వైసీపీ పాలనల సంక్షేమ కార్యక్రమాలకే తప్ప అభివృద్ధి పథకాలకు అవకాశం లేకుండా పోయిందని ఒకపక్క ఆవేదన వ్యక్తమవుతుంటే, ఆర్థిక వనరలు సమీకరణ కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ప్రతి పక్షాలు సహా అన్నివర్గాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా  రూ. 370 కోట్ల అప్పుకోసం సచివాలయ భవనాన్ని జగన్‌ ప్రభుత్వం తాకట్టు పెట్టిందనే వార్తలు  చర్చనీయాంశమయ్యాయి. అది రాష్ట్ర ప్రతిష్ఠకే తీరని అవమానంగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

వైసీసీ ప్రభుత్వ దాదాపు అయిదేళ్ల పాలనాకాలంలో చాలినంతగా మూలధన పెట్టుబడులకు నిధులు ఖర్చుచేయకపోవడంతో రాష్ట్రంలో అభివృద్ధి పడకేసింది. అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల జోలికి పోకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయింది. కొత్త పరిశ్రమలు రాకపోవడం అటుంచి ఉన్నవి సైతం మూలనపడ్డాయి. కక్ష సాధింపులతో కొన్ని పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిపెట్టకపోవడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వ్యవసాయం దెబ్బతింది. ఈ ప్రభావం ఉత్పాదక రంగంపై పడిరది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. దానికి తోడు పన్నుల భారం ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపింది.

నవరత్నాల హామీల అమలుకు దొరికన చోటల్లా అప్పులు చేశారు.అప్పుల స్థాయిలో ఆదాయం పెరగలేదు. వడ్డీలే అతిభారంగా మారిన తరుణంలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖలోని రుషికొండపై రూ.450 కోట్లతో భవనం నిర్మించడం వివాదాస్పదమైంది. అధునాతనంగానే ఉన్న భవనాన్ని పాత భవనంగా చూపి దానిని కూలదోసి కొత్తభవనాన్ని నిర్మించారు. దీనిని వైసీపీ అధినేత నివాసంగా కట్టబెడతారనేది విపక్షాల ఆరోపణ. ఇంతలోనే ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. రూ.370 కోట్ల అప్పుకోసం అమరావతి రాజధానిలోని రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టినట్లు వచ్చిన విమర్శలు ఎన్నికల ముందు గెలుపుపై ప్రభావం చూపించేవే.

రాష్ట్రానికి అభివృద్ధి ఎంతో ముఖ్యం. అభివృద్ధి పనులు/ప్రాజెక్టులకు నిధులను వెచ్చిస్తూపోతే క్రమంగా రాబడులు పెరుగుతాయి. ఆ పెరిగిన ఆదాయం ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుంది. ఈ సూత్రాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఏపీలో ఎటుచూసినా అసంపూర్తి పనులు,ప్రాజెక్టులు, నిర్మాణాలు కనిపిస్తున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌ స్వరూపం ఎంతున్నా మూలధన వ్యయం కింద చేసే ఖర్చులే రాష్ట్ర ప్రగతిని నిర్దేశిస్తాయి. ప్రగతికి నిధులే వెచ్చించకుంటే.. ఇక పనులెలా పూర్తవుతాయి? ఫలితాలెలా వస్తాయి? రాష్ట్ర ఆదాయమెలా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ సర్కారు తమ హయాంలో ఏ ఏడాది మూలధన వ్యయం సరిగ్గా చేయలేదు.

మూలధన వ్యయంపై నిర్ల్యక్షం

మూలధన వ్యయం అంచనాలు తగ్గిపోవడమే కాదు… మొత్తం ఖర్చులోనూ ఈ కేటగిరీ వ్యయం తక్కువే. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 వరకు పరిశీలిస్తే… మొత్తం బడ్జెట్‌ అంచనాల్లో మూలధన వ్యయం అంచనాలు వరుసగా 14.60% నుంచి 13.30 శాతానికి, ఆ తర్వాత 8.06 శాతానికి తగ్గిపోయాయి. ఆ తర్వాత 11.97% మేర కేటాయింపులు చూపారు. మొత్తం బడ్జెట్‌ ఖర్చులో మూలధన వ్యయం కింద చేసిన ఖర్చు బాగా తగ్గిపోతూ వచ్చింది. 2020-21లో అది 10.14% ఉంటే ఆ మరుసటి ఏడాది 8.54 శాతానికి, ఆ తదుపరి ఏకంగా 3.20 శాతానికి తగ్గిపోయింది.

తాజాగా 2022- 23కు సంబంధించిన లెక్కలను కాగ్‌ ఖరారు చేసేసింది. ఆ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద చేసిన ఖర్చు రూ.7,244 కోట్లు మాత్రమే. ఆ ఏడాది మొత్తం బడ్జెట్‌ ఖర్చు రూ.2.25,853.36 కోట్లు. గత ఎనిమిదేళ్లలో ఎప్పుడూ ఇంత అత్యల్ప వ్యయం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం… అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మరీ తక్కువగా ఉంది. ఇది ఏకంగా 39% తక్కువ. కాగ్‌ తెలిపిన ప్రకారం… 2018-19లో మూలధన వ్యయంగా రూ.19,976 కోట్లను ఖర్చు చేయగా వైసీసీ సర్కారు తొలి ఆర్థిక సంవత్సరం 2019-20లో ఇదే మూలధన వ్యయం రూ.12,242 కోట్లు మాత్రమే. అంటే అభివృద్ధి పనులపై చేసిన నిధుల ఖర్చు అంతకు ముందు ఏడాది కన్నా 39% తగ్గిపోయింది.

నిరుత్సాహంలో ఆర్థిక రంగం

ప్రభుత్వాలు ప్రగతి పనులకు తగినన్ని నిధులు వెచ్చిస్తేనే ఆర్థికరంగం బలం పుంజుకుంటుంది. ఫలితంగా ప్రజలకు ఉపాధి, ఆదాయమూ పెరుగుతాయి. మౌలిక సౌకర్యాలు కల్పిస్తే పరిశ్రమలు పెరుగుతాయి. ఫలితంగా ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఈ ఆర్థికచక్రమే… రాష్ట్రం, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపకరిస్తుంది. ఒక్క సాగునీటి రంగాన్నే తీసుకుంటే 2024 నాటికి మొత్తం 42 ప్రాజెక్టులు పూర్తి చేసేస్తామని ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం… కేవలం నెల్లూరు, సంగం బ్యారేజీలు, అవుకు రెండో టన్నెల్‌ పనులు మాత్రమే పూర్తి చేసింది. కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురాలేకపోయింది. రోడ్ల నిర్మాణమూ సరిగా జరగలేదు. సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు, ఇతర అభివృద్ధి పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

ప్రతి జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటి పట్ల ఆసక్తి చూపించలేదు. ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతాంగానికి నిరాశ ఎదురైంది. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వ ఆదాయాన్ని పంపిణీ చేస్తూ నాలుగేళ్లు గడిపేశారు.చాలా ప్రాజెక్టు పనులు 65 నుంచి 95 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులకు నోచుకోవడం లేదు. 72 శాతం పూర్తయిన పోలవరం పనుల్లో కదలికలేదు. నాలుగేళ్లలో లక్షల కోట్ల అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను మాత్రం నిర్ల్యక్షం చేస్తోంది. వంశధార, నాగావళి అనుసంధానం పూర్తికాలేదు. హంద్రీ- నీవా ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 10 వేల క్యూసెక్కులు లిఫ్ట్‌ చేసేలా సమాంతర కాలువ నిర్మిస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని ఆయన మరచిపోయారు.

మౌలిక వసతుల కల్పనపై చిత్తశుద్ధి లేదు!

వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేకపోవడం కూడా ఉపాధి అవకాశాలను కోల్పోయేలా చేసింది. ఈ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కూడా నిర్లక్ష్యం చేసింది. నాలుగేళ్లలో రూ.2.20 లక్షల కోట్ల నగదును సంక్షేమ పథకాలకు పంపిణీ చేశామన్న ప్రభుత్వం మౌలిక సదుపా యాలకు మాత్రం అందులో పదిశాతం కూడా ఖర్చుపెట్టలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పరిధిలోని విశాఖపట్నం వద్ద నక్కపల్లి నోడ్‌, మచిలీపట్టణం నోడ్‌, దొనకొండ నోడ్‌, కొప్పర్తి నోడ్‌, శ్రీకాళహస్తి -ఏర్పేడు నోడ్‌లు, చెనై – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌ కింద కృష్ణపట్నం నోడ్‌, బెంగళూరు – హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్‌ కింద ఓర్వకల్లు నోడ్‌, హిందూపూర్‌ నోడ్‌, అనంతపురం నోడ్‌లకు ఈ ప్రభుత్వం భూములు కేటాయించకపోవడంతో పారిశ్రామిక అభివృద్ధి జరగక ఉపాధి అవకాశాలు కూడా పెరగలేదు.

తాకట్టుపై నిరసన

రూ.370 కోట్ల అప్పుకోసం ఏకంగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టారనే అంశం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం రూ. 2.86 లక్షల కోట్లతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించింది. అంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే ఏపీ సెక్రటేరియట్‌ భవనాలను బ్యాంకుకు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

రాష్ట్రానికి రాజధానిలోని సచివాలయం గుండెకాయవంటిది. రాష్ట్ర సార్వభౌమాధికారానికి ఒక గుర్తు. అలాంటి అధికార కేంద్రాన్ని అప్పుకోసం తాకట్టు పెట్టడాన్ని ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిని రాష్ట్రం పరువు తీయడంగా భావిస్తున్నారు. రూ.370 కోట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో తెలుసా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని ఆవేదన చెందుతున్నారు.

– వల్లూరు జయప్రకాష్‌ నారాయణ

ఛైర్మన్‌,సెంట్రల్‌ లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
YOUTUBE