నేరగాడు అన్ని వ్యవస్థలను చేతులలోకి తీసుకుంటాడు. కరడుకట్టిన నేరగాడు వాటిని శాసించగలడు. ఇక సాక్షాత్తు అధికార పార్టీ, ప్రభుత్వం అండ ఉంటే వ్యవస్థలను ఆడిరచగలడు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే పశ్చిమ బెంగాల్‌ ప్రాంతీయ పార్టీకి మొదటికే మోసం వచ్చేటట్టు చేసిన ఘనుడు షేక్‌ షాజహాన్‌. భారతదేశ నేర వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని తెరిచాడు. ఇతడు చేసిన ఘోర నేరాల గురించి మహిళలు, కింది వర్గాలకు చెందిన వారిగా చెప్పుకునే మహిళలు కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్నా షాజహాన్‌ను చట్టసభలో వెనకేసుకొచ్చిన  తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అతడి నేర చరిత్రలో భాగం పంచుకున్నారు. ఇదంతా ఇటీవలి పశ్చిమ బెంగాల్‌ ఘన చరిత్ర. ఏమైతేనేం! పశ్చిమ బెంగాల్‌ హైకోర్టు కళ్లెర్ర చేసిన తరువాత, 75 గంటలలో అరెస్టు చేయకపోతే సందేశ్‌ఖాలీ నుంచి పాలన ఆరంభిస్తానని రాష్ట్ర గవర్నర్‌ ఆనందబోస్‌ తుది హెచ్చరిక చేసిన తరువాత ఫిబ్రవరి 29న కరడుగట్టిన ఆ అధికారి పార్టీ స్పాన్సర్డ్‌ నేరగాడిని 24 పరగణాలు జిల్లాలోని మినాకా అనే చోట, ఒక ఇంటిలో సీఐడీ అరెస్టు చేసింది. వెంటనే పదిరోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది కోర్టు.

‘షాజహాన్‌ని భవానీ భవన్‌ (బెంగాల్‌ పోలీసు ప్రధాన కార్యాలయం)కు తీసుకువచ్చాం. ప్రశ్నిస్తాం’ అని పోలీసులు చెప్పారు. ఇతడి కేసులను విచారించా లంటే కొన్ని దశాబ్దాలు పడుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఆ కేసుల పరంపరలో తాజా కేసు ఈ జనవరి 5 నాటిది. ఆ రోజునే రేషన్‌ సరుకుల అవకతవకల  వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు షాజహాన్‌ ఇంటి మీద దాడి చేశారు. పదిమంది పాతిక మందీ కాదు. దాదాపు వేయి మంది వారి మీద దాడికి దిగారు. అక్షరాలా యుద్ధం ప్రకటించారు. అసలే ప్రభుత్వ అండ. పైగా మైనారిటీ కార్డు ఉంది. అధికార పార్టీలో పదవీ ఉంది. అందుకే ఇతడి అనుచరులు ఈడీ అధికారుల మీదే దాడికి తెగబడ్డారు. రక్తాలు కారేటట్టు కొట్టారు. అయితే షాజహాన్‌ మాత్రం పలాయనం చిత్తగించాడు. 55 రోజుల తరువాత ఇప్పుడు ‘నాటకీయంగా’ అరెస్టయ్యాడు. ఇతడి మీద విచారించవలసిన కేసులు` వేర్వేరు ఐపీసీ సెక్షన్‌లు  భారీగానే ఉన్నాయి. వాటిలో అవతలి వారి మీద దాడి కేసులు 147. హత్యాయత్నం కేసులు 307. సీఏపీఎఫ్‌, ఈడీ అధికారుల మీద దాడులు చేసి, పారిపోయి, 55 రోజుల తరువాత అరెస్టయిన షాజహాన్‌ మీద మాకు ఎలాంటి సానుభూతి లేదు అని సాక్షాత్తు కలకత్తా హైకోర్టు నిజాయతీగా చెప్పేసింది. ఇదే కాదు, ఘనత వహించిన తమ క్లయింట్‌ మీద శ్రీకోర్టు వారు చేసిన వ్యాఖ్యలు షాజహాన్‌ తరఫున వకాల్తా తీసుకున్న న్యాయ వాదులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. మరీ చిత్రం, అటు షాజహాన్‌కు ముందస్తు బెయిల్‌ కోసం లావాదేవీలు, ఇటు అరెస్టు ఏకకాలంలో జరిగాయి. సందేశ్‌ఖాలీ ప్రాంతానికి ముప్పయ్‌ కిలోమీటర్ల దూరంలో ఉండే మినాకాలో తన భజనపరులతో కలసి ఉన్నాడు. అరెస్టు చేయగానే కలకత్తాకు 65 కిలోమీటర్ల దూరంలోని బసీర్హాత్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ ఆ రాత్రంతా లాకప్‌లో ఉంచి, మరునాడు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఇతడి అరెస్టు వార్త వినగానే సందేశ్‌ఖాలీ జనం హోలీ పండుగ వలె రంగులు చిమ్ముకుంటూ సంతోషం వ్యక్తం చేశారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రికీ, ఆ పార్టీ గణాలకీ చట్టాలూ, న్యాయాలూ అంటే ఆట్టే ఖాతరీ ఉండదు. కాబట్టి దేనికైనా తెగబడే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున బలగాలను అన్నిచోట్ల మోహరించారు. కావాలనుకుంటే సీబీఐ, ఈడీ, రాష్ట్ర పోలీసులు షాజహాన్‌ని 24 గంటలలోనే అరెస్టు చేయగలరని హైకోర్టు వ్యాఖ్యానించిన 24 గంటలలోనే వారు నిజంగానే సత్తా చూపించారు.

‘లాయర్‌ గారూ! ఈ మనిషి (షాజహాన్‌) మీద 43 కేసులు ఉన్నాయి. బాగా గుర్తు పెట్టుకోండి! వచ్చే పదేళ్ల పాటు ఈ మనిషి మీకు ఊపిరి సలపనంత పని కల్పిస్తాడు. ఇతడి మీద కేసులని వచ్చే పదేళ్ల పాటు మీరు వాదించుకోవచ్చు. ఇంకో నలుగురైదుగురు సహాయకులను నియమించు కోవాలేమో కూడా’ అని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞానం వ్యాఖ్యా నించారు. పైగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భం ఏమిటంటే, ‘షాజహాన్‌ కేసును వెంటనే పరిశీలించా’లని అతడి తరఫు న్యాయవాదులు ‘సవినయంగా’ మనవి చేసినప్పుడు. ఈ కేసు హియరింగ్‌కు అంత తొందరేమీ లేదు’ అని న్యాయమూర్తి చెప్పారు. అదృష్టం ఏమిటంటే, అతడు మైనారిటీ కాబట్టి న్యాయమూర్తి ఇలా వ్యాఖ్యానించా రని ఇంతవరకు ఏ ఉదారవాదీ నోరు పారేసుకోలేదు.

షాజహాన్‌ ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా అతడిని అరెస్టు చేయగలిగామని పోలీసులు చెబుతున్నా, అదేమీ కాదు, అతడు పోలీసుల రక్షణలోనే ఇంతకాలం నిక్షేపంగా ఉన్నాడు అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. షాజహాన్‌కి మరొక బిరుదు కూడా ఉంది. అదే బేతాజ్‌ బాద్షా. జిల్లా పరిషత్‌లో ఇతడికి ఓ పదవి ఉంది. అధికార పార్టీలో ఉంటూ మంత్రులను అంటకాగడం, బడుగు వర్గాల ఆడవారిని తన పార్టీ కార్యాలయానికి లాక్కొచ్చి అనుభవించడం, భూములు కబ్జా చేయడం ఇతడి ఉద్యోగం. ఈ విద్యలన్నీ ఇతడు సీపీఎంలో ఉండగానే బాగా ఆకళింపు చేసుకున్నాడు. 2006 ప్రాంతంలో ముస్లిం షేక్‌ అనే సీపీఎం నాయకుడికి కుడిభుజంగా ఉంటూ వసూళ్ల బాధ్యతను సమర్ధంగా నిర్వహించాడని ప్రతీతి. షాజహాన్‌ అక్కడితో ఆగిపోలేదు. నెమ్మదిగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగాడు. తరువాత మత్స్య పరిశ్రమలోకి దిగాడు. ఈ అనుభవంతో షాజహాన్‌ టీఎంసీ అధికారంలోకి వచ్చాక 2013లో ఆ పార్టీలో ఎదిగాడు. రేషన్‌ అవినీతి వ్యవహారంలోనే అరెస్టయిన టీఎంసీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌కు సన్నిహితుడయ్యాడు.

షాజహాన్‌ను టీఎంసీ నాయకురాలు, ముఖ్యమంత్రి మమత వెనుకేసుకొచ్చిన తీరు అతడి నేర చరిత్రను మించి జుగుప్సాకరంగా ఉంది. ఈడీ అతడిని లక్ష్యంగా చేసుకుందని ఆమె అసెంబ్లీలోనే మాట్లాడారు. ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. పైగా హోంశాఖ కూడా ఆమె చేతిలోనే ఉంది. ఇదెలా సాధ్యం? రాజకీయాలలో అత్యంత పతనంతోనే ఇలాంటివి జరుగుతాయి. పైగా ఇంత జరిగిన తరువాత షాజహాన్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. షాజహాన్‌ అనుచరుడు ఆమిర్‌ అలీ గాజీని జార్ఖండ్‌లో ఇంతకు ముందే అరెస్టు చేశారు. ఇంత జరిగిన తరువాత కూడా మహిళా ముఖ్యమంత్రి తన సహచరుడికి ఇంకా తప్పుకోవడానికి దారి ఉంచారు. షాజహాన్‌ అరెస్టుకు కారణం చూపే వారంట్‌లో మహిళల మీద అత్యాచారాల ప్రస్తావన లేదు. అయినప్పటికి నిస్సిగ్గుగా తమ ప్రభుత్వం రాజధర్మాన్ని పాటిస్తున్నదని (షాజహాన్‌ అరెస్టు) టీఎంసీ ఎంపీ శంతను సేన్‌ తన భుజం తానే చరుచుకుని ఆనందించారు. అవినీతి మంత్రులు పార్థా చటర్జీ, జ్యోతిప్రియ మల్లిక్‌, ఇప్పుడు షాజహాన్‌, ఇంతకు ముందు అతని అనుచరులు ఇంతమందిని అరెస్టు చేశాం చూశారా అంటాడు శంతను. షాజహాన్‌ అరెస్టు, అలాగే పార్టీ నుంచి సస్సెన్షన్‌కు నిర్ణయం తీసుకుని తమ పార్టీ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరిక్‌ ఓబరీన్‌ మరీ అసహ్యకరమైన వ్యాఖ్య చేశాడు. కానీ ఈ నేరగాళ్లందరిని ముందు ఆ పార్టీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యథేచ్ఛగా శ్లాఘించారు.కానీ పార్టీలో షాజహాన్‌ వ్యవహారం చిన్నపాటిదే అయినా చిచ్చు రేపిందనే అనాలి. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ మార్చి 1న తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాన కార్యదర్శి పదవిని కూడా వదులుకున్నట్టు తెలియచేస్తూ తన ఎక్స్‌లో జర్నలిస్ట్‌, సామాజిక కార్యకర్త అని మాత్రమే పేర్కొన్నారు.

 సరే, ఇంతకాలం పాటు షాజహాన్‌ అరెస్టు ఎందుకు జరగలేదు అని అడిగితే, కోర్టు ఆదేశాలకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఉన్నాయని టీఎంసీ ప్రధాన కార్యదర్శి, మమత వారసుడు అభిషేక్‌ భాష్యం చెప్పారు. ఏ విధంగా చూసినా షాజహాన్‌ అరెస్టు పరస్పర అంగీకారంతో జరిగిందేనన్న బీజేపీ ఆరోపణలోని వాస్తవం బయటపడడానికి ఎంతో సమయం పట్టదు. దాదాపు 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ పరిపాలన హింసా రాజకీయాల తోనే నిండి ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, అవి స్థానిక ఎన్నికలు కావచ్చు, రాష్ట్ర అసెంబ్లీ, లేదా పార్లమెంట్‌ ఎన్నికల కావచ్చు హింస అనివార్యం. నిజానికి షాజహాన్‌ అరెస్టుతో మమత రాజ్యం బీటలు వారడం మొదలవుతుందన్న అంచనాలు ఇప్పుటికే వెలువడినాయి.  ఇది అంతానికి ఆరంభం. ఇంక బెంగాల్‌, అక్కడ కొన్ని ప్రాంతాలలో మరీ దారుణంగా జరుగుతున్న హింసను ఇక సాగనివ్వం అని గవర్నర్‌ హెచ్చరించారు. ఇది వాస్తవ రూపం దాల్చాలని ఆశిద్దాం.

–  జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE