‌ప్రభుత్వ కార్యక్రమాలను తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటూ వైసీపీ  అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఇప్పటికే ‘గడపగడపకూ మన ప్రభుత్వం’, ‘బస్సు యాత్రలు’ వంటి కార్యక్రమాలకు జన సమీకరణ, కార్యక్రమం నిర్వహణ వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్న ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న పార్టీ సిద్ధం. సభలకు ప్రజలను తరలించేందుకు  ఆర్టీసీ బస్సులను, పైవేటు వాహనాలను,  ప్రభుత్వ అధికారులను వాడుకుంది.

రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికారపక్షం వైపీపీ అధికారయంత్రాంగం దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు. ‘వాలంటీర్ల వందనం’సభలో నిర్వహణ తాజా ఉదాహరణ. ఇటీవల ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్ల సభలో కూడా ప్రతిపక్షాలను విమర్శిస్తూ రాజకీయ సభగా మార్చివేసి అధికార దుర్వినియోగానికి పాల్పడింది. వాలంటీర్లకు పురస్కారాల పేరుతో రూ.392.05 కోట్లను బహుమతులుగా ఇచ్చే కార్యక్రమాన్ని రాజకీయవేదికగా మార్చారు. అన్ని కార్యక్రమాలకు 75 శాతానికి పైగా ఆర్టీసీ బస్సులను వాడుకుంటూ ప్రయాణికులను ఇబ్బందిపెట్టారు. ఎన్నికల సమయంలో సహకరించి దేశవ్యాప్తంగా విమర్శల పాలైన పోలీసులు, రెవిన్యూ ఇతర అధికార యంత్రాంగాలు ఇంకా తమ విధానాలను మార్చుకోకపోవడం గమనార్హం.

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం ఇటీవల నిర్వహించి గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, రత్న, వజ్ర’ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇది ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన కార్యక్రమమైనా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి మాత్రం రాజకీయ ప్రసంగానికే ప్రాధాన్యం ఇచ్చి పార్టీ కార్యక్రమంలా నిర్వహించారు. ఒక విధంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలా దీనిని ఉపయోగించుకొన్నారు. తన జెండాని అజెండాగా తీసుకొని త్రికరణ శుద్ధితో పని చేస్తున్నందుకు వాలంటీర్లకు బహుమతిగా ఈ పురస్కారాలు ఇస్తున్నట్లు చెప్పారు. వాలంటీర్ల సైన్యాన్ని చూస్తే ప్రతిపక్షాలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటా యన్నారు.

 టీడీపీని అధికారం నుంచి దించడానికి జన్మభూమి కమిటీలే కారణమైతే, తాను ఏర్పాటు చేసిన వాలంటీర్ల సైన్యం… గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో అనుసంధానమై ప్రతి ఎన్నికల్లో వైసీపీ ఘన విజయానికి కారణమవుతోందని తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా తన జైత్రయాత్రకు వాలంటీర్లు దారులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్మును జీతాలుగా ఇచ్చే సిబ్బందిని పార్టీ కార్యకర్తల్లా వాడుకోవడం, తమకోసం పనిచేయాలని బహిరంగంగా చెప్పడం నిబంధనలకు విరుద్ధ్దమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

నాకు రుణపడి ఉండాల్సిందే

వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను తమ పార్టీ కార్యకర్తలుగా భావిస్తోంది. ‘మీకు జీతంతో పాటు పురస్కారాల పేరుతో నగదు పారితోషకం అందించినందుకు మీరు నాకు రుణపడి ఉండాలి’ అని తేల్చేశారు. వాలంటీర్లని తన పార్టీ కార్యకర్తల మాదిరిగా భావిస్తూ హితబోధ చేశారు. రాబోయే రెండు నెలలు వాలంటీర్లు చేసే యుద్ధం పైనే తన ప్రభుత్వ సౌధం నిలబడుతుందన్నారు. ప్రతీ వలంటీర్‌ ‌తన క్లస్టర్‌ ‌పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినవారిని ఎన్నికల్లో తన పార్టీకి ప్రచారం చేసేలా చూడాలని సూచించారు. వాలంటీర్లు వైసీపీకి బ్రాండ్‌ అం‌బాసిడర్లుగా వ్యవహరించాలని కోరారు.

రాష్ట్రంలో 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉండగా, వారికి ప్రతి నెలా రూ.5 వేల వంతున గౌరవ వేతనం, పేపర్‌ ‌బిల్లు చెల్లిస్తున్నారు. గౌరవ వేతనం రూపంలోనే ఏటా రూ.1530 కోట్లు ఇస్తున్నారు. ఇది కాక ప్రతి ఏటా సేవా మిత్ర, రత్న, వజ్ర పేరుతో ప్రత్యేక పారితోషికం చెల్లిస్త•న్నారు. ఈ ఏడాది సేవా మిత్రకు రూ.10 వేల నుంచి రూ. 15 వేలు, సేవా రత్నకు రూ.20 వేల నుంచి రూ. 30 వేలు, సేవ వజ్ర పురస్కారానికి రూ.30 వేల నుంచి రూ. 45 వేలకు పెంచారు. ఇందుకోసం రూ. 392 కోట్లు తాజాగా విడుదల చేశారు.

వాలంటీర్లపై ఒత్తిడి?

వాలంటీర్ల వందనం సభకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని వైసీపీ అధికారులతో వాలంటీర్లను బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. జ్వరంతో బాధపడుతున్నా, సొంతింట్లో శుభకార్యం ఉందని చెప్పినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ సభకు రావాల్సిందేనంటూ హుకుం జారీ చేశారంటున్నారు. వారిని తీసుకువచ్చే బాధ్యతను సచివాలయ కార్యదర్శికి అధికారులు అప్పగించారు. ఎవరు కార్యక్రమానికి వస్తున్నారు.. ఎవరు వెనకడుగు వేస్తున్నారు.. అన్న దానిపై సచివాలయ కార్యదర్శులు వివరాలు సేకరించారు. అయినా చాలామంది పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు.

ఈ పరిస్థితుల్లో వారిని సీఎం సభకు తరలించే బాధ్యతను ఆయా పంచాయతీల సర్పంచ్లు, అధికార పార్టీ నేతలు నెత్తికి ఎత్తుకున్నారు. కొన్ని నియోజక వర్గాల్లో వాలంటీర్లను తరలించే కార్యక్రమాన్ని నేరుగా ఎమ్మెల్యేలు పర్యవేక్షించారు. కొందరితో ఎమ్మెల్యేలే ఫోన్లో చెప్పినట్లు తెలుస్తోంది. మొదట నయాన, భయాన చెప్పి చూసినా వాలంటీర్లు వెళ్లేందుకు ససేమిరా అనడంతో నేతలు దూషణలు, బెదిరింపు లకు దిగారు. ‘సభకి రాకపోతే ఉద్యోగం పోతుంది. అంతటితో ఆగం ఇంకా చాలా జరుగుతాయి’ అంటూ పలు ప్రాంతాల్లో బెదిరించారు. ప్రత్తిపాడు, బాపట్ల, తెనాలి, వేమూరు, పొన్నూరు, గుంటూరు-2, సత్తెనపల్లి, పెదకూరపాడు, నరసరావుపేట, గురజాల తదితర నియోజకవర్గాల్లో ఎక్కువ మంది వాలంటీర్లు సభలో పాల్గొనేందుకు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఉదయం 7 గంటలకే ఆయా ప్రాంతాలకు బస్సులు వెళ్లాయి. అయినా ఉదయం 11 గంటలు దాటినా చాలామంది వాలంటీర్లు బస్సులు ఎక్కక పోవడంతో స్థానిక వైసీపీ నేతలు తిట్లు అందుకున్నారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. ఇక స్వయం సహాయక సంఘాల బృందాలది మరో దుస్థితి.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని సమావేశాలకు బాధితులు వీరే. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమమైనా వీరు విజయవంతం చేయాల్సిందే. సభకు రాకుంటే గ్రూపులకు ఏటా ఇచ్చే అప్పురద్దు మొత్తాన్ని నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వైసీపీ సిద్ధం సభల్లోనూ ఇదీ రీతిలో స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలను బలవంతంగా తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు.

బస్సుల తరలింపు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సభలకు ఆర్టీసీ బస్సులను, ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను వాడుకోవడం చూస్తున్నదే అయినా మరింత విస్తృతమైంది. ప్రతిపక్షా లకు, ప్రజలకు తమ బలం నిరూపించుకునే లక్ష్యంతో ఆయా డిపోల్లో 75 శాతం బస్సులను సభలకు తరలిస్తున్నారు. వీటికి బిల్లులు ఎప్పుడిస్తారో దేవుడికే ఎరుక. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటితో పాటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను కూడా తరలించారు.

ఒక్కో బస్సుకు ఖర్చుల కింద రూ.10 వేలు, నియోజకవర్గానికి 2 వేల మంది సేకరించాలని నాయకులకు లక్ష్యం నిర్దేశించి అధికారులు సహకరించాలని అధినాయకత్వం ఆదేశించింది. అధినేత చెప్పినట్లు చేస్తే తాము కోరిన ప్రాంతానికి బదిలీ చేస్తారని కొందరు, ఏం చేసినా పట్టించుకోరని మరికొందరు ప్రభుత్వ అధికారులు భావించి వైసీపీ సేవలో తరిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

అయిదేళ్ల నుంచి ఇదే పరిస్థితి

వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన అన్ని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం కార్యకర్తల్లా పనిచేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టమైపోతుంది.

ఇక స్దానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థులకు పోలీసు, రెవిన్యూ యంత్రాంగం ఏమాత్రం రక్షణ కల్పించలేదు సరికదా ఎదురుదాడులు చేయడం, కేసులు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిదే. వైపీపీ నాయకులు ప్రతిపక్షాల అభ్యర్థులను బెదిరించినా, భౌతికదాడులు చేసినా, నామినేషన్‌ ‌పత్రాలు చింపేసినా పట్టించుక•లేదు. వారు కూడా పార్టీ నాయకులతో కలసి పనిచేశారని విమర్శలొచ్చాయి. ప్రజల కుల, మత ఆర్ధిక సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉండగా, ఈ డేటా మొత్తాన్ని ప్రభుత్వం సేకరించిందని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ సమాచారం ఆధారంగా ఓటర్లపై ఒత్తిడి తీసుకువచ్చారని అభియోగాలు వచ్చాయి. ఇక ఎన్నికల్లో దొంగ ఐడీలు సృష్టించి ఓట్లు వేయించుకున్న విషయం సంచలనమైంది.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో 35 వేల  ఓటరు ఐడీలను డౌన్‌లోడ్‌ ‌చేసి ఫోటోలు మార్చి వైసీపీ ప్రభుత్వానికి సహకరించిన అధికారులను ఎన్నికల కమిషన్‌ ‌సస్పెండ్‌ ‌చేసింది. దీనికి సహకరించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే రీతిన ఓటర్ల నమోదు, తొలగింపుకు అధికార యంత్రాంగం వైసీపీ ప్రభుత్వానికి సహకరించినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి.

-వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ

ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
YOUTUBE