డీఎంకే, ఆ పార్టీ నేతలు సనాతన ధర్మం మీద నీచమైన దాడులకు దిగడం కొత్తకాదు. కేంద్ర మాజీ మంత్రి ఎ. రాజా సనాతన ధర్మంపైన, కొత్తగా రాముడిపైన దాడి ప్రారంభించడమే విశేషం. తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధిపై విచారణలో మత విద్వేషచర్యకు తగిన శిక్ష పడక తప్పదని సుప్రీంకోర్టు ఇటీవల తేల్చి చెప్పింది. అయినా, అదే పార్టీకి చెందిన రాజా దూకుడు ఆపడం లేదంటే, దాని వెనక ఏదో బలమైన కారణం ఉన్నందువల్లే రెచ్చిపోతున్నాడన్న అభిప్రాయం ఉంది. తన అజ్ఞానాన్ని ఆయనేమి దాచుకోవడం లేదు. రాముడి గురించి, రామాయణం గురించి తెలియదంటూనే, వాటిని అంగీకరించను అంటూ ఢంకా బజాయించాడు.ఒక విషయం గురించి కనీసం తెలియకుండా ఇలాంటి ప్రమాదకర వ్యాఖ్యలు చేస్తారా? పైగా ఎంపీగా ఉన్న వ్యక్తికి ఇదేం తెగులు? రాముడినీ, భారతమాతనీ కూడా తమిళనాడు అంగీకరించదట. ఆ మాట చెప్పడానికి రాజా ఎవరు? తమిళులందరికీ ఇతడే ఏకైక ప్రతినిధా?

ఎంత అవినీతికైనా పాల్పడవచ్చు. దాని మీద జైలుకు వెళ్లి బెయిల్‌ ‌మీద బయటకు వచ్చి ఉండవచ్చు. అయినా పులు కడిగిన ముత్యాల మాదిరిగా బీజేపీని విమర్శించడానికీ, దేశానికి నీతులు చెప్పడానికి దేశంలో చాలామంది రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా ఎగబడుతున్నారు. ఎ.రాజా వైఖరి ఇందుకు సంబంధించినదే. హద్దు మీరి రాముడి మీద, రామభక్తుల మీద విరుచుకుపడడానికి, ‘రాముడిని మేము ఒప్పుకోము, భారత్‌ ఒక దేశం కాదు; ఉత్తరాది హిందీ వర్గం అధికారం సహించం:’ అంటూ శివాలెత్తడానికి అసలైన కారణం బీజేపీ ప్రభంజనం. అధికారం చేజారిపోతుందన్న భయం ఈ మేకపోతు గాంభీర్యానికి, అవాకులు చవాకులు వాగడానికి సిసలైన కారణం. అవినీతిలో కొత్త ఎత్తులు చూసినవాడు ఎ. రాజా. డీఎంకేలో భారీ, జాతీయ స్థాయి అవినీతి వ్యవహారాలకు రాజా ఆదిపురుషుడు. అతను కటకటాల వెనక్కి వెళ్లిన విషయం తమిళనాడు ప్రజలకు తెలియనిది కాదు. అతడి ఆవేశానికి ద్వేషం, నిరాశ, నిస్ఫృహ పునాదిరాళ్లు.

రాజా ఊకదంపుడు ఉపన్యాసంలోని అంశాలను పరిశీలిస్తే ఆంతర్యం బట్టబయలవుతుంది. ఇండియా రాష్ట్రంకాదు; ఉపఖండం అంటాడు. ఒకే రాష్ట్రం ఒకేదేశం, అన్న నినాదానికి, ఉపఖండానికి నడుమ గిరి గీయడం అతగాడి అవగాహనా లోపానికి నిదర్శనం. అనేక జాతులు, మతాలు, సంస్కృతులు, భాషలు, అనాదిగా మన భారతదేశంలో కొలువున్నాయని పూర్వ, పశ్చిమ, చారిత్రక మేధావి వర్గం ఇది వరకే చెప్పింది. ‘‘ఇండియా ఒక విచిత్ర చిత్ర ప్రదర్శనశాల’’ అని ప్రముఖ చారిత్రక శాస్త్రవేత్త,  విన్సెంట్‌ ‌స్మిత్‌ ‌విస్పష్టంగా చెప్పాడు. రకరకాల వస్తువులు ఒకే చోట కలిసికట్టుగా ఉన్నట్టుగానే, జాతులు, మతాలు వగైరాలు భారతీయ మంటపాన కలిసిమెలసి ఉండేవని ఆయన అభిప్రాయం. భిన్నత్వంలో ఏకత్వం అన్న వాక్యార్థం తెలియక పోవడం వల్ల ఇలాంటి అనర్థాలు తెరపైకి తెస్తున్నారు రాజకీయ నాయకులు. ఒకే కుటుంబంలోని సభ్యులు ఎవరి పని వారు చేసుకుంటూ సుఖంగా, స్వేచ్ఛగా, ఉండగలుగుతున్నారు. అలాగే వసుధైవ కుటుంబం కావాలని, ప్రజలంతా ఆనందంగా జీవించాలని ఆర్షధర్మం ఆశిస్తున్నది. సనాతన ధర్మానికి ఈ రెండు సూత్రాలు నేత్రాలు.

ప్రస్తుతం స్వతంత్ర భారత్‌ ఈ ‌సూత్రాన్ని అవలంబిస్తున్నది. భారత రాజ్యాంగం వ్యక్తి స్వాతంత్య్రానికి మత స్వేచ్ఛకు తగినంత అవకాశం కల్పించింది. సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా రాజ్యాంగంలో పలు సంస్కరణలు జరిగాయి. రాజ్యాంగ అధికరణ 370లో చేసిన మార్పువల్ల ముస్లిం స్త్రీ సమాజానికి హార్దిక, ఆర్థిక, లాభాలు చేకూరాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం, దేశరక్షణ, సజావుగా సాగుతున్నాయి. మోదీ నాయకత్వం విశ్వానికే శిరోధార్యం అయింది. భారత్‌కు విశ్వగురుపీఠం దక్కింది. ఇవన్నీ సహించ లేని విపక్షాలు, ముఖ్యంగా డీఎంకే నాయకులు, విషం కక్కుతున్నారు. దేశాన్ని ఏకతాటిమీద నడిపించి పూర్వ వైభవాన్ని తేవాలని ప్రయత్నిస్తున్న ప్రధానిని గద్దెదింపడమే ప్రతిపక్షాల ఏకైక లక్ష్యం అయింది. ‘‘మేము సామాజిక న్యాయవాదులం’’ అంటూ బోరవిరుచుకుంటున్న రాజా లాంటి ప్రజానాయకు లకు భారతీయ సంస్కృతి, హిందూ నాగరికత గురించి ఏమాత్రం సదవగాహనలేదు. వారి సంకుచిత అభిప్రాయాలకు అంతేలేదు.

భారతీయులందరూ హిందువులే; హిందూత్వం జీవిత విధానానికి నిర్వచనం. హైందవ నాగరికత, సంస్కృతి ప్రపంచానికే ఆదర్శం అని మేధావులు పదే పదే గుర్తు చేసినా రాజాలాంటి ఖల్‌నాయకులకు చెవికెక్కదు. ప్రస్తుతం వారు పదవులు చేపట్టడానికి, పెత్తనాలు చెలాయించడానికి, నోరు పారేసుకోడానికి, రాజ్యాంగమే కారణం అన్న విషయం తలకెక్కదు. ద్రవిడ నాయకులు చెబుతున్న సామాజిక న్యాయం (సోషల్‌ ‌జస్టిస్‌) ‌తమిళనాడులో కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు. జనాభాలో 80% హిందువులే. వారి దేవాలయాలు శిథిలాలుగానే ఉండిపోవాలి. వారి దేవుళ్లను అవమానించినా, తిట్టిపోసినా, నోరు మెదపకూడదు. గతంలో అలాగే జరిగింది. కాంగ్రెసు ప్రభుత్వం కంటే ముందు రాముడిని ద్రవిడ పైత్యంతో చాలామంది ఘోరంగా అవమానించారు. చెప్పుల దండ మెడలో వేస్తుండగా, చూస్తూ నోరైనా మెదపలేదు ఆనాటి కాగ్రెసు ప్రభుత్వం. మేము గాంధేయులం అంటూ గుండెలు బాదుకోవడం తప్ప ఆయన చెప్పిన మాట ఒక్కటైనా పాటించలేక పోయారు. రాముడు అంటే బాపూకు ప్రాణం. ఆయన రామరాజ్యం కోసం తపించాడు.

ఈనాడు రాముడిపై రాజాదులు దాడులు చేస్తుంటే చూచి చూడనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారో ప్రజలకు తెలుసు. కుటుంబ పాలన పునరుద్ధ రించడమే ధ్యేయం. లక్షకు పైచిలుకు హిందూ దేవాలయాలను, దయనీయమైన స్థితిలో ఉంచడం ఏ సామాజిక న్యాయమో స్టాలిన్‌ ‌ప్రభుత్వం చెప్పాలి. హిందూ దేవాలయాలే ఎందుకు పన్ను చెల్లించు కోవాలో సిద్ధరాముడు వివరణ ఇవ్వాలి. ఎంతటి ప్రజాస్వామ్యం అయినా, వాక్‌ ‌స్వాతంత్య్రం చాటున వ్యక్తిగతమైన దూషణ, మత విద్వేషం, క్షంతవ్యం కాదు. ఎంతటి గొప్పవాడైనా నేరానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు.

అదే విధంగా, దూషణ భూషణ తిరస్కారాలు దైవ ప్రసాదాలుగా భావించి హిందూ సమాజం నోరుమూసుకుని ఉంటే అది చేతకానితనం అవుతుంది. చులకన చేస్తే ఉరుకోవడం ఆత్మగౌర వానికి, నిర్భరతకు అవమానకరం. రాముడు మర్యాదా పురుషోత్తముడు. ధర్మ ప్రభువు. రాజును అనుకుంటున్నంత రాజును క్షమించే విశాల హృదయం ఆయనది. అలాంటి ‘‘ధర్మ’’ రాజుకు కోపం వస్తే ఆగదు. దాని ‘‘పవరు’’ సముద్రుడికి బాగా తెలుసు. ఆనాడు తురుష్కులు, ఆ తరవాత మ్లేచ్చులు ఈ దేశాన్ని పరిపాలించారు. సనాతన ధర్మాన్ని కూలదోయడానికి రాక్షస చర్యలకు పాలుపడ్డారు. బాబరు, అక్బరు, భయాన, నయాన, దేశాన్ని ఏలగలిగారు. అయినా, హిందూధర్మాన్ని రూపు మార్చలేక పోయారు. అల్లావుద్దీన్‌, ఎం‌త హింసించినా హిందువులు సహించారు. సహనానికి ఒకహద్దు ఉంటుంది. అది కాస్తా చెరిగిపోతే ప్రళయమే.

 ‘‘ఇండి’’ మార్కు విపక్షాలు, ఈ సత్యం ఎంత శీఘ్రంగా గ్రహిస్తే, అంతమేలు జరుగుతుంది. స్వార్థం, సంకుచితత్త్త్వం, మితిమీరితే మరో చీకటి యుగం దేశాన్ని కబళిస్తుంది. చరిత్ర పునరావృత్తం కాకుండా చూడవలసిన బాధ్యత తమదీ అని రాజాదులు ఎంత త్వరగా తెలసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది.

సాక్షాత్తు రాహుల్‌ ‌గాంధీ, స్టాలిన్‌ ‌కూడబలుక్కున్నట్టే ఇటీవల ఒక ప్రకటన వెలువడింది. అవును మాది కుటుంబ పాలనే అంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఒప్పేసుకున్నారు. అయితే ఇతర కుటుంబాలకు చేయూతనిచ్చే కుటుంబమని ముక్తాయించా రాయన. సనాతన ధర్మం మీద, పురాతన భారతీయత మీద విరుచుపడే డీఎంకే వంటి పార్టీలు, వాటి నాయకులు కుటుంబ పాలనను ఎలా సమర్ధిస్తారు? ఈ ధోరణిని ఇండీ కూటమి సభ్యులు ఎలా సహిస్తారు? సనాతన ధర్మం మీద, రాముడి మీద ఇన్ని కారుకూతలు కూసినా ఇండీ భాగస్వాములు ఎందుకు నోరు విప్పరు? ఏమైనా హిందూ వ్యతిరేక పక్షాలకు, నాయకులకు గట్టి సమాధానం చెప్పవలసిన రోజు దగ్గరపడింది.

– నిరామయ

About Author

By editor

Twitter
YOUTUBE