‌ప్రపంచ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జనవరిలో జర్మనీకి చెందిన ‘బిల్ట్’ ‌దినపత్రిక తాను సేకరించిన దేశ రక్షణరంగ రహస్య పత్రాల ఆధారంగా, వచ్చే ఏడాది మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఒక కథనాన్ని ప్రచురించింది. అదే నిజమైతే ప్రపంచం మరో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనక తప్పదు. ముఖ్యంగా చమురు- సహజవాయు పరంగా ప్రపంచం అతలాకుతలమయ్యే ప్రమాదం పొంచిఉంది. ఇదే నిజమైతే ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారత్‌ ‌తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. రష్యా- ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభంలో యూరప్‌ ‌దేశాలు ఎంతగా విలవిలలాడు తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ యుద్ధం నేపథ్యంలో మనదేశం ఆత్మవిశ్వాసంతో మెలిగి ఆంక్షలను ఖాతరు చేయకపోయినా అమెరికా నేతృత్వంలోని దేశాలు మనల్ని ఏమీ చేయలేక పోయాయి. ఫలితంగా చమురు సంక్షోభం బారిన పడకుండా బయటపడ్డాం. కానీ ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయి. అప్పుడు ఇంధనపరంగా అన్ని దేశాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేం. ఒకరకంగా ప్రపంచమే స్తంభించిపోవచ్చు.

మనదేశం విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా మన మొత్తం అవసరాల్లో కేవలం 17.9 శాతం చమురు ఉత్పత్తి జరిగింది. అంటే ఇది కేవలం 1/5శాతం అవసరాలను తీర్చగలదు. 80శాతం పైగా ఇంకా విదేశీ చమురు పైనే ఆధారపడుతున్నాం. ఈ పరిస్థితి భయపెడుతున్న తరుణంలో చమురు- సహజ వాయుపరంగా ‘ఆత్మనిర్భర్‌ ‌భారత్‌’ ‌దిశలో పరిణామాలు సంభవిస్తుండటం ఒక గొప్ప సానుకూల పరిణామం. అదీ కాకుండా రాబోయే దశాబ్దకాలంలో దేశంలో పెట్రో •కెమికల్స్ ‌డిమాండ్‌ ఏటా 8% చొప్పున పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఇటీవల దేశంలో చమురు రంగంలో స్వయంసమృద్ధి సాధనగా రెండు కీలక ముందడుగులు పడటం విశేషం. వీటిల్లో ఒకటి కాకినాడ బేసిన్‌ ‌వద్ద చోటుచేసుకోగా మరోటి అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవుల్లో చమురు ఉత్పత్తికి మార్గం సుగమం కావడం. ఈ రెండూ పూర్తిస్థాయికి చేరుకుంటే, దేశం మరో 70 ఏళ్ల వరకు మరే ఇతర దేశంపై చమురుకోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదు!
కాకినాడలో కీలక మైలురాయి
ఇంధన ఉత్పత్తి రంగంలో ఒక కీలక మైలురాయిని దాటామంటూ ఈ ఏడాది జనవరి 7న ఆయిల్‌ అం‌డ్‌ ‌నేచురల్‌ ‌గ్యాస్‌ ఆఫ్‌ ఇం‌డియా (ఓఎన్‌జీసీ) చేసిన ప్రకటన ‘ఆత్మనిర్భర్‌ ‌భారత్‌’‌పై అవగాహన ఉన్న వారిలో ఎంతో ఆసక్తిని, సంతోషాన్ని కలుగజేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. ఈ ఘనత సాధించడానికి ఆంధప్రదేశ్‌ ‌వేదిక కావడం తెలుగువారికి ఎంతో ఆనందం కలిగించే అంశం. కృష్ణా-గోదావరి బేసిన్‌ (•కేజీ బేసిన్‌)‌లో ఆంధప్రదేశ్‌ ‌తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘‘కేజీ-డిడబ్ల్యుఎన్‌-98/2’’ ‌బ్లాక్‌కు చెందిన ‘ఎం’ చమురు క్షేత్రంనుంచి చమురు ఉత్పత్తి ప్రారంభించామన్నది ఆ ప్రకటన సారాంశం. ‘‘•కేజీ-డిడబ్ల్యు