నరేంద్ర మోదీ గుజరాత్‌ నమూనాకు పోటీగా ద్రావిడ నమూనా అని డంబాలు పలుకుతూ, అనవసరమైన హడావిడి చేస్తున్న డీఎంకే ప్రభుత్వం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఆ వైఖరి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఉంది. మే, 2021లో అధికారం చేపట్టిన ఎం.కె. స్టాలిన్‌ ప్రభుత్వం, మూడేళ్లుగా అన్ని విధాలుగానూ వైఫల్యాన్ని మూటగట్టుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతి పెచ్చు పెరిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత సంవత్సరం మే నెలలో పీఎంఎల్‌ఏ చట్టం క్రింద అరెస్టు చేసిన మంత్రి సెంథిల్‌ బాలాజీకి ఇప్పటి వరకు బెయిల్‌ దొరకలేదు. రాబోయే రోజుల్లో ఇంకో ముగ్గురు మంత్రులు కటకటాల వెనక్కి పోయే అవకాశం ఉంది. గత డిసెంబర్‌లో, గనులు, ఖనిజ శాఖ మంత్రి కె. పొన్ముడి, అతడి భార్యకు మద్రాస్‌ హై కోర్టు మూడేళ్లు కారాగారశిక్ష విధించింది. మంత్రి పదవి కోల్పోయిన పొన్ముడి అతి కష్టం మీద బెయిల్‌ సంపాదించగలిగారు. తంగం తెన్నరసు, ఈవీ వేలు, పెరియసామి వంటి వారి మీద అవినీతి కేసులు ఇంకా నడుస్తున్నాయి.

డీఎంకే ప్రభుత్వంలో కాస్తో, కూస్తో మంచి పేరున్న వ్యక్తి డా॥ పళనివెల్‌ త్యాగరాజన్‌ (పీటీఆర్‌). మే 2021 నుండి మే 2023 వరకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి. ఆర్ధిక వ్యవస్థను ఒక గాడికి తెచ్చే ప్రయత్నం చేసాడు. చాలా వరకు విజయం కూడా సాధించాడు. మంచి ఆస్థిపరుల కుటుంబ నేపధ్యం, విదేశాల్లో పై చదువులు, ఉద్యోగం చేసిన అనుభవం ఉన్న పీటీఆర్‌ బలహీనత ఒక్కటే. నాలిక మీద నువ్వు గింజ నానదు. ఒక ఢల్లీి జర్నలిస్ట్‌తో జరిగిన టెలిఫోన్‌ సంభాషణలో ఈయన ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసాడు. ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌, అల్లుడు శబరీశన్‌ కలసి, రెండేళ్లలో దాదాపు ముప్ఫయి వేల కోట్లు అక్రమంగా సంపాదించారన్నదే ఆ ఆరోపణల సారాంశం. కరుణానిధి జీవిత కాలంలో సంపాదించిన డబ్బు, వీళ్లు కేవలం రెండేళ్లలో సంపాదించారని భాష్యం కూడా చెప్పాడు. ఈ రహస్య సంభాషణ టేపులనే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బయటపెట్టారు. ఇది జరిగిన కొద్దిరోజులకే పీటీఆర్‌ను ఆర్ధికశాఖ నుండి ఐటి శాఖకు పంపే శారు. దక్షత కలిగిన ఒకే ఒక మంత్రిని అలా మూలకు కూర్చోబెట్టారు. మంత్రులు, ఎంపీలపై జరుగుతున్న సీబీఐ, ఐటీ, ఈడీ దాడులతో సతమతమౌతున్న డీఎంకే ప్రభుత్వానికి గతవారం మరో పెద్ద దెబ్బ తగిలింది. పార్టీ కార్యకర్త ఒకరు మత్తుమందుల కేసులో ఇరుక్కునాడు.

మాదకద్రవ్యాల స్వాధీనం

ఫిబ్రవరి 15 వ తేదీన ఢల్లీి పోలీస్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) వారు పశ్చిమ ఢల్లీిలో కైలాశ్‌ పార్క్‌ ప్రాంతంలో ఉన్న గోదాముపై దాడి చేసి 50 కిలోల సుడోఎఫేడ్రిన్‌ లేక పీఎస్‌ఈ ను స్వాధీనం చేసుకొన్నారు. దాదాపు నాలుగు నెలల క్రితమే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ కస్టమ్స్‌ అధికారుల నుండి అందిన సమాచారం మేరకు ఈ ముఠా స్థావరాన్ని పసిగట్టగలిగారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు దొరికారు. చెన్నై వాసులు ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, ముఖేష్‌, విల్లుపురం వాసి అశోక్‌ కుమార్‌ పోలీసులకు పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడిరచారు. ఈ మొత్తం మాదక ద్రవ్య వ్యాపారానికి మూలపురుషుడు చెన్నై నివాసి జాఫర్‌ సాదిక్‌. ఇతడు డీఎంకేలో ప్రవాస విభాగం ముఖ్య నిర్వాహకుడు. తమిళ చలనచిత్ర నిర్మాత కూడా. అరెస్టు చేసేలోగానే తప్పించుకున్నాడు. ఎన్‌సీబీ అధికారులు వెతుకుతున్నారు. ఇతడి ఇల్లు తాళం వేసి ఉండగా, కార్యాలయంలో కూడా ఇతడి ఆచూకీ తెలిసిన వారు లేరు. 23వ తేదీన ఎన్‌సీబీ ఎదుట హాజరు కావలసిందిగా నోటీసు కూడా జారీ చేసారు. ఇప్పటి వరకు ఇతడి ఆచూకీ తెలియలేదు. ప్రాథమిక విచారణ మేరకు, ఈ గ్యాంగు గత మూడేళ్లుగా ఈ వ్యాపారం సాగిస్తున్నది. దాదాపు 3500 కేజీల పీఎస్‌ఈని వీరు పలు దేశాలకు ఎగుమతి చేసినట్లు అంచనా. ఒక కిలో పీఎస్‌ఈ వెల, దాదాపు కోటిన్నర రూపాయలు.

పీఎస్‌ఈ ముడి సరకు మాత్రమే. దీనిని ఉపయోగించి మెత్‌ (వీజున) అనే (వీవ్‌ష్ట్రaఎజూష్ట్రవ్‌aఎఱఅవ) అనే కృత్రిమ డ్రగ్‌ తయారుచేస్తారు. మెత్‌ ఉత్ప్రేరక ద్రవ్యం. అలసట చెందకుండా ఎక్కువ సేపు మెలకువగా ఉండేలా చేస్తుంది. ఇది ఒక కామోద్దీపన కోసం కూడా ఉపయోగిస్తారు. పబ్బులలో, పార్టీలలో ఇది తీసుకుని గంటల తరబడి గెంతుతారు. తపాలాబిళ్లలో పావువంతు ఉండే పట్టీని నాలుక క్రింద ఉంచుకొని రోజంతా మెలకువగా, ఉత్సా హంగా, శక్తివంతంగా ఉండవచ్చు. దీనిని ఇంజక్షన్‌ లేదా పీల్చడం ద్వారా కూడా తీసుకుంటారు.

మోడస్‌ ఆపరెండి

 జాఫర్‌ సాదిక్‌కు కొబ్బరి పొడి, సత్తు పిండి తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారం ఉంది. ఈ పదార్థాలతో బాటు పీఎస్‌ఈని కూడా కస్టమ్స్‌, పోలీసుల కన్ను గప్పి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, మలేషియా, శ్రీలంక , అమెరికా వంటి దేశాలకు ఎగుమతి జరుగుతూ ఉంటుంది. జాఫర్‌ సాదిక్‌కు చెన్నైలో ఒక కొరియర్‌ కంపెనీ, ఫుడ్‌ డెలివరీ కంపెనీ, పలు రెస్టారెంట్స్‌ ఉన్నాయి. వీటి మాటున డ్రగ్స్‌ వ్యాపారం గుట్టుగా జరిగిపోతుందని పోలీసుల అనుమానం. కొరియర్‌, డెలివరీ బాయ్స్‌ యంత్రాగాన్ని ఉపయోగించి డ్రగ్స్‌ చేరవేస్తున్నారని పోలీసుల అంచనా. సమగ్ర విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయి. జాఫర్‌ సాదిక్‌ సోదరులు సలీమ్‌, మైద్దులకు కూడా ఈ వ్యాపారాలలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రత్యేక పోలీసు బృందం వీరి కోసం గాలిస్తోంది. జాఫర్‌ సాదిక్‌ అతని తమ్ముళ్ల మీద లుక్‌అవుట్‌ నోటీసు కూడా జారీ అయింది.

జాఫర్‌ సాదిక్‌ నేపధ్యం

జాఫర్‌ సాదిక్‌ స్వస్థలం రామనాథపురం జిల్లా లోని కముది ప్రాంతం. ఇతని చిన్నతనంలోనే వీరి కుటుంబం చెన్నైలో స్థిర పడిరది. తండ్రికి బర్మా బజార్‌లో వీడియో కాస్సెట్లు, సీడీల దుకాణం ఉండేది. వీటితో బాటు విదేశీ వస్తువులు అమ్మేవారు. చిన్న హవాలా వ్యాపారం కూడా ఉండేది. వీరికి చెన్నైలోని శాంతోమ్‌ లో సొంత ఇల్లు, పరశువల్కమ్‌ లో కార్యాలయం కూడా ఉన్నాయి. వ్యాపారాలతో బాటు జాఫర్‌ సాదిక్‌ కుటుంబానికి రాజకీయ ప్రాపకం కూడా ఉంది. డీఎంకేలో పదవితో బాటు క్రియాశీలకంగా ఉండే జాఫర్‌ సాదిక్‌, తన తమ్ముళ్లను ‘విడుదలై చిరుతై కట్చి’ (వీఎస్‌కే)లో సభ్యులుగా చేర్పించాడు. ఇది డీఎంకే కూటమిలోని పార్టీ. పార్టీ చేసే ఏ కార్యక్రమానికైనా వీరు ధారాళంగా ఆర్ధిక సాయం అందజేసేవారు. విరాళాలు ఇస్తే ఆయా నాయకులతో ఫోటోలు దిగి, సోషల్‌ మీడియాలో పంచుకునేవారు. ఎంకే స్టాలిన్‌, ఉదయనిధి స్టాలిన్‌తో బాటు వీఎస్‌కే నాయకుడు తిరుమావళవన్‌ తో దిగిన ఫోటోలు, చేసుకున్న ట్వీట్లు ఇప్పటికి సోషల్‌ మీడియా దర్శనమిస్తాయి. అంతేకాదు, తమిళ సినిమా రంగ ప్రముఖులతో వీరికి మంచి సంబంధాలున్నాయి. ఇటీవల తమిళనాడు డీజీపీ శంకర్‌ జివాల్‌ చేతుల మీదుగా జాఫర్‌ సాదిక్‌ ఒక సత్కారాన్ని కూడా అందుకున్నాడు.

జాఫర్‌ సాదిక్‌, అతని సోదరుల పేరిట జేఎస్‌ఎం పిక్చర్స్‌ అనే సినిమా నిర్మాణ సంస్థ ఉంది. ఇది ఏక వ్యక్తి సంస్థగా డిసెంబర్‌,2021లో నమోదైన ఈ కంపెనీకి ఏకైక డైరెక్టర్‌ జాఫర్‌ సాదిక్‌. ‘ఇరైవన్‌ మిగ పెరియవన్‌’ (దేవుడు చాలా గొప్పవాడు) అనే చిత్ర నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు ఆమీర్‌. ఈయన ఇప్పటికే నాలుగు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇది ఐదవ చిత్రం. ఆమీర్‌కు జాఫర్‌ సాదిక్‌తో బంధుత్వం ఉంది. వీరిద్దరూ భాగస్వాములుగా కొన్ని హోటళ్లు నడుస్తున్నాయి. డ్రగ్స్‌ విషయం బయటకు వచ్చిన తరువాత, దర్శకుడు ఆమీర్‌ పూర్తిగా చేతులు దులిపేసుకున్నారు. జాఫర్‌ సాదిక్‌ గురించిన విషయాలు విని తానూ కూడా దిగ్భ్రాంతికి గురైనానని, తానెప్పుడూ ఇటువంటి దురాచారాలను ప్రోత్సహించనని తెలిపాడు. అయితే ఆమీర్‌ మాటలు నమ్మశక్యంగా లేవని ఒక వర్గం మీడియా చెబుతోంది. ఆమీర్‌ గతంలో పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసాడు. అవకాశం దొరికినప్పుడల్లా తీవ్రవాద సంస్థలకు మద్దతుగా వితండ వాదం చేసేవాడు. ఆమీర్‌తోనే కాదు, కొందరు హీరోలు, దర్శకులతో కూడా జాఫర్‌ సాదిక్‌ కు సంబంధా లున్నాయనేది తమిళ సినిమా రంగంలో చెప్పుకునే మాట. పూర్తి వివరాలు సమగ్ర విచారణ తరువాతే తెలుస్తాయి. తమిళ సినీ ప్రముఖుల నుండి ఈ విషయముపై ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. ప్రతి చిన్న విషయానికి మోదీని , బీజేపీని తిట్టే కమల హాసన్‌, సూర్య వంటి హీరోలు, ప్రకాష్‌ రాజ్‌ లాంటి నటులు ఈ విషయంలో మౌనం వహించి, ఏమి జరగనట్లుగా వ్యవహరించడం ఏమిటంటూ సామాన్య ప్రజలే నిలదీస్తున్నారు.

డీఎంకే ప్రభుత్వానికి కోర్టుల్లో చుక్కెదురు

జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశన్‌ పేరు వింటేనే డీఎంకే నేతలకు నిద్ర పట్టదు. మద్రాసు హైకోర్టు జడ్జిగా ఆనంద్‌ వెంకటేశన్‌ వ్యవహరించే తీరు ఆయనను తమిళ ప్రజలకు చేరువ చేసింది. డీఎంకే నేతలకు సంబంధించిన కొన్ని కేసులను ఆయన సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించారు. క్రింది కోర్టులలో తమ అధికార బలాన్ని ఉపయోగించి బయటకొచ్చినా, హైకోర్టుల్లో వీరి ఆటలు సాగటం లేదు. మంత్రులు కే.కే.ఎస్‌.ఎస్‌.ఆర్‌.రామచంద్రన్‌, తంగం తెన్నరసు, మాజీ మంత్రి శ్రీమతి వలర్మతి, మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీరుసెల్వం వంటి నాయకులపై సుమోటో కేసులు చేపట్టింది ఈయనే. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ కూడా ఈ విషయంపై జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశన్‌ అభినందించారు.

దిక్కు తోచని స్థితిలో డీఎంకే ప్రభుత్వం

ఒక వైపు అన్నామలై ప్రభంజనం, మరోవైపు అవినీతి కేసుల్లో కూరుకుపోతున్న మంత్రులు, కుంటుపడ్డ పాలక వ్యవస్థ కారణంగా నానాటికి ప్రజాదరణ కోల్పోతున్న డీఎంకే ప్రభుత్వానికి, డ్రగ్స్‌ వ్యవహారం రాబోయే రోజుల్లో పెద్ద నష్టాన్నే కలిగించ వచ్చు. జాఫర్‌ సాదిక్‌ గురించిన వార్త వెలువడిన వెంటనే, డీఎంకే అతడిని పార్టీ పదవుల నుండి తొలగించి, ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇంతకుమించి పార్టీ నుండి అధికార పూర్వకంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. డీఎంకేకు వత్తాసు పలికే మీడియా కూడా ఈ విషయాలను తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. జాఫర్‌ సాదిక్‌ గురించి ప్రస్తావించినప్పుడు అతడు ఒక సినీ నిర్మాత అని అంటున్నారే తప్ప, అతడు డీఎంకే కార్యకర్త అని ఎక్కడా అనడం లేదు.

జాఫర్‌ సాదిక్‌ అతని తమ్ముళ్లు దొరికితే పలు సంచలనాత్మక విషయాలు బయటపడే అవకా శాలున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం గనుక జాఫర్‌ సాదిక్‌కు ప్రాణాపాయం ఉంది. బీజేపీ నాయకుడు అన్నామలై తప్ప ఇతర ప్రతిపక్ష నాయకులు ఇంతవరకు పెద్దగా స్పందించలేదు. రాబోయే రోజుల్లో డీఎంకే ఈ విషయంపై ఎలా సంజాయిషీ ఇచ్చుకుంటుందో చూడాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దీని ప్రభావం బాగానే ఉంటుంది.

ఎన్నికల ఫలితాలను అటుంచితే, ఈ మాదక ద్రవ్యాల కారణంగా నిర్వీర్యమౌతున్న మన యువతరాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఎవరూ కాదనలేరు. పిల్లలను సక్రమంగా పెంచడమే కాదు, వారికి మనం ఉజ్జ్వల భవిష్యత్తును కూడా కలిగించాలి. దానికి దోహదం చేసే నాయకులను, పార్టీలను ప్రోత్సహించాలి.

– ఎ. రాధాకృష్ణ, విశ్రాంత బ్యాంక్‌ అధికారి

About Author

By editor

Twitter
YOUTUBE