కుటుంబ పాలన అంటూ పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు కొందరు! అందులో తప్పేమిటి? నలుగురు పిల్లలు ఉంటే అందులో ఒకరు రాజకీయాలలోకి రావాలని ఉబలాటపడితే, పిల్లల సరదా తీర్చడానికి తండ్రి కాస్త లైన్ క్లియర్ చేస్తే అదే పెద్ద తప్పిదమా? దీనికే ఇంత రాద్ధాంతం చేయాలా? మీకు కుటుంబం లేదని, మీకు అలా వారసుల బాధ లేదని, మిగిలిన వాళ్లకి కూడా ఉండకూడదని అనడం ఏమి న్యాయం? అన్న పద్ధతిలో నిలదీసింది పట్నాలో జరిగిన ఇండీ కూటమి. ఫిబ్రవరి 4న జరిగిన ఈ సమావేశం చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. జన విశ్వాస్ మహా ర్యాలీ దీని పేరు. పట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగింది. మిగిలిన వారు ఏం మాట్లాడారో, ఎంత మాట్లాడారో మీడియా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆర్‌జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి దాణా కుంభకోణం ఫేం లాలూ ప్రసాద్ యాదవ్ ఉపన్యాసం జాతిని తిట్టి లేపే విధంగా ఉంది. ఆయన మాటలే మీడియా అంతటా ప్రతిధ్వనించాయి.
అది కుటుంబ పాలన.. మీది కుటుంబ పాలన, విపక్షాలన్నీ కుటుంబ పాలన బాధితులే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల వారిని తరచు విమర్శించడం లాలూ యాదవ్‌కు బొత్తిగా నచ్చలేదు. నరేంద్ర మోదీకి కుటుంబం లేకపోతే దానికి మేమా బాధ్యులం అంటూ ఎలాంటి శషభిషలు లేకుండా నిండు సభలో ప్రశ్నించారాయన. ఇక్కడ లాలూ ఘోష ఏమిటీ అంటే మోదీకి కూడా కుటుంబం ఉండి ఉంటే, సంతానమూ ఉండేది, కాబట్టి సహజంగానే సదరు సంతానం రాజకీయాలలోకి వస్తామని కాళ్లకి అడ్డం పడేది. చేసేదేమీ లేక మోదీ కూడా సంతానాన్ని రాజకీయాలలోకి తీసుకురాక తప్పేదా అన్నదే. ఈ మాటలు అంటున్నప్పుడే లాలూలో ఇంకాస్త ఆవేశం పెల్లుబుకింది? ఈ మాట కంటే తిక్క హఠాత్తుగా ముదిరిందనడం సబబు. ఆ ఆవేశంలో, అసలు నీకు పిల్లులు ఎందుకు లేరో చెప్పాలి? అని కూడా అరిచారు. కాపురం చేయని వ్యక్తికి పిల్లలు ఎలా ఉంటారు లాలూజీ!
ప్రతిసారి రామాలయం కట్టానని మోదీ చెప్పుకుంటున్నారు (నిజమా! అలా మోదీ ఎప్పుడు చెప్పారు?). మోదీ ఏం చెప్పుకున్నా, అసలు ఆయన నికార్సయిన హిందువే కాదు అని ఒక మహా రహస్యాన్ని లాలూ భారతజాతి ముందు విప్పారు. ఎందుకు నకిలీ హిందువూ అంటే తల్లి మరణించి నప్పుడు మోదీ శిరోముండనం చేయించుకోలేదట. తల్లి చనిపోతే శిరోముండనం చేయించుకోని వాడు కూడా ఓ హిందువేనా అన్నది లాలూ లాజిక్. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాళ్లకి మోదీ మాటలు ఎంత బాధిస్తాయో కదా అన్నట్టు చెప్పారాయన. బిహార్ ఎందరికో గొప్పవారికి జన్మనిచ్చింది. వారు ఈ గాంధీ మైదాన్ నుంచే దేశాభ్యుదయానికి పిలుపు నిచ్చారని గుర్తుచేశారు. ఇవాళ బిహార్ ఏమి ఆలోచిస్తుందో రేపు భారతదేశం అదే ఆలోచిస్తుందని ఆయన కొత్త విషయం చెప్పారు. కానీ అదృష్టం, దాణా కేసులో భారతదేశం అలా చేయలేదు. అది లాలూ గుర్తించాలి. మనమంతా సంతోషించాలి. నిజానికి ఈ కార్యక్రమానికి మమతా దీదీ రాలేదు కాబట్టి సరిపోయింది. వస్తే పెద్ద రగడే జరిగేది.చీలిన ఇండీ ఈ ఉపద్రవాన్ని తప్పించినందుకు ఆనందిద్దాం. ‘ఇవాళ బెంగాల్ ఏమి ఆలోచిస్తే రేపు భారత్ అదే ఆలోచిస్తుంది’ అని కదా! దీనిని మీరు హైజాక్ చేస్తే ఎలా! అందుకే విపక్షాల మధ్య పొసగడం లేదు అని దీదీ ఎదురుదాడికి దిగేవారే.
బిహార్ ఆలోచించినట్టు భారతదేశం ఆలోచించే అవకాశమే లేదు. ఎందుకంటే లాలూ ప్రసాద్ మిగిలిన చోట్ల పుట్టలేదు. ఆయన శైలే వేరు. సినిమా భాషలో ఆయన రూటే వేరు. కొద్దికాలం క్రితం ఒక చెణుకు చెలామణిలో ఉండేది. ఒకసారి జపాన్ వాళ్లు మీ బిహార్‌ను మా చేతిలో పెడితే నాలుగేళ్లలో టోక్యోలో మార్చేస్తాం అన్నారట. ఎంతయినా లాలూ చమత్కారం, అందులో వేగం అసాధారణం. మీరు టోక్యోని మా చేతిలో పెడితే రెండు వారాలలో మా బిహార్‌లా మార్చేస్తాం అన్నారట. ఈ మాటలు చెప్పడమంటే నాయకమ్మన్యులు ఘనత చెప్పడమే. సాధారణ ప్రజల గురించి కాదు. అలాగే ఒకసారి పట్నాలో కార్ల షోరూమ్ ప్రారంభోత్సవానికి లాలూని పిలిచారట. ప్రారంభోత్సవం అయిన తరువాత ఒక కారు-ఖరీదైనదే సుమా-లాలూకు కానుకగా ఇచ్చారట కంపెనీ వారు. ఏమిటి లంచమా? అని నిలదీశారట లాలూ. అబ్బే అలా అనుకోవద్దు కావాలంటే ఒక యాభయ్ రూపాయలు ఇవ్వండి అదే మేమిచ్చిన కారుకు మీరు చెల్లించే మూల్యం అన్నారట. వెంటనే లాలూ జేబులో నుంచి వంద రూపాయల కాగితం తీసి ఇచ్చి సాయంత్రం రెండు కార్లు మన ఇంటి దగ్గర పార్కు చేయించండి అని చెప్పాడట.
మోదీ కుటుంబం వ్యాఖ్య మీద ప్రతిస్పందన తీవ్రంగానే వచ్చింది. దీనికి లాలూ ప్రసాద్ తనయుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సమాధానం ఇచ్చారు. మా నాన్న అన్నదాంట్లో తప్పేముంది అంటారాయన. దీనికి ఉపోద్ఘాతంగా తేజస్వీ అన్నమాట చెప్పుకోదగినది. మా నాన్న వ్యాఖ్యలు బీజేపీని ఇంతగా కదిలించినందుకు ముందు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారాయన. మోదీ చాలా మాట్లాడతారు. కానీ నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడరు? పెరిగిపోతున్న పేదరికం గురించి ఎందుకు పెదవి విప్పరు? అని ఉప ప్రశ్నలు వేశారు తేజస్వీ. దేశంలో ఉన్న 140 కోట్లమంది తన కుటుంబ సభ్యులేనని చెప్పుకున్న మోదీ ఆందోళనకు దిగిన రైతులను ఎందుకు అణచివేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. నిజమే కదా! తల్లి చనిపోతే శిరో ముండనం చేయించుకోవాలి. మోదీ చేయించుకోలేదు. అన్నట్టు గెడ్డం కూడా తీయించాలి. అదీ చేయలేదు అంటారు తేజస్వీ. ఆఖరికి సంప్రదాయం కాబట్టి తన కుమార్తెకు కూడా తాను శిరో ముండనం చేయించానని ఆయన చెప్పారు. మాకు హిందుత్వ తేలియదన్నట్టు, అంతా బీజేపీదే అన్నట్టు చెబుతున్నారు కానీ, తమది కూడా సంప్రదాయ హిందూ కుటుంబమేనని ఆయన ప్రకటించారు. మా ఇంట్లోనే ఉన్న దేవుడి గుడిలో రోజూ ఉదయం, సాయంత్రం కూడా హారతి ఇస్తారని తెలియచేశారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ మహా నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ నాయకుడు అఖిలేశ్ కూడా హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకే ఊతమిస్తున్నదని రెండువేల ఒకటో సారి గర్జించారు రాహుల్. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల చిన్న తరహా వ్యాపారులు నష్టపోతున్నారని వాపోయారు. అమృతకాల్ అనేది ఏదైతే ఉందో అది బీజేపీ పాలన ముగిసిన తరువాత మాత్రమే వస్తుందని సీపీఎం నేత సీతారాం ఏచూరి, అఖిలేశ్ కోరస్‌గా అన్నారు.
మోదీ శైలి తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయడం? పాపం ఇప్పుడు ఇండీ కూటమిని చూస్తే జాలి లాంటిదేదో వేస్తుంది. మన అదిలాబాద్ సభలోనే మోదీ నాకు కుటుంబం లేకపోవడం ఏమిటి? 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబమే అని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. తామంతా మోదీ పరివార్ అంటూ ప్రతి బీజేపీ నాయకుడు ఒక ట్వీట్ పెట్టాడు. ఆఖరికి మోదీ వీరాభిమాని, ఇటలీ ప్రధాని జార్జియా మొలోని కూడా నేను సైతం అంటూ మోదీ పరివార్ సభ్యురాలిగా ట్వీట్ చేశారు.
ఇవన్నీ వేరు, బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సుధాంశు త్రివేది ఇచ్చిన రిటార్ట్ ఒకటీ వేరు. అయ్యా లాలూగారూ! భక్తుకే వారసత్వం వస్తుంది తప్ప, కొడుకులకు కాదు అని గుర్తు చేశారు త్రివేది. ఎలాగంటే దేశం నిండా రాముడి భక్తుడు ఆంజనేయస్వామికి గుడులు ఉంటాయి. కానీ రాముడి కుమారులు కుశలవులకు ఎక్కడైనా ఆలయాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. సామాజిక సంబంధాలలో గురు శిష్య సంబంధం ఉంది కానీ, తండ్రి కొడుకుల సంబంధం కుటుంబానికే పరిమితమై ఉంటుంది కదా అని త్రివేది గుర్తు చేశారు. అయినా ఇవన్నీ లాలూ ప్రసాద్‌కీ, అఖిలేశ్‌కి, రాహుల్‌కి ఎలా అర్ధమవుతాయి? రాహుల్ ముత్తాత ఈ దేశ తొలి ప్రధాని. నానమ్మ మూడో ప్రధాని. తండ్రి నాలుగో ప్రధాని. ఈ సత్సంప్రదాయం తప్పితే అరిష్టం కాదూ అనుకుంటున్నారు వారంతా. అలాగే లాలూ వారసునిగా తేజస్వీ యాదవ్ లైన్‌లో ఉన్నాడు. ములాయం వారసుడిగా అఖిలేశ్ కొంతకాలం చక్రం తిప్పి ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు. ఇలాంటి జాగ్రత్త, ముందుచూపు మోదీకి లేకపోతే మాదా తప్పు అంటున్నారు ఇండీ సభ్యులు. అదే పట్నా ర్యాలీ ఫలశ్రుతి.
– జాగృతి డెస్క్