జమ్మూ, కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ లద్దాక్‌లో కదలిక వచ్చింది. తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా పరిమితం చేయకుండా, రాష్ట్ర హోదా ఇవ్వడంతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలంటూ వేలాదిమంది రోడ్డెక్కారు.. అంతేకాదు లద్దాక్‌కు మరో లోక్‌సభ సీటును కోరుతున్నారు. పైకి చూసేందుకు వారి డిమాండ్లు సమంజసం గానే కనిపించినా, కొన్ని దేశ ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. ఈ ఆందోళనల వెనుక కొన్ని స్వార్థ, బాహ్య శక్తుల హస్తం ఉందని స్పష్టమైపోయింది.
ఫిబ్రవరి 3వతేదీన లేహ్‌లో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఇది లద్దాక్ చరిత్రలోనే అపూర్వ ఘట్టమని చెబుతున్నారు. వీరంతా లేహ్‌లోని పోలో గ్రౌండ్‌లో సమావేశమయ్యారు. గుంపులోని కొంతమంది ప్రదర్శనకారులు భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఊపారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా దాదాపు 30,000మంది గుమి గూడారు.. ‘‘బహాల్ కరో, బహాల్ కరో (పునరుద్ధరించండి, పునరుద్ధరించండి)’’ అంటూ వేదికపై ఉన్న వ్యక్తి నినదించగా ‘‘డెమోక్రసీకో బహాల్ కరో’’ అంటూ జనం ప్రతిస్పందించారు. ఆ రోజున లద్దాక్‌లోని మూడింట ఒక వంతు జనాభా అక్కడికి వచ్చిందని చెబుతున్నారు.
‘‘లేహ్ చలో-లేహ్ చలో’’అనే నినాదంతో లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (కేడీఏ) సంస్థల పిలుపు మేరకు వీరంతా ఇక్కడికి తరలివచ్చారు. లేహ్‌లో చలితో గడ్డకట్టుకు పోయే వాతావరణం ఉన్నా రాజకీయ పరంగా అక్కడి వాతావరణం వేడి వేడిగా ఉంది.
నిరసనకారులు లేహ్‌లోని సెంగె నామ్‌గ్యాల్ స్క్వేర్ నుండి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకు నిర్వహించిన ప్రదర్శణలో ఆద్యంతం రాజ్యాధికారం, ఆరో షెడ్యూల్ లో చేర్చడంసహా తమ డిమాండ్లు రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూనే ఉన్నారు. కార్గిల్ జిల్లాలో ఇటువంటి ప్రదర్శనే జరిగింది. అక్కడ కూడా వేలాదిమంది పాల్గొన్నారు. ఆరో షెడ్యూల్‌కు అనుకూలంగా, లడఖ్ ప్రజలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిరసనకారులు నినాదాలు చేశారు.
ఆర్టికల్ 370 రద్దుకు ముందు..
జమ్మూ కశ్మీర్ రాష్ట్రం భారత్‌లో విలీనమైన తర్వాత పాకిస్తాన్ దాదాపు సగం భూభాగాన్ని ఆక్రమించుకుంది. నేటికీ ఆ సమస్య రావణకాష్టంలా రగులుతోంది. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం కారణంగా రాజధాని శ్రీనగర్ చుట్టూ ఉన్న కశ్మీర్ లోయలో నిరంతరం అశాంతియుత వాతావరణం కొనసాగుతోంది. నేటివరకూ రాష్ట్రాన్ని పాలించిన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు శ్రీనగర్ లోయకే పరిమితమవడమే కాక జమ్మూతో పాటు లద్దాక్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ఈ ప్రాంతాలకు ఆర్టికల్ 370పెద్ద గుదిబండైంది. నిధుల్లో ఎక్కవభాగం లోయకే కేటాయించడంతో ఇతర ప్రాంతాలు వివక్షకు గురయ్యాయి.
దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370ని రద్దుచేసింది. దీంతో ప్రత్యేక హోదా పేరుతో అక్కడ జరుగుతున్న రాజకీయ అరాచకానికి తెరపడింది. అలాగే, జమ్మూకశ్మీర్, లద్దాక్‌లు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం నుంచి లద్దాక్‌ను విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన రోజున ఆనందోత్సహాలతో సంబరాలు జరుపుకున్నారు.
దేశ భద్రతలో అత్యంత కీలకం
భౌగోళికంగా చూస్తే జమ్మూ కశ్మీర్‌కన్నా లద్దాక్ ప్రాంతం అతిపెద్దది. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్, చైనాలు వరుసగా 78,114 చ.కి.మీ, 37,555 చ.కి.మీ.లను ఆక్రమించుకున్నాయి. మిగిలిన 59,146 చ.కి.మీ.లు లద్దాక్ భూభాగంలో లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలున్నాయి. లద్దాక్ మొత్తం జనాభా 2,74,289 కాగా, కార్గిల్ జనాభా 1,40,802. లేహ్ జనాభా 1,33,487. జనాభాలో ఎక్కువమంది ముస్లింలు, బౌద్ధులు, ఆ తర్వాత హిందువులు. లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంత జనాభా మొత్తం హైదరాబాద్‌లోని ఒక సర్కిల్ జనాభాకన్నా చాలా తక్కువన్నది గమనార్హం. లేహ్, కార్గిల్ ప్రాంతాలకు రెండు హిల్ కౌన్సిల్స్ ఇప్పటికే ఉనికిలో ఉన్నాయి.
దేశ రక్షణపరంగా చూస్తే లద్దాక్ ప్రాంతం అత్యంత సున్నితమైన ప్రాంతం. గిల్గత్ బాల్టిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ కబ్జాలో ఉండగా.. అక్సాయ్ చిన్, షక్స్‌గమ్ వ్యాలీ చైనా దురాక్రమణకు గురయ్యాయి. 1999లో యుద్దం జరిగిన కార్గిల్ ఈ ప్రాంతంలోనే ఉంది. నిరంతరం పాకిస్తాన్, చైనాలు ఇక్కడ కవ్వింపు చర్యలతో పాటు ఆక్రమణలకు ప్రయత్నిస్తుంటాయి. వేలాదిమంది జవాన్లు నిరంతరం కాపలా కాస్తుంటారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం లద్దాక్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగించడంతో పాటు ఇక్కడ వెనుకబడిన ప్రాంతాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువగా దృష్టి పెట్టింది.
లద్దాక్ అసంతృప్తి వెనుక..
లద్దాక్‌లో నిరసనల వెనుక కారణాన్ని అర్థం చేసుకోవాలంటే కాస్త పూర్వాపరాల్లోకి వెళ్లాలి. 2019లో లద్దాక్‌ను జమ్మూ కశ్మీర్ నుంచి విడదీసిన తర్వాత శ్రీనగర్ కంబంధ హస్తాల నుంచి తమకు విముక్తి కలిగిందంటూ అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. వీధుల్లో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలుచేశారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన తమ ప్రాంతంపై నేరుగా కేంద్రం దృష్టి సారించి అభివృద్ది చేస్తుందని ఆకాంక్షించారు. కానీ ఇప్పుడు అదే జనం తమకు రాష్ట్ర హోదా కావాలంటూ వీధుల్లోకి వచ్చారు.
లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి దానికి ప్రత్యేక శాసనసభ లేకుండాపోయింది. విభజనకు ముందు లద్దాక్ ప్రాంతం నుంచి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి నలుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహించేవారు. కౌన్సిల్‌లో ఇద్దరు సభ్యులు ఉండేవారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడి శాసనసభను పునరుద్దరించి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం సంకేతాలు ఇచ్చింది. ఇందుకోసం అక్కడి నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించింది. అయితే లద్దాక్ మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగడం ఈ ప్రాంత ప్రజల్లో కాస్త ఆందోళన కలిగిస్తోంది.
ఏం కోరుకుంటున్నారు?
ఆందోళనకారులు ప్రధానంగా నాలుగు డిమాండ్లు చేస్తున్నారు. ఇందులో మొదటిది శాసన సభతో కూడిన రాష్ట్ర హోదా, రెండోది రాజ్యాంగంలో ఆరో షెడ్యూల్‌లో చేర్చడం, మూడోది స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడం.. నాలుగవది లద్దాక్‌కు రెండు సీట్లు కేటాయించడం. ప్రస్తుతం లద్దాక్‌కు ఒకే సీటు ఉంది. దీని స్థానంలో లేహ్, కార్గిల్‌లకు చెరొక సీటు ఇవ్వాలన్నది వారి డిమాండ్. లద్దాక్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నందున తమ ప్రత్యక్ష నియంత్రణలో లేదని, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామన్నది వారి వాదన. ఫలితంగా భూమి, ఉద్యోగాల రక్షణ కోల్పోయామని.. జనాభా సమతౌల్యం దెబ్బ తింటోందని చెబుతున్నారు.
ఆర్టికల్ 370 రద్దు చేయడంతో, బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేస్తారని, గతంలో లద్దాక్‌కు కేటాయించిన ఉద్యోగాల కోసం పోటీ పడతారని స్థానికులు భయపడుతున్నారు. లద్దాక్‌లో ప్రధానంగా తమ అస్తిత్వంతో పాటుగా భౌగోళిక, సాంస్కృతిక పర్యావరణ సమతౌల్యం కాపాడు కోవడంతో పాటుగా తమ వనరులపై హక్కును కాపాడుకునేందుకు ఆరో షెడ్యూల్ రక్షణ అవసరమని చెబుతున్నారు. తమ ప్రమేయం లేకుండా పారిశ్రామిక ప్రాజెక్టులకు కేంద్ర అనుమతి ఇవ్వరాదన్నది వారి ప్రధాన వాదన. ఈ ప్రాంతంలో గెజిటెడ్ ఉద్యోగ అవకాశాలు లేవని పేర్కొంటూ, ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కూడా డిమాండ్ చేశారు. భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం, 3,702 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గోవాకు రాష్ట్ర హోదా ఇచ్చిప్పుడు 59,146 చ.కి.మీ. ఉన్న లద్దాక్‌కు ఎందుకు ఇవ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. ఆరో షెడ్యూల్ రక్షణలో ఉన్న అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలను ఉదహరిస్తున్నారు.
అంతకు ముందు లేహ్, కార్గిల్ హిల్ కౌన్సిల్ ఈ తీర్మానాలను ఆమోదించి, డిమాండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాయి. లేహ్ కౌన్సిల్ తీర్మానాల్లో భూరక్షణ, ఉపాధిహామీ, సంస్కృతి, వాణిజ్యం, పర్యావరణ రక్షణ, కొండ ప్రాంత మండళ్లకు రాజ్యాంగంలోని నిబంధనలను పొడిగించడంలాంటివి ఉన్నాయి. కాగా, కార్గిల్ హిల్ కౌన్సిల్ తీర్మానం మరింత విస్తృతంగా ఉంది. లద్దాక్‌కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ హోదా, ఒకటికి బదులుగా రెండు పార్లమెంట్ సీట్లు, ఉద్యోగ భద్రత అనే నాలుగు డిమాండ్లను అది ముందుకు తెచ్చింది.
కేంద్రంతో చర్చలు
2019 పార్లమెంట్ ఎన్నికల్లో లద్దాక్ నుంచి విజయం సాధించిన బీజేపీ ఆ తర్వాత 2020 జరిగిన అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్ర హోదాను పునరుద్ధరి స్తుందని వాగ్దానం చేసింది. ఈ నేపథ్యంలోనే లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రతినిధులు కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి ఒక వివరణాత్మక లేఖ సమర్పించారు, దీనిలో లద్దాక్‌కు పూర్తి రాష్ట్రహోదా కల్పించడానికి జమ్మూ, కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019ని సవరించే బిల్లు తయారుచేయాలని సూచించారు.
గత సంవత్సరం డిసెంబర్ 4న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ లేహ్, కార్గిల్‌కు చెందిన ఎల్‌ఏబీ, కేడీఏ నాయకులతో సమావేశమై చర్చలు నిర్వహించింది. అయితే ఇందులో ఎటువంటి పురోగతి కనిపించలేదు. రెండుపక్షాలతో రెండో విడత చర్చలు ఫిబ్రవరి 19న ఢిల్లీలో జరగనున్నాయి. లద్దాక్ నేతల నుంచి వస్తున్న కొన్ని కొత్త డిమాండ్లు ఆచరణయోగ్యం కాకపోవడంతో కేందప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.
లద్దాక్ నాయకులు ఏమంటున్నారు?
మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి ప్రధాన మద్దతుదారుగా నిలిచారు. తమ డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఆరో షెడ్యూల్ గురించి మాట్లాడే వారు వేధింపులకు గురవుతున్నారని, మైనింగ్ పరిశ్రమలతో లద్దాక్‌ను సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాము రాజ్యాంగ హక్కులను మాత్రమే డిమాండ్ చేస్తున్నామని, అవి సాధించేదాకా విశ్రమించబోమని స్పష్టంచేశారు.
గతంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రమంత్రి, బీజేపీ లద్దాక్ అధ్యక్షునిగా పని చేసిన చెరింగ్ డోర్జయ్ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని కోరారు. గిరిజన హోదా లద్దాక్ ప్రజల హక్కని, కేంద్రం తమ మనోభావాలను గౌరవించాలి అన్నారు.
తమ డిమాండ్లను కేంద్రం పట్టించుకోనందున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీకి దూరంగా ఉండాలని తాము నిర్ణయించుకున్నామని మాజీ ఎంపీ, అపెక్స్ చైర్మన్ తుప్‌స్తాన్ ఛెవాంగ్ స్పష్టం చేశారు. లద్దాక్ ప్రయోజనాలను కాపాడేందుకే తాము ఏడీఏతో చేతులు కలిపామని చెవాంగ్ తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము వ్యతిరేకం కాదని లేహ్ డిప్యూటీ త్సెరింగ్ దోర్జీ లక్రుక్, కెడిఎ కో-ఛైర్‌పర్సన్‌లు ఖమర్ అలీ అఖూన్, అస్గర్ అలీ కర్బలాయ్ అంటున్నారు.
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా లద్దాక్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ తమ భూమి, ఉపాధి, సాంస్కృతిక గుర్తింపును కాపాడాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన ప్రసంగంతో దేశ ప్రజలను ఆకట్టుకున్నారు.
రాష్ట్ర హోదా సాధ్యమేనా?
రాష్ట్రహోదా కావాలనే స్థానికుల ఆకాంక్షలో తప్పులేదు. లద్దాక్ భౌగోళికంగా పెద్దదే అయినా జనాభా తక్కువ. మన దేశంలోని అతి చిన్న రాష్ట్రం గోవాలో 15,42,750 ఉంటే.. లద్దాక్‌లోని లేహ్, కార్గిల్ జిల్లాలు కలిపి కేవలం 2,74,289 మంది ఉంటారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే లద్దాక్ లోక్‌సభ స్థానం పరిధిలోని మొత్తం ఓటర్ల సంఖ్య 1,79,232. మన హైదరాబాద్‌తో పోలిస్తే గోషామహల్ ఓటర్ల సంఖ్య 2,86,264. తెలంగాణలో అతితక్కువ ఓటర్లు ఉండే భద్రాచలంలో మొత్తం ఓట్లు 1,45, 964.. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజవర్గమైన మల్కాజిగిరిలో 31,50,303 ఓటర్లు ఉన్నారు. దీని పరిధిలో కేవలం 7 అసెంబ్లీసీట్లు మాత్రమే ఉన్నాయి.. ఈ గణాం కాలను గమనిస్తే లద్దాక్‌కు అసెంబ్లీ ఏర్పాటు అసాధ్యమని అర్థమవుతోంది.. అక్కడ ఇప్పటికే కార్గిల్, లేహ్ ప్రాంతీయ అభివృద్ధి మండలులు ఉన్నాయి. ఇది దాదాపుగా రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేసిన జిల్లా, ప్రాంతీయ మండలులతో సమానం.
కనిపించని కుట్రలు ఎన్నో..
లద్దాక్ సమస్య ఇప్పుడు తేనెతుట్టెలా మారింది. కొన్ని స్వార్ధశక్తులు తమ ప్రయోజనాల కోసం ఈ తుట్టెను కదిలించాయి.. తరచి చూస్తే తెరవెనుక కుట్రలు, కుతంత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి.
లద్దాక్‌లో థోరియం, లిథీనియంలాంటి అపారమైన ఖనిజ లవణ సంపదతో పాటు పెట్రోలియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని వెలికి తీసి దేశ అవసరాలకు ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తాజాగా పుగా లోయలో భారీ స్థాయిలో గ్యాస్, చమురు, ద్రవ మిశ్రిత ఖనిజాలు కనుగొన్నారు. వీటిని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్‌జీసీ ఇప్పటికే లద్దాక్ ప్రాంతీయ అభివృద్ది మండలితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కేంద్రం తీసుకుంటున్న చర్యలు కొన్ని స్వార్థ శక్తులకు నచ్చడం లేదు. వీరు ఎప్పటినుంచో దీనిపై కన్నేశారు. ఈ కారణంవల్లే ఆరో షెడ్యూల్‌ను అడ్డం పెట్టుకొని స్థానికంగా పెత్తనం కోసం కుట్రలు పన్నుతున్నారు. ఇక్కడి వనరుల మీద సంపూర్ణ ఆధిపత్యం తమకే ఉండాలి, తమ నిర్ణయం ప్రకారమే అంతా జరగాలి అనేది వీరి వాదన.
లద్దాక్ జమ్మూ కశ్మీర్‌లో భాగంగా ఉన్న సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఖమర్ అలీ అఖూన్, కార్గిల్‌కు చెందిన కాంగ్రెస్‌నేత హాజీ అస్గర్ అలీ కర్బలాయితో పాటు కొందరు పెత్తందారులు, కాంట్రాక్టర్లు ఈ ఉద్యమంలో ఉన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇక్కడి వనరులను కొల్లగొట్టిన చరిత్ర గలవారే. సోనం వాంగ్‌చుక్‌ను తెరముందుకు తెచ్చి అతనితో ఉద్యమాలు చేయిస్తున్నారు. ఈ సోనం వాంగ్‌చుక్ తక్కువేం తినలేదు. ఈయన దాదాపు 250 ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగాను నోటీసులు కూడా అందుకున్నారు.
లద్దాక్ భౌగోళిక స్వరూపాన్ని గమనిస్తే కార్గిల్ జిల్లా భౌగోళికంగా చిన్నదే అయినా జనాభా ఎక్కువ, లేహ్ భౌగోళికంగా పెద్దది, కాని జనాభా తక్కువ. కార్గిల్‌లో ముస్లింల అధిపత్యం ఉంటే, లేహ్‌లో బౌద్ధుల మెజారిటీ. సాధారణంగా లద్దాక్ నుంచి లేహ్ వారే గెలుస్తుంటారు. ఇప్పుడు లద్దాక్ లోక్‌సభ స్థానం బదులు కార్గిల్, లేహ్‌లకు విడివిడిగా లోక్‌సభ సీట్లు కావాలని కోరడం వెనుక కుట్ర కనిపిస్తోంది. గతంలో శ్రీనగర్ పెత్తనంలా ఇప్పుడు కార్గిల్ ఆధిపత్యం పెరగాలని భావిస్తున్నారు. వీరు లేహ్ మీద అధిపత్యం సాధించి లద్దాక్ మొత్తం కబ్జా చేయాలని వ్యూహంపన్నారు. లద్దాక్ అసెంబ్లీ ఏర్పడితే ఎక్కువ సీట్లును గెలుచుకోవాలని లెక్కలు వేస్తూ, తెలివిగా బౌద్ధులను ముందుపెట్టి ఉద్యమాన్ని ఎగదోస్తున్నారు. ఇదే జరిగితే లద్దాక్ సాంస్కృతిక, వారసత్వ, భౌగోళిక స్వరూపం దెబ్బతినే ప్రమాదం ఉంది.
దేశ భద్రత రీత్యా లద్దాక్ అతి సున్నిత ప్రాంతం. ఒకవైపు పాకిస్తాన్, మరో వైపు చైనా అక్కడ నిరంతర యుద్ద వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కశ్మీర్ తరహాలోనే లద్దాక్‌లో అశాంతి, అస్థిరతలు పెంచేందుకు తెరవెనుక నుంచి ప్రయత్నిస్తున్నాయి. లద్దాక్‌కు ఉన్న టిబె•న్ మూలాలను ఉపయోగించి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి, ఇక్కడి పౌరులను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చాలనే కుట్ర కనిపిస్తోంది. లద్దాక్ మతసామరస్యాన్ని దెబ్బతీసి స్కార్దూ, గిల్గిత్ బాల్టిస్తాన్‌ల ద్వారా ఇక్కడ చొరబడేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి.
రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ అంటే?
గిరిజన ప్రాంతాల హక్కుల పరిరక్షణ కోసం భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో కొన్ని అంశాలను పొందుపరిచారు. ఈ షెడ్యూల్ గిరిజనుల భూమి, వనరులను రక్షించడంతోపాటు, ఈ వనరులను గిరిజనేతరులకు, వర్గాలకు బదిలీ చేయడాన్ని నిషేధిస్తుంది. అలా, గిరిజనేతరుల దోపిడీకి గురికాకుండా రక్షణతో పాటు స్థానిక ప్రజల సాంస్కృతిక, సామాజిక గుర్తింపులకు భద్రత, ప్రోత్సాహం ఉంటుంది.
ఆరవ షెడ్యూల్‌లోని 244(2)ప్రకారం ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలో స్వయంప్రతిపత్తి గల జిల్లాలు, ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలను పునర్వ్యవస్థీకరించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుంది. అలాంటి జిల్లాలో వేర్వేరు షెడ్యూల్డ్ తెగలు ఉన్నట్లయితే , గవర్నర్ వారు నివసించే జిల్లాను స్వయంప్రతిపత్తిగల ప్రాంతాలుగా విభజించవచ్చు.
స్వయంప్రతిపత్తిగల జిల్లాలు, ప్రాంతాలకు 30 మంది సభ్యులకు మించని ప్రత్యేక ప్రాంతీయమండలి ఉంటుంది. వీరిలో నలుగురికి మించకుండా సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు, ఇతరులను ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
వీరికి భూములు, అటవీ నిర్వహణ, ఆస్తి, వారసత్వం తదితర విషయాలపై చట్టాలను రూపొందించడానికి అధికారం ఉంటుంది. షెడ్యూల్డ్ తెగ నివాసితులు కాకుండా, ఇతర వ్యక్తులు రుణాలివ్వడం, వ్యాపార నియంత్రణపై చట్టాన్ని రూపొందించుకోవచ్చు. ఇందుకు గవర్నర్ ఆమోదం అవసరం.
జిల్లా, ప్రాంతీయ కౌన్సిళ్లు భూ ఆదాయ సేకరణ, వృత్తులు, వ్యాపారాలు, జంతువులు, వాహనాలు మొదలైన వాటిపై పన్నులు విధించే అధికారం కలిగి ఉంటాయి. తమ పరిధిలోని ఖనిజాల వెలికితీత కోసం లైసెన్స్‌లు లేదా లీజులు మంజూరు చేసే అధికారం వాటికి ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలు, డిస్పెన్సరీలు, మార్కెట్‌లు, పశువుల చెరువులు, చేపలపెంపకం, రోడ్లు, రోడ్డురవాణా, జల మార్గాల ఏర్పాటు, నిర్వహణకు అధికారం ఉంటుంది. షెడ్యూల్డ్ తెగలకు చెందిన వివాదాలు, నేరాల కేసుల కోసం గ్రామ, జిల్లా కౌన్సిల్ కోర్టుల ఏర్పాటుకు అధికారం ఉంది. అయితే ఐదేళ్లకు మించిన జైలుశిక్ష, మరణశిక్ష విధించే అధికారం కౌన్సిల్ కోర్టులకు లేదు. అయితే, ఈ నిబంధన కింద రూపొందించిన అన్ని చట్టాలకూ గవర్నర్ ఆమోదం అవసరం.
స్వయంప్రతిపత్తిగల జిల్లాలు, ప్రాంతాలకు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ రూపొందించే చట్టాలు, అందులో మార్పులు, మినహాయింపులు వర్తించవు. ఈ జిల్లాలు, నిర్వహణకు సంబంధించిన ఏదైనా సమస్యపై దర్యాప్తు చేసి నివేదిక అందించడానికి గవర్నర్ ఒక కమిషన్‌ను నియమించవచ్చు. మన దేశంలో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. అవి..
అసోం: ఉత్తర కాచర్ హిల్స్ జిల్లా, కర్బీ అంగ్లాంగ్ జిల్లా, బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతాల జిల్లా… మేఘాలయ: ఖాసీ హిల్స్ జిల్లా, జైంతియా హిల్స్ జిల్లా, గారో హిల్స్ జిల్లా.. త్రిపుర: త్రిపుర గిరిజన ప్రాంతాల జిల్లా.. మిజోరం: చక్మా జిల్లా, మారా జిల్లా, లై జిల్లా.
ఎవరీ సోనమ్ వాంగ్‌చుక్?
అతను విద్యా సంస్కర్త, గొప్ప అవిష్కర్త, పర్యావరణ వేత్త, సోషల్ ఇంజినీర్, లద్దాక్ పాలిట దేవుడు, దేశ భక్తుడు అంటారు.. కాస్త అతిశయోక్తి ఉన్నా మెగసెసే అవార్డ్ గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ పరిచయం ఇది. 2009లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హిందీ సినిమా 3-ఈడియట్స్‌లో అమీర్‌ఖాన్ పోషించిన ‘ఫున్సుఖ్ వాంగ్డు’ పాత్రకు స్ఫూర్తి సోనమ్ వాంగ్‌చుక్.
వాంగ్‌చుక్ 1966లో లద్దాక్‌లోని లేహ్ జిల్లాలోని ఆల్చి సమీపంలో జన్మించాడు. ఆ గ్రామంలో పాఠశాలలు లేనందున 9ఏళ్ల వరకూ చదువులేదు. తల్లి మాతృభాషలో అన్ని ప్రాథమిక విషయాలను నేర్పింది. తండ్రి సోనమ్ వాంగ్యల్ రాష్ట్ర మంత్రి అయ్యాక వాంగ్‌చుక్‌ను శ్రీనగర్‌లో ఓ పాఠశాలలో చేర్పించారు. భాషా సమస్యతో అక్కడ చదువు సాగలేదు. అందరి అవహేళనను భరించ లేక,1977లో సోనమ్ ఢిల్లీకి పారిపోయాడు. అక్కడ కేంద్రీయ విద్యాలయంలోని ప్రిన్సిపాల్ చొరవతో బి.టెక్ పూర్తి చేశాడు. 1987లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీనగర్ నుండి మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత 2011లో ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్‌లోని క్రేటర్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ఎర్టెన్ ఆర్కిటెక్చర్‌లో ఉన్నత చదువులు చదివాడు
సోనమ్ వాంగ్‌చుక్ ఇంజనీర్ మాత్రమే కాదు. ఎన్నో పరికరాలను ఆవిష్కరించారు. భారత సైన్యం కోసం సోలార్ టెంట్లు తయారు చేశాడు. పర్వతాలలో కఠినమైన పరిస్థితులలో నివసించే ప్రజల జీవితాలకు గణనీయమైన సహకారం అందిస్తున్నారు. లడఖ్, నేపాల్, సిక్కింలలో మట్టి భవనాలను రూపొందించడంలో సాయం చేస్తున్నాడు.
అతడు విద్యా సంస్కరణవాది కూడా. విద్యార్థుల విద్య, సాంస్కృతిక ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. 1993 నుండి 2005 దాకా వాంగ్ చుక్ లడాక్స్ మెలాంగ్ పత్రికకు ఎడిటర్‌గా, ప్రభుత్వ సంస్థలకు సలహాదారుడిగా పని చేశారు. అనంతరం ఎడ్యుకేషన్ అండ్ టూరిజంపై పాలసీని రూపొందించే బాధ్యతను చేపట్టారు. 2018లో రామన్ మెగసెసే అవార్డు పొందారు. ఐసీఏ పురస్కారం సహా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.
గత ఏడాది జనవరి 26న భారత రాజ్యాంగం దినోత్సవ వేడుకల సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ పేరు దేశమంతా వినిపింది. మైనస్ 20డిగ్రీల ఉష్ణోగ్రతలో లద్దాక్ ప్రమాదంలో పడింది, శ్వాస పీల్చుకునేందుకు అల్లాడుతోంది అంటూ నిరాహార దీక్షకు కూర్చున్న సోనమ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. కొత్తగా వస్తున్న పరిశ్రమల కారణంగా కాలుష్యం బారిన పడకుండా లద్దాక్‌ను కాపాడాలని ప్రధాని మోదీని కోరారు.
తాజాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత లద్దాక్‌కు ఇతర ప్రాంతాల ప్రజల తాకిడి ఎక్కువైందని సోనమ్ వాంగ్‌చుక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, రిసార్టస్, మైనింగ్ పెట్టుబడిదారుల కన్నుపడిందని, ఈ తాకిడితో మంచు కొండలు వేగంగా కరిగిపోతున్నాయన్నది వాంగ్‌చుక్ ఆవేదన. ఇప్పటికే లద్దాక్‌లో నీటికొరత ఏర్పడిందని, సగటున రోజుకు 5లీటర్ల నీటితోనే జీవిస్తున్నామని అంటున్నారు. తమ ప్రాంతం, భాష, సంస్కృతులను కావాలని కోరుతున్నారు.
50 శాతం గిరిజనులు ఉన్న కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు మాదిరిగానే 90 శాతం గిరిజనులు ఉన్న లద్దాక్‌కు ఆరో షెడ్యూల్ రక్షణ కల్పించాలని సోనమ్ డిమాండ్‌ను చేస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ హమీని ఇచ్చినందునే బీజేపీకి చెందిన జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్‌గు గెలిపిం చామన్నారు. నాటి కేంద్ర గిరిజనసంక్షేమ మంత్రి అర్జున్ ముండా షెడ్యూల్ ఏరియా స్టేటస్ ఇస్తామంటూ తనకు లేఖ రాశారని చెబుతున్నారు. 3 ఈడియట్స్ చిత్రంలోని ‘ఆల్ ఈజ్‌వెల్’ అనే పాటకు భిన్నంగా ‘ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ లద్దాక్’ అంటున్నారు సోనమ్ వాంగ్‌చుక్.
క్రాంతి
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్