సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ : ఫాల్గుణ పూర్ణిమ 25 మార్చి 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
పద్దెనిమిదో లోక్‌సభ సమరానికి ఎన్నికల సంఘం ముహూర్తం పెట్టింది. నిర్దిష్టమైన, నిర్మాణాత్మకమైన ఉద్దేశాలతో కదులుతున్నది ఎన్‌డీఏ కూటమి. తన సమీపానికి కూడా ఎవరూ చేరలేనంత ఎత్తుకు ఎదిగిన నేతతో ఎన్‌డీఏ కూటమి నాయక హోదాలో నిలిచినది బీజేపీ. ఇవాళ దేశంలో ఆ పార్టీ ఒక ప్రభంజనం. రెండు తెలుగు రాష్ట్రాలలోను మే 13న పోలింగ్ జరుగుతుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ; కాంగ్రెస్, డీఎంకే, ఆర్‌జేడీ వంటి పార్టీల ఇండీ కూటమి తలపడడం నిశ్చయమైపోయింది.
మార్చి 16వ తేదీన ఎన్నికల ప్రకటన వెలువడగా, తరువాతి రెండు రోజులు – 17,18 తేదీలలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట (బొప్పూడి)లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్నికల సభ జరిగింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఎన్‌డీఏ కూటమికి నాలుగు వందల స్థానాలు వస్తాయని ఇదే సంకేతిస్తున్నదని, శుభ సూచకమని దిశానిర్దేశానికి సమయస్ఫూర్తిని జోడించి ఆ సభలోనే ప్రధాని అన్నారు. మరునాడు జరిగిన జగిత్యాల సభలో ఈ పోటీ శక్తి ఆరాధకులకీ, శక్తి ద్వేషులకీ మధ్య సమరమని నిశ్చయంగా ప్రకటించారాయన. పరోక్షంగానే కావచ్చు ఆ రెండు అంశాలే ఈ ఎన్నికల సమరాన్ని నడిపిస్తాయని రూఢ అయింది. కాబట్టి ఓటర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. హిందూ ‘శక్తి’ మీద కాంగ్రెస్ నేత రాహుల్ నోరుజారిన నేపథ్యంలో ప్రధాని ఈ మాట అన్నారు.
ఎన్‌డీఏ కూటమికి నాలుగు వందల స్థానాలు రావాలని ప్రధాని కొద్దిరోజుల నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. తమ కూటమికి అంతటి విజయం చేకూర్చాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో బీజేపీ 370 స్థానాలు గెలవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ 370 సీట్ల సంఖ్యను ఆర్టికల్ 370 రద్దుకు గుర్తుగా చూడాలని ఆయన పిలుపునిస్తున్నారు. నిజమే, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెట్టే ఆర్టికల్ 370 రద్దుతో ఎన్‌డీఏ, బీజేపీ, మోదీల పట్ల దేశ ప్రజలలో విశ్వాసం పరిపూర్ణ స్థాయికి చేరుకుందనే చెప్పాలి. నిజంగా అదొక సాహసోపేత రాజకీయ నిర్ణయం. అయితే ఆ సాహసానికి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంది. రాజ్యాంగాన్నీ, రాజ్యాంగకర్తల ఆశయాన్నీ, అన్నింటికీ మించి దేశ సమగ్రతనీ సమున్నతంగా గౌరవించాలన్న ఆశయం కనిపించింది. అంతేగాని అది ఓట్ల రాజకీయం కాదు. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్‌లో ఏర్పడిన వాతావరణాన్ని చూసి ప్రజలు మోదీలో అలాంటి నమ్మకాన్ని పెంచుకున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తే దేశం భగభగ మండిపోతుందన్న వాగాడంబరాన్ని ఆయన లెక్క చేయలేదు. అంతేనా! ఒక్క తూటా కూడా పేల్చకుండా ఆ అధికరణం రద్దు ప్రక్రియను పూర్తి చేశారు. మోదీ వస్తే దేశం శాంతిభద్రతలతో ఉంటుంది అన్న మాట సాధారణ భారతీయుల నోటి నుంచి వెలువడడం అందుకే. మోదీ హయాంలో ముంబై తరహా పేలుళ్లు లేవు కదా అని కొందరు ఆనందం వ్యక్తం చేయడమూ అలాంటిదే. ముంబై పేలుళ్లు, హైదరాబాద్ పేలుళ్లు చాలామంది దురదృష్టవంతులను పొట్టన పెట్టుకున్నాయి. సుదూరంగానే ఉన్నా కూడా ఎందరో ఈ దేశ సాధారణ ప్రజల గుండెను కూడా ఆ అమానుష చర్యలు దారుణంగా గాయపరిచాయి. బుజ్జగింపు రాజకీయాలతో ఆ బాధను గుర్తించడం దగ్గర ఈ దేశ విపక్షాలు ఘోరంగా విఫలమయ్యాయి. మోదీ సాధారణ భారతీయుడి హృదయాన్నే కాదు, మైనారిటీల మనసులను కూడా గెలుచుకున్నారు. భారతదేశ ఉత్తర ప్రాంత పార్టీ నాయకుడన్న మాట పరిపూర్ణంగా కాలగర్భంలో కలసిపోయింది. విపక్షాలు ఎన్ని అవాకులూ చెవాకులూ పేలినా కొవిడ్ సమయంలో మోదీ ప్రదర్శించిన విజ్ఞత, సామర్థ్యం భారతీయులకు గుర్తుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం 21వ శతాబ్దపు భారతదేశం మీద గొప్ప ముద్ర. భారత నాగరికతా ప్రస్థానంలో మైలురాయి. మనదైన జీవన విధానం చీకటియుగాల నుంచి బయపడుతున్నదన్న నమ్మకాన్ని కలిగించింది. ఇదంతా మోదీ వలన సాధ్యపడిందని సాధారణ హిందువు నిశ్చితాభిప్రాయం. సాంస్కృతిక జాతీయవాదం, సర్వజన సంక్షేమం, శాస్త్ర సాంకేతిక పురోగతి, సమరసత కలగలసిన భారతదేశాన్ని ఆయన నిర్మిస్తున్న సంగతి వెల్లడవుతున్నది. తాజాగా సీఏఏ కూడా ఆయన కీర్తిని పెంచేదే.
విపక్ష కూటమి ఎలా ఉంది? అదొక విధ్వంసక శిబిరమన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా కూడా కాంగ్రెస్ ప్రముఖుడు రాహుల్ గాంధీ మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికే మొగ్గు చూపారు. ఆ ఆరోపణను నిరూపించుకున్నారు. హిందూ ధర్మంలో శక్తి అన్న మాట ఉంది, దానిని ధ్వంసం చేయాలనే రాహుల్ అన్నారు. ఆయన పక్కనే కూర్చున్నవారు డీఎంకే నేత ఎంకే స్టాలిన్. ఈయన, ఈయన కుమారుడు ఉదయనిధి ఆశయం సనాతన ధర్మాన్ని పెకలించడమే. నిజానికి ఇప్పుడు ఇండీ కూటమిని నడిపిస్తున్నవి ఈ రెండు పార్టీలే. అవి మేము హిందూ వ్యతిరేకులమని నీళ్లు నమలకుండానే ప్రతి సందర్బంలోను ప్రకటించుకుంటున్నాయి. భారత ప్రజల కల అయోధ్యలో రామాలయం. అది ఆ రెండు పార్టీలకు నచ్చడం లేదు. భారతమాతకు జై అనడానికి సిద్ధంగా లేవు.
ఓటు హక్కు ఒక ఆయుధం. ఆ సంగతి ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన వారు హిందువులు. ఓటు హక్కు వినియోగించుకొనడంలో వారు నిరంతరం జాతీయ స్పృహతో మెలగడం అవసరం. ఓటు హక్కును సరిగా వినియోగించుకోకపోతే మన ధర్మమే కాదు, మన నేల కూడా మనకు దక్కదు. ఆ వాతావరణం పొంచి ఉంది. దీనిని గుర్తించాలి. మాతృభూమి రక్షణ, స్వధర్మ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటు హక్కు వినియోగించే సమయంలో గుర్తుకు రావాలి.