సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ఫాల్గుణ శుద్ధ పాడ్యమి – 11 మార్చి 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


తమిళనాడు ద్రవిడస్థాన్‌ అయిపోలేదు. అందుకోసం మహమ్మదలీ జిన్నా తోడుగా ఈవీ రామస్వామి నాయకర్‌ చేసిన ప్రయత్నం ఆదిలోనే తుస్సుమంది. ఈ ప్రమాదకర, స్వార్థపూరిత కోరికను పాకిస్తాన్‌ వేర్పాటువాది జిన్నాయే కాదు, బ్రిటిష్‌ వాడు కూడా చీదరించుకున్నాడు. కానీ తమిళనాడు ఏనాడో ద్రవిడస్థాన్‌గా మారిపోయిందనే పిచ్చి భ్రమలలో ఉంటారు చాలామంది డీఎంకే నాయకులు. కార్యకర్తలనీ, వారసులనీ కూడా ఉంచుతారు. అలాంటివారిలో ఒకడే ఉదయనిధి స్టాలిన్‌. తమిళనాడు అంటే హిందూ ద్వేషానికి అతి పెద్ద వేదిక అన్నదే ఉదయనిధి పార్టీ నిశ్చితాభిప్రాయం. సనాతన ధర్మాన్ని ఎంత దూషిస్తే తమకు అంత బలమన్న వెర్రితనం కూడా అక్కడ తక్కువేమీ కాదు. అలాంటి రాజ్యానికి తామే శాశ్వత ఏలికలమని ఉదయనిధి పిచ్చి నమ్మకం. సనాతన ధర్మం మీద పేలుడు దాని ఫలితమే.

కానీ తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే, వాడి తల తన్నేవాడు వేరొకడు ఉంటాడు. ఇది ప్రకృతిధర్మం. అధికార మదంలో, పదవితో వచ్చిన మత్తులో ఇది గుర్తించరు ద్రవిడవాదంలో కూరుకుపోయిన దౌర్భాగ్యులు. దాని ఫలితం దారుణంగానే ఉంటుంది. ఉండాలి కూడా. ‘సనాతన ధర్మాన్ని మార్చడం అన్న ఆలోచనే దండగ. కొన్నింటిని వ్యతిరేకించాలని అనుకోకూడదు. వాటిని వ్యతిరేకించడం కాదు, కూకటివేళ్లతో పెళ్లగించాలి, అంతే. డెంగ్యు జ్వరాన్నీ, దోమలనీ, మలేరియానీ లేదా కరోనానీ వ్యతిరేకించడం కాదు, నిర్మూలించా ల్సిందే’ ఇవి, మేధావుల పేరుతో చెలామణి అవుతున్న పనికిమాలిన రచయితల వేదిక మీద రెచ్చిపోయి ఉదయనిధి కూసిన కూతలు. ఇన్నాళ్లకి పాపం పాక్షికంగా పండిరది. నిరుడు కూసిన ఆ కూతల మీద ఈ ఫిబ్రవరి 4వ తేదీన సుప్రీం కోర్టు గూబ గుయ్యిమనే రీతిలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సిగ్గూశరం ఉన్న మనిషి ఎవడైనా అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన ఈ అభిప్రాయానికి వెంటనే రాజీనామా చేసి పోయేవాడు. ఇక్కడ అలాంటి విలువను ఆశించలేం.

‘నువ్వొక మంత్రివి! నిరక్షర కుక్షివి కాదు. పరిణామాలు (ఇలాంటి కారుకూతల కూసిన తరువాత) ఎలా ఉంటాయో తెలిసి ఉండాలి’ ఇదీ అత్యున్నత న్యాయస్థానం అన్నమాట.ఆర్టికల్‌ 19(1)(ఎ), 25వ అధికరణాల ప్రకారం దక్కిన వాక్‌స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును నీవు పూర్తిగా దుర్వినియోగం చేశావు’ అని కూడా కోర్టు కర్రు కాల్చి వాతపెట్టింది. వాగేవన్నీ వాగేసి చివరికి శరణు శరణంటూ ఈ న్యాయస్థానానికి రావడం ఏమిటి అని కూడా కడిగేసింది. నాలుక తీటను ప్రదర్శించిన తరువాత తన మీద వెల్లువెత్తిన కేసులలో ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటిని ఒకే అంశంగా చూడాలంటూ ఈ వీర హిందూ వ్యతిరేక మంత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించడం జుగుప్సాకరంగా ఉంది. ఇలా సమాజంలో మంటలు రేపే మాటాలన్నీ మాట్లాడి, పీకల్లోతు కష్టాల్లో మునిగిన తరువాత కోర్టు సాయం కోరడం ఏమిటని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపంకర్‌ దత్తా నిలదీశారు. నిజమే, నోటినిండా ఇంత రోత ఉన్నవాడిని కూడా కోర్టులు రక్షించడ మేనా అన్న ప్రశ్న వస్తుంది మరి! ఏ కోర్టు పిలిచినా సనాతన ధర్మం గురించి నా అభిప్రాయం ఏదైతే ఉందో అదే చెబుతాను అని జబ్బ చరుచుకున్న వీరాధి వీరుడు ఇతడు. కానీ ఎఫ్‌ఐఆర్‌ల వెల్లువతో తోక ముడిచాడు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని ఇతడు చెప్పేసిన తీర్పును సమున్నత న్యాయ స్థానం ఈడ్చి తన్నిందంటే అతిశయోక్తి కాదు. అసలు సనాతన ధర్మం మీద ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడానికి అతడికి ఉన్న హక్కు, అర్హత ఏమిటి?

