జమ్ము, కశ్మీర్ పట్ల భారత ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, దాని అభివృద్ధిని కాంక్షిస్తున్నదో పట్టి చూపేందుకు ఇటీవలే ‘రావీ’ నదిపై పూర్తి చేసిన ‘షాపూర్‌కంది’ ఆనకట్టే సాక్ష్యం. పంజాబ్, జమ్ము కశ్మీర్ సరిహద్దులలో గల ఈ ఆనకట్ట కొన్ని దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉండి, పాకిస్తాన్‌కు మేలు చేస్తోంది. కాగా, ఈ ఆనకట్టను పూర్తి చేసి, పాక్‌కు నీటి సరఫరాను నిలిపి వేయడంతో, దీనిని ‘భారత్ జల తీవ్రవాదం’గా అభివర్ణిస్తూ ఆ దేశపు మీడియా విరుచుకుపడు తోంది. అందుకు కారణం లేకపోలేదు, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా, అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలో నీటికి కూడా సంక్షోభం వస్తే అన్న అనుమానం, భయంతో వారు విలవిలాడిపోతున్నారు.
దేశ విభజన సందర్భంగా అసంపూర్ణంగా మిగిలిపోయిన వ్యవహారం ఈ ఒప్పందం అని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రిటిష్‌వారు భారత్‌ను రెండుగా విభజించిన సమయంలో జరిగిన హింస కారణంగా జలాల పంపిణీ చర్చలలో పాల్గొన్న ప్రతినిధులు రెండు దేశాలూ నీటిని పంచుకోలేవనే భావనకు రావడంవల్ల, ఈ ఒప్పందం కింద ఏకంగా నదులనే పంచేయడంతో వచ్చిన సమస్య ఇది అని నిపుణులు, పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.
బీజేపీ వైఖరి
భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అధికారం చేపట్టినప్పటి నుంచీ పాకిస్తాన్‌తో నదీ జలాల పంపిణీ విషయంలో కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. పాక్ వైఖరితో విసిగిపోయిన ప్రధాని మోదీ, సింధు నదీ జలాల ఒప్పందం కింద పాక్ నుంచి ప్రవహించే రావీ, సత్లజ్, బియాస్ నదీ జలాలను భారత్ ఉపయో గించుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారు ఇలాగే వ్యవహరిస్తే ఒక్క చుక్క నీరు కూడా భారత్ వారికి ఇవ్వదంటూ 2019లో ప్రకటించడం నాడు సంచలనమైంది.
జలాల నిర్వహణ దిశగా భారత్ చేపట్టిన ఈ వ్యూహాత్మక చర్య 1,150 క్యూసెక్కుల నీటిని నిల్వ చేసేందుకు తోడ్పడుతుంది. గతంలో ఈ జలాలు పాకిస్తాన్‌కు పారేవి. ఇప్పుడు ఈ నీటిని జమ్ము కశ్మీర్‌లో వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయో గించనున్నారు.
ఇంతకీ షాపూర్‌కంది ఆనకట్ట ప్రాముఖ్యత ఏమిటి? దీనికి భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన సింధునదీ జలాల ఒప్పందానికి సంబంధమేమిటనేది తెలుసుకోవాలంటే చరిత్రను తవ్వాల్సిందే.
గత కొన్ని దశాబ్దాలుగా షాపుర్‌కంది ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపివేశారు. అసలు ఈ నదిపై ఆనకట్టను నిర్మించాలని నిర్ణయించి, 1979లో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఒక ఒప్పందం చేసుకున్నారు. కొన్ని వార్తాపత్రికల ప్రకారం, రెండు రాష్ట్రాల సరిహద్దులలో గల రావీ నదిపై ‘రంజిత్ సాగర్’ ఆనకట్టను నిర్మించడం, ఆ జలాలను అనుకూలంగా వినియోగించుకోవడం, తర్వాత కాలంలో దిగువ జలాలకు లేదా ప్రవాహానికి కొద్ది దూరంలో పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లాలో షాపూర్‌కంది వద్ద రెండవ ఆనకట్టను నిర్మించాలని భావించారు. కాగా, రంజీత్‌సాగర్ ఆనకట్టకు 1982లో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శంకుస్థాపన చేయగా, ఇది 1998 నాటికి పూర్తవు తుందని అంచనా వేశారు. అయితే, జమ్ము,కశ్మీర్, పంజాబ్‌ల మధ్య వివాదాల కారణంగా ఈ ప్రాజెక్టును నిలిపివేసి, అటకెక్కించేశారు.
కేంద్రం 2018లో జోక్యం చేసుకొని దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో మరొకసారి పంజాబ్, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రులు షాపూర్ కంది ఆనకట్టను మూడేళ్లలో పూర్తి చేయాలనే ఒప్పందంపై సంతకాలు చేశారు. అయినప్పటికీ, నిర్మాణం నత్తనడకే నడిచింది. ఎట్టకేలకు, దానిని పూర్తి చేసినట్టు జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడిరది. దాదాపు 5.5 మీటర్ల ఎత్తుగల ఈ ఆనకట్ట, మొత్తం స్థాపిత సామర్ధ్యం 206 మెగావాట్ల రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులతో కూడిన బహుళప్రయోజన నదీలోయ ప్రాజెక్టులో భాగం. ఈ రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులు 2025 నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌లో వేల ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేసేందుకు సంభావ్యతను, సామర్ధ్యాన్ని కలిగి ఉంది కనుకనే ప్రధానమంత్రి మోదీ షాపూర్‌కంది ఆనకట్ట ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని కేంద్ర మంత్రులు చెబుతున్నారు.
ఒకవేళ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 2014లో బాధ్యతలు చేపట్టకపోయి ఉంటే, దశాబ్దాల కింద నిలిపివేసిన షాపూర్‌కంది ఆనకట్ట ప్రాజెక్టు సాకారమయ్యేది కాదని, కథువా జిల్లాలోని తన నియోజకవర్గమైన ఉధంపూర్‌లో మాట్లాడుతూ పిఎంఒ సహాయ మంత్రి డా॥ జితేంద్ర సింగ్ పేర్కొనడం గమనార్హం.
ఆనకట్ట ప్రాముఖ్యత
ఈ ఆనకట్ట జమ్ముకశ్మీర్‌తో పాటు పంజాబ్ ప్రజలకు కూడా లబ్ధిని చేకూర్చనుంది. అధికారుల ప్రకారం కంది ప్రాంతాలలో వ్యవసాయ భూములతో సహా సంబా, కథువా జిల్లాలో జమ్ము` పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై దాదాపు 32,000 హెక్టార్ల వ్యవసాయ భూమి సాగుకు తోడ్పడనుంది.
‘షాపూర్‌కంది ఆనకట్ట ప్రారంభం కావడంతో, పాకిస్తాన్‌కు నదీ జలాలు పోకుండా రంజిత్‌సాగర్ ఆనకట్టను తాము దాని పూర్తి సామర్ధ్యంతో నిర్వహించ గలుగుతామని అధికారులు చెప్తున్నారు. షాపూర్‌కంది దిగువ నీటి జలాలను కూడా నియంత్రి త్వంగా విడుదల చేస్తామని, ఇది మాధోపూర్ బ్యారేజీ వద్ద జలాలు మెరుగ్గా వినియోగం కావడాన్ని అనుమతిస్తుందని వారు చెప్తున్నారు.
సింధు నదీ జలాల ఒప్పందం, 1960 కింద గతంలో పాకిస్తాన్‌కు కేటాయించిన కనీసం 1,150 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం, జమ్ముకశ్మీర్‌కు అందనుంది. దీనితోపాటుగా, ఆనకట్ట ఉత్పత్తి చేసిన జలవిద్యుత్‌లో 20 శాతం జమ్ముకశ్మీర్‌కు వస్తుంది.
ఏమిటీ సింధు నదీ జలాల ఒప్పందం?
సింధు జలాల ఒప్పందం ప్రకారం సత్లజ్, బియాస్, రావి నదులపై భారత్‌కు విశేష హక్కులు ఉంటాయి. వార్షికంగా 33 మిలియన్ ఎకరాల అడుగులు (ఎంఎఎఫ్) నీటికి వ్యవసాయం చేయడానికి తగినంత జలాలు ఉంటాయి. కాగా, మొత్తం 135 ఎంఎఎఫ్ కలిగిన పశ్చిమ నదులైన ఇండస్, రీaలం, చీనాబ్ జలాలపై ఇస్లామాబాద్‌కు నియంత్రణ ఉంటుంది.
ఈ ఒప్పందంపై మాజీ ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ, నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్‌లు 1960లో సంతకాలు చేయగా, ప్రపంచ బ్యాంకు దీనిపై సాక్షి సంతకం చేసింది. ఒప్పందం ప్రకారం భారత్ ఈ నదుల జలాలను ఉపయోగించు కోవచ్చు కానీ, పశ్చిమ నదులపై నిల్వ వ్యవస్థల నిర్మాణం చేయకూడదన్న ఆంక్షలు ఉన్నాయి. అయితే, నిర్ధిష్టమైన నమూనా, సరైన కార్యాచరణ, నిర్వహణతో పశ్చిమ నదీజలాలను ఉపయోగించు కొని, జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే హక్కు భారత్‌కు ఉంది. కాగా, భారతీయ ప్రాజెక్టుల డిజైన్ పట్ల అభ్యంతరాలు తెలిపే హక్కు పాకిస్తాన్‌కు ఉంది.
అయితే, ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుంచీ భారత్‌కు ఉన్న అతిపెద్ద ఫిర్యాదు` పశ్చిమ నదులైన సత్లజ్, బియాస్, రావీలపై నిల్వ వ్యవస్థల నిర్మాణాన్ని అనుమతించడం లేదని. ఒప్పందం ప్రకారం, అటువంటి వ్యవస్థలను అసాధారణ పరిస్థితుల్లో నిర్మించాలి, కానీ పాకిస్తాన్ తాము ఎటువంటి ప్రయత్నం చేసినా అడ్డుకుంటోందని భారత్ ఫిర్యాదు. ఈ నదులు జమ్ముకశ్మీర్‌లో ఉండడం వల్ల ఏ ఉపయోగం లేదనేది భారత్ అభిప్రాయం.
కాగా, గత ఏడాది జనవరిలో భారత్ సింధు జలాల ఒప్పందంలో మార్పులు చేయాలంటూ పాకిస్తాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసు లను ఇండస్ జలాల కమిషనర్ల ద్వారా పంపారు. ఎందుకంటే, భారత్‌కు చెందిన కిషన్‌గంగ, రాత్లె జలవిద్యుత్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరిపి, పరిష్కరించేందుకు గత ఐదేళ్లుగా పాక్ తిరస్కరిస్తూ వస్తోంది.
కాగా, భారతదేశ అభిప్రాయంలో సార్వభౌమాధి కారం అంటే కేవలం భూభాగాన్ని నియంత్రించడం కాదు, ఆ భూమిపై నుంచి ప్రవహించే ప్రతి నీటి చుక్కపై నియంత్రణ కూడా. కానీ, పాకిస్తాన్ మాత్రం సార్వభౌమాధికారాన్ని యథాతధ స్థితిని కొన సాగించడంగా భావిస్తుంది. అందుకు కారణం, నిన్నటి వరకూ తాము ఉపయోగించుకుంటున్న జలాలపై భారత్ కోత పెట్టడం అంటే తన సార్వభౌమత్వంపై దాడి చేయడమేనని ఆ దేశం భావిస్తోందని, హెయిన్స్ అనే పర్యావరణ చరిత్ర అధ్యాపకుడు, ‘ఇండస్ డివైడెడ్: ఇండియా, పాకిస్తాన్ అండ్ ది రివర్ బేసిన్ డిస్ప్యూట్’ శీర్షికతో రచించిన తన పుస్తకంలో పేర్కొన్న మాటలు కొద్ది వివాదా స్పదంగా అనిపిస్తాయి. ఎందుకంటే, ఆ జలాలు భారత్‌వి, నిన్నటి వరకూ అడ్డూఆపూ లేకుండా, నీతి నియమాలకు కట్టుబడకుండా పాక్ వాడుకుంటూ వచ్చింది. తనవి కానివి వాడుకుంటూ, వాటి యజమాని దానిపై నియంత్రణ తీసుకోగానే ఏకంగా దానిని తీవ్రవాదంగా అభివర్ణించడం పాక్‌కు సమంజసం కాదు.
పర్యావరణవేత్తల ఆందోళన
వాస్తవానికి ఒప్పందం చేసుకున్న సమయంలో ఇరు దేశాలూ నదీ జలాలు అంటే వాటిని ఉపయోగించి తీరాల్సినవేనని, అవి సముద్రంలో కలిసిపోతున్నా యంటే వృధా అయిపోయినట్టేననే భావనతో చేసుకున్నారు. ఇది పూర్తిగా శాస్త్ర విరుద్ధమని, ఒకప్పుడు వ్యవసాయ భూములను సుసంపన్నం చేస్తూ ఒండ్రు ప్రవహించడమే కాకుండా కోస్తాతీరాలలో మడ అడవుల పెరిగేందుకు తోడ్పడేవని, కానీ ఇప్పుడు సమస్యలను సృష్టిస్తున్నా యని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హిమాలయాలు, ప్రపంచ మూడవ ధృవంగా పేరొందిన హిందూ ఖుష్ పర్వతాలలో హిమానీ నదాలే ఈ ఆరునదులకు జీవనాధారం. ఉత్తర, దక్షిణ ధృవాల అనంతరం ప్రపంచంలోనే అత్యధిక మంచునీరు నిల్వ ఉన్న ప్రాంతం కనుకనే దానిని మూడవ ధృవమంటుంటారు. కాగా, ఈ హిమానీ నదాలు కూడా పర్యావరణమార్పు కారణంగా ముప్పును ఎదుర్కొంటున్నాయని పర్యావరణ వేత్తలు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపం కేవలం 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితే, ఇందులో మూడొంతులు ఎగిరిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొద టగా, భారీ వరదలు వస్తాయని, తర్వాత అసలు నీరే మిగలదని హెచ్చరి స్తున్నారు.
ఈ ఒప్పందం తాను విభజించిన నదులను ధ్వంసం చేసిందని, నదులకు గల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెరికివేసి, వాటిని మురుగునీటి దిబ్బలుగా మార్చే సంస్కృతిని సృష్టించిందని నదీ ప్రేమికుల భావన. సింధు జలాల ఒప్పందం కేవలం ఒప్పందం కాదని, అది ఒక నది.. ఆ నదిపై ఆధారపడిన ప్రజల మరణమని వారి ఆవేదన.
కీడెంచినా, మేలున్నది
మరొక కోణంలో చూసినప్పుడు, నిన్నటివరకూ తీవ్రవాదంతో కునారిల్లిన ప్రాంతాలకు సాగునీరు సరఫరా కావడంతో అక్కడ భూమి సస్యశ్యామలం కావడమే కాదు, జీవనోపాధిని కూడా కల్పించేందుకు తోడ్పడుతుంది. అలాగే, భూగర్భజలాల మట్టాలు తగ్గిన పంజాబ్ ప్రాంతంలో కూడా దానిని పునరుద్ధరించి, వ్యవసాయానికి తోడ్పడనుంది. ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేయడం అలవాటు చేసుకున్న పాక్ ఇప్పటికైనా హేతుబద్ధంగా ఆలోచించకపోతే అధిక నష్టాన్ని చవిచూసేది ఆ దేశమేనన్నది నిర్వివాదం.
– డి. అరుణ