బెంగాల్‌ ‌విభజన వ్యతిరేక జ్వాలల నుంచి జనించినదే వందేమాతరం ఉద్యమం. అప్పుడే మొదటిసారి స్వదేశీ భావన వెల్లువెత్తింది. భారతీయులందరినీ తొలిసారి జాతీయ స్పృహతో అడుగులో అడుగు వేసి నడిపించిన నినాదం అది. వందేమాతరం ఉద్యమం, స్వదేశీ గురించి వివరించడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి లాల్‌ ‌బాల్‌ ‌పాల్‌ ‌త్రయంలోని బిపిన్‌చంద్ర పాల్‌ ‌దక్షిణాదికి వచ్చారు. విజయనగరం, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నాలలో ప్రసంగాలు ఇచ్చి, ఆపై మద్రాస్‌ ‌వెళ్లారు. అదొక జాతీయవాద ప్రభంజనం. తెలుగునాట ముట్నూరి కృష్ణారావు పాల్‌ ‌సభలను నడిపించారు. మద్రాస్‌లో సుబ్రహ్మణ్య భారతి అండగా ఉన్నారు. పాల్‌ ఉపన్యాసాలు రాజమండ్రిలో గాడిచర్ల హరిసర్వోత్తమరావును అందించాయి. మద్రాస్‌లో మరొక మహనీయుడిని కూడా స్వాతంత్య్రోద్యమానికి అందించాయి. ఆయనే నీలకంఠ భద్రాచారి. వీరంతా పత్రికా రచయితలు కావడం విశేషం.

‘ఆఖరికి ఒక్క మనిషి అయినా అన్నం లేకుండా

పస్తు ఉండవలసి వచ్చిన రోజున

ఈ ప్రపంచాన్ని దగ్ధం చేసేద్దాం!’

తమిళ మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి కవితలలో ఇదొకటి. నాలుగు రోజుల నుంచి భోజనం లేదు అంటూ ఒక వ్యక్తి తన ఎదురుగా నిలబడి చెప్పినప్పుడు ఆ మహాకవి నోటి నుంచి ఈ పంక్తులు వెలువడినాయి. ఆ క్షుధార్తుడు ఎవరో కాదు, భారతి అనుచరుడే. పేరు నీలకంఠ భద్రాచారి. తరువాత భారతి భద్రాచారికి సుష్టుగా భోజనం పెట్టాడు. నీలకంఠ విప్లవమార్గంలో స్వాతంత్య్రం కోసం పాటుపడిన మహనీయుడు. భారతి శిష్యుడు. తరువాత ఆధ్యాత్మిక మార్గం పట్టారు.

నీలకంఠ జీవితంలో అనేక దశలు ఉన్నాయి. ఆయన చింతనలో అనేక అరలు ఉన్నాయి. ఇరవయ్యో పడిలోకి రాగానే, అంటే 1911లో  కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను తమిళ భాషలోకి అనువదించారు. 1911 అంటే రష్యా జార్‌  ‌రాజ్యంలో విప్లవం తేవాలని ఆ దేశ ప్రజలు అప్పటికి అనుకోలేదు. అయితే నీలకంఠ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన దాఖలాలు లేవు. తీవ్ర జాతీయవాదాన్ని నమ్ముతూ స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించారు.

డిసెంబర్‌ 4,1889‌న నీలకంఠ మైలాదుతురై జిల్లా ఇరుక్కూరులో పుట్టారు. తండ్రి శివరామకృష్ణ గణపతిగళ్‌ ‌సామవేద పండితుడు. ఎనిమిది మంది సంతానం ఉన్న ఆ కుటుంబంలో నీలకంఠ పెద్దవారు. కుటుంబం పేదరికంలో ఉండేది. అయినా ఆయన వైదిక ధర్మాచారం ప్రకారం జీవించారు. ధర్మానికి కట్టుబడి, సత్యాన్ని మాత్రమే మాట్లాడేవారు. ఇరుక్కూరులో ఆయన పొందిన అనుభవాలు జీవితాంతం ఆయనకు ఉపయోగపడినాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న కష్టాల నుంచి తప్పించు కోవడానికి ఆ ఊరు వదిలి మాయావరం తరలిపోవాలని అనుకుంది ఆ కుటుంబం. ఆ క్రమంలో అక్కడ ఉన్న కొద్దిపాటి ఆస్తిని అమ్ముకు న్నారు. మాయావరంలో శివరామకృష్ణ గణపతిగళ్‌కు వేద పాఠశాలలో ఉద్యోగం దొరికింది. ఇంతలో అవసరాల కోసం కొడుకును కొంత డబ్బు సమకూర్చ మని తండ్రి అడిగారు. అప్పటికే స్వాతంత్య్రోద్య మంలో పాల్గొంటున్న నీలకంఠ స్వరాజ్య భారతి పేరిట జరుగుతున్న ఉద్యమం కోసం కొంత ధనం సేకరించారు. తండ్రి సర్దుబాటు చేయమన్నందుకు తిరిగి ఇంటికి వెళ్లలేదు.

నీలకంఠ సిర్కాలిలోని శుభనాయకర్‌ ‌హిందూ ప్రాథమికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివారు. ఆపై స్థోమత లేక చదువుకు స్వస్తి చెప్పి ట్రిప్లికేన్‌ అర్బన్‌ ‌కో ఆపరేటివ్‌ ‌సొసైటీలో (మద్రాస్‌) ‌చిన్న గుమాస్తాగా చేరారు. ఇది జరిగిన కొద్దికాలానికే లాల్‌ ‌బాల్‌ ‌పాల్‌ ‌త్రయంలోని బిపిన్‌చంద్ర పాల్‌ ఉపన్యాసాలు ఇవ్వడానికి మద్రాస్‌ ‌వచ్చారు. బెంగాల్‌ ‌విభజన తరువాత బిపిన్‌పాల్‌ ‌దేశమంతా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చారు. అప్పుడే సుబ్రహ్మణ్య భారతి, ఇంకొందరితో కలసి నీలకంఠ బిపిన్‌పాల్‌కు స్వాగతం పలికారు. పాల్‌ ఉపన్యాస వేదిక మెరీనా బీచ్‌. అది ట్రిప్లికేన్‌కు కూతవేటు దూరమే. పాల్‌ ‌మహావక్త. బెంగాల్‌ ‌విభజన వ్యతిరేకోద్యమంలో భాగంగా, వందేమాతరం నినాదంతో ఆయన మద్రాస్‌ ‌నగరంలో ఉపన్యాసాలు ఇవ్వడానికి వచ్చారు. ఆయన వక్తృత్వంలో అదంతా ప్రతిబింబించింది, ప్రతిధ్వనించింది. అప్పటికే అంతో ఇంతో స్వాతంత్య్రోద్యమంతో బంధం ఉన్న నీలకంఠ రక్తం ఉప్పొంగి పోయింది. గుండె నిండా స్వరాజ్య జ్వాల ఎగసింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. మహాకవి భారతి నడుపుతున్న వార్తాపత్రిక ‘ఇండియా’లో చేరారు.

అప్పటికే ‘ఇండియా’ పత్రిక మీద బ్రిటిష్‌ అధికారుల కన్ను ఉండేది. నీలకంఠ చేరిన కొన్ని రోజులకే రాజద్రోహాన్ని ప్రేరేపించే రాతలు రాస్తున్నారన్న ఆరోపణతో పత్రికను మూయించారు. సుబ్రహ్మణ్య భారతిని కూడా అరెస్టు చేయవచ్చునన్న వదంతులు వచ్చాయి. దీనితో సమీపంలోనే ఫ్రెంచ్‌ ఏలుబడిలోని పుదుచ్చేరికి వెళ్లిపోవలసిందని భారతి శ్రేయోభిలాషులు కోరారు. మిగిలిన భారతదేశానికి చెందిన విప్లవకారులంతా అరెస్టులను తప్పించుకోవ డానికి పుదుచ్చేరి చేరుకునేవారు. భారతి, ఆయన వెంట నీలకంఠ కూడా వెళ్లారు. గురుశిష్యులిద్దరూ పత్రికలనే ఆశ్రయించారు. నీలకంఠ ‘సూర్యోదయం’ అనే పత్రికలో సంపాదకునిగా చేరారు. ఆ బాధ్యతలతో పాటు స్వరాజ్య భావనను వ్యాపింప చేయడానికి ఆయన ప్రచారక్‌గా కూడా పనిచేశారు. నీలకంఠ సూటిగా మాట్లాడేవారు. ఆయన మాట అర్జుని బాణంలా గురి తప్పకుండా తగులుతుందని అనుకునేవారు. ఈ లక్షణాలే ఆయన వెనుక పెద్ద అనుచరగణాన్ని ఏర్పరిచింది. వారంతా భారతమాత సేవలో ఉండేవారు. టెంకాసీ, ట్యుటికోరన్‌ ‌వంటి చోట్ల ఆ రోజులలో ఆ క్రమంలో ఏర్పడినదే భారతమాత సంఘం. వీరవాంచీనాథన్‌, ‌కృష్ణాపురం శంకరకృష్ణన్‌, ‌మదతుక్కడై చిదంబరం పిళ్లయ్‌, ఒట్టాపిడారం మదసామి పిళ్లయ్‌ ‌వంటి స్వాతంత్య్ర సమరయోధులంతా భారతమాత సంఘం నుంచి వచ్చినవారే. నీలకంఠకు అనేక పేర్లు ఉండేవి. భరద్వాజన్‌, ‌గోవిందనాయర్‌ ‌దుబే, గోవింద్‌ ‌నారాయణ్‌, ‌స్వామి బ్రహ్మచారి, నీలకంఠ దత్త ఇవన్నీ ఆయన పేర్లే. మద్రాస్‌ ‌నగరంలోని మైలాపూర్‌ ‌నుంచి ఆనాడు వెలువడిన ‘వేదాంత కేసరి’ పత్రికకు లె ఫ్రేల్‌ అనే ఫ్రెంచ్‌ ‌పేరుతో రచనలు చేశారాయన.

తన ఉద్యమ లక్ష్యం మీద, దానికి ఉన్న తాత్వికత మీద కూడా నీలకంఠకు అచంచలమైన విశ్వాసం ఉండేది. ఇది దీనికి ఒక చక్కని ఉదాహరణ: కడలూరులో చక్రవర్తి అయ్యంగార్‌ అనే పెద్ద న్యాయవాది ఉండేవారు. సాయుధ పంథా అవసరం మీద ఆ న్యాయవాదితో నీలకంఠ ఒక సందర్భంలో వాదించవలసి వచ్చింది. వాదోపవాదాలు బాగా వేడెక్కాయి. భారతమాత మీద బ్రిటిష్‌ ‌జాతి సాగిస్తున్న అణచివేతను నిలదీసే రోజు దగ్గరలోనే ఉంది అంటూ ఒళ్లు తెలియని ఆవేశంతో అరిచారు. ఆ రోజు వచ్చినప్పుడు బ్రిటిష్‌ ‌జాతికి రక్తంతోనే సమాధానం చెబుదామని కూడా అన్నారాయన. భారతమాత ఆశీస్సులతో ఒక దశాబ్దాంలోనే ఇది జరుగుతుందని ఎదురుగా ఉన్న బల్లను గుద్ది చెప్పారాయన.

స్వదేశీ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఓవీ చిదంబరం పిళ్లయ్‌, ‌సుబ్రహ్మణ్య శివం అనే వారిని మార్చి 12,1908న తిరునల్వేలి కలెక్టర్‌ ‌వించ్‌ అరెస్టు చేశాడు. ఆ ఇద్దరిని పాళయంకొట్టాయి జైలుకు పంపించారు. ఇది స్వాతంత్య్ర సమరయోధులను బాగా బాధించింది. ఆ అరెస్టులకు ప్రతీకారంగా వించ్‌ను హత్య చేయాలని నీలకంఠ నాయకత్వంలో భారతమాత సంఘం నిర్ణయించింది. అయితే అప్పుడే వించ్‌ ‌బదలీ అయి, అతడి స్థానంలో రాబర్ట్ ఏషే వచ్చాడు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు వించ్‌ను మించిన కఠినాత్ముడు ఏషే. నీలకంఠ ప్రోద్బలంతో వాంచినాథన్‌ ఏషేను మనియాంచి రైల్వే స్టేషన్‌ ‌దగ్గర కాల్చి చంపాడు. తరువాత వాంచినాథన్‌ ‌దొరక్కుండా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో కీలకమని భావిస్తున్న నీలకంఠ కోసం అన్వేషణ మొదలయింది. కలకత్తాలోని ఒక హోటల్‌లో దాగి ఉన్న నీలకంఠను పోలీసలు అరెస్టు చేసి విచారణ కోసం మద్రాసుకు తీసుకువచ్చారు. సెక్షన్‌ 121ఏ ‌కింది కేసు నమోదయింది. అంటే బ్రిటిష్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నించాడన్న ఆరోపణ. 280 మంది సాక్షులను ప్రవేశపెడితే 200 మంది బ్రిటిష్‌కు అనుకూలంగా సాక్ష్యం చెప్పారు. నీలకంఠకు ఏడేళ్లు కఠిన కాగాగార శిక్ష విధించి బళ్లారి జైలుకు పంపించారు. అయితే ఆ జైలు నుంచి తప్పించుకుని బయటకు వచ్చినప్పటికి ధర్మవరం రైల్వే స్టేషన్‌లోనే ఆయన దొరికిపోయారు. శిక్షను ఏడున్నరేళ్లకు పెంచారు. ఏడేళ్లలో సంవత్సరానికి ఒకటి వంతున ఏడు జైళ్లకు తిప్పారు. అవి- బళ్లారి, మద్రాస్‌, ‌పాళయంకొట్టయ్‌, ‌కన్నూర్‌, ‌కోయంబత్తూరు, రాజమహేంద్రపురం, విశాఖపట్నం. ఆఖరికి ఆగస్ట్ 1919‌లో విడుదల చేశారు.

మద్రాస్‌ ‌చేరుకున్న నీలకంఠ స్వదేశీ ఉద్యమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించారు. కానీ ఆయన జీవితంలో చీకటిరోజులు ప్రవేశించాయి. కొన్ని సందర్భాలలో నాలుగు రోజులకు కూడా తిండి ఉండేది కాదు. ఆకలికి తట్టుకోలేక చీకటి పడిన తరువాత భిక్షాటన చేశారాయన. చివరికి తన గురువు భారతి వద్దకు చేరుకుని పరిస్థితిని వివరించారు. నాలుగు అణాలు ఇవ్వవలసిందని, అన్నం తిని నాలుగు రోజులయిందని కోరారు. భారతి చలించి పోయారు. తరువాత భారతి కన్నుమూసినప్పుడు నీలకంఠ పాడె మోశారు.

అనంతర కాలాలలో నీలకంఠ ఇహలోకం మీద నమ్మకం కోల్పోయారు. ఒక పరిత్యాగి వలె దేశమంతా తిరిగారు. తరువాత శ్రీసద్గురు ఓంకార్‌గా మారారు. బెంగళూరు నందికొండల దగ్గర ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్రముఖులే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఆ  ఆశ్రమానికి విశేషంగా వచ్చేవారు. శివరాత్రికి, దుర్గాష్టమికి అక్కడ ప్రత్యేక యాగం చేసేవారు. ఆ సందర్భంగా వచ్చే బూడిద ప్రసాదం కోసం జనం వెల్లువెత్తేవారు. తన రచనా శక్తిని కూడా ఆయన ఆధ్యాత్మికతకు ధారాదత్తం చేశారు. ఆయన రాసిన వ్యాసాలను 1954లో ‘ఆర్గనైజర్‌’ ‌పత్రిక ధారావాహికంగా వెలువరించింది. భారతమాతను సేవించుకుంటూ, సనాతన ధర్మ ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసిన సద్గురు ఓంకార్‌ ‌మార్చి 4, 1978న భగవదైక్యం చెందారు.

– జాగృతి డెస్క

About Author

By editor

Twitter
YOUTUBE