చెన్నైలో ఉండి సనాతన ధర్మం గురించి నీచాతినీచంగా వాగినంత సులువేమీ కాదు, తరువాతి పరిణామాలను ఎదుర్కొనడం! ఇలాంటి వాగుడుకి వేదికను ఏర్పాటు చేసిన సదరు తైనాతీలు, గంధోళిగాళ్లు, కేతిగాళ్లు ఇప్పుడయితే ముందుకు రారు. ఆ నాలికతీట మనిషిని జుట్టు పట్టుకుని కోర్టు ముంగిట నిలిపాయి ఎఫ్‌ఐఆర్‌లు. ఇతడి తాత వీర నాస్తికుడు కావచ్చు. ఇతడి తండ్రి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హిందూ వ్యతిరేకి కావచ్చు. అంతమాత్రానే ఏది బడితే అది మాట్లాడితే చెల్లదు. కోట్లాదిమంది మనోభావాలతో ఇష్టారీతిన అడుకుంటానంటే వీలుకాదు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఎఫ్‌ఐఆర్‌లు అన్ని కలిపి చూడాలన్న ఉదయనిధి విన్నపాన్ని మార్చి 15న పరిశీలిస్తానని చెప్పింది.

సనాతన ధర్మాన్ని విమర్శించే ఉదయనిధి వంటి అజ్ఞానులకీ, స్వయం ప్రకటిత ఉదారవాదులకీ, కిరాయి వాగుడుకాయలకీ, నకిలీ మేధావులకీ ఈ దేశంలో లోటు లేదు. ఈ బాపతు చీదర మందకి సుప్రీం కోర్టు మాటల గడ్డి పెట్టాయి. స్టాండప్‌ కమేడియన్లు, కొందరు రచయితలు, ఇతర మతాల వారు హిందూధర్మాన్ని విమర్శించడానికి పోటీ పడుతూ ఉంటారు. హిందువులు సమున్నత భావంతో పూజించే దేవీదేవతల గురించి ఈ శునకాలు చిరకాలంగా మొరుగుతూనే ఉన్నాయి. హిందువుల సహనమే, ఓరిమే వీళ్లందరికీ చేతకానితనంగా కనిపిస్తున్నది.

ద్రవిడవాదం పేరుతో జరిగిన భారతీయ విలువల విధ్వంసం అంతర్జాతీయంగా దేశం పరువు తీసింది. భారతీయతను అవమానించింది. తమిళనాట ద్రవిడవాదానికీ, రాజకీయానికీ అవినాభావ సంబంధం ఉంది. అలాగే అక్కడి రాజకీయాలదీ, చలనచిత్ర రంగానిదీ విడదీయలేని బంధం. అలా ద్రవిడవాదం భారత చిత్ర పరిశ్రమను, ప్రధానంగా భారత దక్షిణ ప్రాంత రాష్ట్రాల సినిమా పరిశ్రమను బాగు చేయడం ఏమాత్రం సాధ్యం కాని స్థాయిలో భ్రష్టు పట్టించింది. కళా ప్రక్రియలను, రూపాలను విష పూరితం చేసింది. ఈ రుగ్మత తమిళ చలనచిత్ర రంగం నుంచి పలువురు తెలుగు చలనచిత్ర దర్శకులు స్వీకరించారు కూడా. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ద్రవిడవాదపు నోటి దురుసును వదిలిస్తాయేమో చూడాలి!

About Author

By editor

Twitter
YOUTUBE