భారతదేశం అధికారికంగా ‘కటిక పేదరికాన్ని’ (యాబ్సల్యూట్‌ పావర్టీ)ని జయించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం వెల్లడిరచింది. విదేశీ యూనివర్సిటీ ‘బ్రూక్లిన్‌ యూనివర్సిటీ’ అధ్యయనం చేసి మరీ తమ నివేదికను వెలువరించింది. దీనితో మన వామపక్ష మేధావులు ప్రస్తుతం ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ సమయంలోనే  2023`24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతానికి చేరుకున్నదనే విషయాన్ని వెల్లడిరచి ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చి వామపక్ష మేధావులు, ఉదారవాదుల నోటమాట రాకుండా చేసింది. ఎందుకంటే, ఈ రెండు సాకులు చూపుతూ, మార్క్సిజం ఎంత ముఖ్యమో, ఎందుకు ముఖ్యమో చెప్పుకుంటూ సమాజాలు, ప్రభుత్వాలపై వామపక్షులు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. భారత్‌లో వారికి ఇవి రెండూ గట్టి దెబ్బలేననే విషయం చెప్పనవసరం లేదు.

ఇందుకు కారణం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే అన్నది నిర్వివాదం. ఆ విశ్వాసంతోనే తనను మూడవసారి గెలిపిస్తే, భారత్‌ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోని అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని మోదీ హామీ ఇస్తున్నారు. ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు కూడా 2025-2027 మధ్య భారత్‌ మూడవ స్థానాన్ని ఆక్రమిస్తుందనే జోస్యం చెబుతున్నాయి. ప్రస్తుతం వ్యవస్థాపకతపై దృష్టి పెట్టడమే కాక ప్రభుత్వం ప్రైవేటు రంగానికి కూడా అత్యధిక ప్రాముఖ్యతనిచ్చి, ప్రోత్సాహాన్ని ఇస్తోంది. ఎంఎస్‌ఎం ఇల స్థాపన, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అన్నది మనం ప్రగతి సోపానాలను వేగంగా ఎక్కేందుకే.

ఎవరు అవునన్నా, కాదన్నా భారతదేశ ఆర్ధిక ప్రగతి పరుగులు తీస్తోంది. ఒకనాటి ‘బంగారు చిలుక’ అన్న పేరును తిరిగి సాధించే మార్గంలో శరవేగంతో దూసుకుపోతున్నది. ఒకనాడు మనను పాలించిన బ్రిటిషు వారి ఆర్థిక వ్యవస్థను అధిగమించి, ప్రపంచ అతిపెద్ద ఐదవ ఆర్థికవ్యవస్థగా అవతరించింది. ఈ వేగానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తూ భారత స్టాక్‌ ఎక్స్‌చేంజి నిన్న మొన్నటి వరకూ నాలుగవ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్‌చేంజిగా ఉన్న హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజిని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం మొత్తం 4.33 ట్రిలియన్‌ డాలర్ల విలువైన షేర్ల లిస్టింగ్‌తో భారత స్టాక్‌ ఎక్స్‌చేంజి తన సామర్ధ్యాన్ని చాటుకుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులను, ఇతర స్థితిగతులను గమనించినప్పుడు, భవిష్యత్తులో భారతదేశం 5.63 ట్రిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు కలిగిన జపాన్‌ స్టాక్‌ మార్కెట్‌ను కూడా అధిగమించి, చైనా మార్కెట్‌ను వెనక్కినెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మనం కటిక దారిద్య్రాన్ని జయించా మన్నది గొప్ప వార్తేనన్నది నిర్వివాదం.

భారత్‌లో దారిద్య్ర క్షీణతపై

బ్రూక్లిన్‌ వర్సిటీ నివేదిక

బ్రూక్లిన్‌ యూనివర్సిటీ ‘కటిక పేదరికం’పై వెలువరించిన నివేదిక ప్రకారం, తలసరి దారిద్య్ర నిష్పత్తిలో క్షీణత, గృహ వినియోగంలో పెరుగుదల ద్వారా వారు ఈ భావనకు వచ్చారు. గత దశాబ్ద కాలంలో బలమైన పునఃపంపిణీపై ప్రభుత్వం పెట్టిన విధానపరమైన దృష్టి ఫలితంగానే ఈ సమ్మిళిత వృద్ధి సాధ్యమైందని నివేదిక పేర్కొనడం విశేషం. ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా విశ్వాస్‌, సబ్‌ కా వికాస్‌’ అంటూ నరేంద్ర మోదీ వికసిత భారత్‌ కోసం ఇచ్చిన, ఇస్తున్న నినాదం ఏ రీతిలో సాకారమవుతున్నదో ఈ నివేదిక చెప్పకనే చెప్తోంది. పదేళ్లలో తొలి అధికారిక సర్వే ఆధారిత దారిద్య్ర అంచనాలను అందిస్తూ భారతదేశం ఇటీవలే 2022-23 సంవత్సరానికి గాను అధికారిక వినిమయ వ్యయ డేటాను విడుదల చేసింది.

