జమిలి ఎన్నికల నిర్వహణే శ్రేయస్కరమని ఉన్నతస్థాయి కమిటీ మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించించిన నివేదికలో స్పష్టం చేసింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీని నియమించిన సంగతి తెలిసినదే. నిజానికి అందుబాటులో ఉన్న కొద్ది వనరులను గరిష్ఠంగా వినియోగించుకోవడం, అధికసంఖ్యలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా చేయడం అనే లక్ష్యాల సాధనకు వీలుగా అధ్యయనం కోసం ఈ ఉన్నతస్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 23, 2023న ఏర్పాటు చేసింది. ఏకగ్రీవ నిర్ణయంతో కమిటీ రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. నివేదికలోని 18,629 పేజీలలో 321 పేజీలను మాత్రం బయటపెట్టడం గమనార్హం.
జమిలి ఎన్నికలు మొత్తం ఎన్నికల పక్రియతో పాటు, పాలనా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తాయని కమిటీ అభిప్రాయపడింది. దీనిపై ఈ స్పష్టమైన నిర్ణయానికి రావడానికి ముందు కమిటీ 191రోజుల పాటు విస్తృత అధ్యయనం నిర్వహిం చింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరుదేశాల్లో అంటే దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండొనేసియా దేశాల్లో అమల్లో ఉన్న జమిలి ఎన్నికల పక్రియను కమిటీ అధ్యయనం చేసింది. వివిధ రాజకీయ పార్టీలు, సుప్రీం కోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లతో వ్యక్తిగతంగా సంభాషించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తులు జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే, జస్టిస్ యు.యు.లలిత్‌లతో పాటు 9 మంది హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు జమిలి ఎన్నికలను సమర్థించారు.
ముగ్గురు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయ మూర్తులతో పాటు ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఒకరు వ్యతిరేకించారు. నలుగురు ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారులు సమర్థించారు. కాగా లా కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘంతో కమిటీ చర్చించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ, సీ•ఐఐ, అసోచాం వంటి సంస్థల నుంచి సలహాలు తీసుకుంది. వివిధ ఆర్థికవేత్తలతో చర్చించింది. దేశ పౌరులు, ఇతర సంఘాలనుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తూ బహిరంగ ప్రకటన విడుదల చేయగా మొత్తం 21,558 స్పందనలు వచ్చాయి. ఇందులో 80% జమిలికి సానుకూలత వ్యక్తం చేసినవే. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో స్పందనలు వచ్చాయి.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అధికారులు జమిలి ఎన్నికల కోసం తీవ్రంగా కృషిచేసినప్పటికీ తర్వాతి కాలంలో ఇవి గాడితప్పడానికి గల కారణాలపై లోతైన అధ్యయనం చేయాలని కమిటీ సూచించింది. ఈ అంశంపై త్వరలో లా కమిషన్ కూడా నివేదికను అందజేయనుంది. 2029 ఎన్నికల నుంచి ఈ జమిలి ఎన్నికల పక్రియను అమలు జరపాలని ఈ కమిషన్ సూచించే అవకాశమున్నదన్న వార్తలు వచ్చాయి.
మెజారిటీ పార్టీల ఆమోదం
దీనిపై 62 పార్టీల అభిప్రాయాలను కోరగా స్పందించిన మొత్తం 47 పార్టీల్లో 32 జమిలి ఎన్నికలక• ఓటేశాయి. 15 పార్టీలు వ్యతిరేకించగా మరో 15 పార్టీలు స్పందించలేదు. బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఏఐఏడీఎంకే, బిజూ జనతాదళ్, మిజోనేషనల్ ఫ్రంట్, శివసేన, జనతాదళ్(యూ), శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు అనుకూలంగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం,తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్‌వాదీ పార్టీ వంటివి వ్యతిరేకించాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం, బీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలు స్పందించలేదు.
తొలిదశలో లోక్‌సభ, అసెంబ్లీలకు
తొలిదశలో లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిం చాలని, తర్వాతి దశలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదిక పేర్కొంది. లోక్‌సభకు కాలపరిమితిని రాజ్యాంగం లోని 83వ అధికరణం, శాసనసభల కాలపరిమితికి సంబంధించి 172వ అధికరణం వివరిస్తున్నాయి. జమిలి ఎన్నికలు జరపాలంటే వీటిని సవరించడం అవసరం. ఇందుకోసం 82ఎ అధికరణాన్ని రాజ్యాంగానికి జోడించాలని కోరుతూ ఈ సవరణకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం, లోక్‌సభ లేదా అసెంబ్లీ తమ కాలపరిమితి కంటే ముందుగానే ఏదైనా కారణం చేత రద్దయితే, మిగిలిన కాలానికి మాత్రమే మధ్యంతర ఎన్నికలు జరపాలి.
రెండో దశలో స్థానిక సంస్థలకు
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సి పాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు వీలుగా రాజ్యాంగంలో 324ఎ అధికర ణాన్ని చేర్చాలి. ఫలితంగా 243ఈ, 243యు అధికరణాలతో సంబంధం లేకుండా మున్సి పాలిటీలు, గ్రామ పంచాయతీలకు సార్వత్రిక ఎన్నికలతో పాటే ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుంది. అయితే చట్టసభలకు ఎన్నికలు జరి గిన తర్వాత వంద రోజుల్లోగా వీటిని నిర్వహించాలి. వీటిల్లో ఏ సంస్థలకైనా కాలపరిమితి మధ్యలో ముగిస్తే, వాటికి మిగిలిన కాలం వరకే మధ్యంతర ఎన్ని కలు జరపాలి. అంతేకాదు ఈ మూడంచెల వ్యవస్థకోసం ఒకే ఓటరు జాబితా రూపొందించాలని కూడా నివేదిక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ నుంచి జాబితాను తీసుకొని ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. కొన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాలు సొంతంగానే ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాయి. కమిటీ నివేదిక అమలైతే, ఒకే జాబితా తయారవడమే కాదు ఎన్నికల సంఘాలకు పనిభారం తగ్గుతుంది. ఇందుకోసం 325వ అధికరణాన్ని సవరించాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైనే ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు, సిబ్బంది, భద్రతా బగాలు మిగిలిన వస్తుసామగ్రి ఎంత అవసరమవు తుందో, అందుకయ్యే ఖర్చు అంచనా కూడా చాలా స్పష్టంగా తెలిపింది.
సిఫారసులు
- సాధారణ ఎన్నికల అనంతరం 82ఎ అధికర ణాన్ని అమల్లోకి తెస్తూ లోక్‌సభ మొదటి సమావేశ తేదీని నిర్ణయిస్తూ రాష్ట్రపతి నోటిఫికే షన్ జారీచేయాలి. ఈ నోటిఫికేషన్ జారీచేసిన తేదీని అపాయింటెడ్ డేగా పరిగణించాలి.
- లోక్‌సభ అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడిన అసెంబ్లీలన్నీ లోక్‌సభ కాలపరిమితితో పాటే ముగిసేలా చూడాలి. ఇందుకు 83, 172 అధికరణలలోని అంశాలతో ఎటువంటి సంబంధం ఉండరాదు.
- ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం, ఎన్నికల చట్టాలతో సంబంధం లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితి ముగియగానే వీటికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాజ్యాంగంలోని 15వ విభాగంలోని నిబంధనలను వీటికి వర్తింపజేయాలి. ఒకవేళ ఏవైనా సవరణలు అవసరమైతే ఉత్తర్వుల ద్వారా ఎన్నికల సంఘం వాటిని అమల్లోకి తీసుకురావాలి.
- జమిలి ఎన్నికలకోసం దాదాపు 18 రాజ్యాంగ సవరణలు అవసరం కావచ్చు. వీటిల్లో చాలా వాటికి రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు.
- లోక్‌సభలో హంగ్, అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురైన ప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. కొత్తసభను ఏర్పాటు చేయాలి.
- అప్పుడు కొత్తగా కొలువైన సభ మిగిలిన కాలానికి మాత్రమే పరిమితమై కొనసాగుతుంది.
- జమిలి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం, ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్ర దించి ఉమ్మడి ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులను రూపొందించాలి. ఇందుకోసం 325వ అధికరణకు సవరణ చేపట్టాలి.
- స్థానిక సంస్థలతో ఏకకాలంలో ఎన్నికల కోసం 324ఎను సవరించాలి.
- 325, 324ఎ అధికరణలకు సవరణ చేపట్టా లంటే రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి.
విపక్షాల భయాలు
‘జమిలి’ రాజ్యాంగ మూల స్వరూపాన్ని దెబ్బతీసి, జాతీయ పార్టీలను ప్రోత్సహిస్తుందేమోనని 15 పార్టీల అభిప్రాయం. ఇది రాష్ట్రపతి తరహా పాలనకు దారితీస్తుందన్న అనుమానాన్ని వెలిబుచ్చాయి. ఇది ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని ప్రోత్సహించేదేనని మమతా బెనర్జీ అభిప్రాయం. ఇది రాష్ట్రాలపై దాడి తప్ప మరోటి కాదన్నది కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శ. సామాన్యులకు ఒరిగేదేంటన్నది అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్న.
సర్కార్ వాదన
డబ్బు వృథాను అరికట్టవచ్చు. ప్రస్తుతం దేశంలో నిరంతరం ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పేరుతో కార్యక్రమాలు ఆగిపోవడం, సమయం వృథా కావడం సర్వ సాధారణమైపోయింది. ఒకేసారి ఎన్నికలు జరిపితే దీనికి అడ్డుకట్ట పడుతుంది. ఫలితంగా పనిరోజులు పెరుగుతాయి. ఏటా కనీసం రెండు మూడు రాష్ట్రాల్లోనైనా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా జరిగితే కేంద్రం పరిపాలనపై మరింత దృష్టి పెట్టగలదు. అంతేకాదు రాజకీయ సుస్థిరత కూడా ఏర్పడుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంపూర్ణ బలం లేకపోతే ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పదని అప్పుడు పాలనకు అవరోధాలు ఏర్పడతాయని బీజేపీ భావిస్తోంది. అదే ఉమ్మడి ఎన్నికలు జరిగితే తమ విధానాలను సమర్థవంతంగా ఐదేళ్లపాటు అమలుపరచ వచ్చని పార్టీ అభిప్రాయం. 2019లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయగా కేవలం 21 పార్టీలే పాల్గొన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు అప్పట్లో జమిలికి సమ్మతించినా ఇప్పుడు మాత్రం అభిప్రాయం వెల్లడించలేదు.
ప్రాంతీయ ధోరణులకు విరుగుడు
జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలకు బెడదగా పరిణమిస్తాయని చాలామంది చెబుతున్నారు. జాతీయ దృక్పథం లేని ప్రాంతీయ పార్టీలు, తమ స్వార్థం కోసం సంకీర్ణ ప్రభుత్వాలను నానా ఇబ్బందు లకు గురిచేసిన సందర్భాలను చూశాం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను ఆయా కుటుంబాలు శాసిస్తున్న రాజకీయ చరిత్ర ప్రస్తుతం దేశంలో కొనసాగుతోంది. ప్రాంతీయ పార్టీల వైఖరి చాలా సందర్భాల్లో జాతీయ ప్రయోజనాలకు పెద్ద ఆటంకంగా మారడం గమనార్హం. ఉదాహరణకు బంగ్లాదేశ్‌తో తీస్తా నదీజలాల ఒప్పందం కుదరక పోవడానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ. తాను అధికారంలో కొనసాగడానికి జాతీయ ప్రయోజనా లను పణంగా పెట్టడానికి ఆమె ఎంతమాత్రం సంకోచించరు. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ నదీజలాల సమస్య కొలిక్కి రాకపోవడానికి కారణం అక్కడి రాజకీయ నాయకుల వైఖరి ప్రధాన కారణం. రెచ్చగొట్టి అధికారాన్ని నిలుపుకోవడమే వీరి పరమావధిగా రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉమ్మడి పౌరసత్వ చట్టం-2019పై కూడా తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులోని డీఎంకే, కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం, ఢిల్లీలోని ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు అసలు వాస్తవాలు చెప్పకుండా తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే తప్పుడు వివరణలు ఇస్తున్నాయి. ఇది ప్రమాదకరం. జమిలి ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలకు, జాతీయ భావాలకు ప్రాధాన్యం హెచ్చుతుందని చెప్పడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు. దీనివల్ల సంకుచిత ప్రాంతీయ ధోరణలకు అడ్డుకట్టపడే అవకాశం లేకపోలేదు.
-జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్.