ఇది ఔరంగజేబ్‌, ఇతర ముస్లిం పాలకులు మధ్యయుగాలలో విధించిన జిజియా పన్నుకు ఏమాత్రం తక్కువ కాదు. హిందు వ్యతిరేకతను బహిరంగంగానే ప్రదర్శిస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం హిందూ ఆలయాలపై పన్నులు విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  హిందూ ఆలయాల మీద మాత్రమే పన్ను వేయడం లౌకికవాదానికి, సమానత్వానికి పూర్తి విరుద్ధం. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు బీజేపీ వ్యతిరేకతతో తోక ముడిచినా, కాంగ్రెస్‌ ‌పార్టీ మొండిగా సమర్ధించుకుంటూ, మరోసారి చూస్తామని నిస్సిగ్గుగా ప్రకటించింది. కర్ణాటకలో టిప్పుకు ప్రాణప్రతిష్ఠ చేశారని అనిపిస్తుంది. హిందువుల ఓట్లతోనే నెగ్గినా, వారి హక్కులు, మనోభావాలు కాంగ్రెస్‌ ‌పార్టీకి పూచికపుల్లలతో సమానం. హిందూ ఆలయాల మీద పన్ను ప్రతిపాదన ఇందుకు తాజా ఉదాహరణ.

మైనారిటీలను బుజ్జగించడానికి హిందువుల ప్రయోజనాలను పణంగా పెట్టడం కాంగ్రెస్‌ ‌పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వం చేపట్టిన ఏ పథకాలు, కార్యక్రమాలైనా తొలి ప్రయోజనం ముస్లింలకే అని మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ ‌నిస్సిగ్గుగా ప్రకటిం చారు. వాస్తవానికి ఈ విధానాలు నెహ్రూ, ఇందిర కాలం నుంచి ఉన్నాయి. ప్రజలు కాంగ్రెస్‌ ‌పార్టీని తిరస్కరించినా, ఈ విధానాన్ని మార్చుకోలేదు.

ఫిబ్రవరి 16న కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. అందులో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధి కోసం రూ.100కోట్లు, క్రైస్తవుల సంక్షేమం కోసం రూ. 200 కోట్లు కేటాయించింది. సిక్కులు, జైన్‌, ‌మొదలైన ఇతర మైనారిటీ వర్గాలకు కేటాయింపులు చేసింది. హిందువుల సంక్షేమం ప్రస్థావనే లేదు.

గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కిన కన్నడ కాంగ్రెస్‌  ‌దగ్గర వీటిని అమలు చేయడానికి తగిన నిధులు లేవు. అందుకే రకరకాల పన్నులను వేయాలని నిర్ణయించుకుంది. హిందూ వ్యతిరేకతను నరనరానా జీర్ణించుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మైనారిటీల మెప్పు పొందడానికి మరో ఘనకార్యం చేశారు. వారి కన్ను హైందవ ధార్మిక క్షేత్రాల మీద పడింది.

హిందూ వ్యతిరేక పన్ను

కర్ణాటక అసెంబ్లీ దేవాలయాలపై పన్ను విధించే బిల్లు ‘హిందూ మత సంస్థలు&ధర్మాదాయ (సవరణ) బిల్లు- 2024’ను ఆమోదించింది. దీని ప్రకారం రూ. కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో 10 శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఆదాయం ఉన్న ఆలయాల నుంచి 5 శాతం తీసుకుంటుంది. ఈ నిధిని ‘ధార్మిక పరిషత్‌’ ‌పేరుతో వసూలు చేస్తుంది. ఈ నిధులను చిన్న దేవాలయాలతో పాటు ‘ఇతర’ పనులు చేపడతా మంటోంది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం

ఈ బిల్లులో రెండు ప్రమాదకర క్లాజులు ఉన్నాయి. సెక్షన్‌ 19ఏ ‌ప్రకారం ఇలా వసూలు చేసిన పన్నును ప్రజోపయోగపనులకు ఉపయోగిస్తారు. అయితే ఆ పనులు ఏమిటి అన్నది మాత్రం చెప్పలేదు. సెక్షన్‌ 25 ఇం‌కా ప్రమాదం. దీని ప్రకారం హిందూ మతానికి చెందని వ్యక్తులు కూడా దేవాదాయ శాఖలో ఉద్యోగులుగా చేరొచ్చు. హిందు ఆలయాలపై మాత్రమే పన్ను విధిస్తూ, ఇతర మతాల ప్రార్థనాలయాలను మినహాయించడం వివాదా స్పదంగా మారింది. అదీ కాక బిల్లులోని క్లాజుల ప్రకారమే దేవాలయాల దగ్గర వసూలు చేసిన పన్నును ప్రభుత్వం ఏ విధంగా అయినా ఉపయో గించుకునే అవకాశం ఉంది. పథకాలకు  మళ్లించే అవకాశం లేకపోలేదు.

ఈ నిధులను ధార్మిక పరిషత్‌ ‌ప్రయోజనాల కోసం, ఆర్థికంగా వెనుకబడిన అర్చకుల సంక్షేమం, వారి పిల్లలకు విద్యా సౌకర్యం, చిన్న దేవాలయాల అభివృద్ది కోసం ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా బిల్లులో మాత్రం ఆ మాటలు చేర్చలేదు. సెక్షన్‌ 19ఏ ‌క్లాజ్‌ ‌ప్రకారం వసూలు చేస్తే ఆ ధనాన్ని ముస్లింలు, క్రైస్తవుల సంక్షేమ కార్యక్రమాలకు, స్కాలర్‌షిప్‌లు ప్రార్ధనాలయాలకు, షాదీఖానాలు, మదరసాలు, చర్చి గోడల నిర్మాణాలకు కూడా ఉపయోగించే అవకాశం ఉంది. సెక్షన్‌ 25 ‌ప్రకారం హైందవేతరులను ఆలయాల్లో ఉద్యోగులుగా, అధికారులుగా నియమిస్తే వారి నుంచి ఏ విధమైన ధార్మిక విధులను ఆశించగలం? ఫిబ్రవరి 19న ప్రభుత్వం కర్ణాటక శాసనసభలో ఈ బిల్లు ప్రవే శపెడితే 22న ఆమోదం పొందింది. అసెంబ్లీలో మొత్తం 224 సభ్యులు ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు 135 సభ్యుల సంఖ్యాబలం ఉంది. స్పష్టమైన మెజారిటీ ఉన్నందున తేలికగానే నెగ్గింది. అయితే శాసనసమండలి (కౌన్సిల్‌)‌కు ఈ బిల్లు రాగానే పరిస్థితి తారుమారయింది. మొత్తం కౌన్సిల్‌లో 75 సభ్యులు ఉంటే కాంగ్రెస్‌ ‌సభ్యులు 30 మంది మాత్రమే.. బీజేపీకి 34 మంది, జేడీఎస్‌ 8 ‌మంది, ఒక ఇండిపెండెంట్‌ ఉన్నారు. వీరంతా వ్యతిరేకించడంతో ప్రభుత్వ వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ ఏ విధంగానైనా పంతం నెగ్గించుకోవాలని పట్టుదలతో ఉంది.

ఈ బిల్లును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. హిందూ వ్యతిరేక విధానాలను అవలంబించి,  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఖజానా నింపుకోవాలని చూస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బిఎస్‌ ‌విజయేంద్ర విమర్శించారు. హిందూ దేవాలయాల మీదనే ఈ పన్ను ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లు ద్వారా కాంగ్రెస్‌పార్టీ కొత్తగా తన దిగజారుడుతనాన్ని బయట పెట్టుకున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు రాజీవ్‌ ‌చంద్రశేఖర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ ‌దిగజారుడు తనానికి ఈ బిల్లు  మచ్చుతునక అని పేర్కొన్నారు. ఏమైనా ఈ బిల్లు న్యాయ సంబంధ సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మత స్వాతంత్య్రానికి భంగం కలిగిస్తుందనే విమర్శలు చెలరేగుతున్నాయి. మరోవంక, కర్ణాటకలో విశేష ప్రాబల్యంగల ధార్మిక సంస్థలు, పీఠాలతో ప్రభుత్వ సంబంధాలు సహితం దెబ్బతినేందుకు దారితీయ వచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

కరసేవక్‌ ‌పూజారి అరెస్టు

కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రావడంతోనే ఈ హిందూ వ్యతిరేక ధోరణిని మొదలు పెట్టింది. హిందుత్వం అంటేనే ఉలిక్కి పడుతోంది. దేశమంతా అయోధ్య  ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సందడిలో ఉండగా, కర్ణాటక ప్రభుత్వం కరసేవలను గుర్తించి హింసించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా హుబ్బలి-ధార్వాడ్‌ ‌పోలీసులు శ్రీకాంత్‌ ‌పూజారి అనే కరసేవకుడిని అరెస్టు చేశారు. 1992 నుండి పరారీలో ఉన్నాడని, ఇప్పుడు దొరికినందున అరెస్టు చేశామని ఆయనపై అభియోగం. గత 31ఏళ్లలో పూజారిపై 16 కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి శ్రీకాంత్‌ ‌పూజారి అదే నగరంలో గత 31 ఏళ్లుగా ఉంటూ, బహిరంగంగానే తిరుగుతున్నారు.పైగా ఆ పూజారి పూర్వికుల ఇంట్లో నివాసం ఉంటూ జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్నాడు. 2004, 2009, 2018లో పూజారికి పోలీసులు సమన్స్ ‌పంపారని చెబుతున్నారు. మరి అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం 1992లో హుబ్లీలో జరిగిన హింసా కాండలో ఆయన ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని, ఈ అరెస్టు ప్రతీకార చర్య కాదని ముఖ్య మంత్రి  సమర్ధించుకున్నారు. కర్ణాటక బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు నిరసనలు చేపట్టింది. బీజేపీ ఎమ్మెల్యే వి.సునీల్‌కుమార్‌ ‌తాను కూడా కరసేవకుడినే, తన•ను అరెస్ట్ ‌చేయండంటూ ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేయడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

కాషాయ పతాక వివాదం

మాండ్యా జిల్లాలోని కేరగోడు గ్రామంలో 108 అడుగుల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దానికి హను మంతుని రూపం ఉన్న కాషాయ ధ్వజం ఎగుర వేశారు. ఈ జెండా ఏర్పాటులో చుట్టుపక్కల ఉన్న 10కి పైగా గ్రామాల ప్రజలు భాగస్తులయ్యారు. పోలీసులు వచ్చి దాన్ని దించేశారు. ఈ ఘటనపై అక్కడి గ్రామాల ప్రజలంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. ఇక్కడ జాతీయ పతాకం ఏర్పాటు కోసం అనుమతి తీసుకొని కాషాయ జెండా ఎగురవేశారు అని ప్రభుత్వం వాదన. అయితే 15 ఆగస్టు, 26 జనవరి సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఆ తర్వాత కాషాయ ధ్వజంకోసం ఉపయోగించుకుంటామని ప్రజలు స్పష్టం చేశారు. బీజేపీ, బజ్రంగ్‌ ‌దళ్‌, ‌హిందుత్వవాదులు కాషాయ జెండాలు ఎగురవేసి మతపరమైన ఉద్రిక్తతలు రేపుతున్నారని, దీన్ని అనుమతించబోనని సీఎం సిద్ధరామయ్య హుంకరించారు. కానీ బెంగళూరు, మైసూరు సహా అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆకుపచ్చ జెండాలు ఎగురుతున్నాయి.

బజ్రంగ్‌ ‌దళ్‌ను నిషేధిస్తారట

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ తన మేనిఫెస్టోలో బజ్రంగ్‌దళ్‌ను నిషేధిత ఇస్లామిక్‌ ‌సంస్థ పీఎఫ్‌ఐతో కలిపి నిషేధిస్తామని ప్రకటించింది. బీజేపీ ఈ ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ తన ప్రచార సభలో బజరంగ్‌ ‌భలీని నిషేధిస్తారా అంటూ దుమ్మెత్తి పోశారు. ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో ప్రజలచేత బజరంగ్‌దళ్‌ ‌నినాదాలు చేయించారు. దీంతో కాంగ్రెస్‌ ‌పార్టీ ఉలిక్కిపడింది. అలాంటిది తమ పార్టీ మేనిఫెస్టోలో లేదంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ వివరణ ఇచ్చు కున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ ‌నాటి అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ‌హనుమాన్‌ ఆలయాలను సందర్శించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు

టిప్పు వివాదం

బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో నిలిపివేసిన టిప్పు జయంతి ఉత్సవాలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిరిగి నెత్తికెక్కించుకుంది. మైసూరు లేదా శ్రీరంగపట్నంలో 100 అడుగుల టిప్పు విగ్రహాన్ని ప్రతిష్టించే యోచన ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్వీర్‌ ‌సైత్‌ ‌చేసిన ప్రకటన కలకలం రేపింది. నిజంగా విగ్రహం పెడితే బాబ్రీ మసీదులా కూల్చివేస్తామని శ్రీరామ్‌సేన అధినేత ప్రమోద్‌ ‌ముతాలిక్‌ ‌హెచ్చ రించారు. బెంగళూరు నగర నిర్మాత కెంపెగౌడ పేరు మీద ఉన్న విమానాశ్రయం పేరును టిప్పుసుల్తాన్‌ ‌విమానాశ్రయంగా మార్చాలని గతంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రకటించడం కూడా వివాదాస్పమైంది.

ఆలయాలపై పెత్తనం ఎందుకు?

దేశంలో అత్యధిక ఆలయాలు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటకది నాలుగో స్థానం. రాష్ట్ర వ్యాప్తంగా 34,563 ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఏడాదికి రూ.25 లక్షల కన్నా అధిక ఆదాయం ఉన్న ఆలయాలు 205 మాత్రమే. ఇక రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలు 139. 34,219 ఆలయాల ఆదాయం ఏడాదికి రూ. 5 లక్షల లోపు మాత్రమే. ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగులు జీతభత్యాలు, నిత్య ధూపదీప నైవేద్యాలు, నిర్వహణ చిన్న ఆలయాలకు భారంగా మారుతోంది. ఇతర మతాల వారి ప్రార్ధనా స్థలాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. హిందూ దేవాలయాలపై మాత్రమే ప్రభుత్వం పెత్తనం చేస్తుంది. హిందూ దేవాలయాలకు వచ్చిన విరాళాలపై ప్రభుత్వానికి ఆదాయ పన్ను కట్టవలసి ఉంది. దేవాలయ ఆర్థిక వనరులపై ప్రభుత్వ పెత్తనం ఉంది.

మైనారిటీల ప్రార్ధనా స్థలాల నిర్వహణలో వారికే పూర్తి అధికారాలున్నాయి. అవి ఎలాంటి పన్నులు చెల్లించనవసరం లేదు. వారు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, ఇతర సంస్థలపైన ప్రభుత్వ పెత్తనం పరిమితమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిందూ ఆలయాల ద్వారా వచ్చిన ధనాన్ని ఇతర మత సంస్థల నిర్వహణ కోసం ఖర్చుపెడుతున్నారు. కర్ణాటకలో దేవాలయాల నుంచి వచ్చే నిధులను మదర్సాల నిర్వహణకు, క్రైస్తవ చర్చిల నిర్వహణకు, హజ్‌యాత్రికుల ప్రయాణ సబ్సిడీలకు ఖర్చు పెడ్తున్నారు. ఒక్క కర్ణాటకలో మాత్రమే కాదు. హిందూ ఆలయాలపై రాజకీయ పెత్తనానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉంది.

క్రాంతి

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE