నేషనల్ డెమొక్రటిక్ ఎలయన్స్ (ఎన్‌డీఏ)లో తెలుగుదేశం పార్టీ అధికారికంగా చేరింది. జనసేన ఇప్పటికే ఎన్‌డీఏతో కలిసి ఉంది. టీడీపీ కూడా కలవడంతో ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలతో ఎన్‌డీఏ పటిష్టంగా ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆంధప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కోవడం బీజేపీ వల్లనే సాధ్యమౌతుందని తెలుగుదేశం భావించింది. దాంతో వారే ముందుకు వచ్చి కూటమిలో చేరతామని అభ్యర్ధించారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేసి గెలవాలని నిర్ణయించుకున్న బీజేపీ పెద్ద మనసుతో ఆలోచించి తెలుగుదేశాన్ని ఎన్‌డీఏలోకి ఆహ్వానించింది.
1998లో లోక్‌సభ ఎన్నికల తర్వాత టీడీపీ ఎన్‌డీఏ కూటమిలో తొలిసారిగా చేరింది. వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆ పార్టీ ఎంపీ జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్ అయ్యారు. 1999 ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీచేసి ఘనవిజయం సాధించాయి. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో రెండు పార్టీలు ఓడిపోయాయి. తర్వాత టీడీపీ ఎన్డీఏ వైదొలిగింది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తమ ప్రధాని అభ్యర్ధిగా మోదీని రంగంలోకి దింపింది. ఆయనకు ప్రజాదరణ బాగా పెరగడంతో దానిని తమ విజయానికి అనుకూలంగా మార్చుకోవాలని తెలుగుదేశం భావించి తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో చేరి గెలిచింది. అప్పుడే కొత్తగా ఆవిర్భవించిన జనసేన కూడా ఈ కూటమికి మద్దతు పలికింది. కేందప్రభుత్వంలో తెలుగుదేశం, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వాములుగా చేరాయి. అయితే తెలుగుదేశం పాలనా వైఫల్యాలు, అవినీతిపై ప్రధాన ప్రతిపక్షం నుంచి ఒత్తిడి రావడంతో చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాపేరుతో సమస్యను పక్కదారి పట్టించారు. ఆర్థిక సంఘం సూచనల మేరకు ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం వీలుకాదని, దానికి బదులుగా ప్రత్యేక నిధులు ఇస్తామన్న కేందప్రభుత్వ హామీకి చంద్రబాబు ఒప్పుకున్నారు. కాని వైసీపీ నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక కేందప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ 2018 మార్చిలో ఎన్‌డీఏ నుంచి వైదొలిగారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ జనసేనలు వేర్వేరుగా పోటీచేశాయి. బీజేపీ అండలేని టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. నసేనది కూడా అదే పరిస్థితి. బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారం చేపట్టింది. జనసేన కూడా 2020 జనవరి 16న తిరిగి ఎన్డీఏ చేరింది.
రాష్ట్రంలో వైసీపీ ప్రజావ్యతిరేక పాలన
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ విధానం ఉగ్రవాదం, అవినీతి, సహజ వనరులను దోచుకోవడంగానే కనిపించింది. ‘రాష్ట్ర విభజనతో ఆంధ్రలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఏర్పడితే దానిని పరిష్కరిస్తారని జనం నాడు ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో వైఫల్యం చెందారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు నరకాన్ని చూపింది. విలువైన ఇసుక, ఖనిజాలు వంటి సహజ వనరులను దోపిడీ చేసింది. సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేసిన తర్వాతే తిరిగి ఎన్నికలకు (2024) వెళతామని చెప్పిన వైసీపీ ఆ హామీని బుట్టదాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలు చేపట్టింది. గతంలో ఉన్న మద్యం తయారీ యజమానులను బెదిరించి డిస్టిరీలను స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. పైగా దుకాణాల్లో నాసిరకం మద్యాన్ని రెండింతల ధరలకు అమ్ముతోంది. ఇందులో విశేషం ఏంటంటే మద్యాన్ని నగదు రూపంలోనే కొనుగోలు చేయవలసి వస్తోంది. అమ్మకాల్లో 30 శాతం లాభాలు నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కే చేరుతున్నాయనే బీజేపీ ఆరోపణలపై ప్రభుత్వం నుంచి స్పందనే లేదు. ఇక తమ జేబులు నిండడం కోసం నూతన పాలసీ తయారీ పేరుతో ఇసుక సరఫరాను ఉద్దేశ్యపూర్వకంగా నిలిపివేసి బ్లాక్ మార్కెట్‌లో అమ్మినట్లు వచ్చిన ఆరోపణలపైనా ప్రభుత్వం స్పందించలేదు. నూతన పాలసీ పేరుతో ఇసుకను జేపీ వెంచర్స్ అనే సంస్థకు రెండేళ్ల కాలానికి కాంట్రాక్టుకు అప్పగించడం, ఆ సంస్థ చాటున వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుకను తోడేసి అమ్మేసుకోవడం, దీనిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించడం తెలిసిందే కరెంట్ ఛార్జీలను ఆరుసార్లు పెంచారు. భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయలేదు. దానికి తోడు పన్నులు భారీగా పెంచారు. భూకబ్జాలు పెరిగాయి. రాజధాని అమరావతిని కాదని, వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులను తెరపైకి తెచ్చి రైతులక• అన్యాయం చేశారు. కనీసం ఒక్క రాజధానిని నిర్మించలేదు. మౌలికసదుపాయాలను నిర్ల్యక్షం చేశారు. ఒక్క ప్రాజెక్టును పూర్తిచేయలేదు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి నిర్ల్యక్షం చేశారు. అభివృద్ధిని అటకెక్కించారు. విద్య, వైద్యంపేరుతో మాయచేస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేశారు. వ్యాపారవేత్తలను, పారిశ్రామిక వేత్తలను బెదిరించడం, వారు పారి పోయేలా చేయడం… ఎర్రచందనం అక్రమ రవాణా, 30 వేలకు పైగా మహిళల ఆచూకీ లేకపోవడం, దళితులపై అత్యధిక స్థాయిలో అఘాయిత్యాలు, దేవాలయాల ధ్వంసం, టీటీడీని ఏటీఎంగా మార్చడం… ప్రతిపక్ష నేతలకు, కేడర్‌కు బెదిరింపులు, భౌతిక దాడులు, న్యాయవ్యవస్థపై దాడులు, ఎన్నికల పోలింగ్‌కు దొంగ ఐడీలు తయారీ ఇలా ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు లెక్కేలేదు.
బీజేపీ వైపు ప్రజల చూపు
మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. అభివృద్ధి నల్లేరుపై నడకలా సోగుతోంది. మోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. యువత, మహిళలు, రైతులు, పేదలు.. అన్ని వర్గాలు మోదీ పట్ల ఆకర్షితులయ్యారు. దేశ ఆర్థికాభివృద్ధికే కాకుండా వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధికి కేంద్ర సర్కారు ప్రాధాన్యమిచ్చింది. కరోనా సమయంలో దేశ ప్రజలను ఆదుకోడానికి ప్రధాని మోదీ విశేష కృషి చేశారు. 9 నెలల్లోనే వాక్సిన్ కనిపెట్టేలా శాస్త్రజ్ఞులను ప్రోత్సహించారు. తీవ్ర సంక్షోభాల మధ్యకూడా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బీజేపీ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు. దుర్బల ఆర్థిక పరిస్థితుల నుంచి ప్రపంచంలో మొదటి అయిదు బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదిగింది. ఎగుమతులు, ఎఫ్‌ఐలు గణనీయంగా పెరిగాయి. ప్రపంచంలోని బలమైన బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్ మారింది. మొబైల్ ఫోన్ల తయారీ 5 రెట్లు పెరిగింది. రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రూ. లక్ష కోట్లు దాటింది. మరో పెద్ద సంస్కరణ- డిజిటల్ ఇండియా సృష్టి. ఇది వ్యాపార లావాదేవీలను చాలా సులభతరం చేసింది. దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. గ్రామాల్లో దాదాపు 4 లక్షల కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించారు. విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 149కి పెరిగింది. ‘వన్ నేషన్, వన్ పవర్ గ్రిడ్’తో విద్యుత్తు వ్యవస్థ మెరుగుపడింది. 25 వేల కిలోమీటర్లకుపైగా రైలు మార్గాల నిర్మాణం జరిగింది. 100% రైల్వేలైన్ల విద్యుదీకరణకు దగ్గరగా ఉన్నాం. గతంలో రూ.2 లక్షల ఆదాయంపై పన్ను విధించేవారు. నేడు రూ.7 లక్షల వరకు పన్నులేదు. దీనివల్ల గత పదేళ్లలో పన్ను చెల్లింపుదారులకు సుమారు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అయింది.
ఆయుష్మాన్ యోజనతో ఉచిత వైద్యం వల్ల పౌరులకు రూ.3.5 లక్షల కోట్లు మిగిలింది. మందుల ధరలను తగ్గించడంవల్ల ఏటా దాదాపు రూ.27 వేల కోట్లు ఆదా అవుతున్నాయి. పేద లకు చౌక రేషన్‌కోసం ప్రభుత్వం దశాబ్ద కాలంలో దాదాపు రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, సుపారిపాల నతో రాష్ట్ర ప్రజలు కూడా మోదీ పట్ల ఆకర్షితులయ్యారు. బీజేపీ నాయకులు వైసీపీ చేస్తున్న అరాచకాలపై తీవ్ర పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో ఒంటరిగానే పోటీచేసి అధికారంలోకి రావాలని బీజేపీ నిర్ణయించుకుంది. అదే సమయంలో మోదీ నాయకత్వాన్ని అంగీకరించి బీజేపీతోనే తాము రాష్ట్రంలో అధికారంలోకి రాగలమని భావించిన టీడీపీ తిరిగి ఎన్డీఏలోకి వస్తామని అభ్యర్ధించింది. దాంతో బీజేపీ అంగీకరించి రాష్ట్రంలో కూటమిగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో కలిసిమ పోటీ చేయాలని నిర్ణయించుకుంది.
-వల్లూరు జయప్రకాష్ నారాయణ
ఛైర్మన్,సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