రాయప్రోలు వెంకటరమణ శాస్తి
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘‘తాతయ్యా ఇక్కడే ఈ రోజు రాత్రికి సంగీత్ సంబరం. నువ్వూ బామ్మ ఇద్దరూ డాన్స్ చేస్తుంటే చూడాలని ఉంది. చేస్తారు కదూ నాకోసం’’ వేదిక చూపిస్తూ చెప్పింది పెళ్లికూతురు అన్వయ, డెబ్భై ఏళ్ళ తాత చిన్మయమూర్తికి.
‘‘రాత్రికి వచ్చేవాళ్లలో ఎముకలు అతికించే డాక్టర్ ఎవరైనా ఉంటే, నాకు అభ్యంతరం లేదు అన్నూ’’ సరదా తగ్గకుండా ఆయన సమాధానం.
అన్వయ తండ్రి మారుతీరావుది బట్టల వ్యాపారం. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ముఖ్యపట్టణాల్లో గొలుసు దుకాణాలు కూడా ఉన్నాయి అతనికి. కూతురు అన్వయ పెళ్లి, బంధుమిత్రులందరూ మరచిపోలేని విధంగా జరిపించడానికి, కృష్ణానది లంకల్లో వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు జరిగాయి. ఆ రోజు ఉదయమే మెహందీ కార్యక్రమం అయ్యింది. మర్నాడు పెళ్లి. మధ్యాహ్న భోజనం అయ్యాక తాత, తండ్రి, మనవరాలు..సంగీత్ జరగబోయే వేదిక దగ్గర ఏర్పాట్లు చూడడానికి వచ్చారు. ఇంతలో అక్కడకి రవాణా లారీ వచ్చింది.
‘‘ఏమొచ్చాయ్ అందులో’’ అడిగాడు తండ్రి అన్వయని.
‘‘చూడాలి’’ చెప్పింది అన్వయ.
ఇంతలో ఇద్దరు కూలీలు లారీ నుండి దిగి, తెచ్చిన వస్తువులు దింపసాగారు. చిన్మయమూర్తి, అన్వయ, మారుతీరావు అక్కడకి నడిచారు!
హమాలీలు ముందుగా కొన్ని చెక్కబల్లలు దించారు. తర్వాత దించుతున్న వాటిని చూసి అన్నాడు చిన్మయమూర్తి ఆశ్చర్యంగా, ‘‘ఏయ్ నులకమంచాలు! ఇవి దేనికి!’’ అన్వయ వైపు చూస్తూ.
‘‘ఆ.. గుర్తొచ్చింది. ఇవాళ రాత్రి డిన్నర్ కార్యక్రమం కోసం అవి.. రోడ్డు ప్రక్క ధాబాలాగా ఏర్పాటు ఉంటుంది. ఆ మంచాల మీద ఇద్దరు ఇద్దరు కూర్చోని, మధ్యలో ఆ బల్ల పెట్టుకొని తినాలి. అన్నీ మీ దగ్గరకే వచ్చి వడ్డిస్తారు. లేచే పని లేదు’’ చెబుతున్న అన్వయకి అడ్డు తగులుతూ అడిగాడు చిన్మయమూర్తి, ‘‘మగవాళ్లు తేలికగా కూర్చోగలరు.. మరి ఆడవాళ్లూ? పట్టు చీరలు పాడైపోవూ?’’
‘‘ఈ ఏర్పాటు ఆడవాళ్ల కోసం కాదు, రాత్రికి మగవాళ్ల వెట్ పార్టీకి’’ మారుతీరావు చెప్పాడు తండ్రికి రహస్యం చెప్పినట్టు.
‘‘చూడు తాతయ్యా..మంచాలు బాగున్నయ్యా?’’ అడిగింది అన్వయ.
ఒక మంచం వాల్చి, కూర్చోని చూసి ‘‘గట్టిగానే ఉన్నది గానీ, కొంచెం కుక్కిగా అంటే గుంటగా ఉంది. సరి చెయ్యాలి. వ్యాపార ధోరణి కదా, అవసరమైతే తప్ప, అడిగితే తప్ప ఇట్లాంటివి పట్టించుకోరు’’ చెప్పాడు చిన్మయమూర్తి. ఇంతలోనే కాంట్రాక్టర్ ఒక మనిషిని తీసుకువచ్చి మంచాలు చూపించి, ‘‘ఇవన్నీ బిగించు ముందు’’ అని చెప్పి, అన్వయతో, ‘‘మొత్తం ముప్ఫై మంచాలు, బల్లలు. చాలా అమ్మా? ఇంకా తెప్పించమంటారా?’’ అని అడిగాడు.
‘‘చాలండీ. కానీ వీటిని ఉంచాల్సింది ఇక్కడ కాదు. దాని వెనకాల ఉన్న కొబ్బరితోటలో. అక్కడ వేయమనండి’’ చేత్తో చూపిస్తూ చెప్పింది అన్వయ.
తర్వాత వచ్చి తాతయ్య ప్రక్కన మంచం మీద కూర్చుంది.
‘‘ నాకు నులకమంచం చూస్తే మా అమ్మే గుర్తొస్తుంది రా,.. ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చుంటే మా అమ్మే వచ్చి కూర్చున్నట్టు ఉంది నా పక్కన’’ అన్నాడు చిన్మయమూర్తి, అన్వయ తలమీద చెయ్యి వేసి. మళ్లీ ఆయనే మాట పొడిగించాడు ‘‘ఎన్ని ఏళ్లయ్యిందో ఇలా కూర్చోని! చిన్ననాటి సంగతులు గుర్తొస్తున్నాయి. మా అమ్మకు నులకమంచంతో చాలా అనుబంధం’’.
‘‘ చెప్పు తాతయ్యా ఏంటి అది? మనకి ఇప్పుడు పనులేం లేవులే’’
చెప్పసాగాడు చిన్మయమూర్తి –
* * *
మా అమ్మకి చాలా విద్యలు వచ్చు! అందులో వొకటి మంచం అల్లడం! నులకతో మంచం అల్లడం ఓ కష్టతరమైన విద్యనే! దీని పట్టీలు ఏటవాలుగా వస్తాయి. ఆ పట్టిల ఒకదానిమీద ఇంకోటి పడడం చూస్తే డైమండ్ ఆకారంలో ఖాళీలు ఉండి చూడ్డానికి అందంగా ఉంటాయి. అలా అల్లగలగడమే అసలైన సమర్థత!
మా చిన్నప్పుడు ఎక్కువ నులకమంచాలే ఉండేవి. నవ్వారు మంచాలు కొంచెం డబ్బున్న వాళ్ల ఇళ్లల్లో ఉండేవి. మా ఇంట్లో, మా స్నేహితుల, బంధువుల ఇళ్లల్లో అన్నీ నులకమంచాలే కనపడేవి. మా ఇంట్లో -మంచాలు- అని బహువచనం వాడే పరిస్థితి ఉండేది కాదు చాలా రోజుల వరకు!
ఈ నులకమంచం రెండు రకాలు – ఒకటి వెదురు కర్రలతో చేసినది. ఇది అందుబాటు ధరలో ఉండేది. రెండోది చెక్క పట్టెలు కలిగి ఉండేది దీనిలాగా. దీని పట్టెలు వడ్రంగులు చేసి పెట్టే వారు. తలవైపు, కాళ్లవైపు ఉండేవి అడ్డపట్టెలు. అవి నిలువు పట్టెలకంటే కొంచెం ఎత్తులో ఉంటాయి. దీన్ని పట్టెమంచం అనడం కూడా కద్దు. ఇది వెదురు మంచం కంటే బరువుగా ఉంటుంది, ఖరీదు కూడా. మంచాలు రెండు రకాలైనా, అల్లిక మాత్రం ఒకటే విధానం.
మా అమ్మకి ఉన్న చురుకుతనం, అవగాహన వల్ల దేన్నైనా నేర్చేసుకోగలదు చాలా తొందరగా – ఇది నేను అన్నమాట కాదు, మా అమ్మమ్మ చెబితే విన్నమాట!
అమ్మ ఎక్కడ, ఎప్పుడు నేర్చుకుందో తెలియదుగానీ, తను మంచం అల్లగలదని, నాకు ఊహతెలిసినప్పటి నుండి తెలుసు. చుట్టుపక్కల వాళ్లు కూడా అమ్మచేత నులకమంచం అల్లించుకునే వాళ్లు. అమ్మ, స్నేహాన్ని పెంచుకోవడం కోసం, మర్యాదలను పంచుకోడం కోసం మాత్రమే తన విద్యను ఉపయోగించేది. ఫలాపేక్ష లేకుండా నిస్వార్ధంగా సేవాధర్మంతో చేసే పనిలో తృప్తి ఎంతో ఉంటుందని అమ్మను చూసి తెలుసుకున్నాను.
నులకమంచం అల్లడం విద్యే కాకుండా శ్రమతో కూడినది కూడా. మరో వ్యక్తి సాయం తీసుకుంటేనే కొంత శ్రమ తగ్గి, తక్కువ సమయంలో అల్లేసేయచ్చు. అల్లిన తర్వాత రెండురోజులు అమ్మ చేతివేళ్లు గుంజేస్తో ఉండేవిట!
తెచ్చిన నులకను మొదట ఉండలాగా చుట్టేది. ముందు మంచానికి కాళ్లక•ట్ట కట్టి దానికి పురి పెట్టేది బాగా, ఒక కర్రతో. రెండు చెక్క పుల్లల సాయంతో ఏటవాలుగా నులక పట్టీలు వేయడం చేస్తుంది. ఒక్కొక్క పట్టికీ నాలుగు నులక పొరలు ఉండేవి. ఒక్కో పట్టిని ఒక్కో గృహం, అంటే ఇల్లు లాగా పరిగణిస్తారు. వాటికి పేర్లు కూడా వుంటాయి, అవి – శ్రీ, యశో, ఆయుః, మృత్యు! అంటే చివరి పట్టీకి ఏ గృహం పేరు వస్తుందో ఆ మంచం వాడుక వల్ల అది కలుగు తుందని విశ్వాసం! అవి వరుసగా డబ్బు, కీర్తి, ఆయుషు, మరణంకి నిలయాలని నమ్మకం. చివరి పట్టీ ఎప్పుడూ మృత్యుగృహంగా ఉండకుండా చూసుకోవాలి. అలా వస్తూంటే ఇంకో పట్టీ పట్టే స్థలం ఉంటే ఒకటి వేయాలి, లేదా ఒక పట్టీ తీసేయాలి. మృత్యు గృహంలో ఆగితే దాని మీద పడుకున్న వాళ్లకి భూమ్మీద నూకలు చెప్పినట్లే. అందుకే లెక్క తప్పు పోగూడదు!
అమ్మ మంచం అల్లడాన్ని శ్రద్ధతో చేసే ఒక దైవ కార్యం లాగా తలచేది ! ఈ విషయం నాకు ముందు తెలియదు. అమ్మకు అల్లడంలో సాయం వెళ్లగా వెళ్లగా తెలిసింది. మంచానికి కాళ్లకట్ట పోసేటప్పుడు ఏవో సంస్కృత మంత్రాలు చదివేది! తర్వాత పట్టీలు వేసేటప్పుడు కూడా దైవస్తుతి చేస్తూ, తక్కువగా… అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతూ వుండేది.
నులకమంచం మన వాడుకలో ఇప్పుడు లేకపోయినా, దాని అందాన్ని మాత్రం మనసులో నుంచి తీసేయలేను’’ అంటూ చెప్పడం ఆపాడు చిన్మయమూర్తి.
