సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  మాఘ శుద్ధ దశమి – 19 ఫిబ్రవరి 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


రాజా రామమోహనరాయ్‌, బంకించంద్ర, టాగూర్‌, సుభాశ్‌బోస్‌ వంటి వారు పుట్టిన గడ్డకు పట్టిన దుర్గతి ఇది. ఇదే ఆధునిక బెంగాల్‌ దుస్థితి.  ఇదంతా ఒక మహిళ ముఖ్యమంత్రిగా అఘోరిస్తున్న రాష్ట్ర వాస్తవిక చిత్రమంటే నమ్మక తప్పదు. అధికార పార్టీలోని గూండాలూ, పోలీసులూ చెట్టాపట్టాలేసుకుని బడుగు బలహీన వర్గాల మహిళలను ఇళ్ల నుంచి ఎత్తుకు పోయి ‘తృప్తి పడిన తరువాత’ వదిలి పెడుతున్నారు. ఈ కీచకపర్వానికి అధికార పార్టీ కార్యాలయాలే పడగ్గదులు. ఈ అన్యాయమంతా కేవలం హిందూ స్త్రీల మీదనేనన్నది మరొక దిగ్భ్రాంతికర వాస్తవం. తన ఏలుబడిలో ఎంతటి అఘాయిత్యాలు జరిగినా, రక్తం పారినా బీజేపీ మీద విమర్శ చాటున, సెక్యులరిజం రక్షణ నినాదాలతో పదవిని కాపాడుకొస్తున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాక్షసపాలనలో నిజంగా ఇదొక కొత్త అధ్యాయం. ఆమెకు సిగ్గూ, శరం ఉంటే ఈ పాటికి రాజీనామా చేసి ఉండేది. కనీసం ఇంతటి నీచ ప్రవృత్తి ఉన్న పార్టీ నేతలను అరెస్టు చేయించేది. రెండూ జరగలేదు. అసలు నోరు కూడా విప్పలేదు. ఆ ధైర్యం ఆమె చేయలేదు. ఇదీ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడతానంటూ వీరంగం వేసే కీలక విపక్ష నేత ఘనత. ఈ ఉదంతం మీద మాట్లాడితే బీజేపీకి బలం చేకూర్చడమేననుకుని గట్టిగా నమ్ముతున్నందుకు కాంగ్రెస్‌ వంటి విపక్షాలు, ఉదారవాదులు ఆ నేరంలో భాగస్వాములైపోయారు.

 ‘సర్వే పేరుతో పార్టీ (తృణమూల్‌ కాంగ్రెస్‌) వాళ్లు ఇళ్లకు వస్తారు. వయసులో ఉన్న ఇల్లాళ్ల, అమ్మాయిల ఆచూకీ లాగుతారు. ఆపై వాళ్లని పార్టీ కార్యాలయాలకి తీసుకుపోయి, మోజు తీరే వరకు ఉంచేస్తారు’ ఇవి సందేశ్‌ఖాలి అనే ప్రాంతంలో యథేచ్ఛగా జరిగిన అత్యాచారాల తీరు గురించి ఒక మహిళ వీడియో ద్వారా చెప్పిన మాటలు. ఇదంతా ఘనత వహించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏలుబడి స్వరూపం. ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన ఈ ఆటవిక దుశ్చర్యకు కారకుడు షేక్‌ షాజహాన్‌. అసలే కోతి, ఆపై కల్లు తాగింది అన్నట్టు ఇతడొక మాఫీయా డాన్‌. ఆపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు. మైనారిటీ, ఆపై జిల్లా పరిషత్‌ సభ్యుడు. టీఎంసీ నేతలు, పోలీసులు ఎంతగా బరితెగించారో కనికాదాస్‌ అనే మహిళ మాటలు వింటే అర్ధమవుతుంది. తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో 20 నుంచి 30మంది వచ్చి మా ఇంటి తలుపులు బాదారు. చివరికి కిటికీ పెరికి చొరబడ్డారు. తన చేతిలోని ఆడశిశువులను కూడా కిందపడేశారు. తనను తీసుకుపోయారని చెప్పిందామె. వాళ్లు వచ్చి ఒక మహిళను ఎత్తుకుపోతారు. రాత్రంతా పార్టీ కార్యాలయంలో ఉంచి, మళ్లీ ఉదయమే వదులుతారు అని మరొక మహిళ వాపోయింది.

‘షాజహాన్‌, ఇతడి అనుచరగణం బంగ్లా సరిహద్దులలోని సందేశ్‌ఖాలీలో అక్షరాలా భీతావహ పాలనను సాగిస్తున్నారు. ఈ నీచుడి మీద మహిళలు చెప్పిన విషయాలు దారుణంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక మహిళకు భర్త అయి ఉండవచ్చు. కానీ అతడికి ఆమె మీద అధికారం ఉండదు. తన భార్యను తీసుకుపోతున్నా ఏమీ అనలేని పరిస్థితి. ఈ ప్రతాపమంతా అక్కడ  ఎక్కువగా ఉండే ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల మీదే. వారి ఆత్మగౌరవాన్ని షాజహాన్‌ మనుషులు నిరంతరం నేల రాస్తున్నారు. బడుగువర్గాల, ఎస్‌టీల భూములను ఆక్రమిస్తున్నారు’  అని శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడు సువేందు అధికారి ఫిబ్రవరి 11న ఆరోపించారు. ఇప్పుడు గుట్టు రట్టయింది. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో చాలాచోట్ల ఉద్రిక్త వాతావరణం ఉంది. కొన్ని చోట్ల 144వ సెక్షన్‌ విధించారు. స్థానికులు, ప్రధానంగా మహిళలు కర్రలు చేతపట్టి ఆవేశంతో నిరసనలకు దిగుతున్నారు.

ఈ గొడవ అంతా షాజహాన్‌ను అరెస్టు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సభ్యులు వెళ్లడంతో గుప్పుమంది. భూమి కబ్జాలు, మహిళలను చెరపట్టడం వంటివాటితో పాటు రేషన్‌ అవకతవకల ఆరోపణలు కూడా షాజహాన్‌ మీద ఉన్నాయి. రేషన్‌ వ్యవహారంలోనే అతడి అరెస్టుకు ఈడీ జనవరి 5న వెళ్లింది. వందలాది షాజహాన్‌ గూండాలు అధికారుల మీద దాడికి దిగి, అతడు జారుకునే వీలు కల్పించారు. ఇప్పటికీ అతడి జాడ లేదు. అందివచ్చిన ఈ అవకాశాన్ని తీసుకుని స్థానికులు, ఎక్కువగా మహిళలు షాజహాన్‌కూ, అతడి గూండాలకూ వ్యతిరేకంగా నిరసనలు ఆరంభించారు. అంటే  అక్కడ ఈ షాజహాన్‌ సృష్టించిన భయానక వాతావరణం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ లీనా గంగోపాధ్యాయ అక్కడికి వెళ్లారు. గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ వెళ్లడానికి ప్రయత్నిస్తే టీఎంసీ గూండాలు కాన్వాయ్‌ని ఆపేశారు. నిధుల విడుదలలో కేంద్రం చేస్తున్న జాప్యానికి నిరసనగా గవర్నర్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్నట్టు చెప్పడం పరమ వికృతంగా ఉంది. ‘తీవ్రంగా కలత పెట్టే’ ఈ దురంతం మీద నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశించింది. షాజహాన్‌ అరాచకమంతా హిందువుల మీదే సాగిందని కొన్ని మీడియా సంస్థలు పేర్కొనడం గమనార్హం. మాటలకు అందని ఇలాంటి అకృత్యం జరిగినా, బాధితులు బడుగువర్గాలే అయినా పోలీసులు నిస్సిగ్గుగా నిందితుల తరఫున పనిచేయడం మరీ దిగ్భ్రమ గొలుపుతుంది. ఫలితమే నిరసనలను అణచివేయడానికి విధించిన 144వ సెక్షన్‌.

ఇదంతా ముస్లింల బుజ్జగింపు ధోరణిలో బయటపడుతున్న మరొక కోణమే.  హిందూ సమాజాన్ని ఎదుర్కొనలేమని అర్ధమైన ముస్లిం గూండాలూ, మతోన్మాదులూ, నేతలూ ఇప్పుడు హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. లవ్‌ జిహాద్‌కు మించిన అకృత్యమిది. ఇందులో మమత వంటి వారి నీచమైన పాత్ర నిజం. ఎప్పుడూ మధ్యయుగం నాటి మనస్తత్వంతో ఉండే ముస్లిం గూండాలకు ఈ ధోరణి మరింత రుచిస్తుంది. దీనిని హిందూ సమాజం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

About Author

By editor

Twitter
YOUTUBE