ఎన్ని శతాబ్దాలు గడిచిపోయినా శ్రీరామ చంద్రుడు భారతీయులకు ఈ నాటికీ స్ఫూర్తి ప్రదాతే; ఆదర్శమూర్తే. ఆయన నామస్మరణ మాత్రం తో బాధలన్నీ తొలగిపోగలవని మనం విశ్వ సిస్తున్నాం. శ్రీరాముని వ్యక్తిత్వం పరిపూర్ణమైనది. వ్యక్తిగతంగాను, సామాజికంగాను ఆయన శీలం జాతి మొత్తానికి ఆదర్శంగా వెలుగొందుతోంది. మానవుడుగా అవతరించి, మానవుడుగా జీవించి సమస్త జనులకు మానవత్వ స్వరూపాన్ని చూపించారు. పితృవాక్య పరిపాలన మొదలు ఆయన ఆచరించిన ప్రతి వ్రతమూ మానవులందరికి ఒక మహోన్నతాదర్శంగా దీపిస్తోంది. సామాజికంగా ఆయన అవలంబించిన ధర్మం నాటికే కాదు. యుగాల తర్వాత కూడా మానవాళికి ఆదర్శ శిఖరంగానే ఉంటుంది.రాజ్యం ప్రజలది – తాను ప్రజల ప్రతినిధి.తన పరిపాలనలో ప్రతి క్షణంల•నూ దీనిని రుజువు చేస్తూ వచ్చారు. సింహాసనం అధిష్టించే ముందు ప్రజల అంగీకారాన్ని పొందారు. సింహాసనాన్ని విడనాడేటప్పుడు సైతం ప్రజల అనుజ్ఞకోసం అభ్యర్థించారు. ప్రజా సౌఖ్యానికి తన సర్వాస్వాన్ని ధారపోసేందుకు సదా సిద్ధంగా ఉండే మహానీయుడు రామచంద్రుడు.
స్నేహం దయాంచ సౌఖ్యంచ
యది వా జానకీ మపి
ఆరాధనాయ లోకస్య
ముంచతే నాస్తి మే వ్యథా।।
‘స్నేహాన్ని, దయను, సౌఖ్యాన్ని, అవసరమైతే జానకిని సైతం ప్రజా సౌఖ్యానికై త్యజిస్తా’ నని చాటిన మహనీయుడు, త్యాగశీలుడు, ప్రజాస్వామ్యవాది ఇంకెవరుంటారు? సువర్ణమయమైన లంక తన స్వాధీనమయి, సామ్రాజ్య లక్ష్మి స్వయంగా తన పాదాక్రాంతమై ఉన్న సమయంలో ‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ స్వస్థానానికి బయల్దేరిన రామచంద్రుని మించిన దేశభక్తు లెవరుంటారు? రాక్షస శక్తులు ప్రబలిపోయి, ప్రకృతి శక్తులన్నీ వాటిముందు మోకరిల్ల వలసి వచ్చిన వివత్స మయంలో, మానవత్వాన్నైనా సరిగా పొందని (వా)నరులను సమీకరించి లోకంలో శాంతి నెలకొల్పిన వాని కన్నా భౌతిక, ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడెవంటారు? ఇవన్నీ గుర్తించారు కనుకనే గాంధీజీ, భ్రష్టమైపోతున్న మనజాతికి ‘రామనామ’ మంత్రాన్ని సూచించారు. ‘రామరాజ్య’ ఆదర్శాన్ని ముందుంచారు.
రాముని పాలనకు కాదు జీవితానికి గీటు రాయి ధర్మం. ధర్మానికి సమస్త జనులూ తల యొగ్గ వలసిందే. ధర్మమే సమాజ ప్రాతిపదిక. స్వభావతః రాముడు అహింసావాదే కాని, ధర్మహానికలిగే సందర్భంలో దుష్టశిక్షణకు వెనుకాడ లేదు. స్వయంగా సర్వశక్తిమంతుడే అయినా తన పరిపాలనకు అడ్డు రాగలవారెవరూ లేకపోయినా, ధర్మ నిర్దేశకుడుగా వసిష్ఠుని గురుస్థానంలో ఉంచుకున్నారు. ధర్మానికి ముందు ఎట్టి రాగ ద్వేషాలకు గాని, ఏ వ్యక్తికీ ఎట్టి ప్రత్యేకతలకుగాని అవకాశం లేదు. ధర్మందృష్ట్యా ప్రజలందరూ- వారేమతానికి, కులానికి, వర్గానికి, శాఖకు చెందినవారైనా సరే అందరూ సమానులే. ‘యథారాజా తథాప్రజా’ అన్నట్లు ప్రజలూ రాముని అడుగుజాడల్లో ధర్మపథాన్నే స్వీకరించారు. ప్రజలు, పాలకుడు అన్యోన్యానురాగంతో సంచరించారు. నాడు దేశంలో విలసిల్లిన ఆధ్యాత్మిక శక్తి సంపదవల్ల ఈతిబాధలు సైతం వీరి దరి చేరలేకపోయాయి.
శతాబ్దాలు గడిచాయి. తరాలు మారాయి. ప్రజల్లో నైతిక విలువలే మరుగున పడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన అడుగంటి పోతోంది. భౌతిక భోగలాలసతో ప్రపంచం అధోగతి పాలవుతోంది. నాయకులు ధర్మంయెడ అంధులుగా సంచరి స్తున్నారు. రాక్షస శక్తులు పైశాచికనృత్యం ప్రారం భించాయి. నాయకులు ధర్మంయెడ అంధులుగా సంచరిస్తున్నారు. ఫలితంగా మానవాళిఫలితంగా మానవాళి యావత్తూ పరిష్కరించలేని సమస్య లుత్పన్నమవుతున్నాయి. శ్రీరామచంద్ర స్ఫూర్తితో వాటిని అధిగమించేందుకు నడుం కట్టాలి.

– సంపాదకీయం
‘జాగృతి’ 09-04-1954 సంచిక నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE