ఒకవైపు ప్రధాని మోదీ ఏక్‌భారత్‌ ‌శ్రేష్ఠ్ ‌భారత్‌ అని నినదిస్తూ, కులమతాలకు అతీతంగా పాలనను అందిస్తున్న నేపథ్యంలో బిహార్‌ ‌రాష్ట్రం ఇటీవల బరితెగించి కుల రాజకీయాలకు శ్రీకారం చుట్టడంతో అక్కడి పరిణామాలు అనూహ్య మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ ‌నేతృత్వంలో ప్రభుత్వం తొంభై రెండేళ్ల తర్వాత గత ఏడాది కుల గణన చేయించడమే కాదు ఫలితాలను కూడా ప్రకటించింది. దీనితో బీజేపీని ఇరుకున పెట్టవచ్చని భావించింది. ఈ క్రమంలోనే ప్రధాని సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్‌కు ‘భారతరత్న’ను ప్రకటించి, తనదైన శైలిలో ప్రతి పక్షాలకు దిమ్మతిరిగేలా మాస్టర్‌ ‌స్ట్రోక్‌ ఇచ్చారు. నితీశ్‌ ‌బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గూటికి చేరిపోయారు. బిహార్‌లోని ఈ పరిణామానికి మరొక పేరే ఇండీ కూటమి పతనం. మోదీ ఓటమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆ కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసిన వ్యక్తే ఇప్పుడు మోదీ చెంతకు చేరడం పెద్ద మలుపు.

2022 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమికి మెజారిటీ కన్నా ఆరు ఎక్కువగా 128 స్థానాలు సాధించగా, మహాఘట్‌బంధన్‌లో (ఆర్జేడీ, కాంగ్రెస్‌ ‌వామపక్ష పార్టీలు) 114స్థానాలు గెలుచుకుంది. మొత్తం 243 స్థానాలు గల బిహార్‌ అసెంబ్లీలో 79మందితో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించగా, 78 స్థానాలతో బీజేపి, 45 స్థానాలతో జేడీ(యు), 19 స్థానాలతో కాంగ్రెస్‌ 18 ‌స్థానాలు వామపక్షాలు, మాంఝీ పార్టీ నాలుగు స్థానాలు ఎఐఎంఐఎం ఒక స్థానాన్ని సాధించాయి. జనతాదళ్‌ ‌యు (జేడీ•యు) అధినేత నితీశ్‌కుమార్‌ ‌రాష్ట్ర ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఆగస్టు 2022లో బీజేపీ తన పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తోందనే సాకుతో మహాఘట బంధన్‌లో చేరారు.

‘పల్టూమార్‌’ అన్న బిరుదు పొందిన నితీశ్‌కు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పల్టీ కొట్టడం కొత్తకాకపోయినా, ఆయన జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించేందుకు చేసిన గత ప్రయత్నాల నేపథ్యంలో ఎన్డీయేతో చేతులు కలుపుతారని ఎవరూ ఊహించ లేదు. ఎందుకంటే, ఆయన ‘ఇండీ కూటమి’ ఏర్పడకముందు నుంచే ప్రతిపక్ష పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. ‘ఇండీ కూటమి’ ఏర్పడిన అనంతరం తనను దానికి కన్వీనర్‌గా చేస్తారని, చేయాలని ఆశించారు. కానీ కాంగ్రెస్‌ ‌పార్టీ మాత్రం తాను కాక, మరెవరూ నాయకత్వ బాధ్యతలలో ఉండేందుకు అర్హులు కారన్నట్టు ప్రవర్తించడం ఆయనను నిరాశకులోను చేసింది. ఆ నిరాశలోంచి వచ్చిన అసహనాన్ని ఆయన దాచుకోకుండా ప్రదర్శిం చారు. అయినప్పటికీ ఇండీ• కూటమి దానిని విస్మరించడమే ప్రస్తుత పరిణామా లకు దారి తీసిందని చెప్పవచ్చు. కాగా, దాదాపు నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికలలో ఎన్డీయేతో కలిసిపోటీ చేసి, గెలిచిన తర్వాత వారిని కాదని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) పార్టీతో ప్రేమలోపడి వారితో ఇతర ప్రతిపక్షాలను కలుపుకొని మహా ఘ•బంధన్‌ ‌ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్‌, ఇప్పుడు వారికి విడాకులు ఇవ్వడాన్ని ప్రతిపక్ష కూటమి తప్పుపట్టడం సరే, ప్రజలు అంగీకరిస్తారా అన్నది మిలియన్‌ ‌డాలర్‌ ‌ప్రశ్నగా మారిందని కొందరి భావన.

లల్లన్‌ ‌సింగ్‌ ‌ట్విస్ట్

‌కాగా, గత డిసెంబర్‌ ‌వరకూ జేడీయు అధ్యక్షుడిగా ఉన్న లల్లన్‌ ‌సింగ్‌ ‌కొంత కాలం కిందట లాలూ కుమారుడు తేజస్విని ముఖ్యమంత్రిని చేయవలసిం దిగా సూచిస్తూ12 నుంచి 13మంది ఎమ్మెల్యేలను వెంటవేసుకొని వెళ్లడంతో, ఏదో కుట్ర జరుగుతోందని సంశయించిన నితీశ్‌ ‌వెంటనే పార్టీ అధ్యక్ష పదవి నుంచి లల్లన్‌ను తొలగించి, ఆ బాధ్యతను తనే స్వీకరించాలని నిర్ణయించుకున్నారని డిసెంబర్‌లోనే జితేన్‌రాం మాంఝీ బహిరంగంగా వెల్లడించడం వాస్తవమేనని ఈ పరిణామాలు చెప్తున్నాయి. కాగా, లల్లన్‌ ‌సింగ్‌ ఆర్జేడీ నేత లాలూ యాదవ్‌తో కలిసిపోయి, పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వాసనలు నితీశ్‌ ‌పట్టేయడం వల్లనే ఆయనను తొలగించి, తాను పార్టీ అధ్యక్షుడయ్యాడని మరొక వర్గం చెప్తున్నమాట. ఏది ఏమైనా, నితీశ్‌ ‌మనసు మార్చుకొని, ఎన్డీయే వైపు మొగ్గడానికి ప్రధాన కారణంగా దీనిని చూడవచ్చు.

ఈ అంశంలో రాజకీయ వ్యూహకర్త, ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. జేడీయుతో పొత్తు రానున్న 2025 ఎన్నికల్లో బీజేపీకి హాని చేస్తుందని ఆయన అంటున్నారు. అప్పటివరకూ ఈ కూటమి కొనసాగదని కూడా ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌జోస్యం చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో నితీశ్‌కు తమ ద్వారాలను మూసివేశామని స్పష్టంగా ప్రకటించిన బీజేపీ తిరిగి అతడి పార్టీతో ఎందుకు కలిసిందో ప్రజలకు చెప్పి, ఒప్పించడం కష్టమవు తుందని ఆయన అన్నారు.

కుల రాజకీయాలకు పుట్టిల్లు

బిహార్‌ ‌కులరాజకీయాలకు పుట్టిల్లు అన్న విషయం విదితమే. ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నితీశ్‌ ‌ప్రభుత్వం తొంభై రెండేళ్ల తర్వాత కుల గణన చేయించి, గత అక్టోబర్‌లో దాని ఫలితాలను ప్రకటించింది. కుల గణన నివేదిక ప్రకారం రాష్ట్రంలో వెనుకబడిన కుల జనాభా (బీసీ)27.12 శాతం ఉండగా, అత్యంత వెనుకబడిన కులాలు (ఇబిసి) 36.01శాతం, షెడ్యూల్డు కులాలు (ఎస్‌సీలు) 19.65శాతం, షెడ్యూల్డు తెగలు (ఎస్‌టి) 1.68శాతం, సాధారణ (అగ్రవర్ణ, ఆధిపత్య)కుల జనాభా 15.52శాతం ఉన్నారు. ఈ గణాంకాలను మండల రాజకీయాల కోసం ఉపయోగించుకుని, నితీశ్‌కూటమి లబ్ధి పొందుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే, అదే సమయంలో 1990లో జరిగిన మండల రాజకీయాలంత అవకాశం ఉండదని కూడా వారు హెచ్చరించారు. అందుకు కారణం ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి ఒబిసి కావడం, ఆయన నేతృత్వంలో బీజేపీ కూడా వెనుకబడిన వర్గాల రాజకీయాలు చేస్తుండడం. కనుక, ఆశించినంతగా ఫలితాలు దక్కకపోవచ్చన్నది వారి భావన.

మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రతి ఎన్నికల్లో కూడా రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న కులాలను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం జరుగుతున్నది. ఒక రకంగా, ఇదే బీజేపీకి ఒక పెద్ద అస్త్రంగా మారింది కూడా. ఈ రకంగా బీజేపీ అగ్రవర్ణ పార్టీ అనే అపవాదును ప్రధాని మోదీ తుడిచిపెడుతున్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు ఏ మేరకు గమనించాయో వారికే తెలియాలి. ఎందుకంటే, 2014 ముందువరకూ ఒకలాగా, 2014 తర్వాత ఒకలాగా రాజకీయాలు సాగుతున్నాయి. ప్రస్తుతం సమ్మిళిత అభివృద్ధి దిశగా ప్రధాని దేశాన్ని నడిపిస్తున్నారు. మారుమూల గ్రామాల వరకు కూడా ప్రభుత్వ పథకాల లాభాలను అందించాలన్న లక్ష్యంతో పని చేయడమే కాదు, అవి అందుతున్నాయో లేదో కూడా గమనిస్తూ, అందనివారికి వాటి గురించి వివరించి, అందులోకి చేర్చడమే ‘వికసిత భారత సంకల్ప యాత్ర’ లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు పాతచింతకాయ పచ్చడి వ్యూహాలను వదలకపోతే, ఏ రకంగానూ లాభపడ లేరన్నది బిహార్‌ అనుభవం స్పష్టం చేస్తోంది.

మోదీ పట్ల నితీశ్‌ ‌ప్రేమ

నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ పట్ల బిహార్‌ ‌ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కి లవ్‌-‌హేట్‌ (‌ప్రేమ- ద్వేషం) సంబంధం ఉంది. మధ్య మధ్యలో అలకలు పోయినా, మోదీ పట్ల తనకున్న ఆదరభావాన్ని నితీశ్‌ ఎన్నడూ దాచుకోలేదు. అందుకే, 2003లో అటల్‌ ‌బిహారీ మంత్రివర్గంలో ఉన్నప్పుడే అందరికన్నా ముందుగా మోదీలో జాతీయ నాయకుడి లక్షణాలను గమనించడమే కాదు, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు కూడా. అప్పుడే ఆయన 2002లో జరిగిన అల్లర్లను పెద్దది చేసి చూడకుండా గుజరాత్‌లో మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలని కూడా సూచించారు. అటువంటి ఆప్యాయత మోదీ పట్ల ప్రదర్శించినప్పటికీ, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆకాంక్ష సమసిపోక పోవడం వల్లనే నితీశ్‌ ఈ ‌పల్టీ రాజకీయాలు చేస్తున్నారనుకోవాలి.

ఏకకాలంలో మందిర -మండల రాజకీయంతో దెబ్బ

దేశమంతా రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో మురిసిపోతున్న సమయంలో ప్రధాని మోదీ సోషలిస్టు, బీసీ నేత కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్నను ప్రకటించారు. ఇది వాస్తవానికి ఎప్పటి నుంచో నితీష్‌కుమార్‌ ‌చేస్తున్న డిమాండ్‌. ఈ ‌రకంగా, నితీశ్‌ ‌కూటమి వేసిన మండల రాజకీయ వ్యూహాన్ని మోదీ తిప్పి కొట్టారు. సరిగ్గా కర్పూరీ ఠాకూర్‌ ‌శతజయంతోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ ఆయనకు దేశంలోనే అత్యున్నత అవార్డును ప్రకటించడంతో, నితీశ్‌ ఆయనకు కృతజ్ఞతలు చెప్పకతప్పలేదు. ఠాకూర్‌ ‌శత జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పడమే కాదు, కర్పూరీ ఠాకూర్‌లా తాను కూడా కుటుంబాన్ని రాజకీయాల్లోకి తేలేదని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఆ పని చేశాయంటూ ఆర్‌జెడిని పరోక్షంగా ఎద్దేవాచేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీహార్‌లో రాజకీయంగా కొద్ది గందర గోళం ఏర్పడడం, ఆ సమయంలోనే మోదీతో నితీష్‌ ‌చేతులు కలపడం నాటకీయంగా జరిగిపోయాయి.