వరల్డ్‌ డేటా లాబ్స్‌ రూపొందించిన వరల్డ్‌ పావర్టీ క్లాక్‌ (దారిద్య్ర గణన) డేటా ప్రకారం 34,458,941 మంది ప్రస్తుతం కటిక పేదరికంలో జీవిస్తున్నారు. ఇది భారత జనాభాలో 2 శాతం మాత్రమే. ఈ రెండు శాతంలో 32,5-7, 519 మంది (94శాతం) గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా, 1,941,362 మంది పట్టణ వాసులు (6శాతం). అధిక వృద్ధి, అసమానతలలో క్షీణత కలిసి కటిక దారిద్య్రాన్ని నిర్మూలించడానికి కారణమయ్యాయి. ఇది ప్రస్తుతం 1.9 డాలర్ల దారిద్య్ర రేఖవద్ద కొనుగోలు శక్తి తుల్యత ఆధారంగా రూపొందించిన నివేదిక. దీని ప్రకారం గ్రామీణ దారిద్య్రం 2.5శాతం ఉండగా, పట్టణ ప్రాంతంలో 1 శాతానికి వచ్చింది. దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న వారి సంఖ్యను తగ్గించడం ద్వారా ఇతర దేశాలలాగా ప్రస్తుతం భారత్‌ దారిద్య్రరేఖను పునర్నిర్వచించి, ప్రస్తుతమున్న కొలమానమైన 1.9 డాలర్ల నుంచి 3.2 డాలర్ల దగ్గర దానిని స్థిరపరచవలసి ఉందని కూడా నివేదిక పేర్కొంది. ఉద్దేశిత లబ్ధిదారులను మెరుగ్గా గుర్తించి, నిజమైన పేదలకు మరింత తోడ్పాటును అందించేందుకు ఉనికిలో ఉన్న సామాజిక సంరక్షణ కార్యక్రమాలను తిరిగి నిర్వచించుకొనేందుకు ఈ కొలమానం అవకాశమిస్తుందని నివేదిక పేర్కొంది.

నివేదిక అంచనాలు దాదాపు మూడొంతుల మంది జనాభాకు ప్రభుత్వం అందచేస్తున్న ఉచిత బియ్యం, గోధుమలను, ప్రభుత్వ విద్య, ఆరోగ్యం వసతులను ఉపయోగించుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రపంచ బ్యాంకు వేసిన అంచనాలకన్నా భారతదేశంలో నివేదిక ప్రకారం అత్యంత తక్కువ మంది నిరుపేదలు ఉన్నారు. ప్రభుత్వ నిధులతో విస్తృతమైన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పునఃపంపిణీపై బలమైన దృష్టి పెట్టడం వల్లనే గ్రామీణ ప్రాంతాల వినిమయంలో వృద్ధి సాధ్యమైందని నివేదిక రూపకర్తలు పేర్కొంటున్నారు.

ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల ఆధారంగా రూపొందించే బహుముఖీయ పేదరికం లేదా దారిద్య్రం (ఎంపిఐ) నుంచి కూడా ప్రజలు బయిటపడినట్టు నివేదిక ఆధారంగా మనకు తెలుస్తుండగా, అసంతృప్తులు మాత్రం ఏ మాత్రం హర్షాన్ని వ్యక్తం చేయడం లేదు. వాస్తవానికి ఆక్స్‌ఫోర్డ్‌ పావర్టీ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనీషియేటివ్‌ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ బహుమితీయ పేదరికం కొలమానానికి భారత్‌ కొత్తగా ప్రసూతి/ తల్లి ఆరోగ్యం, బ్యాంక్‌ అకౌంట్లను కూడా చేర్చింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద అమలవుతున్న ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ యోజన, జన్‌ధన్‌ ఖాతాలు మన ఆర్థిక వ్యవస్థలో పోషిస్తున్న పాత్రను లోతుగా తరచి చూస్తే తప్ప అర్థం కానిది. యుపిఐ విజయానికి ఈ ఖాతాలే కారణమని అంతర్జాతీయ విత్త సంస్థ (ఐఎంఎఫ్‌) కూడా కితాబిచ్చింది. అలాగే, ప్రజల గడపకు ఆరోగ్యాన్ని తీసుకువెళ్లేందుకు ఎయిమ్స్‌ వంటి పెద్ద ఆసుపత్రులే కాదు మారుమూల పల్లెల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం తీసు కుంటున్న చర్యలను గమనించేందుకు ఎవరికీ భూతద్దమేం అక్కర్లేదు.

