సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ మాఘ బహుళ నవమి
04 మార్చి 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
మైనారిటీలను బుజ్జగించడానికి దురాచారాలను కూడా కొనసాగించే దుస్థితికి ఇవాళ్టి రాజకీయం దిగజారడం అత్యంత విషాదం. సాంఘిక దురాచారాలను వదిలించుకోవడానికి భారతీయ సమాజం సుదీర్ఘ పోరాటమే చేసింది. అయితే అదంతా ఒక వర్గానికి పరిమితం. మైనారిటీలలో ఒక భాగం ఇస్లాంలో సంస్కరణకు చోటు తక్కువ. దీనితో కొన్ని దురాచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆ మతంలోను సంస్కరణల కోసం కొన్ని ఉద్యమాలు జరగలేదని చెప్పలేం. కానీ తక్కువ. ఏమైనా దురాచారాల దుష్ఫలితాలు ఎక్కువగా అనుభవించేది (ఏ వర్గంలో అయినా కూడా) మహిళలే. అస్సాంలో అమలులో ఉన్న ‘ముస్లిం వివాహ, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం, 1935’ అందుకు సంబంధించిన అవశేషమే. దానినే ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరిణామాన్ని స్వాగతించడానికి బదులు బుజ్జగింపు రాజకీయ శిబిరాలు యథాతథ స్థితిని కోరుతున్నాయి.
అస్సాంలో ప్రతిపక్ష కాంగ్రెస్, ఆలిండియా యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్ (ఏఐయుడీఎఫ్) ఫిబ్రవరి 26న ఈ అంశం మీద శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. 1935నాటి ఆ చట్టాన్ని రద్దుచేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. మంత్రిమండలి నిర్ణయం గురించి చర్చకు పట్టుపడుతూ ఏఐయూడీఎఫ్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్ బిశ్వజిత్ దయామరి నిరాకరించారు. బిల్లుకు సవరణలు చేయవచ్చు గాని, మొత్తంగా రద్దు చేయడం సరికాదన్నది కాంగ్రెస్ వాదన. రాష్ట్రంలో పెద్ద సామాజిక బెడదగా పరిణమించినందుకే బాల్య వివాహాలను అరికట్టడానికి ముస్లిం వివాహ, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ సామాజిక రుగ్మతని పూర్తిగా నిర్మూలించడానికి ఈ నిర్ణయం తొలి అడుగు అవుతుందని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒక దశలో విపక్షాల అడ్డగోలు వాదనలకు ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ‘జాగ్రత్తగా వినమని ప్రార్థన. నేను జీవించి ఉన్నంతకాలం అస్సాంలో బాల్య వివా హాలకు అనుమతించబోనని శపథం చేస్తున్నాను. 2026 సంవత్సరంలోగానే ఈ దుకాణం మూయిస్తానని మీకు రాజకీయంగా సవాలుచేస్తున్నాను’ అని సభలో గర్జించారాయన. ఆ దుకాణం అంటే ముస్లిం బాలికల జీవితాలను ధ్వంసం చేయడానికి కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ తెరిచిన దుకాణమని ఆయన బాహాటంగానే విమర్శించారు. అయినా ఈ పక్షాలు తమ పట్టు వీడలేదు. మంత్రిమండలి నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ పది నిమిషాలపాటు వాకౌట్ చేసింది. ఏఐయుడీఎఫ్ ఐదు నిమిషాలు సభలో బైఠాయించి తరువాత వాకౌట్ చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏకైక సీపీఎం సభ్యుడు మాత్రం సభలోనే ఉండిపోయారు.
ముస్లింలకే పరిమితమైన బ్రిటిష్ కాలం నాటి ఆ చట్టం ప్రకారం ముస్లిం కుటుంబాలలో జరిగిన వివాహాలను లేదా తీసుకున్న విడాకుల గురించి స్వచ్ఛం దంగా రిజిస్ట్రర్ చేసుకోవాలి. అయితే ఇందులో ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేదు. ఒక ముస్లింకు రిజిస్ట్రేషన్ చేసే హక్కును (లైసెన్స్‌ను) ప్రభుత్వం అప్పగిస్తుంది. ఈ దుష్ట సంప్రదాయాన్ని ఆపడానికే ఫిబ్రవరి 23న మంత్రిమండలి ఈ చట్టం రద్దుకు ఆమోద ముద్ర వేసింది.
చాలాచిత్రంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన తలాక్ రద్దు చట్టం అస్సాంలో వర్తించడం లేదు. అందుకు అడ్డంగా నిలిచినది 1935 నాటి ఆ ముస్లిం వివాహ, విడాకుల చట్టమే. చట్టం ప్రకారం వివాహం చేసిన యువతికి 18 సంవత్సరాల నిండకపోయినా, ఆ పెళ్లి రిజిస్టరవుతుంది. కానీ అందుకు బాధ్యత రిజిస్ట్రేషన్ అధికారం ఉన్న ఖాజీది కాదు. ఆ చట్టం ఖాజీని బాధ్యుడిని చేయడం లేదు. అంటే 18 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయడానికి ఈ చట్టం అన్ని విధాలా తోడ్పడుతుంది. ఇంకా చెప్పాలంటే చట్టం లోని 8(1) వయోపరిమితితో సంబంధం లేకుండా బాలికలకు వివాహం చేయడానికి అనుమతి ఇచ్చేదే. దీనిని సవరించి మిగిలిన చట్టాన్ని యథాతథంగా ఉంచాలని కొందరి వాదన. ఇది ఎంత అర్థరహితమో చెప్పక్కరలేదు. ఆ సంగతి ఎలా ఉన్నా ఈ చట్టం రద్దు దరిమిలా ఇష్టారాజ్యంగా విడాకులు ఇవ్వడానికి మాత్రం వీలు ఉండదు. బాల్య వివాహాల మీద హిమంత బిశ్వశర్మ అక్షరాలా యుద్ధమే ప్రకటించారు. గడచిన సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద నిఘా పెట్టారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వేలాది మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది కూడా.
ఈ మార్పును ఉదారవాదులు యథాప్రకారం విమర్శించడం ఆరంభించారు. ఎలాగంటే బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 అమలులో ఉంది. ఇప్పుడు కొత్త చట్టం తీసుకువస్తే ముస్లింలలో గందరగోళం సృష్టించడమేనని అంటున్నారు. మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అయితే ఇస్లాం నుంచి యువతను దూరం చేయడానికే ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం 1935 చట్టాన్ని రద్దు చేసిందని పెద్ద ఆరోపణే చేశారు. బాలికల జీవితాలు నాశనమైపోతున్నా, ఛాందసత్వం, ఓటు బ్యాంకు రాజకీయాలు కొనసాగాలన్నదే వీరందరి లక్ష్యంగా కనిపిస్తున్నది.
ఉత్తరాఖండ్ తరువాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడానికి సిద్ధ పడుతున్న రాష్ట్రం అస్సాం. 1935 నాటి ఆ చట్టం రద్దు ఇందుకు నాంది అన్న అభిప్రాయం ఉంది. వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాలలో దేశ ప్రజలందరినీ ఒకే చట్టం కిందకు తెచ్చే ఉద్దేశంతో తీసుకువస్తున్నదే ఉమ్మడి పౌరస్మృతి. దీనికి పరిస్థితులను సానుకూలం చేసే ఏ చర్యకయిన మద్దతు ఇవ్వడం దూరదృష్టి కలిగిన వారి బాధ్యత.