అయోమయంలో లాలూ కుమారుడి భవితవ్యం

నితీష్‌ ‌కుమార్‌ ‌తీసుకున్న హఠాత్‌ ‌నిర్ణయంతో లాలూ కుమారుల రాజకీయ జీవితం అయో మయంలో పడిపోయింది. ఒకవైపు ఉన్న ఉపముఖ్య మంత్రి పదవి ఊడిపోయిన ఆవేదన, మరోవైపు తండ్రి రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలకు, భూములు తీసుకున్న స్కాంలో అటు లాలూ, ఇటు తేజస్వి యాదవ్‌ను ఇడీ ప్రశ్నిస్తుండటం వారికే కాదు ఆ పార్టీకి కూడా ఇబ్బందిగా పరిణ మించింది. నిజానికి, ఆర్జేడీకి పుష్కలమైన యాదవ్‌ ఓటు బ్యాంకు బీహార్‌లో ఉంది. దానితో పాటుగా కొంత ముస్లిం ఓటు బ్యాంకు కూడా. అయితే, ఇప్పుడు నితీష్‌ ‌వెళ్లి బీజేపీతో కలవడం, జితేన్‌రాం మాంఝీ వంటి నాయకులు బీజేపీతోనే కొనసాగు తుండడం వల్ల వీరి ఓట్లన్నీ కలిస్తే, ఆర్జేడీ ఎందుకూ పెట్టదు. 2019లో ఎన్డీయే కూటమి 40లో మొత్తం 39 సీట్లను గెలుచుకుంది. ఈసారి కూడా చరిత్ర పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.

9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

తాను ఆర్జేడీతో సంబంధాన్ని తెంచుకుంటు న్నానని ప్రకటించి, తన రాజీనామాను సమర్పించి అసెంబ్లీని రద్దు చేసిన నితీశ్‌ 48 ‌గంటలు తిరుగకుం డానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా రికార్డు సాధించారు. వాస్తవానికి ఆయన వేసే పిల్లిమొగ్గలే ఆయన చేత తొమ్మిదిసార్లు ప్రమాణ స్వీకారం చేయించాయి. ఈ క్రమంలోనే నిన్నటివరకూ ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్‌ ‘ఆయన అలసిపోయిన ముఖ్యమంత్రి’ అటువంటి వాడి చేత మేం పని చేయించాం అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు, నితీష్‌ ఏం ‌మాట్లాడు తున్నాడో ఆయనకే తెలియడం లేదని, ఆయన రాజకీయ జీవితం 2024తో ముగిసిపోతుందని, జోస్యం కూడా చెప్పారు. అయితే, తేజస్వి ఇంకా ఇడీని ఎదుర్కొనవలసి ఉంది.

ఇదిలా ఉండగా, ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ ‌పార్టీ, జేడీయులు పరస్పర విమర్శలకు దిగాయి. ముందస్తు ప్రణాళికతోనే నితీశ్‌ ఈ ‌పని చేశారంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు చేయగా, అది ముందస్తు ప్రణాళికే అయితే మొదటి ఇండీ సమావేశాన్ని తామెందుకు నిర్వహిస్తామని, అరవింద్‌ ‌కేజ్రీవాల్‌, ‌మమతా బెనర్జీ అఖిలేష్‌ ‌వంటి నాయకులను ఎందుకు మీకు అనుకూలంగా కూడగడతామంటూ జెడియు నాయకుడు కెసి త్యాగి విరుచుకుపడటమే కాదు, కాంగ్రెస్‌ ‌పార్టీ దృష్టి ఎప్పుడూ ప్రధాని పదవి పైనే ఉంటుందని విమర్శించారు.

అన్యాయమవుతున్న కాంగ్రెస్‌ ‌న్యాయయాత్ర

ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ నాయకత్వంలో జరుగుతున్న ‘భారత్‌ ‌జోడో న్యాయయాత్ర’ జనవరి 29న కిషన్‌గంజ్‌ ‌నుంచి బీహార్‌లో ప్రవేశించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి మొత్తం 19మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో 10మంది మాత్రమే హాజరు కావడం సంచలనం కాగా, పార్టీ నాయకులు మాత్రం దానిని చిన్న విషయంగా తీసేస్తూ, బహిరంగ సభకు అందరూ హాజరవుతారని విశ్వాసంతో చెప్పారు.

ఈ రాజకీయ చదరంగంలో బీహార్‌ ‌ప్రజలు ఎవరికి చెక్‌ ‌పెడతారనే విషయం వేచి చూడవలసిన విషయమే.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE