‌హిందువుల ఆత్మ జాగృతమైన సుదినమది… అందరి మనస్సులూ ఆనందంతో నిండిన రోజు. ఎన్నాళ్లో వేచిన ఆ హృదయాలకు సాంత్వన లభించిన భవ్యమైన దినమది. తన, మన బేధం లేకుండా అందరినీ కలుపుకుని ఉత్సవాలు జరుపుకున్న దివ్యమైన రోజు. దేశం మొత్తాన్నీ కుల, మతాలకు అతీతంగా ఏకం చేసిన దినమది. ఒకరకంగా చెప్పాలంటే, హిందూ రాష్ట్ర అవతరణకు శంఖారావం పూరించిన గొప్ప ఘడియలు అవి… అవే అయోధ్యలోని రామజన్మ భూమిలో బాల రాముడిని ప్రతిష్ఠించిన ఘడియలు. హిందూ రాష్ట్రంలో హర్షోల్లాసాలు, ఐకమత్యం ఎలా ఉంటుందో పట్టి చూపిన రోజది. రామ్‌‌ల్లా తిరిగి రావడమన్నది విజయానికి ప్రతీక అయినప్పటికీ, వాస్తవంగా ఇది ఒక కొత్త యుగానికి నాంది అన్న సంకేతాలు నాటి వక్తల ఉపన్యాసాలు పంపాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘచాలక్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ అన్నట్టుగా భారతదేశపు ఆత్మ గౌరవం (స్వ) తిరిగి వచ్చిన రోజు ఇది. మొత్తం ప్రపంచపు దుఃఖానికి సాంత్వన కల్పించే నూతన భారతదేశం ఏర్పడుతుందని, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన దినమిది అని మోహన్‌జీ అన్నారు. ఇంతటి దివ్యభవ్య ఘట్టాన్ని దేశంలోని కోట్లాదిమంది ప్రజలు వీక్షిస్తున్న సమయంలో బాధ్యత కలిగిన మాటలు చెప్పవలసి ఉందంటూ ఆయన తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు.

ఏ మతానికి, పంధాకు చెందినవారిని అయినా పెద్ద మనసుతో స్వీకరించే గుణం హిందువుల జన్యువులలోనే ఉందన్నది వాస్తవం. సెక్యులరిజం అన్న పదం మన రాజ్యాంగంలో ఉన్నా, లేకున్నా మన జీవనవిధానం, పద్ధతులలో అది ఉంది కనుకనే, మెజారిటీ హిందువులు ఉన్న దేశంలో ఇతర మతాలు ఎటువంటి సమస్యలూ లేకుండా మనగలుగు తున్నాయి, శాంతియుతంగా జీవించగలుగు తున్నాయి. ఈ విషయాన్నే మోహన్‌జీ భాగవత్‌, ‌ప్రధాని మోదీ, గోవిందగిరి మహరాజ్‌ ‌ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతిధ్వనించారు.

 అయోధ్య నుంచి రామ్‌లల్లా బయటకు ఎందుకు వెళ్లారో సర్‌సంఘచాలక్‌ ‌వివరించారు. రామాయణం చదివిన ప్రతివారికీ రాముడు వనవాసానికి వెళ్లాడని తెలుసు. కానీ, ఎందుకు అంటే అక్కడ కలహం జరిగింది కనుక వెళ్లాడని ఎందరికి తెలుసు? అని ఆయన ప్రశ్నించారు. ‘అయోధ్య’ అంటే కలహాలు, ద్వంద్వాలు, సందేహాలులేనిదని అర్థం. కానీ అక్కడే కలహాలు చెలరేగడంతో 14 సం।।ల వనవాసం చేసి, ప్రపంచంలో కలహాలను నిర్మూలించి ఆయన తిరిగి వచ్చారని భాగవత్‌జీ చెప్పారు. మన ప్రధాని కూడా ప్రాణ ప్రతిష్ఠ కోసం కఠోర వ్రతం చేశారు. ఆయన తపస్వి అని నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. కానీ ఆ తపస్సు ఏదో ఆయన ఒక్కరే చేస్తారా? మరి మనమేం చేద్దామంటూ ప్రశ్నించి, ప్రజల బాధ్యతను పట్టి చూపారు. 500 ఏళ్లల్లో ఎన్నో తరాలు చేసిన త్యాగాలు, తపస్సు, ప్రయాసాల వల్ల రామ్‌‌ల్లా తిరిగి వచ్చారు; అందుకే ప్రాణప్రతిష్ఠ సందర్భంగా చెప్పిన సంకల్పంలో వారందరినీ స్మరించుకున్నాం. వారంతా కోటిసార్లు స్మరించుకోవలసినవారు. రామ్‌లల్లా తిరిగి రావడానికి దారి తీసిన పరిస్థితులను అధ్యయనం చేసిన వారికి దేశం పట్ల ప్రేమ, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అందరి దుఃఖాలను తొలగించే సామర్ధ్యం ఈ ఇతిహాసానికి ఉందని ఆయన చెప్పారు.

