తెలంగాణలో గడిచిన పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. నిబంధనలు అమలు చేయకుండా, మార్గదర్శకాలను పాటించకుండా, చివరకు న్యాయస్థానం ఆదేశాలు కూడా బేఖాతరు చేసి ఇష్టారాజ్యం పాలన సాగించిన వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అనేక లొసుగులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి, నిధుల విషయంలో ఏ మాత్రం జవాబుదారీతనం లేకుండా వ్యవహరించిన తీరుకు సంబంధించిన గుట్టు అంతా బయటకు వస్తోంది. టీఎస్ బీపాస్ పేరుతో తెచ్చిన పోర్టల్ విషయంలోనూ అంతా లోగుట్టుగానే సాగిన వ్యవహారం బట్టబయలయ్యింది.
తెలంగాణలో భవన నిర్మాణాల అనుమతుల కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం టీఎస్ బీపాస్ పేరుతో ఓ పోర్టల్‌ను అమలులోకి తెచ్చింది. అవసరార్థులు ఆ పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించారు. నిర్ణీత ఫీజులు కూడా చెల్లించారు. కానీ, బీపాస్ పోర్టల్ కాస్తా.. బైపాస్‌లాగా మారిపోయింది. వాస్తవానికి భవన నిర్మాణాలకు పారదర్శకంగా అనుమతులు ఇచ్చేలా, ఆన్‌లైన్‌లోనే అనుమతులు వచ్చేలా ఆ ప్రభుత్వం టీఎస్ బీపాస్‌ను అమలులోకి తెచ్చింది. కానీ, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకున్నప్పటికీ.. అనుమతులు మాత్రం అధికారులు ఆఫ్‌లైన్‌లోనే ఇచ్చేసిన బండారం బయటపడింది. టీఎస్‌బీపాస్ పోర్టల్‌లో సరైన పత్రాలు అప్‌లోడ్ చేయకున్నా అనుమతులు ఇచ్చిన విషయం బయటకు వచ్చింది. కానీ, ఆన్‌లైన్‌లో ఆ ఫైళ్లు నమోదు కాలేదు. అంతేకాదు.. పర్మిషన్లు ఇచ్చినప్పటికీ.. ఆఫ్‌లైన్‌లోనూ ఆ ఫైళ్లు భద్రపరచలేదు. ఈ దందాలో పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు, బహుళ అంతస్తులకు సంబంధించిన ఫైళ్లే ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటికీ అక్రమంగా అనుమతులు ఇచ్చినట్లే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. విజిలెన్స్ విచారణకు అనుమతించింది. అయితే, ఈ దందాలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాత్ర ఉన్న హెచ్‌ఎండీఏ, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమ తులు వేగవంతంగా, పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. తద్వారా సత్వరమే నిర్మాణ అనుమతులు పొందడంతోపాటు దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉందో ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం కల్పించామని; 21 రోజుల్లో అనుమతులు వస్తాయని, అలా నిర్ణీత సమయాన్ని దాటి దరఖాస్తు ఆగితే.. ఆ అధికారికి జరిమానా విధించేలా కూడా చట్టాన్ని రూపొందించామనీ అప్పటి ప్రభుత్వం వెల్లడించింది. ప్రకటించి నట్లుగానే.. అలక్ష్యం వహించిన కొన్ని కేసుల్లో అప్పట్లో కొందరు అధికారులకు జరిమానాలు కూడా విధించారు. ముఖ్యంగా 100 నుంచి 500 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించని అధికారులపై ఈ జరిమానాలు విధించారు. అయితే, ఏడు అంతస్తుల నుంచి 58 అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు పొందిన ఫైళ్లను మాత్రం అత్యధికం ఆఫ్‌లైన్‌లోకి మార్చేశారు. దరఖాస్తులు చేసిన దగ్గర్నుంచి అనుమతులు ఇచ్చే దాకా అన్నింటినీ ఈ పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా అవకతవకలను అరికట్టవచ్చన్నది అసలు లక్ష్యం. కానీ, నిబంధనల ఉల్లంఘనకు అలవాటుపడిన కొందరు.. టీఎస్ బీపాస్‌ను బైపాస్ చేసి ఆఫ్‌లైన్‌లో అనుమతులు పొందారు. ఈ వ్యవహారానికి అధికారులు, సిబ్బంది సహకరించినట్లు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా ఫైళ్లను అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా మాయం చేశారు. వందలాది దరఖాస్తులను, ప్రధానంగా బహుళ అంతస్తుల భవనాల దరఖాస్తు లన్నింటినీ ఆఫ్‌లైన్‌లోకి మార్చేసి, అనుమతులిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. బడా రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లకు చెందిన కీలక ఫైళ్లు ఇలా మాయమయ్యాయి. ఈ వ్యవహారం తెలియడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