ఎన్‌-98/2’’ ‌బ్లాక్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలో ఓఎన్‌జీసీ డీప్‌వాటర్‌ ‌డ్రిల్లింగ్‌ ‌చేస్తున్న మొట్టమొదటి క్షేత్రం ఇది. ఇక్కడ ఓఎన్‌జీసీ డీప్‌వాటర్‌ ‌నుంచి ఉత్పత్తి చేసిన క్రూడాయిల్‌ను స్వర్ణసింధు పేరుగల కంటైనర్‌లో సంస్థ రిఫైనరీకి తరలించారు. ఈ కంటైనర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2న బిహార్‌లోని బిగుసరాయ్‌ ‌నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈవిధంగా కేజీ బేసిన్‌లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్న ‘ఆత్మనిర్భర్‌ ‌భారత్‌’ ‌సాధనలో ఇదొక కీలక ముందడుగుగా చెప్పకతప్పదు. ఈ బ్లాక్‌కు చెందిన రెండో దశ ప్రాజెక్టు దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఇది ఈ ఏడాది మధ్యనాటికి ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నాయి. మొదట్లో దీన్ని కైరాన్‌ ఎనర్జీ సంస్థ తీసుకున్నప్పటికీ తర్వాత దీన్ని పూర్తిగా ఓఎన్‌జీసీ సొంతం చేసుకుంది. ఈ క్షేత్రం నుంచి ఉత్పత్తి ప్రారంభం కావడంతో, ఓఎన్‌జీసీ చమురు- సహజవాయు ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 11%- 15% పెరిగింది. ఈ బ్లాక్‌ ‌నుంచి గరిష్ఠ స్థాయిలో చమురు ఉత్పత్తి జరిగినప్పుడు ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం చమురుకు అదనంగా మరో 7% చమురును ఈ క్షే•త్రం అందించగలగుతుంది. సాంకేతికంగా ఇది అత్యంత సంక్లిష్టమైన ప్రాజెక్టుగా కేజీ-డిడబ్ల్యుఎన్‌ -98/2 ‌క్షేత్రాన్ని పేర్కొంటున్న ఓఎన్‌జీసీ దీన్ని రూ.41వేల కోట్ల వ్యయంతో నిర్మించింది.ఈ క్షేత్రం గరిష్ఠ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకున్నప్పుడు రోజుకు 10 మిలియన్‌ ‌స్టాండర్డ్ ‌క్యూబిక్‌ ‌మీటర్లు లేదా రోజుకు 45వేల బ్యారళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. ఓఎన్‌జీసీ ఈ బేసిన్‌లో చమురు ఉత్పత్తిని ఈ ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఈ క్షేత్రం నుంచి ప్రస్తుతం రోజుకు 12 వేల నుంచి 12500 బ్యారళ్ల వరకు చమురు ఉత్పత్తి అవుతోంది. నిజానికి 50 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కృష్ణా-గోదావరి బేసిన్‌ ‌దేశంలోనే అతిపెద్దది మాత్రమే కాదు ఇక్కడ దేశంలో అత్యధిక శాతం గ్యాస్‌ ‌లభిస్తుందని అంచనా. ఓఎన్‌జీసీ, రిలయన్స్ ‌సంస్థలు ఇక్కడ చమురు తవ్వకాలు జరుపుతున్నాయి. మొదట్లో ‘•కేజీ-డిడబ్ల్యుఎన్‌-98/2’ ‌నుంచి ఉత్పత్తి అయ్యే చమురు చాలా మడ్డిగా ఉండటం వల్ల సమస్యలు ఎదురయ్యాయి. దీంతో దేశీయంగా అభివృద్ధి చేసిన ‘పైప్‌ ‌టు పైప్‌’ ‌సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓఎన్‌జీసీ ఈ సమస్యను అధిగ మించింది. కాగా ఈ విజయంతో డీప్‌వాటర్‌ ‌చమురు అన్వేషణలో భారత్‌ ‌కీలక అడుగు వేసినట్లయింది. ఓఎన్‌జీసీ ప్రస్తుతం దేశీయంగా చేస్తున్న చమురు ఉత్పత్తి వల్ల ఏటా దాదాపు రూ.11వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం పొదుపు అవుతుందని అంచనా. అంతేకాదు కాకినాడ వద్ద ఉత్పత్తి అయ్యే ఆయిల్‌ ‌దేశ అవసరాల్లో 15శాతం వరకు తీర్చగలుగుతుందని కూడా చెబుతున్నారు.

స్వర్ణసింధు
స్వర్ణసింధు క్రూడాయిల్‌ ‌కంటైనర్‌ (‌భారత్‌లో ఇది మొట్టమొదటిది)ను ఒక ఆయిల్‌ ‌ట్యాంకర్‌గా వాడతారు. ఇందులో కాకినాడ బేసిన్‌లో ఉత్పత్తి అయిన క్రూడాయిల్‌ను నింపి, ఓఎన్‌జీసీకి చెందిన ఒక రిఫైనరీకి పంపారు. డీప్‌వాటర్‌ ‌డ్రిల్లింగ్‌ ‌ద్వారా దేశీయంగా తొలిసారి ఉత్పత్తిచేసిన ముడిచమురును రిఫైనరీకి తీసుకెళ్లిన మొదటి కంటైనర్‌గా స్వర్ణసింధు చరిత్ర సృష్టించింది. ఇదిలావుండగా స్టోరేజ్‌ ఆఫ్‌లోడింగ్‌ ‌ఫెసిలిటీస్‌ ‌కాకినాడ వద్ద మాత్రమే ఉండటం విశేషం.ఇవి ఆసియాలో మరెక్కడా ఎక్కడా లేవు.
ఆర్మడా స్టెర్లింగ్‌-5
‌షాపూర్‌జీ పల్లోన్‌జీ ఎనర్జీ (ఎస్‌పీ ఎనర్జీ)సంస్థకు చెందిన ‘అర్మడా స్టెర్లింగ్‌-5’ అనే పేరుగల ఫ్లోటింగ్‌ ‌ప్రొడక్షన్‌ ‌స్టోరేజ్‌ అం‌డ్‌ ఆఫ్‌లోడింగ్‌ (ఎఫ్‌పీఎస్‌ఓ) ‌వెజల్‌, ‌భారత ప్రభుత్వ సంస్థ ఒ.ఎన్‌.‌జి.సి.కోసం పనిచేస్తున్నది. ఈ ఎఫ్‌పీఎస్‌ఓలో, ఎస్‌.‌పి. ఎనర్జీకి (70%), మలేసియాకు చెందిన బుమి అర్మడా (30%)కు వాటాలున్నాయి. అంటే ఇది ఈ రెండు సంస్థల జాయింట్‌ ‌వెంచర్‌. ఇది షాపూర్‌జీ పల్లోన్‌జీకి చెందిన నాలుగో ఫ్లోటింగ్‌ ‌నౌక కాగా భారతీయ జలాల్లో పనిచేసే మూడోది. తుపానులను కూడా తట్టుకొనే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫల్లోన్‌జీ సంస్థ ఈ ఎఫ్‌పీఎస్‌ఓను రూపొందించింది. ఇది భారత ఉపఖండంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌ ఇన్‌స్టాలేషన్‌ ‌కావడం విశేషం. డ్రిల్లింగ్‌ ‌చేసిన చమురును ఎఫ్‌పీఎస్‌ఓలో నిల్వచేస్తారు. ఈ నిల్వ ఒకదశకు వచ్చిన తర్వాత నౌకలోకి చమురును బదిలీచేసి రిఫైనింగ్‌కు తరలిస్తారు. ఈ ఎఫ్‌పీఎస్‌ఓ ‌మొట్ట మొదటిసారి చమురును ఈ ఏడాది జనవరి 7న వెలికితీసింది. ఇది రోజుకు 50వేల బ్యారళ్ల చమురు ప్రాసెసింగ్‌ ‌చేయగలదు. అదేవిధంగా 3 మిలియన్‌ ‌స్టాండర్డ్ ‌క్యూబిక్‌ ‌మీటర్ల సహజ వాయువును ప్రాసెస్‌ ‌చేయగలదు. దీని నిల్వ సామర్థ్యం 7లక్షల బ్యారళ్లు.
అండమాన్‌లో అపరిమిత చమురు నిల్వలు
అండమాన్‌ ‌దీవుల్లో 70 ఏళ్లకు సరిపడ ముడి చమురు మనం వెలికి తీయబోతున్నామన్న వార్తలు జనవరిలో వచ్చాయి. ఇక్కడ మొత్తం 610 మిలియన్‌ ‌టన్నుల హైడ్రోకార్బన్‌ ‌నిల్వలున్నట్టు తేలింది. 120 బిలియన్‌ ‌బ్యారల్స్ ఆయిల్‌ ‌లభిస్తుందని అంచనా. దేశీయంగా మనకు రోజువారీ అవసరాలు 4.5 మిలియన్‌ ‌బ్యారళ్లు. ఇంత పెద్దమొత్తంలో ఈ ప్రాంతంలో హైడ్రోకార్బన్ల లభ్యత ఉన్నప్పటికీ, చమురు అన్వేషణ వేగం పుంజుకోక•పోవడానికి దీన్ని డిఫెన్స్ అవసరాలకోసం ఉపయోగించడంవల్ల ప్రవేశాలు నిషేధించిన జోన్‌గా పరిగణించడం, పర్యావరణం, ఈ ప్రాంతంలో నివసించే అరుదైన జాతి ప్రజలు ఇతరత్రా అంశాలు కూడా కారణం కావచ్చు.
ఈ నేపథ్యంలో 2022 డిసెంబర్‌లో కేంద్ర కేబినెట్‌ ‌సమావేశమై అండమాన్‌ ‌వద్ద క్రూడాయిల్‌ ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రాంతంలోని భూములు డిఫెన్స్, అం‌తరిక్ష పరిశోధనా సంస్థకు చెందినవి కావడంతో ప్రభుత్వం వాటి నుంచి వేగంగా అనుమతులు పొందింది. ఆ విధంగా ఈ ప్రాంతంలో చమురు అన్వేషణకు ఆడ్డంకులను అధిగమించింది. అండమాన్‌ ‌దీవుల్లో వచ్చే మే నెలలో డ్రిల్లింగ్‌ ‌ప్రారంభించి, ఈ ఏడాది చివరినాటికి క్రూడాయిల్‌ ఉత్పత్తి చేస్తామని ఒ.ఎన్‌.‌జి.సి, ఆయిల్‌ ఇం‌డియా సంస్థలు చెబుతు న్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నేషనల్‌ ఐలాండ్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ‌ప్రాజెక్టు ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా, ఓఎన్‌జీసీ నేతృత్వంలో ఈ ప్రాంతంలో చమురు డ్రిల్లింగ్‌కోసం పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రణాళిక ప్రకారం ముందుగా మూడు బావుల్లో డ్రిల్లింగ్‌ ‌చేపట్టనున్నారు. ఒక్కొక్క బావికి రూ.350-400 కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రాంతంలోని 610 మిలియన్‌ ‌టన్నుల చమురు- సహజవాయువును వెలికితీయ గలిగితే మరో 70 ఏళ్ల వరకు దేశీయ చమురు అవసరాలకోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా చూస్తే భారత్‌కు ఇదొక వరంలాంటిది.
భౌగోళిక చరిత్ర
నిజానికి అండమాన్‌ ‌దీవుల్లో చమురు నిల్వల విషయం ఇప్పటిది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని బంగాళాఖాతం, మధ్యప్రాచ్య దేశాలో చమురు నిల్వలు ఉన్న ప్రాంతాల్లోని భౌగోళిక స్థితిని పోలిఉండటం విశేషం. సౌదీ అరేబియాలో ‘క్రస్టల్‌ ‌ప్లేట్‌’, ఇరాన్‌కు చెందిన ‘క్రస్టర్‌ ‌ప్లేట్‌’ ‌దిగువకు జారి 1200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉండే మాగ్మాలోకి ప్రవేశిస్తోంది. ఈ సమయంలో జరిగే రసాయన చర్యల కారణంగా హైడ్రోకార్బన్లు ఆవిర్భవిస్తున్నాయనేది భౌగోళిక శాస్త్రవేత్తలు తేల్చిన అంశం. సరిగ్గా ఇదేమాదిరి పరిస్థితి అండమాన్‌ ‌దీవులకు చెందిన బంగాళా ఖాతంలో కూడా నెలకొన్నదని వారు చెబుతున్న మాట. ఈ ప్రాంతంలో ఇండో-ఆస్ట్రేలియన్‌ ‌ప్లేట్‌, ‌యురేసియన్‌ ‌క్రస్టల్‌ ‌ప్లేట్‌ ‌దిగువకు చొచ్చుకు పోతుండటం వల్ల ముడిచమురు, హైడ్రోకార్బన్‌లు ఆవిర్భవిస్తున్నాయనేది శాస్త్రవేత్తల అంచనా. అండమాన్‌ ‌నికోబార్‌ ‌బేసిన్‌ ‌విస్తీర్ణం మొత్తం 225,918 చదరపు కిలోమీటర్లు కాగా ఇందులో 18,074 చదరపు కిలోమీటర్లు లోతు తక్కువ ప్రాంతం (shallow water) కాగా 207,844 చదరపు కిలోమీటర్లు డీప్‌వాటర్‌ ‌ప్రాంతం. అండమాన్‌ ‌బేసిన్‌లో మొత్తం 72 ఎంఎంటీఓఈ (మెట్రిక్‌ ‌మిలియన్‌ ‌టన్స్ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్వలెంట్‌) ‌హైడ్రోకార్బన్ల లభ్యత ఉండగా 2 ఎంఎటీఓఈ హైడ్రో కార్బన్లను ఇప్పటికి కనుగొన్నారు. దీన్ని ప్రస్తుతం సబ్‌-‌కమర్షియల్‌ (‌సబ్‌-‌కమర్షియల్‌ ‌ప్రాంతంలో నిర్ణీత సమయంలో ఉత్పత్తి ప్రారంభించ వచ్చు. సాధారణంగా ఈ సమయం 5ఏళ్ల కాలం వరకు ఉంటుంది) ప్రాంతంగా పరిగణిస్తున్నారు. మిగిలిన 70 ఎంఎంటీఓఈ హైడ్రోకార్బన్లపై అన్వేషణ కొనసాగాల్సివుంది.
సర్వే అంచనాల్లో తేడా
అండమాన్‌ ‌నికోబార్‌ ‌ద్వీపాల వద్ద దాదాపు 180 మిలియన్‌ ‌టన్నుల చమురు, 610 మిలియన్‌ ‌టన్నుల చమురుకు సమానమైన సహజవాయు (oil equivalent gas) నిల్వలున్నట్టు 2003లోనే డైరెక్టరేట్‌ ఆఫ్‌ ‌హైడ్రోకార్బన్స్ అం‌చనా వేసింది. తర్వాతి అధ్యయనాలు ఇక్కడి నిల్వలు120 బిలియన్‌ ‌బ్యారల్స్‌గా అంచనా వేశాయి. అయితే ఈ ప్రాంతంలో లభించే చమురు- సహజ వాయువు విషయంలో వివిధ సర్వేల అంచనాలు ఒకేమాదిరిగా లేకపోవడం గమనార్హం. బహుశా వారు చేపట్టిన సర్వే విధానాలను బట్టి ఫలితాలు వచ్చి ఉండవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఓఎన్‌జీసీకి మూడు బ్లాక్‌లు, ఆయిల్‌ ఇం‌డియాకు ఒక బ్లాక్‌ ఉన్నాయి. ఈ ప్రాంతంలోని సహజ వనరులపై భారతీయ కంపెనీలు మాత్రమే కాదు, విదేశీ కంపెనీలు కూడా దృష్టిపెట్టాయి. 2020లో యూకేకు చెందిన ప్రీమియర్‌ ‌గ్యాస్‌ ‌కంపెనీ అండమాన్‌ ‌ప్రాంతంలో చమురు వెలికితీతకు ప్రణాళికలు రచిస్తోందన్న వార్తలు వచ్చాయి. అండమాన్‌-2, ‌దక్షిణ అండమాన్‌ ‌ప్రాంతంలో 6 ట్రిలియన్‌ ‌ఘనపుటడుగుల గ్యాస్‌, 200 ‌మిలియన్‌ ‌బ్యారళ్ల చమురు ఉన్నట్లు ఈ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో 22,500 కిలోమీటర్ల తీరంలో 2డి-సిస్మిక్‌ ‌డేటాను సేకరించింది. నేషనల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ‌ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ పరిశోధన అనంతరం కేంద్రం ఈ ప్రాంతంలో చమురు అన్వేషణకు అవసరమైన నిధులు ఓఎన్‌జీసీకి కేటాయించడం మొదలుపెట్టింది. కేంద్రం విదేశీ కంపెనీలకు కూడా ఈ ప్రాంతంలో అన్వేషణకు ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ కంపెనీలైన ఓఎన్‌జీసీ ఆయిల్‌ ఇం‌డియా కంపెనీలు తమకు కేటాయించిన బ్లాక్‌ల్లో చమురు అన్వేషణ జరిపి డ్రిల్లింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఓఎన్‌జీసీ తనకు కేటాయించిన బ్లాకుల్లో రెండింటిలో సర్వే పూర్తిచేసి, మూడు బావుల్లో తవ్వకాలు చేపట్టాలని భావిస్తోంది. దీనిపై ఈ ఏడాది మే నెలాఖరులోగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ఇక అయిల్‌ ఇం‌డియా కంపెనీ చమురు తవ్వకాలకు మూడు ప్రదేశాలను గుర్తించినప్పటికీ బిడ్డింగ్‌పై ఒక నిర్ణయానికి రానట్టు తెలుస్తోంది. ఎక్సాన్‌మొబిల్‌, ‌చెవ్రాన్‌, ‌టోటల్‌ ఇం‌జినీర్స్ ‌వంటి విదేశీ సంస్థలకు కూడా ఈ ప్రాంతంలో చమురు అన్వేషణపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.
పొంచి ఉన్న ప్రపంచయుద్ధ ప్రమాదం
రష్యాతో సాయుధ సంఘర్షణకు జర్మనీ సిద్ధమవుతోందంటూ ‘బిల్ట్’ ‌దిన పత్రిక ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది. జర్మనీ రక్షణ శాఖ నుంచి తనకు ఈ కీలక పత్రాలు లభించినట్టుకూడా పేర్కొంది. దీని ప్రకారం 2025 నాటికి నాటో దేశాలపై దాడులకు దిగడం ద్వారా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని రష్యా విస్తరించే అవకాశం ఉంది. యూరప్‌ ‌దేశాలు కూడా రష్యా దాడి నుంచి తమను తాము రక్షించుకునే యత్నాల్లో పడ్డాయని కూడా ఈ నివేదిక పేర్కొంది. ‘అలయెన్స్ ‌డిఫెన్స్-2024’’ ఏర్పాటవుతుందని, ముందుగా కొద్ది వేల సంఖ్యలో జర్మనీ సైన్యాలను యుద్ధరంగానికి పంపిన తర్వాత నుంచి అసలు యుద్ధం మొదలవు తుందని పేర్కొంది. నాటో దేశాలు రష్యా దాడులను ఏ విధంగా ఎదుర్కొంటాయనేది కూడా ఇందులో వివరంగా ఉన్నాయని ఆ కథనం పేర్కొంది. బహుశా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావచ్చని కూడా హెచ్చరించింది. అయితే రష్యా అధికార్లు దీన్ని తప్పుడు వార్తగా కొట్టిపారేసినప్పటికీ, ప్రపంచ రాజకీయ పరిణామాలు కూటములు ఏర్పడే దిశగా కొనసాగుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇంధన పెను సంక్షోభం ఏర్పడక తప్పదు. అన్ని దేశాలు బాధితులుగానే మిగిలిపోతాయి. మన దేశానికీ మినహాయింపు లేదు. ఇప్పటికే రష్యా, చైనా, ఇరాన్‌ ‌వంటి దేశాలు కూటమిదిశగా వెళుతుంటే, అమెరికా, యూరప్‌ ‌దేశాలు మరో కూటమిగా క్రమంగా ఏర్పడుతున్నాయి. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడు ఏ విపరిణామానికి దారితీస్తాయో చెప్పడం కష్టం. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా దాదాపు గెలిచింది. ఇప్పుడు ఆ దేశం నాటో దేశాల కట్టడికి యత్నించే అవకాశాలే ఎక్కువ. ఇది ప్రపంచ యుద్ధానికి దారితీయక తప్పదు. కాలగతిని నిలువరించడం సాధ్యం కాదు!

-జమలాపురపు విఠల్‌రావు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE