‘సముద్రగర్భంలో ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థనలు చేయడం అలౌకికమైన అనుభవం. నాకు ఆ కాలానికి వెళ్లిన అనుభూతి కలిగింది’ అరేబియా సాగరంలలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో కృష్ణభగవానుని ప్రార్థించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల స్వరాష్ట్రం గుజరాత్‌లో అరేబియా జలాలలోకి వెళ్లారు. ఈ వార్త సంచలనం కలిగించింది. ఆ తరువాత ఎక్స్ ఖాతాలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కృష్ణునికి సంప్రదాయబద్ధంగా సమర్పించే నెమలి పింఛాలను కూడా ఆయన తీసుకువెళ్లారు. ప్రధాని వెంట నిపుణులైన డైవింగ్ సిబ్బంది ఉన్నారు. సముద్రగర్భంలో దిగడానికి ఉపయోగించే శిరస్త్రాణం, ఇతరు దుస్తులు కూడా ప్రధాని ధరించారు.
బేట్ ద్వారక లేదా శంకోధర్ అని ఈ ద్వీపాన్ని పిలుస్తారు. కంసుని వధించిన తరువాత కృష్ణుడు ఇక్కడికే వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. మహాభారతంలోను, స్కాంద పురాణంలోను ఈ ద్వీపం ప్రస్తావన ఉంది. తన మిత్రుడు సుధాముడిని కృష్ణుడు ఇక్కడే కలుసుకున్నాడని కూడా ప్రతీతి. ఇక్కడి ద్వారకాధీశుని ఆలయం 2500 సంవత్సరాల క్రితం నిర్మించారని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దీనిని కృష్ణ భగవానునికి అంకితమిచ్చారు. దీనినే మహమ్మద్ బేగాదా ధ్వంసం చేశాడు. మళ్లీ 16వ శతాబ్దంలో పునర్ నిర్మించారు. ద్వారకా పీఠానికి ఇది దగ్గరగా ఉంటుంది. ఈ పీఠం శంకర భగవత్పాదులు ఏర్పాటు చేశారు.
ఇక్కడి ఆలయం గురించి సముద్రంలోను, తీరంలోను కూడా భారత పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. 1963లో జరిగిన తొలినాటి తవ్వకాలలో కొన్ని పురాతన వస్తువులు బయటపడ్డాయి.
ఇటీవలి తన దక్షిణ భారతదేశ యాత్రలో నరేంద్ర మోదీ దక్షిణ భాగం చివరిలో ఉన్న శ్రీ అరుల్‌మిగ రామనాథస్వామి (రామేశ్వరం) ఆలయాన్ని సందర్శించారు. తన భారతీయ ఆలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ప్రధాని గుజరాత్‌లోని సముద్రగర్భంలోని కృష్ణుడి క్షేత్రాన్ని దర్శించారు. ద్వారక గురించి భారతంలోను, రామేశ్వరం గురించి రామాయణంలోను ప్రస్తావనలు ఉంటాయి.
ప్రధాని మోదీ ఫిబ్రవరి చివరి వారంలో స్వరాష్ట్రంలో పర్యటించారు. రూ. 4,150 కోట్లతో ద్వారక వద్ద చేపట్టే పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. పూర్తయిన కొన్ని పథకాలను జాతికి అంకితం చేశారు. దేశంలోనే అతి పొడవైన కేబుల్ స్టేడ్ వంతెనను ఆయన జాతికి అంకితం చేశారు. ఓక్లా నౌకాశ్రయం, బేట్ ద్వారకాలను కలిపే 2.32 కిలోమీటర్ల ఈ వంతెనను రూ.980 కోట్లతో నిర్మించారు. ఇదే సుదర్శన్ వారధి.ఈ వారధి నిర్మాణంతో బేట్ ద్వారకకు వెళ్లేవారికి సదుపాయంగా ఉంటుంది. భగవద్గీతలోని సన్నివేశాలను గుర్తు చేసే చిత్రాలతో, సోలార్ పేనల్స్‌తో దీనిని నిర్మించారు.
అయోధ్యలో ఈ జనవరి 22న జరిగిన బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రత్యేక దీక్ష వహించిన నరేంద్రమోదీ తన దక్షిణ భారత యాత్రలో పలు ఆలయాలను సందర్శించారు.
తమిళనాడులోని రామేశ్వరంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. ఇటీవల మధుర మీనాక్షి ఆలయాన్ని కూడా దర్శించారు. ఆలయ పర్యాటక అభివృద్ధే ధ్యేయంగా ఆయన తన అధికారిక కార్యక్రమంలో ఆలయాల సందర్శనను కూడా భాగం చేశారనిపిస్తుంది.
బేట్ ద్వారక ద్వీపంలో పురాతన కృష్ణాలయం ఒకటి ఉంది. ఇంకా హనుమ, విష్ణు, శివ, లక్ష్మీనారాయణ, జాంబవతీదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. దేవభూమిగా పిలిచే ద్వారక యాత్రలో ఈ వంతెన ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో పర్యాటకం మరింత అభివృద్ధి కావడానికి ఇంకొంత కృషి కూడా అవసరం. ఈ ప్రదేశం పాకిస్తాన్ సంబంధాలకు సంబంధించి వ్యూహాత్మకమైనది.