రామ్‌లల్లా రాకతో రామరాజ్యానికి పునాదులు పడ్డాయని సర్‌సంఘచాలక్‌ ‌పేర్కొన్నారు. అందుకోసం ప్రధానమంత్రి తపస్సు చేశారు, కానీ మనం కూడా చేయవలసి ఉందన్నారు. రామరాజ్యం వస్తే ఎలా ఉంటుంది? అంటూ శ్రీరామచరితమానస్‌లో రామరాజ్యానికి సంబంధించిన వర్ణనను వివరించారు.

దైహిక దైవిక భౌతిక తాపా ।

రామరాజ్య నహి కాహుహి వ్యాపా ।।

సబ్‌ ‌నర్‌ ‌కరాహి పరస్పర ప్రీతి ।

చలాహి స్వధర్మ నిరత శృతి నీతి ।।

(‘రామరాజ్యంలో భౌతిక, దైవిక, దైహిక తాపం ఎవరినీ ప్రభావితం చేయదు. మానవులందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండటమే కాక వేదాలలో సూచించిన నియమ, నిబంధనలను అనుసరించడం ద్వారా వారి వారి ధర్మాలను అనుసరిస్తారు.’)

సబ్‌ ‌నిర్బంధ ధర్మరత్‌ ‌పునీ।

నర అరు నారీ చతుర సబ్‌ ‌గుణీ ।।

సబ్‌ ‌గుణజ్ఞ పండిత సబ గ్యానీ ।

సబ్‌ ‌కృతగ్య నహి కపట సయానీ ।।

(అందరూ అహంకారం లేనివారు, భక్తిపరులు, సద్గురువులు, పురుషులు, మహిళలు అందరూ తెలివైనవారు, ప్రతిభావంతులు. అన్ని ధర్మాలను గౌరవించే, విజ్ఞానం, విజ్ఞత కలిగిన పండితులు ఉన్నారు. అందరూ కృతజ్ఞులై ఉంటారు (ఇతరులు చేసిన ఉపకారాలను మర్చిపోకుండ), ఎవరూ మోస పూరితులు కాదు అంటూ, ఈ వర్ణన ప్రకారం జీవిస్తున్న మనమంతా వారికి సంతానం అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభు రాముడి గుణగణాలను మనం కోటి కోటి గొంతులతో గానం చేస్తాం, ఇప్పుడు ఆ గుణాలను మనం కూడా అంది పుచ్చుకోవాలి, ఆచరించాలని ఉద్బోధించారు.

వ్యక్తులుగా మన మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా ఉండే కలహాలకు, విభేధాల కారణంగా గొడవ పడటానికి స్వస్తి చెప్పాలి. ఒక సాధారణ పౌరుడులా అహంకారం లేకుండా ఉండాలి. కేవలం మాటలు కాదు ఆచరణ కావాలి. అది కూడా ప్రామాణికతతో ఆచరించాలి. మాటలు చెప్పి అహంకారంతో ఉండేవాడు కాదు, పని చేసేవాడు, ఆచరించేవాడు, అహంకారం లేనివాడు అయినవాడే ధార్మికుడు.

శ్రీమద్భాగవతంలో చెప్పినట్టుగా ఏ నాలుగు స్తంభాల (సత్యం, కరుణ, శుచిత, తపస్సు) పై అయితే ధర్మం నిలిచిందో వాటిని నేడు కూడా ఆచారించాలి అనడమే కాదు, ఆధునికకాలంలో వాటిని ఆచరణ లోకి పెట్టడం ఎలాగో కూడా వివరించారు.  మొదటి సత్యం – దాని ఆచరణ: ప్రతి జీవిలోనూ రాముడున్నాడని పరమ సత్యం,  అంటే సర్వత్రం వ్యాపితమై ఉన్నాడని తెలుసుకొని, మనం సమన్వయంతో ముందుకు వెళ్లాలి. అందరూ మనవారు కనుకనే మనం పురోగమించగలం. సమన్వయంతో ముందుకువెళ్లడమనేదే ధర్మం, మొదటి సత్యం – దాని ఆచరణ.

రెండవ అడుగు కరుణ. ఆధునిక కాలంలో సేవ, పరోపకారమే మార్గం. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తన బాధ్యతగా అమలు చేస్తోంది. కానీ సమాజాన్ని ఐక్యం చేయడమనేది మన కర్తవ్యం కూడా. దుఃఖానికి ఓదార్పునివ్వాలి. ప్రతిసారి రెండు చేతులా సంపాదించి, తన కనీస అవసరాలకు వినియోగించుకుని, మిగలినదంతా పరోపకార మార్గంలో సమాజానికి తిరిగి ఇవ్వడమే నేటి కాలంలో కరుణ.

మూడవది శుచిత, అంటే పవిత్రత. అందుకు సంయమనం అవసరం. స్వీయ నియంత్రణ కావాలి. తాను చెప్పిందే సరైనదనే భావన సరికాదు. ఇతరులకూ అభిప్రాయాలుంటాయనే విషయాన్ని గుర్తించి, గౌరవించాలి. స్వీయ నియంత్రణ అన్నదే ఈ పృధ్విని సజీవంగా ఉంచుతుంది. గాంధీ అనేవారు, ‘‘ఈ భూమి దగ్గర అందరి అవసరాలకు తగినంత ఉంది కానీ, ప్రతి ఒక్కరి దురాశకు తగినంత కాదు’’ అని. జీవితంలో నియమాలు ఉండాలి, వాటిని పాటించాలి. కుటుంబంలో, సమా జంలో కూడా నియమాలు పాటించాలి. సామాజిక సంబంధాలలో కూడా అవి ఉండాలి. సోదరి నివేదిత కూడా, ప్రజలు సానుభూతిని కలిగి ఉండి, పౌరులు నియమాలను పాటించడమే దేశభక్తి రూపం అని పేర్కొన్నారు.

నాలుగవది తపస్సు అంటూ, అందుకు నిలువెత్తు ఉదాహరణ మీ ఎదురుగానే ఉన్నారంటూ ప్రధాని మోదీని పొగడ్తలో ముంచెత్తారు. ఇది కూడా వ్యక్తిగతంగా మనం ఆచరిస్తాం, సామూహికం మాటేమిటి? సామూహిక తపస్సు అంటే,

సంఘచ్ఛద్వం, సంవదధ్వం।

సంవో మనాంసి జానతామ్‌ ।।

 ‌దేవాభాగం యథాపూర్వే ।

సంజానానా ఉపాసతే।।

మీరు సామరస్యంగా కదలండి, ఒకే స్వరంలో మాట్లాడండి. మీ మనస్సులు ఒకేలా ఉండనివ్వండి. నాడు దేవతలు తమ త్యాగభాగాన్ని పంచుకున్నట్లే అన్నారు. మనమంతా అటువంటి సామరస్యతను కలిగి ఉన్నప్పుడే దేశం విశ్వగురువు కాగలదు.      అందుకు మనమందరం దోహదం చేయాలి.

ఐదువందల సంవత్సరాలపాటు ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేసినవారు ఇంతటి ఆనందకరమైన రోజును దేశానికి ఇచ్చారు. వారందరి పట్లా మనం కృతజ్ఞతతో ఉండాలి. ధర్మస్థాపన కోసం వ్రతాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు రాముని అవతారం వచ్చింది. కనుక అటువంటి పరిస్థితులను ఉత్పన్నంగ మలచుకోవడం మన కర్తవ్యం. నేడు రామ్‌లల్లా వచ్చారు. మనకు ప్రేరణను ఇవ్వడంతో పాటు ఈ లక్ష్యం సాధించేందుకు కృతి ప్రమాణమిచ్చారు. ఆయన ఆదేశాలను తలకెత్తుకుని ఇక్కడ నుంచి వెళ్లాలి అంటూ ప్రసంగించిన సర్‌సంఘచాలక్‌ ‌దేశంలో సమైక్యత, నియమబద్ధమైన జీవన విధానం అవసరాన్ని నొక్కి చెప్పారు.

– డి. అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE