సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ఫాల్గుణ శుద్ధ నవమి – 18 మార్చి 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వ దశాబ్దకాల చరిత్రలోనే కాదు, స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మరొక గొప్ప తేదీ నమోదైంది. మార్చి 11, 2024న పౌరసత్వ (సవరణ) చట్టం 2019 (సీఏఏ) అమలులోకి వచ్చింది. దేశహితం కోసం రాజకీయ సంకల్పం కలిగిన ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమిది. 2016 నుంచి ఈ అంశం గురించి బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వం స్పష్టంగానే ఉంది. 2019 ఎన్నికలలో బీజేపీ దీనినొక అంశంగా చేసుకుంది కూడా. బుజ్జగింపు రుగ్మతతో, మతోన్మాదం తలకెక్కిన పార్టీలు, సంస్థల వీరంగంతోను, మరొక పక్క కొవిడ్‌ విజృంభణతోను దీని అమలును నిలిపివేయవలసి వచ్చింది. కొంత ఆలస్యం జరిగినా మొత్తానికి కేంద్రం ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

పౌరసత్వ సవరణ బిల్లు, 1955ను సవరించడానికి జూలై 15, 2016న ప్రయత్నాలు ఆరంభమైనాయి. డిసెంబర్‌ 11,2019న రాజ్యసభ ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆమోదం (125-99) తెలిపింది. జనవరి 30, 2020న జరిగిన పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశంలో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఒక విషయం జాతి దృష్టికి తీసుకువచ్చారు. ‘పాకిస్తాన్‌లో నివసించడానికి ఇష్టపడని హిందువులు, సిక్కులు భారత్‌కు రావచ్చు. ఇక్కడ వారు సాధారణ జీవితం గడపడానికి కేంద్రం అన్ని ఏర్పాట్లు చేయాలి’ అన్నారు మహాత్మా గాంధీ. గాంధీజీ మాటలను విపక్షాలు సౌకర్యంగా మరచిపోయి ఉండవచ్చు. కాంగ్రెస్‌ అయితే కావాలనే విస్మరించి ఉంటుంది కూడా. గాంధీజీ మాటే గుర్తు ఉండి ఉంటే విపక్షాలు ఇంతగా బరితెగించేవి కావు. బీజేపీ తీసుకువచ్చిన సీఏఏ ఆంతర్యం గాంధీజీ ఆశయాన్నే కదా ప్రతిబింబిస్తున్నది! పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌లలో మతపరంగా అణచివేతకు గురి అవుతున్న హిందువులు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు భారతదేశానికి వచ్చి పౌరసత్వం తీసుకోవచ్చు. సగౌరవంగా బతకవచ్చు. ఇప్పుడు విపక్షాల అల్లరి అంతా ఇందులో ముస్లింలను ఎందుకు చేర్చరు అనే! ముస్లింలు ఇక్కడికి వేరే పద్ధతిలో రావచ్చు. కానీ ముస్లిం రాజ్యాలలో ముస్లింలు మతపరమైన అణచివేతను ఎదుర్కొంటారా? తిరుగుబాటు, హక్కుల పోరాటం, లేదా రాజకీయ కారణాలతో వారు ఆ రాజ్యానికి వ్యతిరేకులు కావచ్చు. ఆ పరిధిలో వారు ఏ దేశానికైనా వెళ్లవచ్చు. నిజానికి ఆ మూడు దేశాలలో మతపరంగా వివక్షకు గురి అయి భారతదేశం రావాలని అనుకున్న వారికి 2022 నుంచి పౌరసత్వం ఇచ్చే అధికారాన్ని దాదాపు ముప్పయ్‌ జిల్లాల కలెక్టర్లకు కేంద్రం ఇచ్చింది. పెళ్లి పందిళ్లలోకి చొరబడి మైనారిటీల వధువులను ఎత్తుకెళ్లిపోయే రాక్షస సంస్కృతి రాజ్యమేలుతున్న పాక్‌ వంటి చోటు నుంచి బయటపడాలనుకుంటున్న హిందువులకు భారతదేశం ఆశ్రయం కల్పించి తీరాలి. అలాగే మిగిలిన ముస్లిమేతర మైనారిటీలు కూడా.

సీఏఏ వ్యతిరేకత పేరుతో భారత్‌లో జరిగిన అల్లర్లు, అంతర్జాతీయంగా జరిగిన దుష్ప్రచారం పరమ నీచమైన చర్యలే. అంతా పథకం ప్రకారం జరిగినవే కూడా. డిసెంబర్‌ 11, 2019న రాజ్యసభ సీఏఏకు ఆమోదం తెలిపితే డిసెంబర్‌ 15 కల్లా దేశంలో మంటలు రాజేశారు. అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం, ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం అల్లర్లతో అట్టుడికి పోయాయి. వాటిని నిరోధించడానికి పోలీసులను పంపవలసి వచ్చింది. మరునాడే షాహీన్‌బాగ్‌లో ‘పేద మహిళలు’ దీక్ష మొదలు పెట్టారు. తరువాత ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక తదితర ప్రాంతాలలో అల్లర్లు జరిగాయి. మొత్తం 69 మంది చనిపోయారు. ఇందులో నైరుతి ఢల్లీిలో ‘ఆప్‌’ కార్పొరేటర్‌ కనుసన్నలలో జరిగిన మత కల్లోలాలలోనే 42 మంది చనిపోయారు. షాహీన్‌బాగ్‌ అసలు రూపం తరువాత బయటపడిరది. సీఏఏ వస్తే దేశంలో ముస్లింల పౌరసత్వం రద్దు అవుతుందంటూ ఓ పచ్చి అబద్ధాన్ని ముస్లిం గురువులు, ఇతర రాజకీయ పార్టీలు కూడా నిస్సిగ్గుగా దేశమంతటా వినిపించాయి.

విదేశీయులు తరాల తరబడి తిష్ట వేయడానికి ముందుచూపు గల ఏ ప్రభుత్వం అంగీకరించదు. దేశం పట్ల, జనాభా సమతౌల్యం పట్ల సమ్యక్‌ దృక్పథం కలిగిన ఏ నాయకత్వం ఆ పేరుతో సాగే ఎలాంటి ఆటలను సహించదు కూడా. మధ్యయుగాల దురాక్రమణదారులు ఈ దేశాన్ని ధర్మసత్రంలా భావించడమే దారుణమనుకుంటే, ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం ఈ దేశం ఇంకా ధర్మసత్రంలానే కొనసాగాలని కోరుకుంటున్నాయి. ఎన్నికల ముందే సీఏఏ అమలు ఎందుకు గుర్తుకు వచ్చిందని కొన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. 370 స్థానాలతో బీజేపీ తిరిగి ఎన్నిక కావడం, మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం తథ్యమని ప్రతి సర్వే చెబుతుంటే (ఎన్‌డీఏ 400 స్థానాలు సాధించాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు) విపక్షాలు ఇలా ఎందుకు వదరుతున్నాయో అర్థం కాదు. ప్రస్తుతం చాలా దేశాలు జనాభా సమతౌల్యం గురించి గట్టిగా యోచిస్తున్నాయి. ఇప్పుడు మన విపక్షాలు ఏ వర్గాన్ని సీఏఏలో చేర్చనందుకు గోల చేస్తున్నాయో, ఆ వర్గంతోనే ఆ దేశాలు సమగ్రత కోణం నుంచి తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇది గమనించి తీరాలి. సీఏఏ కావచ్చు, 370 అధికరణ రద్దు కావచ్చు. ఇలాంటివే మరే కీలక నిర్ణయమైనా కావచ్చు. మోదీ ప్రభుత్వం దొడ్డిదారిన తీసుకురాలేదు. ఎన్నికల ప్రయోజనాలను అసలే పట్టించుకోలేదు. నిజానికి దేశభద్రత కోసం, సైన్యాన్ని పటిష్టం చేయడానికీ, సరిహద్దులను కట్టడి చేయడానికీ నరేంద్ర మోదీ ఏం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి భారతీయ విపక్షాలు. వాటికి భారతీయ జనతా పార్టీని విమర్శించడానికీ, భారత్‌ను విమర్శించడానికీ తేడాయే లేదు. అంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సీఏఏ ఈ దేశానికి శ్రీరామరక్ష.

About Author

By editor

Twitter
YOUTUBE