూడా కేసీఆర్‌కు బై బై చెబుతూ బీజేపీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతున్నారు. ప్రజా విశ్వాసం కోల్పోయినప్పుడు మంద బలం ఎంతగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓటమి తప్పదని శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రుజువు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన శాసనసభ్యులలో పలువురు మహా నాయకులేమీ కాదు. ప్రజా ఆకాంక్షలను, మనోభావాలను గుర్తించ కుండా అధికారాన్ని చలాయిస్తే కేసీఆర్ కుటుంబానికి ప్రస్తుతం ఎదురవుతున్న చేదు అనుభవాలే కాచుకొని ఉంటాయి. శాసనసభలో ప్రతిపక్షాలకు మిగిలిన కొద్దిమంది సభ్యులు కూడా గొంతు ఎత్తలేని పరిస్థితిని కల్పించిన కేసీఆర్ విజయగర్వంతో విర్రవీగారు.
ఒకప్పుడు తెలంగాణ సమాజమే తనది.. తన వెనుకే తెలంగాణ జనం అని విర్రవీగిన కేసీఆర్ ఓ రకంగా ఇప్పుడు ఒంటరి అయ్యారు. ఆయన ఇప్పుడున్న పరిస్థితికిగానీ, కవిత అరెస్ట్ అయినందుకు గానీ, రాజకీయ వర్గాల నుంచి, ప్రజలనుంచి కూడా పెద్దగా స్పందన రావడం లేదు. కేసీఆర్ ఖర్మఫలంగా లైట్ గా తీసుకుంటున్నారు. అంతేకాదు.. ఇన్నాళ్లుగా ఎవరు తనకు వ్యతిరేంగా ఉన్నా.. ఎవరు విమర్శిం చినా.. కేసీఆర్ మాత్రం తెలంగాణ సెంటిమెంట్‌ను ఎత్తుకునే వారు. తెలంగాణ ద్రోహులంటూ ఎదురు తిరిగేవారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేవారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చే యడంతో ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది.
ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్ట్టీకి ఓటు వేసిన వారిలో కొంతమంది లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు అంచనాలు, సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. దీనికితోడు ప్రధాని మోదీ ప్రభావం కూడా ఉండనే ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒకవైపు, ప్రజా బలాన్ని పెంచుకుంటూ, బీజేపీ మరోవైపు మోహరించి ఉన్నందున కేసీఆర్ పార్టీ పరిస్థితి ఏంటనే సందేహం సహజంగానే కలుగు తుంది. గతంలో చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్‌లో ధర్నాలు చేసిన వారిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కవితను ఢిల్లీకి తీసుకుపోయారు కనుక అక్కడ ధర్నాలు చేసుకోండని కేటీఆర్ ను హేళన చేస్తున్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయడంతో పాటు అవినీతి మయం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్న విశ్లేషణ ఉంది. ఆయన పుణ్యమా అని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు అధికారం లేకుండా, డబ్బు లేకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం కాదని ఇప్నటికైనా కేసీఆర్ గ్రహిస్తేనే రాజకీయాల్లో మనగలుగుతారన్న వాదన ఉంది. ఉద్యమ సమయంలో తమ ఆకాంక్షలను నెరవేర్చ గలిగే నాయకుడ్ని కేసీఆర్‌లో చూశారు. అధికారంలోకి వచ్చాక ఆయనలోని నియంతను, ఫ్యూడల్‌నూ చూశారు. కుటుంబ సభ్యుల దర్పాన్ని, అధికార దుర్వినియోగాన్ని గమనించారు. ఫలితంగా కేసీఆర్ ఇప్పుడు ఒంటరి వాడయ్యారు. తెలంగాణ సమాజాన్ని తాను మాత్రమే కాచి వడపోశానని చెప్పుకొనే కేసీఆర్, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం అత్యంత ప్రధానం అన్న వాస్తవం ఎందుకు గ్రహించలేకపోయారన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ప్రజలతో మమేకం అవుతూ సంస్థాపరంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే ఎన్ని ఒడుదొడుకులనైనా ఎదుర్కోవచ్చన్న వాస్తవాన్ని కేసీఆర్ గ్రహించలేదు. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం వదులుకొని, త్యాగాలు చేసి కొట్లాడిన వాళ్లందరినీ తన అహంకారంతో దూరం చేసుకున్న కేసీఆర్.. తెలంగాణ ఉద్యమకారులను జైలుకు పంపించిన, తెలంగాణను బాహాటంగానే వ్యతిరేకించిన వాళ్లను పార్టీలో చేర్చుకొని అందలం ఎక్కించిన పరిస్థితులను, అనుభవాలను ఇప్పుడు రాజకీయ శ్రేణులు, ప్రజలు కూడా బేరీజు వేసుకుంటున్నారు.
-సుజాత గోపగోని
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్