మాట తప్పని ప్రధాని

ప్రధాని మోదీ ఏదైనా హామీ ఇస్తే అది సాకారమవుతుందనే విషయం ఈ పదేళ్లలో ప్రజలకు అనుభవంలోకి వచ్చిన విషయమే. అందుకే సామాన్యులు కూడా నేడు ‘మోదీ కీ గ్యారెంటీ’పై అత్యంత భరోసాతో ఉన్నారు. మోదీ ప్రధానిగా అధికారం చేపట్టే సమయానికి మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పదవదిగా ఉంది. మోదీ వచ్చిన పదేళ్లల్లోనే ఐదు మెట్లు ఎక్కించేశారు. ప్రస్తుతం ఎగుమతులు, మౌలికసదుపాయాల కల్పన, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, కార్పొరేట్‌ రంగంలో పరిశోధన, అభివృద్ధి పై ఎక్కువ దృష్టినీ, పెట్టుబడు లను పెట్టాల్సిన అవసరం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రభావంతో భారత్‌ కేవలం తన సరిహద్దులలోనే కాక ఆవల కూడా ప్రజల సంక్షేమానికి కూడా దోహదం చేస్తున్నది. ఈ విషయాన్ని మనం కొవిడ్‌ సమయంలో గమనించాం. భారతదేశం తన అభివృద్ధి ప్రయాణంలో చేపట్టిన అనేక ఆర్థిక వ్యూహాలు, చొరవలు, విజయాలు ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకోవడమే కాదు, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచాయి. ఒక దేశపు బలం, ఆవిష్కరణలు, నిరంతర ఆర్థిక సంస్కరణలు అన్నవి దానిని అంతర్జాతీయ వేదికపై ఎలా నిలుపుతాయో భారత వృద్ధి కథనం వివరిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2022-23లో 7.2 శాతం అత్యధిక రేటుతో భారత్‌ వృద్ధి చెందిందని ప్రపంచ బ్యాంకు కూడా అంగీక రించింది. భారత వృద్ధి రేటు ఉద్భవిస్తున్న మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలకు రెండిరతలు ఉండటమే కాదు, జి20 దేశాలలో రెండవ స్థానంలో ఉంది.

దూసుకుపోతున్న జీడీపీ వృద్ధి రేటు

ఎవరూ ఊహించని విధంగా ఆర్ధిక సంవత్సరం 2023-24 మూడవ త్రైమాసికంలో 8.4 శాతం జిడిపి వృద్ధిని చూపి, ఆర్థికవేత్తలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే, ప్రభుత్వ వ్యయం తగ్గడం, పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి మందగించడం, మూడవ త్రైమాసికంలో రుతుపవ నాలు అస్థిరంగా ఉండడం వల్ల గత త్రైమాసికాని కన్నా వృద్ధి గణాంకాలు తక్కువగా ఉంటాయని వారంతా అంచనా వేశారు. కాగా, బలమైన నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగాల వల్ల నిపుణుల అంచనాలను మించి ఈ వృద్ధి సాధ్యమైందని జాతీయ గణాం కాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) వెల్లడిరచింది. ఉత్పత్తి రంగం మూడవ త్రైమాసికంలో 11.6శాతం విస్తరించగా, నిర్మాణ రంగం 9.5శాతం పెరిగిందని ఎన్‌ఎస్‌ఒ వివరించింది. కొన్ని ప్రైవేటు సంస్థలు మూడవ త్రైమాసిక వృద్ధి రేటు గురించి ప్రముఖ ఆర్థికవేత్తల అంచనాలను కోరినప్పుడు వారిచ్చిన సమాచారం ప్రకారం ఈ రేటు గత త్రైమాసికంలో గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన 7.6కన్నా తగ్గి 6.64శాతం వద్ద స్థిరపడు తుందని వారు అంచనా వేశారు. ‘2023-24 త్రైమాసికంలో ఆరోగ్యవంతమైన 8.4శాతం జిడిపి వృద్ధి రేటు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, దాని సంభావ్యతను చూపుతుంది. 140మంది కోట్ల భారతీయులు మెరుగైన జీవితాన్ని గడుపుతూ, వికసిత భారత్‌ను సృష్టిం చేందుకు తోడ్పడే వేగవంతమైన ఆర్థికవృద్ధిని సాధించేందుకు మా కృషి కొనసాగు తుంది,’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’పై పోస్ట్‌ చేసి వృద్ధి రేటుపై సానుకూలంగా స్పందించారు. కాగా, బలమైన జిడిపి వృద్ధి ఉన్న ప్పటికీ ప్రైవేటు వినిమయ వృద్ధి 3.6శాతం వద్దే ఉండటం అన్నది ఆందోళన కలిగించే విషయమని కొందరు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

జిడిపి గణాంకాలు బలంగా ఉండి, వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నా, బాహ్య కారకాలు ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ అప్రమత్తం చేయడం గమనార్హం. కనుక, అనేకమంది అంచనా వేసిన దానికన్నా మెరుగ్గా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందంటే, భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక పరివర్తన చోటు చేసుకుంటోందనే విషయాన్ని అది పట్టి చూపుతోందని ఆయన వివరించారు. అటు భౌతిక మౌలిక సదుపా యాలు, ఇటు డిజిటల్‌ అవస్థాపనలతో పాటు సమ్మిళిత అజెండా భారతీయ కుటుంబాల కొనుగోలు శక్తికి దోహదం చేస్తోందంటూ, ఈ వృద్ధి రేటు వెనుక గల అసలు కారణాలను ఆయన వివరించారు.

కాగా, అన్ని రంగాలలోకి అతి బలహీనంగా ఉన్నది వ్యవసాయ రంగమే. అనుకున్నట్టుగానే భారత వ్యవసాయ రంగం 0.8శాతం కుంచించింది. గత త్రైమాసికంలో దాని వృద్ధి రేటు కూడా 1.6శాతంగా మాత్రమే ఉన్నది. గత ఏడాది ఇదే కాలంలో దీని వృద్ధిరేటు 5.2 శాతాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది మాత్రం వర్షాభావం, ఎల్‌-నినో ప్రభావం వ్యవసాయాన్ని దెబ్బతీశాయి. అయితే, ఎల్‌నినో ప్రభావం తగ్గుతోందని, సాధారణ రుతుపవనాల ఉంటాయని వాతావరణ శాఖ అంచనాలు ఉన్నందున సరైన రబీ పంటలతో పాటుగా, మెరుగైన ఖరీఫ్‌ నాట్లు ఉంటాయని భావిస్తున్నట్టు ఆర్ధిక సలహాదారు నాగేశ్వరన్‌ చెప్పడం ఆశాజనకంగా అనిపించక మానదు.

అస్థిర ప్రపంచంలో దృగ్గోచరమవుతున్న వృద్ధి!

ఒకవైపు ఐరోపా దేశాలు సహా, పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్‌ త్రైపాక్షికంలోనైనా సరే అంత వృద్ధి రేటును ప్రదర్శించడం వారందరికీ అసూయ కలిగించే విషయమే. ఈ వృద్ధి గణాంకాలు చూసిన కొందరు ఆర్థికవేత్తలు భారత ఆర్థిక వ్యవస్థ బలమైన ఒరవడిలో ఉన్న విషయాన్ని ఈ అంకెలు ప్రతిఫలిస్తున్నాయంటున్నారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక పరిదృశ్యం అత్యంత అస్థిరంగా ఉన్న నేపథ్యంలో ఈ వృద్ధి చోటు చేసుకోవడానికి కారణం పెట్టుబడులు 12.2 శాతం పెరగడమేనని వారంటు న్నారు. అంటే, భారత్‌ భవిష్యత్తు పై విశ్వాసం పెరిగి, పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్యవేత్తలు ముందుకు వస్తున్నారన్న మాట.

కాగా, మూలధన వ్యయాన్ని పునరుద్ధరిం చడంలో ప్రస్తుత జీడీపీ గణాంకాలు తోడ్పడతాయని, ఇది దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడుతుందని వారంటు న్నారు. వ్యవసాయం మినహా అన్ని రంగాలూ ఆర్ధికంగా వృద్ధిని సాధిస్తున్నాయి.

మోదీకి ముందు- తర్వాత

నాటి ప్రభుత్వాలు అనుసరించిన సోషలిస్టు విధానాల కారణంగా, భారతదేశం ఎదుగూ బొదుగూలేకుండా జిడిపి వృద్ధి 4శాతాన్ని మించక పోవడంతో, ఇదే హిందూ వృద్ధిరేటు అంటూ మన ఆర్ధికాభివృద్ధిని పాశ్చాత్య దేశాలు తక్కువచేసి చూసిన కాలముంది. కానీ, ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారాన్ని చేపట్టిన తర్వాత తాను చేపట్టిన విధానాలతో అది అవాస్తవమనే విషయాన్ని రుజువు చేశారు. నిజానికి, 1990ల్లో చేపట్టిన సరళీకృత ఆర్ధిక విధానాలతో ఆర్థిక రంగంలో కొంత మెరుగుదల వచ్చినా, యూపీఏ కాలంలో జరిగిన అవినీతి, స్కాంలు ఆ వృద్ధి ఫలాలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాకుండా అడ్డుపడ్డ విషయం ప్రపంచానికి విదితమే. అయితే, 2014 తర్వాత పెద్ద నోట్ల రద్దు దగ్గర నుంచి ఇడి వంటి సంస్థలకు మరిన్ని అధికారాలిచ్చి అవినీతికి అడ్డుపడడంతో, దేశంలో నేడు ఒక విశ్వాసం వ్యక్తమవుతున్నది. ప్రత్యక్షంగా లబ్ధిదారుల ఖాతాలలోకి నగదును బదిలీ చేయడంతో అక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది. ఒక్క రూపాయి లబ్ధిదారుకు కేటాయిస్తే, అందులో 15 పైసలు మాత్రమే వారికి చేరుతా యంటూ నాడు రాజీవ్‌గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుత విధానాన్ని చూసినప్పుడు నూటికి నూరు శాతం లబ్ధిదారులకు చేరడం కనిపిస్తుంది. అదే వారి కొనుగోలు శక్తిని పెంచి, మార్కెట్లో విత్తం లభ్య మయ్యేలా చేస్తోంది. ఇదే కొవిడ్‌ అనంతర పరిస్థితుల్లో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుంగి పోకుండా తోడ్పడిరది. 2022`23వ సంవత్సరంలో ఆర్ధిక వ్యవస్థ 7.2శాతం పెరగ్గా, ఈ ఆర్ధిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను మించనున్నట్టు కనిపిస్తోంది.

మూడవ స్థానాన్ని సాధించే పథంలో భారత్‌

 ఐఎంఎఫ్‌తో పాటు దేశీయ అంచనాలు కూడా భారత్‌ అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థ కావాలన్న లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఉందని చెప్పడంలో అవాస్తవికత లేదు. మన వాస్తవ పెట్టుబడి రేటు దాదాపు 33శాతం ఉండగా, కరెంట్‌ అకౌంట్‌ లోటు తగ్గడమే కాదు, దేశంలోని యువజనాభా కూడా ఇందులో పాత్ర పోషిస్తోందని వారు పేర్కొంటున్నారు. నిజమే, ప్రపంచవ్యాప్తంగా నేడు జనాభా రేట్లు తగ్గిపోయిన, తగ్గిపోతున్న నేపథ్యంలో అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశం భారతదేశమే. చైనాలో కూడా వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో ఆ దేశ ఉత్పాదక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ మంతా రష్యా`ఉక్రెయిన్‌ కారణంగా ఆర్థిక మాంద్యం లోకి, తిరోగమనంలోకి వెడుతున్న నేపథ్యంలో భారత్‌ దౌత్యపరమైన కృషి కారణంగా ఆ జారుడుబండ నుంచి జారవలసిన అవసరం రాలేదు. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం ద్వారా, ఇక్కడ ఉత్పత్తి రంగం సహా పలు రంగాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేసింది. ఈ సమయంలో రష్యాపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా ఇంధన సరఫరాలు లేక రష్యాకు బదులుగా జర్మనీ సహా పలు ఐరోపా దేశాలు ఆర్థిక మాంద్యాన్ని, తిరోగమనాన్ని చవి చూస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా, యునైటెడ్‌ కింగ్డమ్‌, జపాన్‌లు ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్టు బహిరంగంగా ప్రకటించాయి.

జీడీపీ వృద్ధి మాత్రమే కాకుండా, మొత్తం ఆర్థిక రుణభారం సహా పలు కొలమానాలలో అనేక దేశాలకన్నా మెరుగైన పనితీరును భారత్‌ ఆర్థిక వ్యవస్థ కనబరుస్తోంది. ప్రస్తుతం జీడీపీలో కేవలం 170 శాతం రుణభార నిష్పత్తిని మాత్రమే మనం మోస్తున్నాం. ఇక, జపాన్‌ 400 శాతం అతిపెద్ద రుణభార నిష్పత్తిని కలిగి ఉండగా, చైనా దాదాపు 300 శాతాన్ని, జర్మనీ 190 శాతాన్ని కలిగి ఉంది. అంత పెద్ద పెద్ద గణాంకాలతో పోల్చినప్పుడు మనం ఎంతో మెరుగ్గా ఉన్నామనే విషయం విదితమవుతుంది.

ప్రస్తుతం ప్రపంచ ఆర్ధికవ్యవస్థ మంద గించడంతో బహిర్గత డిమాండ్‌ పడిపోవడమే కాదు, అంతర్గత వినిమయం కూడా పూర్తిగా కోలుకో లేదన్నది వాస్తవం. మనం 7 నుంచి 8 శాతం వృద్ధిని సాధించేందుకు ఇవే ప్రస్తుతం ఆటంకాలుగా కనిపించాయి. కానీ, మన అంతర్గత వ్యవస్థల పని తీరు కారణంగా అందరి అంచనాలను మించి వృద్ధిని సాధించింది. అయితే, ఇదే వృద్ధి రేటు తదుపరి త్రైమాసికంలో కొనసాగకపోయినప్పటికి కూడా మనం 2027నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్ధిక వ్యవస్థగా ఎదిగే అవకాశాలున్నా యంటూ జీడీపీ డేటా ఆధారంగా ఎస్‌బిఐ ఎకోరాప్‌ నివేదిక పేర్కొనడం ఒక శుభ సంకేతమే. ఐఎంఎఫ్‌ జులై 2023లో ఇచ్చిన సమాచారం ప్రకారం జర్మనీ ఆర్థిక వ్యవస్థ 2023లో 0.3 శాతం సంకోచించి, 2024లో 1.3 శాతం వృద్ధిని, జపాన్‌ ఆర్థిక వ్యవస్థ 2023లో 1.4 శాతం వృద్ధిని, 2024లో 1శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేశారు. కాగా భారతదేశం 2023 ఆర్థిక సంవత్సరంలో 6.1శాతం వృద్ధిని, 2024లో 6.3శాతం వృద్ధిని సాధిస్తుందనే అంచనా. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కానీ భారతదేశం తన సనాతన విజ్ఞతను ఉపయోగించి పరుగులు తీస్తోంది.

ప్రాచీన నాగరికత కలిగిన భారత్‌లో సుసంపన్న మైన ఆరోగ్య, సంక్షేమ, ఔషధీయ సంస్కృతి ఉంది. ప్రపంచంలో తొలి సంప్రదాయ ఔషధీయ కేంద్రాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించడమన్నది సంప్రదాయ వైద్యం, ఔషధాల క్షేత్రంలో ఉన్న సంభావ్యతకు, తోడ్పాటుకు ఇచ్చిన గుర్తింపుగా చూడాలి. నేడు యోగాను, ఆయుర్వేదాన్ని కేవలం భౌతిక ఆరోగ్యమే కాక, ఒత్తిడిని తగ్గించి, మనసు, శరీరానికి మధ్య సమతుల్యతను సాధించి డయాబెటిస్‌, ఊబకాయం, డిప్రెషన్‌ వంటి వ్యాధులను తగ్గిస్తాయనే విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించి అందిపుచ్చుకుంటున్నారు. అందుకే ఆయుష్‌ కింద ఉండే దేశీయ చికిత్సా విధానాల కోసం భారత్‌ రావాలనుకున్న విదేశీయు లకు భారతదేశం ఆయుష్‌ వీసాలను అందిస్తోంది. వారు సంప్రదాయ వైద్య చికిత్సల కోసం ఇందుకు దరఖాస్తు చేసుకొని భారత్‌కు రావచ్చు. దీనివల్ల దేశంలో సంప్రదాయ వైద్యవిధానాలకు డిమాండ్‌ పెరగడమే కాదు, అవి ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తాయి.

కొవిడ్‌ స్పందన, విధాన రూపకల్పన

ప్రపంచాన్ని పీడిరచిన మహమ్మారి, తాము ఎంతో పురోగతిని సాధించామన్న అహంకారంతో ఉన్న మానవులకు, దేశాలకూ ముందెన్నడూ ఎదుర్కోని అనేక సవాళ్లను విసిరింది. ఈ సమయంలో భారత్‌ తన సనాతన వివేకాన్ని, ముందు చూపును ఉపయోగించి స్వతంత్ర విధాన రూపకల్పనను ప్రదర్శించింది. ఒక్క సారిగా ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో పడిపోతున్న డిమాండ్‌ను నిర్వహించడంపై పలు దేశాలు దృష్టి పెట్టాయి. కానీ భారత్‌ మాత్రం సరఫరాలో ఉండే ఆటంకాలపై, నిలకడలేని ఆర్థిక ఒత్తిళ్లను నివారించ డంపై, ద్రవ్యోల్బణ పెరుగుదలపై దృష్టిపెట్టింది. ఒకరకంగా, ఇతర దేశాలలో చోటు చేసుకుంటున్న పరిణామాల ఆధారంగా తన విధాన కల్పన చేసుకునే యత్నం చేసింది. ఇటువంటి అంశాలను నిర్వహించ గల స్థాయిలో ఆచరణీయ వైఖరిని కలిగి ఉండడమే, విపత్తు వచ్చినప్పుడు భారత్‌ ఎంత బలంగా ఉండగలదో పట్టి చూపుతుంది.

సమ్మిళిత వృద్ధికి డిజిటల్‌ పరివర్తన

మోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం సామాజిక ఆర్థిక రంగంలో నిర్మించిన డిజిటల్‌ పరివర్తన నమూనా అన్నది అందరినీ కలుపుకు పోతూ, అందరికీ మంచి జీవితాన్ని ఇచ్చే దిశగా పయనాన్ని ప్రారంభించింది. మొబైల్‌ ఫోన్ల సంఖ్య పెరగడం, ఇంటర్నెట్‌ వ్యాపించడం, మిలియన్ల బ్యాంకు ఖాతాలు తెరవడం, ఆధార్‌ రూపంలో ప్రత్యేక డిజిటల్‌ గుర్తింపు, యూపీఐ రూపంలో డిజిటల్‌ చెల్లింపుల నమూనా అన్నవి డిజిటల్‌ ఇండియాకు పునాదులు అయ్యాయి. స్థానిక, అంతర్జాతీయ సమాజ సమస్యలను పరిష్కరించేందుకు వీటి ఆధారంగానే నూతన తరం సాంకేతికతలను రూపొందిస్తున్నారు. ఒకరకంగా, నగదు రహిత లావాదేవీలు నిర్వహణకు సౌలభ్యాన్ని కల్పించారు.

పౌర కేంద్రిత డిజిటల్‌ విధానం

భారతదేశపు డిజిటల్‌ పరివర్తనలో పౌర కేంద్రిత విధానం ఒక కీలకాంశం. కేవలం సేవల బట్వాడానే కాకుండా ఒకప్పటి నగదు ఆధారిత, సాంకేతికతను అడ్డుకునే సంస్కృతిని అధిగమించి డిజిటల్‌ సంస్కృతిని ప్రజలకు అలవాటు చేసేందుకు ప్రభుత్వం సమర్ధవంతంగా చేసిన ప్రయత్నాల వల్ల ఇది సాధ్యమైంది. ముఖ్యంగా, తక్కువ ఖర్చుతో, తేలికగా లెక్కించగలిగే అవకాశం ఉన్నది కావడంతో దీనిని డిజిటల్‌ విభజనను అనుభవిస్తూ, వనరుల సమస్యలను ఎదుర్కొంటున్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో సమర్ధవంతంగా నకలు చేయవచ్చు.

మహిళల నాయకత్వంలో అభివృద్ధి చొరవలు

మహిళ నేతృత్వంలో అభివృద్ధి ద్వారా భారత్‌ నూతన గతిలో ప్రయాణాన్ని ప్రారంభించింది. విద్య, ఆర్ధికంగా కలుపుకుపోవడం, వ్యవస్థాపకత, నైపుణ్యాల అభివృద్ధి, గృహాలు తదితర విస్త్రత అంశాలలో మహిళలపై దృష్టిపెట్టి ప్రభుత్వం అనేక విధానాలను రూపొందించింది. ప్రభుత్వం నిర్వహి స్తున్న వికసిత్‌ భారత సంకల్ప యాత్ర సందర్భంగా ప్రధాని సంభాషణలు కూడా మహిళల పాత్రపైనే దృష్టి పెట్టాయి

పర్యావరణ చర్య, సుస్థిరత

అనేక అభివృద్ధి సవాళ్లు ఉన్నప్పటికీ, ముఖ్యంగా పర్యావరణ మార్పుపై పోరాటానికి భారత్‌ ప్రతిష్ఠాత్మక సుస్థిర లక్ష్యాలను పెట్టుకుంది. కాప్‌(COP)26లో ప్రారంభించిన లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ (LiFE – పర్యావరణం కోసం జీవనశైలి) సుస్థిరమైన జీవనానికి ప్రాధాన్యతనిస్తుంది. దీనిని భారత ఇంధన పరివర్తన వ్యూహంతో ఏకీకృతం చేశారు. తక్కువ ఖర్చుతో పర్యావరణ మార్పును సంపూర్ణంగా పరిష్కరించేందుకు ఈ వ్యూహం విలువైన స్ఫూర్తులను ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే సౌర ఇంధనం సహా పలు పర్యావరణ అనుకూల ఇంధనాలైన హైడ్రొజెన్‌ వంటి పునరావృత ఇంధనాలకు ప్రోత్సాహాన్ని మనం చూడాలి. పునరావృత ఇంధన శాఖ ఈ లక్ష్యాలను సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నది.

అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఇఎ) ప్రకారం, ప్రపంచ, జి20 సగటుకన్నా 10శాతం ఇంధన సామర్ధ్యాన్ని భారత ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. వాతావరణ ఉపశమనం, స్థితి స్థాపకతకు ప్రపంచ సహకారం కోసం భారత్‌ చేస్తున్న కృషి, దాని నాయకత్వానికి ఉదాహరణగా నిలువడమే కాదు, పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు ఐక్యం కమ్మని ప్రపంచానికి ఆహ్వానం పలికినట్టుగా కనిపిస్తుంది.

ప్రపంచ శ్రేయస్సు కోసం విజ్ఞాన భాగస్వామ్యం

భారత్‌ వృద్ధి కథనం బహుముఖీయమైనది, అది అనుభవాలు, ఉత్తమ ఆచరణలు, సాంస్కృతిక విజ్ఞానపు ప్రపంచ యవనిక. భారతదేశం పరిణామం చెందుతూనే, ప్రపంచానికి దోహదం చేస్తున్నప్పుడు ఇతర దేశాలు దానిని నుంచి నేర్చుకోవడానికి, అందిపుచ్చుకోవడానికి, సహకరించడానికి అత్యంత సంభావ్యత ఉన్నది. భారత వృద్ధి అన్నది ఒక నిరంతర కథనం.

అడుగడుగునా మన పురోగమన పథానికి సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. నిన్న మొన్న గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో నిర్మించి డైమండ్‌ బోర్స్‌ అమెరికాలోని పెంటాగన్‌ కన్నా అతిపెద్ద కట్టడమంటే దేనికి సంకేతం? ఎలాన్‌ మస్క్‌ నుంచి బ్లాక్‌ రాక్‌ సంస్థ వరకూ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నా యంటే, వారికి భారత్‌ వృద్ధి గమనంపై ఉన్న విశ్వాసమే కారణం కాదా? నిన్నటికి నిన్న ప్రపంచ ధనికులలో ఒకరైన ముఖేష్‌ అంబానీ రెండవ కుమారుడు అమిత్‌ అంబానీ వివాహానికి ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ దగ్గర నుంచి బ్లాక్‌రాక్‌ సంస్థ అధినేతలు, ప్రతినిధుల వరకు హాజరుకావడం కేవలం ఆ వివాహం ఎలా జరుగుతుందో చూడటానికే అనుకోవడం మన అమాయకత్వమే అవుతుంది. ప్రస్తుతం ఆర్థిక వృద్ధితో దూసుకుపోతున్న భారత్‌లో వారు పచ్చదనాన్ని చూసి ఇక్కడ పెట్టుబడి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చారు. ముఖేష్‌ అంబానీ శ్రీమతి నీతా అంబానీ డిస్నీల్యాండ్‌తో కలిసి ఒక మీడియా వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్టు కుమారుడి వివాహ సంబరాలకు ముందే వార్త రావడం కూడా సంకేతమే.

– డి. అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE