సంఘ వివిధ క్షేత్రాల తరఫున పనిచేసే మహిళల సమన్వయంతో పాటు, సమాజంలోని వివిధ రంగాల మహిళలను ఒక్క త్రాటిపై తీసుకు రావడం కోసం నిర్వహించినవే మహిళా సమ్మేళ నాలు. మహిళా సమన్వయ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 450 మహిళా సమ్మేళనాలు నిర్వహించారు. 20 లక్షలకు పైగా మహిళలు వీటిలో భాగస్వాములయ్యారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 13 ప్రాంతాలలో శ్రీకాకుళం, విశాఖపట్నం, పాడేరు, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూల్‌లలో మహిళా సమన్వయం ఆధ్వర్యంలో నారీశక్తి సమ్మేళనాలు జరిగాయి. దాదాపు 40 వేలకుపైగా వ్యాపార, విద్య, వైద్య, సామజిక, న్యాయ, ధార్మిక, క్రీడా రంగాలతో పాటు వివిధ రంగాల ఉన్న మహిళలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. నారీశక్తి సమ్మేళన లక్ష్యాన్ని చర్చించుకున్నారు.

పెరుగుతున్న సనాతన ధర్మ చైతన్యానికి నిదర్శనంగా 16000కు పైగా మహిళలు ఈ సమ్మేళనాలలో పాల్గొన్నారు. మహిళలలో చైతన్యం కలిగించడం ద్వారా భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, వివిధ రంగాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కారాలను కనుగొనడం, మహిళలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం లాంటి లక్ష్యాలను సాధించేందుకు నారీశక్తి సమ్మేళనం నిర్వహించారు. మన దేశం బాగుండాలి మన  ధర్మం బాగుండాలి అని ఆలోచించే మహిళలను ఏకం చేయడానికి జరిపిన సమ్మేళనమే నారీశక్తి.

వైదిక కాలంనుండి ప్రఖ్యాతి పొందిన స్ఫూర్తి వంతమైన మాతృమూర్తుల గొప్పతనాన్ని పట్టి చూపే ప్రదర్శనను నిర్వహించారు. కార్యక్రమం కూడా ప్రత్యేక పంథాలో నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం నాలుగు వరకు జరిగిన ఈ సమ్మేళనాలలో వివిధ రంగాలలోని ప్రముఖులు ముఖ్య అతిథులుగా, వక్తలుగా పాల్గొన్నారు.

సనాతన ధర్మ విశిష్టత, మన భారతీయతలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత, భారతీయ మహిళ ఎంత శక్తిమంతురాలిగా, పరాక్రమ వంతురాలిగా ఉన్నది ఇక్కడ చర్చించారు. ఇతర మతాలలో స్త్రీకి లేని కనీస స్వేచ్ఛ గురించి వక్తలు తెలియచేశారు. వీటితో పాటు మన దేశంపై, ధర్మంపై, సాంస్కృతిక వారసత్వంపై జరుగుతున్న అంతర్గత, విదేశీ దాడులను ఏ విధంగా త్రిప్పి కొట్టాలి తదితర అంశాలు తెలియచేశారు. ఇవన్నీ మొదటి కాలాంశంలో భాగం.  అంతటి  పరాక్రమ భారతీయ మహిళ పరంపరను కొనసాగిస్తూ నేటి భారతీయ స్త్రీ ఏవిధంగా అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందో కూడా చర్చించారు. రాబోయే 25 సంవత్సరాల అమృత కాలంలో దేశ వారసత్వ, సాంస్కృతిక, ఆర్ధిక, సామాజికాభివృద్ధిలో నారీశక్తి భాగస్వామ్యం అత్యంత కీలకమని, దేశంలోని ప్రతీ మహిళా ఆర్ధిక, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక స్వావలంబన సాధించిననాడే భారత దేశం వికసితమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. మహిళ తనను తాను చైతన్యపరచుకుని, నాయకత్వ లక్షణాలను పెంచుకుని, సేవా, దాతృత్వం, సహృద యతతో నేటి కాలపు అవకాశాలను అందిపుచ్చు కుంటూ, కుటుంబ, సమాజ, దేశ కార్యంలో నియుక్తురాలు కావాల్సిన సమయం ఆసన్నమయినది అన్న అంశాలతో రెండవ కాలాంశం జరుగగా, వివిధ రంగాలలోని మహిళలకు ఉన్న సమస్యలు-పరిష్కా రాలు అనే చర్చా గోష్టితో సమ్మేళనాలు ముగిసాయి.

ఆధునిక మహిళకు అన్ని రంగాలలోను సమాన ప్రాతినిధ్యం దక్కుతోంది. కొవిడ్‌ వైరస్‌కి టీకా కనుగొనడంలో భారతీయ మహిళ పాత్ర ఉంది. భారత చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు చంద్రయాన్‌-3 విజయం. అందులో మహిళా శాస్త్రవేత్తల సహకారం ఈ దేశం మర్చిపోదు. ఒకప్పుడు మహిళలకు కనీస ప్రవేశం లేనటువంటి రక్షణ దళాలలో నేడు మహిళలకు అత్యున్నత బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తోపుడు బండ్ల వ్యాపారం చేసే మహిళ సైతం యూపీఐ డిజిటల్‌ లావాదేవీలను నిర్వహిస్తున్నారు. మహిళలు సమర్ధవంతంగా ఇటు కుటుంబ, సమాజ బాధ్యతను నిర్వహిస్తూ, సంస్కారవంతమైన పిల్లలను దేశానికి అందిస్తున్నారు. ఇంతటి శక్తి కలిగిన మహిళల సంఘటిత చైతన్యం భారత దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలుపుతుంది అనడంలో సందేహం లేదు.

–  యామిని సాదినేని


తెలంగాణలో

అఖిల భారత స్థాయిలో మహిళా సమన్వయ యోజనకనుగుణంగా తెలంగాణ ప్రాంతంలో జనవరి, ఫిబ్రవరి మాసాలలో మహిళాశక్తి సమ్మేళనాలు జరిగాయి. మూడు నెలల ముందే తయారీగా జిల్లా, విభాగ్‌ స్థాయిలలో సంచలనా సమితులను ఏర్పాటుచేసి ఆహ్వానిత శ్రేణులను నిర్ణయించి ఆహ్వానిత సూచీని తయారుచేశారు. ప్రాంతంలో మొత్తం 67 సమ్మేళనాలు జరిగాయి. ప్రతి సమ్మేళనానికి స్వాగత సమితిని ఏర్పాటుచేశారు. ప్రాంతంలో 261మంది ప్రతిష్ఠిత మహిళలు స్వాగత సమితిలో సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలలో ఉన్నత పదవులలో ఉన్న 66మంది మహిళలు ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సమ్మేళనాలలో 17,944మంది మహిళలు పాల్గొనగా 37మంది మహిళలు తమ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలలో సంగోష్ఠులతో మార్గదర్శనం చేశారు. భారతీయ ఆలోచనా విధానం మహిళల పాత్ర, దేశ నిర్మాణంలో మహిళల పాత్ర అనే అంశాలపై ప్రసంగాలతోపాటుగా ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో మహిళల భాగస్వామ్యతపై సంగోష్ఠులు జరిగాయి. ఆ సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను గురించి కూడ ఆలోచన జరిగింది. క్రీడ, కళా, సాహిత్య, సామాజిక రంగాలలో ప్రముఖులను  కొన్ని సమ్మేళనాలలో సన్మానించారు.

జస్టిస్‌ మాధవీలత, అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ సంగీతారెడ్డి, పదశ్రీ శోభారాజు, ఇస్రో డిప్యూటి ఛైర్మన్‌ ఉమారాణి, నైనా జైస్వాల్‌ మొదలగు ప్రముఖ మహిళలు పాల్గొని సమ్మేళనాలకు శోభను కలిగించారు.

About Author

By editor

Twitter
YOUTUBE