మార్చి 10 జయంతి, వర్ధంతి
‘కలిమికి కాణాచి నీ పుట్టినిల్లు
చెలిమికి మాగాణి నువు మెట్టినిల్లు
కలలన్నీ నిజమౌ నీ కాపురానా
కలకాలం వెలుగు నీ ఇంటి దీపము!’
ఈ పాట ఎక్కడో విన్నట్లుందా? ముందు పంక్తులు గుర్తుకొస్తే, మనకు మరింత బాగా అర్థమవుతుంది. అవి ఇవి :
‘కొత్త పెళ్ళికూతురా రారా!
నీ కుడికాలు ముందుమోపి రారా!
గుణవతి, కులసతి రారా
నువు కోరుకున్న కోవెలకు రారా!’…. దశాబ్దాల నాటి గీతం. ప్రధాన గాయని స్వర్ణలత, సంగీత, నాట్య రంగాల మేటి. ప్రత్యేకించి ఇరవై ఏళ్లపాటు ఆమె పాటలు ఊరూవాడా మారు మోగాయి. ఎంతో మార్దవం, హృద్యం, పరిణత తత్వం నిండిన స్వరం. మరింత విశిష్టత ఏమిటంటే,.. ఇటువంటి కుటుంబ గీతికలతోపాటు ‘నవ్వుల నదిలో పువ్వులు రువ్వే..’వాటినీ ఆలాపించారీమె. .కాలక్రమంలో తనూ దీటుగా నిలిచి, శోభాయమానత కనబరచి, సాక్షాత్తు ‘మహాలక్ష్మి’ అనిపించుకున్నారు.పేరులో మొట్టమొదటి రోజుల్లో లక్ష్మీ ఉన్నా, ఆ తర్వాత గీత సరస్వతిగా ఖ్యాతి సంపాదించారు.
అంటే గీత, సంగీత, నర్తన పక్రియల్లో తనకు తానే సాటి అన్న మాట. ఇన్ని విభిన్నతలున్న స్వర్ణలత పాతికేళ్ల క్రితం ఒక సంఘటన ఫలితంగా శాశ్వతంగా వెళ్లిపోయారు. అయినా ఇప్పటికీ శ్రోతల మనోమందిరాల్లో సుస్థిరంగా వెలుగుతూనే ఉన్నారు. ఈ గాయనీ మణి ఉదయాస్తమయాలు రెండూ మార్చిలోనే. తేదీ కూడా ఒకటే మార్చి 10 కావడం కాకతాళీయమే అయినా, ఇదొక విధి వైచిత్రి!
కళావతి, వసంతి, యక్షిణి…ఈ పాత్రలు ‘మాయారంభ’లో కనిపిస్తాయి, వినిపిస్తాయి, అనురక్తి కలిగిస్తాయి. పురాణ ప్రధాన చిత్రమిది. ఇది రమారమి 75 ఏళ్లనాటి సంగీత సందర్భం. ఇందులో ‘రాత్రీ పగలనక’ పాట పాడారు స్వర్ణలత. పేరుకు తగిన తీరు. ఎప్పుడు ఏ సమయంలో చిత్రీకరణ కొనసాగినా స్వర్ణాలంకార భూషితగా వచ్చేవారు. బంగారు గాజులతో, నగల అలంకరణతో వచ్చి పాడుతూ ఉంటే – ఆ ప్రదేశమంతా లక్ష్మీకళ వెల్లివిరిసేది.
సీనియర్ గాయనీమణులతో కలిసి ఆమె ఆలాపించిన గీతికల్లో ఒకటి –
విన్నావ యశోదమ్మా!
మీ చిన్నికృష్ణుడు చేసినట్టి
అల్లరి చిల్లరి పనులు!
యశోద : అన్నం పున్నెం ఎరుగని పాపడు
మన్నుతినే నా తనయుడు; ఏమి చేసెనమ్మా? ఎందుకు రవ్వ చేతురమా?
గోపికలు : మన్ను తినేవాడా… వెన్న తినేవాడా?
కృష్ణుడు : కలదామ్మా … ఇది ఎక్కడనైనా కలదామ్మా?
గోపిక రణుల కల్లలూ….
నాకేం తెలుసూ- నేనిక్క లేందే!
యశోద : మరి ఎక్కడున్నావూ?
కృష్ణుడు : కాళిందు తలపై తాండవమాడి
ఆ విష సర్పమునంతము జేసి
గోవుల చల్లగా కాచానే (ఇంతలో….)
ద్రౌపది : హే కృష్ణా! ముకుందా! మొర వినవా?
ఇంత సుదీర్ఘ గీతిక అంతటిలోనూ స్వర్ణలత గాత్రం విలక్షణంగా వినవస్తుంది. అందులో ఏదో ప్రత్యేకత, ఎంతెంతో విశిష్టత నిండినట్లు అనిపిస్తుంది.
ఇలా వందలకొద్దీ చిత్రాల్లో తన గానమాధుర్యం మారుమోగింది. ప్రతీ అక్షరమూ ప్రస్ఫుటంగా వినిపించేది ఆ గొంతుకలో. భావ వ్యక్తీకరణ అసాధారణంగా ఉండి, శ్రోతల హృదయాలను ఇట్టే ఆకట్టుకునేది.
ఆమె బాల్యం, అనంతర జీవనం కూడా ప్రకాశవంతంగా కొనసాగింది. కర్నూలు ప్రాంతంలోని ఊరు ఆమెది. సంగీతం అంటే తొలి నుంచే ఎక్కువ మక్కువ. నాటక ప్రదర్శనలు విరివిగా చూస్తుండేది. పురాణ సంబంధ పద్యాలు ఆలాపిస్తూ ఉండేది. కొన్నిమార్లు నాటకాల్లో నటించింది. నర్తన గురించీ ఎంతగానో అభ్యాసం చేసింది. అంతగా కళా ప్రియత్వం స్వర్ణలత సొంతమైంది.
పాటలు పాడేవారు అనేకమంది ఉంటారు. వాటిల్లో ఒక్కో పక్రియలో ఒక్కొక్కరు పేరు పొందుతుంటారు. అన్ని తరహాల గీతాలూ ఆలపించాలని గాయకులుకు ఉంటుంది. కానీ సాధికారత మాత్రం కొన్నిటికే మితమవుతుంటుంది. గాత్రకచేరీలు చేసిన అనుభవం ఎంతగానో ఉన్న స్వర్ణలత ప్రథమంగా చిత్రగానం చేసింది ఒక హాస్యకళాకారుడితో! బహుశా అందుకేనేమో… హాస్యగీతికల ఆలాపన అటు తర్వాత నిరంత రాయంగా సాగుతూ వచ్చింది.
1960 ప్రాంతాల్లో ఒక పాట ఎందరెందరినో మురిపించి, మైరపింపచేసింది. అందులోని పదాలన్నీ ఆసక్తిదాయకాలే, మళ్లీమళ్లీ వినాలని అనిపించేవే.
డివ్వి డివ్వి డివ్విష్టం
నువ్వంటేనే నాకిష్టం!
డోడిక్కంది అదృష్టం
గట్టెక్కింది మన కష్టం!
బాజాలతో, బాకాలతో
పందింట్లో ఇద్దరం ఒకటవుదాం…
బుక్కా వసంతాలు చల్లుకుందాం
ఎంచక్కా తలంబ్రాలు పోసుకుందాం!
దీవించి వేస్తారు అక్షింతలూ
ఇక అవుతాయి సౌఖ్యాలు లక్షంతలు!…
వింటున్నంతసేపూ ఆనంద తరంగాలలో ఓలలాడిస్తుందీ గీతిక. ఎంతో చలాకీగా, చురుగ్గా, చమక్కుమనేలా పాడారు. ఆ రోజుల్లోనే అత్యంత ఆధునికత వ్యక్తపరచి, శభాష్ అనిపించుకున్నారు.
ఆమెది ప్రేమ వివాహం. ఆయనది కేరళ. సంతానంలో కొందరు వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. అలాగే నటుడిగా, నృత్య దర్శకుడిగా పేరు పొందినవారున్నారు. పిల్లల్లో ఒకరు గాయకురాలిగా వారసత్వ సంపద అందుకున్నారు.
పాడిన ప్రతీ పాటలనూ ఎంతో కొంత విలక్షణత ధ్వనించాలన్నదే స్వర్ణలత ధ్యేయం. అందుకు నిరంతరం పరిశ్రమించేవారు. సాధనను కఠోరంగా కొనసాగిస్తుండేవారు. శక్తి, సమయం, వనరులన్నింటినీ గానరంగం మీదనే కేంద్రీ కరించారు.
ఓ పంచవన్నెల చిలక!
నీకెందుకింత అలకా?
ఆమె : ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు?
మా నాన్నగారు చూస్తే మీ దుమ్ము దులు పుతారు!… అలా, మరెంతగానో విభిన్న స్వరాన్ని అందించారు. స్వర్ణలత, ఆ పాట, పాడిన విధానం రెండూ ప్రత్యేకంగా ఉంటాయి.
బలె బలె బలె బలె హిరణ్య కశపుడరా
నిన్ను ఇరుచుక తింటారా…. అంటూ సాగుతుందీ గీతం.
సాంఘికం, జానపదం, పౌరాణికం – అన్ని చిత్రాల్లోనూ తనదైన పటిమ చాటారు ఆ గాన సరస్వతి. అనేక పాటలు ఇప్పటికీ శ్రోతల సమాదరణ పొందుతూనే ఉన్నాయి. పాటపాటకీ నైపుణ్యం పెంచుకోవడంలో అపార శ్రద్ధాసక్తులు చూపిన ప్రజ్ఞానిధి. తన తనయుల్లో ఒకరికి తన పేరే పెట్టుకున్నారు.
1950, 1959, 1963, 1965…. ఈ విధంగా అన్ని సంవత్సరాల్లోనూ తానేమిటో నిరూపించుకున్నారు. అప్పట్లోనే విదేశీ పర్యటనలు సైతం జరిపారు. ఆ పర్యటనలు తరుణంలోనే అనుకోని ఘటన! విదేశీ సందర్శన ముగించుకోని, స్వదేశానికి చేరుకుని, కార్యక్రమానికి హాజ రయ్యేందుకు కారులో వెళుతూ దారిలో దుండగుల బారినపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆ రోజు మార్చి నెల పదో తేదీ… పుట్టిన, గిట్టిన రోజు ఒకటే కావడం విధి బలీయం.
మెరుపులా మెరిసిన
నిండుదనానికి ప్రతీకగా నిలిచిన
తెలుగుతేజానిన నిరూపించిన
ఆమె లేరుకానీ… ఆ పాట ఉంది. ఆ మాటా వినపిస్తోంది. జీవితాన్ని సంగీతంలో, సంగీతంతోనే గడిపిన సార్థక నామధేయురాలు.
తన పాటల్లో చమత్కారం ఉట్టిపడేది.
ఎంత గడుసుతనంమో అనిపిస్తుండేది.
తర మొత్తాన్నీ ఉత్తేజితం చేసిన గాత్రశక్తి.
అసాధారణ వ్యక్తి, ఆమెదొక ప్రత్యేక రీతి. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ పాటలెన్నింటిన రక్తికట్టించిన గాత్ర సంపద ఆమెది. తలచుకున్న ప్రతీసారీ వెన్నెల చల్లదనం మన గుండెల నిండా నిండుతుంది.
విధి విసిరిన కరవాలం ఎంత పనిచేసిందీ? అనుకున్నప్పుడు విషాదం నిలువెల్లా ఆవహిస్తుంది. వినోద విషాదాల కలనేత తన జీవితం. అయినా కళారంగాన స్వర్ణలత స్థానం శాశ్వతం, నిరంతర స్మరణీయం.
జంధ్యాల శరత్‌బాబు
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్