టీఎస్ బీపాస్‌లో దరఖాస్తు చేసిన తర్వాత రెవెన్యూపరమైన అంశాలను పరిశీలించే తహశీసీల్దార్ స్థాయిలోనే ఫైళ్లను ఆఫ్‌లైన్‌లోకి మార్చేశారన్న ఆరోపణలున్నాయి. టీఎస్ బీపాస్ అమలులోకి రాకముందు మాదిరిగానే దరఖాస్తులను ఇష్టారీతిన క్లియర్ చేశారు. ఆఫ్‌లైన్ కావడంతో సరైన పత్రాలు లేకపోయినా నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఉన్నతాధికారులు సంబంధిత ఫైళ్లను తెప్పించు కున్నారు. సరైన పత్రాల్లేవని కిందిస్థాయి అధికారులుఫైలును నిలిపివేసినా, అప్పటి హెచ్‌ఎండీఏ డైరెక్టర్ శివబాలకృష్ణ తమకు పంపించాలంటూ ఆదేశాలిచ్చారని కొందరు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. అంతేకాదు.. మంత్రి చెప్పారంటూ ఆగమేఘాల మీద ఆ ఫైళ్లకు అనుమతులిచ్చినట్లు చెప్పుకుంటున్నారు. శివబాలకృష్ణ ఇటీవల ఏసీబీ దాడుల్లో దొరికి, అక్రమాస్తుల కేసులో చిక్కుకొని రిమాండ్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
అన్నిరంగాల్లో మాదిరిగానే, ప్రభుత్వ పాలనలోనూ, పాలనా వ్యవహారంలోనూ మార్పులు వచ్చేశాయి. సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అందుకే ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అనుమతుల పక్రియకు సంబంధించి ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందించింది. కానీ, కొందరు అధికారులు మాత్రం ఆ ఆన్‌లైన్ పద్ధతిని మళ్లీ పాత పద్ధతిలోకి అంటే ఆఫ్‌లైన్‌లోకి మార్చేశారు. ఒకవేళ అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆఫ్‌లైన్‌లో అప్పటికప్పుడు అనుమతులు ఇచ్చినప్పటికీ.. తిరిగి ఆ ఫైళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ ఆన్‌లైన్‌లో ఎంట్రీచేస్తే రికార్డు చెక్కుచెదరకుండా ఉండే అవకాశం ఉంటుంది. కానీ, ఆఫ్‌లైన్‌లో అనుమతులిచ్చిన ఏ ఒక్క దరఖాస్తునూ ఆన్‌లైన్‌లోకి మార్చలేదని పోర్టల్‌ను పరిశీలిస్తే అర్థమవుతోంది.
ఇటీవల వరుసగా హెచ్‌ఎండీఏలో ఏసీబీ సోదాలు, వివిధ భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అనుమతులపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వివిధ రకాల అనుమతులపై ఏ రోజుకారోజు నివేదికలు అడుగుతోంది. కానీ, చాలావరకు ఫైళ్లు హెచ్‌ఎండీఏలో మాయమైనట్లు చెబుతున్నారు. అయితే ఇటీవల ఏసీబీ సోదాల్లో శివబాలకృష్ణ పనిచేసిన మాసబ్‌ట్యాంక్‌లోని రెరా ఆఫీసులో పలు హెచ్‌ఎండీఏ ఫైళ్లు బయటపడినట్లు సమాచారం. ఈ క్రమంలో కొన్ని ఫైళ్లను మాత్రం అధికారులే మాయం చేశారన్న ఆరోపణలున్నాయి. శివబాలకృష్ణ చేసిన తప్పిదాల మకిలి తమకు కూడా అంటు కుంటుందన్న ఉద్దేశంతో.. కొందరు అధికారులు ఇటీవల ప్రభుత్వం అడిగిన నివేదికల్లో సమాచారం లేదని చెప్పినట్లు తెలిసింది. సంబంధిత ఫైళ్లను తాము అప్పట్లోనే డైరెక్టర్ శివబాలకృష్ణకు పంపామని, ఆ తర్వాత సంబంధిత ఫైళ్లు తిరిగి వెనక్కి రాలేదని బదులిచ్చినట్లు సమాచారం.
మరోవైపు.. పేరున్న, విలువైన ఐటీ కారిడార్‌లో భారీ ప్రాజెక్టులు చేపడుతున్న పలు సంస్థలు.. తాము చేసిన దరఖాస్తులకు సంబంధించిన అనుమతులన్నీ ఆఫ్‌లైన్‌లోనే పొందాయి. కానీ, ఆయా సంస్థల ఫైళ్లు పునఃపరిశీలించాలంటే మాత్రం హెచ్‌ఎండీఏ ఫైళ్ల భాండాగారంలో దొరకడం లేదు.
అంతేకాదు.. 111 జీవో పరిధిలోని వట్టినాగులపల్లికి సంబంధించిన ఫైళ్లు కూడా ఇలాగే మాయమైనట్లు చెబుతున్నారు. వట్టినాగులపల్లిలోని 100 నుంచి 200 ఎకరాల భూములను బయో కన్జర్వేషన్ జోన్ నుంచి మల్టీపర్పస్ జోన్‌లోకి మార్చేందుకు ఎన్నికల ముందు ప్రభుత్వం ఆగమేఘాల మీద చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అనుమతులు ఇచ్చింది. ఈపీటీఆర్‌ఐ నివేదిక ఆధారంగా ఆ మార్పు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఈపీటీఆర్‌ఐ నివేదికను హెచ్‌ఎండీఏలోని ఏ ప్లానింగ్ అధికారి కూడా చూడలేదని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంబంధిత ఫైళ్లు రావడంతో జీ హుజూర్.. అంటూ కిందిస్థాయి అధికారులు ఉన్నత స్థాయికి పంపారు. సంబంధిత శాఖ మంత్రి ఆమోదంతో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేశారు. కానీ, సంబంధిత ఫైళ్లు, ఈపీటీఆర్‌ఐ నివేదికలన్నీ మాయమైనట్లు తెలుస్తోంది. ఈ తతంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. పాలనావ్యవస్థను గాడిలో పెట్టాల్సిన ప్రభుత్వ పెద్దలే ఇష్టారీతిన ప్రభుత్వ పాలనను వ్యాపారంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరి.. విజిలెన్స్ విచారణ తర్వాత ఏమేం భయంకర వాస్తవాలు బయటకు వస్తాయో, లేదంటే.. ఒత్తిళ్లకు తలొగ్గి ఏమీ లేదని తేలుస్తారో చూడాలి.
-సుజాత గోపగోని,
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్