ఉద్వేగంతో చెప్పిన తాతయ్యను చూసి ‘‘బాగా ఎమోషనల్ అయిపోయావు తాతయ్యా! నులకమంచం వెనక ఇంత కథ ఉందా? అనిపించింది నువ్వు చెప్పాక’’ అంది అన్వయ.
‘‘కథ కాదు దీన్లో అంత కళ ఉందా అని అడగాలి! మీ భాషలో అయితే ఎంత సీన్ ఉంది? అని ఆశ్చర్య పోయే విషయం!!’’
‘‘నీకు వచ్చా అల్లడం?’’ కుతూహలంగా అడిగింది అన్వయ.
‘‘అభిమన్యుడిలాగా సగం విద్యే తెలుసు నాకు. నేను ఎప్పుడూ మొదలు పెట్టడం నేర్చుకోలేదు. అమ్మకి సహాయంగా నులక ఉండని అవతలవైపు అందుకోవడం, మంచం కోడు ఎత్తిపట్టి తాడును వేసి, చెక్క పుల్లని సరి చెయ్యడం చేసేవాడిని. చివరలో కాళ్లకట్ట లాగి బిగించి కట్టడానికి నన్నే పిలిచేది. ఎంత బలంగా లాగితే అంత బిగి ఉంటుంది మంచానికి.’’
‘‘ నీకు ఇదంటే ఇంత ప్రేమని నాకు తెలీదు తాతయ్యా’’
‘‘ ఎట్లా తెలుస్తుంది? నువ్వు పుట్టే సరికే ఇంట్లో అన్నీ చెక్క మంచాలు, వాటి మీద మెత్తటి పరుపులు వచ్చేసాయిగా. మా అమ్మ చివరిగా అల్లిన మంచం మీ నాన్న పెళ్లి వరకూ ఉండింది.’’
‘‘ఇప్పుడు ఎక్కడైనా అమ్ముతారా ఇవి?’’ అడిగింది అన్వయ.
‘‘తెలీదు, కనపడడం లేదు. నెట్లో వెతుకు, దొరకచ్చు. అయినా మీ నాన్న తన ఇంద్రభవనంలోకి దీన్ని రానిస్తాడా’’ నవ్వుతూ అన్నాడు చిన్మయమూర్తి.
‘‘ఇదిగో ఉంది. దొరుకుతోంది అమెజాన్‌లో.. నలభై వేలుట ధర’’ సెల్ ఫోన్‌లో చూస్తూ చెప్పింది అన్వయ.
ఇంతలో మారుతీరావు అక్కడకి వచ్చాడు. వస్తూనే, ‘‘చాలా బాగుందిరా ఆన్నూ నీ ఈ ధాబా ఏర్పాటు. చక్కగా వచ్చింది. కొబ్బరి చెట్లకు లైట్స్ తగిలిం చేశారు, నడిచే దోవలో మంచాలు, బల్లలు వేస్తున్నారు. డ్రింక్స్ సర్వ్ చెయ్యడానికి అందరికీ అందుబాటులో ఉండేలా నాలుగు స్టేషన్లు పెట్టారు. మగ పెళ్లివారు అదిరి పోయేలా ఉంది. ఇక్కడ ఇవతల సంగీత్‌లో సాగే పాటలు అక్కడికి కూడా వినిపిస్తాయి!’’ మెచ్చుకోలుగా చెప్పాడు మారుతీరావు అన్వయతో.
* * *
మర్నాడు మధ్యాహ్నం అన్వయ వివాహం అంగ రంగ వైభవంగా జరిగింది. వచ్చిన చుట్టాలు తిరిగి వెళ్లడం, వియ్యంకుల ఇళ్లల్లో నిద్రలు చెయ్యడం, కొత్త దంపతులు ప్రేమయాత్ర చేసిరావడం, సందడి అంతా సర్డుమణగడానికి దగ్గర దగ్గర నెలరోజులు పట్టింది. తరువాత అన్వయ, భర్తతో అమెరికా వెళ్లి పోయింది.
చిన్మయమూర్తికి ఇల్లంతా వెలితిగా అనిపించ సాగింది మనుమరాలు కాపురానికి వెళ్లిపోవడంతో! మరో పదిరోజులు గడిచాయి.
ఆరోజు మధ్యాహ్నం ఇంటి ముందు రవాణా వాహనం ఒకటి వచ్చి ఉండడం పైనుండి చూశాడు చిన్మయమూర్తి. లోపల లాన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు పరికరాలతో ఏదో బిగిస్తుండడం చూసి క్రిందికి వచ్చాడు. వాళ్లు బిగిస్తున్నది ముచ్చటగా అల్లబడి వున్న ఒక – నులక మంచం!
వాళ్లతో మాట్లాడబోతున్న చిన్మయమూర్తికి, ఫోన్‌లో మెసేజ్ వచ్చిన శబ్దం రావడంతో తెరచి చూసాడు. అన్వయ నుంచి. చదవ సాగాడు –
‘‘తాతయ్యా! నేను ఇక్కడకు వచ్చేసాక నువ్వు చాలా డల్‌గా అయ్యావని తెలిసింది. ఆ రోజు పెళ్లికి ముందు రోజు నులక మంచం మీద మనం కూర్చున్న ప్పుడు, నువ్వు మీ అమ్మ గురించీ, మంచం అల్లడం గురించీ చెబుతుంటే నీ కళ్లల్లో వెలుగు, నీ మాటల్లో ఉత్సాహం చూశాను. నువ్వు ఇంతకు ముందెప్పుడూ అంత ఎమోషనల్ అవడం నేను చూడలేదు. ఆ వెలుగూ, ఉత్సాహం నీలో ఎప్పటికీ ఉండాలనే, నాన్నని ఒప్పించి, అమెజాన్‌లో నీకోసం నులక మంచం ఆర్డర్ పెట్టాను. ఈ రోజు ఇంటికి వచ్చిందని తెలిసింది. చూసి చెపు. నీకు నచ్చిందా? మొహమాటానికి నచ్చిందని చెప్పకు! నిజంగా చెప్పు. ఇంకోటి, దాని అల్లిక శ్రీ, యశో, ఆయు, మృత్యులలో ఏ గృహంలో ఆగివుందో చెప్పు!’’
వచ్చిన పనివాళ్లు వెళ్లిపోయాక చిన్మయమూర్తి మంచం దగ్గరకు వచ్చాడు. మంచి గట్టి చెక్క పట్టెలతో తయారైన మంచం చక్కగా, కుదురుగా నులక అల్లి ఉంది. దాని మీద కూర్చోని తన తల్లి ఒక చేతిలో అన్నం కంచం పట్టుకొని, మరో చేత్తో ముద్దచేసి తనను పిలుస్తున్నట్టు అనిపించ సాగింది చిన్మయమూర్తికి. అతని కళ్లు నీటి గుండాలయినయ్యి. మంచమంతా మనవరాలి ప్రేమ పరిచినట్టు అనిపించింది.
మంచం కోడు పట్టుకుని మెల్లగా దాని ముందు కూర్చున్నాడు. పట్టె మీద ఉన్న గృహాలను గణించాడు – శ్రీ, యశో,ఆయుః, మృత్యు అంటూ! కళ్లను తుడుచుకుని మరోసారి లెక్కించాడు కంపిస్తున్న వేళ్లతో. మొత్తం ఇరవై యెనిమిది పట్టీలు ఉన్నాయి! ఒక్క క్షణం దీర్ఘ శ్వాస తీసుకొని, మంచం మీద వాలి, వాట్సాప్ లో జవాబు పెట్టాడు అన్వయకి –
‘‘మంచం గట్టిగా, అందమైన అల్లికతో ఉంది. నేను ఇప్పుడు ఈ వయసులో పొందాల్సిన గృహంలోనే అల్లిక ఆగింది!’’
వచ్చేవారం కథ..
చిరంజీవి ‘గంగాలహరి’ – విహారి