మార్చి 16 శ్రీరంగం గోపాలరత్నం వర్ధంతి
ఆకాశవాణి. ఆంగ్లంలో ఆలిండియా రేడియో.ఆ ప్రసారాలకు సరిగ్గా శతాబ్ధకాల చరిత్ర. ఒకప్పుడైతే, దేశంలోని ప్రధాన కేంద్రాలు ఆరు. ఇప్పుడు ఆ సంఖ్య వందల్లో! కాలక్రమంలో మార్పు చేర్పులెన్నో, తెలుగునాట రెండు రాష్ట్రాల్లోనూ పలు స్టేషన్లు, సరికొత్తగా మరికొన్ని. ప్రసార పరంపర నానాటికీ నవ్యతను సంతరించుకుంటోంది.
తొలి తెలుగు ప్రసారాలు మద్రాసు నుంచి. అటు తర్వాత విజయవాడ కేంద్రం ఆరంభం. అనంతర క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అనేకచోట్ల స్టేషన్ల సంస్థాపన, నిర్వహణ.
రేడియో అనేసరికి తెల్లవారు జాము నుంచీ వీనుల విందు. సంగీత, సాహిత్య, విద్య, శాస్త్రీయ కార్యక్రమాలు అనేకం.
గాన రంగాన లలిత, శాస్త్రీయ సంగీతాల జోరు అనంతం.
ఆ ప్రక్రియలో ఎందరెందరో సప్రసిద్ధులు.
వారిలో ముందు వరసన శ్రీరంగం గోపాలరత్నం.
మీకు గుర్తుందా. ఆనాడు ఒక చిత్రంలోని ఆమె గీతిక.
‘ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటు
నా పలుకులో కులుకుతావట
ఆపద మొక్కుల సామీ! నీ సన్నిధే నా పెన్నిధి!’
‘నా’ అనడంలో ఎంతెంతో మార్దవం, హృద్య ఉచ్చారణం.
ఆ స్వరంలో ఎంతో ప్రత్యేకత.నిండుదనం, ప్రతీ అక్షరానా ప్రస్ఫుట తత్వం.
‘నల్లని మేని ` నగవు చూపులవాడు’ పాట.
‘మేని’ అని పలకడంలో విశిష్టత, ఆమెది.
‘ఏమని పొగడుదు….’ అని విస్తరించడంలో విలక్షణత.
‘అలమేలు మంగా!’ పాట ఆలాపనలో ‘రూపము? అనేచోట మధుర మధురతర సంవిధాన చాతురి. ఆమె ఆలపించే అన్నమార్య కీర్తనలు శ్రోతలెందరికో అద్భుత అనుభూతి. ‘నమో నారాయణా’ గీతంలో ‘నా విన్నపమిదిగో’ అంటున్నపుడు ‘నా’ అక్షరం దగ్గర మెరుపు అనిర్వచనీయం. పదాలు, భజనలు, కీర్తనలు ` ఇలా అన్నింటా తనకు తానే సాటి.
‘కొండచీర వచ్చితిని…. అండ చేర్చి కాపాడరా’ అంటున్న ఆమెలో, వింటున్న అందరి లోనూ అనంత తన్మయత. రాగరత్నం’ అని పిలవాలనిపిస్తుంది ఎవరికైనా!
అంతటి పరిణతి వెనక ఎంతెంతో సాధన దాగుంది. గీతాలాపనకు ముందు ఆమె సాగించిన మనో పరిశ్రమ ఇంతా అంతా కాదు.శ్రద్ధ, ఆసక్తి, అభివ్యక్తి ఎంత అన్నది మాటలకు అందదు. అది శాస్త్రీయమైనా, లలితమైనా తనదైన ముద్ర ఉండి తీరుతుంది. ప్రతీ పదాన్నీ అంత ఇష్టంగా పలకడం ఆమె ప్రత్యేకత.
విజయనగరం ప్రాంతంలో విద్వత్ కుటుంబంలో పుట్టిన ఆమె విజయనగరం మహారాజా కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. మొదటిసారి హరికథా గానం చేసినపుడు పట్టుమని పదేళ్లయినా లేవు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అడుగుపెట్టినపుడు పద్దెనిమిదేళ్ళ యువతి. అక్కడి నుంచి తన గానప్రస్థానం వైభవప్రాభవాలతో కొనసాగింది. ఒకటా, రెండా, వందలాదిగా ఆలాపనలు. ఏ గీతానికి ఆ గీతం విలక్షణం. ఆమెకు మాత్రమే సొంతమైన గాత్ర సంపద అది.విజయాడ ఆకాశవాణిలోనైనాÑ హైదరాబాద్‌లోని సంగీత కళాశాల ప్రధాన అధ్యాపకురాలిగా కూడాÑ అలాగే తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ ఆచర్యగాÑ తిరుమల ` తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా మరెంతగానో సేవలందించారు.
తనది సర్వసహజంగానే సంగీత నేపథ్యం. పాటనే జీవితంగా భావించారు. ఆశా, శ్వాసా అంతా గీతమే. భక్తిరంజనిలో ‘సూర్యస్తుతి’ని తాను పాడితేనే వినాలి.
‘లోకాలోక ప్రకాశాయ సర్వలోకైక చక్షు సే
లోకోత్తర చరిత్రాయ భాస్కరాయ నమోనమః
వేదాంగాయ పతంగాయ విహంగా రూఢగామినే
హరిద్వర్ణ తురంగాయ భాస్కరాయ నమోనమః
సత్యజ్ఞాన స్వరూపాయ సహస్ర కిరణాయచ
గీర్వాణ భీóతినాశాయ భాస్కరాయ నమోనమః
నిత్యాయ నిరవద్యాయ నిర్మల జ్ఞానమూర్తయే
నిగమార్థ ప్రకాశాయ భాస్కరాయ నమోనమః’
ఇలా ఏది పాడినా సొంత శైలి, ముద్ర, విభిన్నత, వైవిధ్యరీతి.
ఈ అన్నీ ఆమెను సమున్నతరీతిన నిలిపాయి.
పుష్పగిరి ప్రదేశాన జన్మించిన ఆ కళా స్వరూపిణి సంగీత ప్రముఖుల నుంచి విద్యను అభ్యసించి, ఎందరెందరికో విద్యను నేర్పించారు.
వేంకటాద్రి స్వామి కీర్తనలు.నారాయణతీర్థ తరంగాలు మొదలైన అనేకం ఆ స్వరంలోనే ప్రాణం పోసుకున్నాయి. మరొక గీతికను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాలి.
లలిత సంగీతానికి సంబంధించి…
చరణాలు చరణాలు ముక్తి సోపానాలు
శరణన్నవారికవి మోక్ష భవనాలు!
ధరణిసిరి హృదయాల తనరారు చరణాలు
గిరిజేశ వాక్పతుల కీర్తించు చరణాలు
విరిచూపు గలవాని నిరసించు చరణాలు
సరయూ నదీ తటిని చరియించు చరణాలు
అజ్ఞాన తిమిరమున విజ్ఞాన కిరణాలు
సుజ్ఞానులకు సకల సౌవర్ణాభరణాలు
శాంతికవి నిలయాలు సౌందర్య వలయాలు
సంతోష ద్వారాలు సకల స్మృతి తీరాలు!
ఇందులో ` సోపానాలు, భవనాలు, చరణాలు, కిరణాలు, భరణాలు, వలయాలు అనేచోట్ల ఆమె స్వర మధురిమ ఎంతగాన ఆకట్టుకుంటుంది మనందరినీ.
పాటతో పాటు మాటా మనోహరంగా అనిపించేది.చెదరని నవ్వు ప్రత్యేక అలంకారంగా నిలిచేది.
గాయనీగానే కాదుÑ నటీమణిగానూ పేరు సాధించారు. భక్త సక్కుబాయి, మీరా ఈ రెండు పాత్రలకీ ప్రధానంగా పెట్టింది పేరు.
విడిగా పాడినా, యుగళంగా వినిపించినా… అద్వితీయ, తిరణాలకు వెళ్లే పిల్లను, ఉరుముల మెరుపుల వానను సరిపోలుస్తూ ఆమె పాడిన పాట ఎప్పటకీ గుర్తుండిపోతుంది. అందులోని కొన్ని భాగాలు ` ఇవిగో ఇవి :
‘తిరునాళ్లకు తరలొచ్చే కన్నెపిల్లలా
మెరుపులతో మెరిసింది వానకారు
నీలి మొయిలు వాలుజడకు, చినుకే చేమంతి
కట్టుకున్న పచ్చదనం పట్టు పరికిణీ!’ అలా!….
తాను సమర్పించిన నాటకాలు, రూపకాలు పుష్కలం.
అదే విధంగా చలనచిత్ర గీతాలలో సైతం తానేమిటో నిరూపించుకున్నారు ఆ విదుషీమణి.
‘ఇదియే నీ కథ ` తుదిలేని వ్యథó
ఎచ్చటి నుండి వచ్చావో, ఎచటికేగినావో’… ఇటువంటి పాటల మాటలు పలికేటపుడు ఆ స్వరంలో ఆర్తి ధ్వనించేది. ‘చల్లని నీ దయ జల్లవయ్య ఎల్లలోకముల’ అంటుంటే అపార తత్పరత ప్రతి ఫలించేది.
అన్ని భావనలూ ఆ స్వరంలో వెల్లివిరిసేవి. పెళ్లి పాటలు పాడినా, కూచిపూడి నాట్య సంగీత ధ్వనులను ఒలికించినా, జానళులతో మురిపించినా యక్షగానాదులతో మరింతగా ఆకట్టుకున్నా, మరెంతో విస్తృతంగా ఎంకి పాటలు నిపించినా, అందులో తనదైన మధురిమ తొణికిసలాడేది.
పాలకొల్లు ప్రాంతంలో మొదటి గానాలాపన. పద్మశ్రీతో ంగా ప్రభుత్వ సత్కారం .ఎనెన్నో ఘట్టాలు ఉన్నాయి, తన జీవితంలో.ఎన్ని సత్కారాలు వరించి వచ్చినా నిగర్వ భావన, అంకిత తత్వచింతన.ఎన్నెన్నో విశిష్ట గుణసంపన్నురాలు ఆఓమ.
‘వాణీ శర్వాణీ వీణాపాణీ పుస్తకధారణీ!’ ఈ పాటలోని మాటలన్నీ తనకే వర్తిస్తాయని అనిపిస్తుంది. సంగీత సరస్వతిగా భావించి సంభావించారు ఈ గాయక ప్రముఖరాలిని.
పద్యమైనా, పాట అయినా, శ్లోకమైనా, కీర్తన అయినా, ఆమె పాడితే ఒక తీపిదనం, తెలుగుతనం, ఆత్మీయతత్వం. తిరుప్పావై, సప్తపదులు వంటివి ఇంటింటా మోగాయన్నా, సంగీత శిక్షణలతో తరగతి గదులు ప్రతిధ్వనించాయన్నా అంతా గోపాలరత్నం, దీక్షాదక్షతలు మాత్రమే!
గాయకురాలు, నటీమణి, యక్షగాన ప్రచారకురాలు, సంస్కృత రూపక పాత్రల్లో మేటి పలుచోట పర్యటించి కచేరీలు సాగించిన నిత్య ఉత్సాహి.
‘సంగీత చూడామణి’గా పిలిచేవారు అందరూ. అంతటి శిరోరత్న భూషిత, భాషాభారతిగా సుప్రసిద్ధురాలు
ఆ తెలుగు వెలుగును దక్షిణాది ప్రాంతాల ` కళాకారులెందరో శ్లాఘించారు. నిలయ విద్వాంసు రాలైన ఆమెను ఆకాశవాణి కళావేత్తలనేకమంది ప్రశంసించారు. ప్రత్యేకించి అనేకానేక రూపక ప్రదర్శనల్లో ఆమె ప్రధాన పాత్రధారిణి. అదీ గొప్పతనం. ఆ రూపకాలు ` ఉషా పరిణయం భామాకలాపం తదితరాలు.
తనకు వీణ నేర్పించిన గురువు గురించి ఎన్నోసార్లు చెప్తుండేవారు శ్రీరంగం గోపాలరత్నం. వృత్తిలో భాగంగా, ప్రవృత్తికి అనుగుణంగా వందలాదిగా పాడారు. లలితగీతాల పరంగానూ తన అగ్రతను నిలబెట్టుకుంటూ వచ్చారు. ఎంత చక్కగా పాడేవారో, అంత బాగా నట ప్రవీణత కనబరిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె!
పద్యాలు ఆలాపించినా అంతే దృఢత్వం, మృదుత్వం. రాగయుక్త పఠనం, ఆ సాంతం నైవిధ్యం ఆమెకే సొంతం.
పురస్కృతుల గురించి తనకంటూ నిశ్చిత అభిప్రాయముంది.‘అవార్డులకు సంబంధించి నాకేమీ విముఖత లేదు. అలా అని, అవి రావాల్సిందేనన్న తాపత్రయం అంతకన్నా లేదు.’ ఇదీ ఆమె వ్యక్తిత్వస్థాయి. నిబద్ధతకు సూచిక.
ఎంత గొప్ప గాయకురాలిలో అంత చక్కటి రచయిత్రి.సాహిత్యానికి, సంగీతానికి సమ ప్రాధాన్యం ఇచ్చినవారు.
‘నిదురమ్మా నిదురమ్మా!
కదలి వేగమే రావమ్మా!’
అనేది ఆమె ఎప్పుడో ఆరున్నర దశాబ్దాల కిందట పాడిన పాట. ఒక చలన చిత్రంలో.
ఇప్పుడు ఆ పాటనే తలచుకుంటే, మన కళ్లముందు మెదిలేది ఆ రత్నమే! మెరుపులా వచ్చి, మెరుపులా వెలిగి, మెరుపులాగే వెళ్లిపోయిన ఆమె అక్షరాలా గంధర్వం గాయని. అంతకుమించి అద్భుత కళాకారిణి.
నేటికీ తన గురించే తలచుకుంటూ ఉంటున్నామంటే, ఆకాశవాణి పరిమళంగా ఆమెనే భావిస్తున్నామంటే… అదీ శ్రీరంగం గోపాలరత్నం సంగీత మూర్తిమత్వం. ఆ మహనీయకు స్వరాభివాదం.
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్