‘అభినందన్‌ను విడిచిపెట్టి పాకిస్తాన్‌ ‌మంచి పని చేసింది. లేదంటే ఓ భయానక రాత్రిని చూడాల్సి వచ్చేది’ – 2019 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య ఇది. అప్పట్లోనే ఈ వ్యాఖ్య ఆసక్తిని రేకెత్తించినా, తరువాత అంతా మరచిపోయారు. అసలు ఆనాడు పాకిస్తాన్‌ ‌తమకు పట్టుబడిన భారత్‌ ‌వింగ్‌ ‌కమాండర్‌ అభినందన్‌ ‌వర్థమాన్‌ను ఎందుకు హడావిడి•గా విడిచి పెట్టాల్సి వచ్చింది? తాజాగా మార్కెట్‌లోకి వస్తున్న భారత మాజీ దౌత్యవేత్త అజయ్‌ ‌బిసారియా పుస్తకం ఇందుకు సమాధానం ఇచ్చింది.

ఏ దేశమైనా శత్రువు పట్టుబడితే సంతోషి స్తుంది. కానీ ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి 27, 2019న అభినందన్‌ ‌చేజిక్కిన సమయంలో పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌సహా ఉన్నతస్థాయి అధికార గణమంతా చిగురుటాకులా వణికింది. పాక్‌ ‌రెండురోజుల్లో అభినందన్‌ను విడిచిపెట్టి, బతుకుజీవుడా అని ఊపిరిపీల్చుకుంది. పాక్‌ ఎం‌దుకలా భయపడింది? ఇమ్రాన్‌కు ఎందుకు చెమటలు పట్టాయి? ఆ సమయంలో పాక్‌లో భారత హై కమిషనర్‌గా పనిచేసిన అజయ్‌ ‌బిసారియా ఈ అంశాలనే తన తాజా పుస్తకంలో వివరించారు.

‘యాంగర్‌ ‌మేనేజ్‌మెంట్‌: ‌ది ట్రబుల్డ్ ‌డిప్లొమాటిక్‌ ‌రిలేషన్‌షిప్‌ ‌బిట్వీన్‌ ఇం‌డియా అండ్‌ ‌పాకిస్తాన్‌’ ‌పేరుతో ఈ పుస్తకం త్వరలో మార్కెట్‌లోకి రానుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు ఎలాంటివి? భారత దౌత్యనీతితో పాక్‌ ఎలా భయపడింది? ఉగ్రవాదంపై తమ విధానాలను ఎలా మార్చుకోవాల్సి వచ్చింది? వంటి అంశాలను అందులో చర్చించారు.

ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై పాకిస్తాన్‌ ‌కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ జైష్‌ ఈ ‌మహమ్మద్‌ ‌దాడి చేసింది. సుమారు 40 మంది సైనికులు చనిపోయారు. దీనికి ప్రతిగా బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్‌ ‌వైమానిక దాడులు చేసింది. బాలాకోట్‌ ‌ఘటన జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాక్‌ ‌వైమానిక దళం ఎఫ్‌-16 ‌విమానాలతో భారత్‌పై దాడికి యత్నిం చగా.. వింగ్‌ ‌కమాండర్‌ అభినందన్‌ ‌మిగ్‌-21 ‌విమానంతో వెంటాడి ఒక ఎఫ్‌-16‌ను నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలి పోవడంతో పారాచూట్‌ ‌సాయంతో కిందకు దూకే ప్రయత్నంలో..పాక్‌ ‌భూభాగంలో పడ్డారు. ఆయనను పాక్‌ ‌జవాన్లు చిత్రహింసలు పెట్టారు. అభినందన్‌ను తిరిగి అప్పగించాలని భారత్‌ ‌నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. పాక్‌ ‌సైన్యం వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు ఆయనను అప్పగించింది.

అభినందన్‌ ‌విడుదలను శాంతి ప్రయత్నం అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్‌. ‌కానీ దీని వెనుక సుదీర్ఘ తతంగమే నడిచింది. అభినందన్‌కి ప్రాణహాని జరిగితే భారత్‌ ‌నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్‌కి అమెరికా, బ్రిటన్‌ ‌రాయబారులు సహా పాశ్చాత్యదేశాల దౌత్య వేత్తలు వెల్లడించడంతో పాకిస్తాన్‌ ‌దిగిరాక తప్పలేదు

పాకిస్తాన్‌పై భారత్‌ ‌క్షిపణుల గురి

అభినందన్‌ను బంధించిన తర్వాత భారత్‌ ‌తీవ్రంగా స్పందించింది. దాయాది పైకి 9 క్షిపణులతో దాడికి సిద్ధమైంది. బాలాకోట్‌పై భారత వాయుసేన దాడుల తర్వాత పాకిస్తాన్‌ ‌విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జన్‌జువాకు ఆ దేశ సైనికాధికారుల నుంచి కీలక సమాచారం అందిందని బిసారియా పేర్కొన్నారు. భారత్‌ ‌తొమ్మిది క్షిపణులను పాక్‌పైకి ఎక్కుపెట్టిందని, వాటిని ఏ క్షణంలోనైనా ప్రయోగించే అవకాశం ఉందనేది వారికి అందిన సందేశం. ఆందోళన చెందిన పాక్‌ ఈ ‌విషయాన్ని అమెరికా, యూకే, ఫ్రాన్స్ ‌రాయబారులకు చేరవేసింది. భారత్‌కు సర్దిచెప్పాలని పాక్‌ ‌కార్యదర్శి ఆయా దేశాల రాయబారులను కోరారు. ఐరాసలో వీటో అధికారం ఉన్న ఐదు దేశాలతో పాటు భారత్‌, ‌పాక్‌ ‌మధ్య ఆరోజు రాత్రి పెద్ద ఎత్తున దౌత్యపరమైన సంప్ర దింపులు జరిగాయని బిసారియా చెప్పారు.

మోదీతో మాట్లాడేందుకు ఇమ్రాన్‌ ‌ప్రయత్నం

ఈ పరిణామాలతో పాక్‌ ‌తీవ్రంగా భయపడింది. ఆ సమయంలో భారత్‌లోని అప్పటి పాక్‌ ‌హైకమిషనర్‌ ‌సోహైల్‌ ‌మహమ్మద్‌ ఇస్లామాబాద్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 27 అర్ధరాత్రి ఆయన నన్ను సంప్రదించారు. ‘మోదీతో ఇమ్రాన్‌ఖాన్‌ ‌ఫోన్‌లో మాట్లాడాలనుకుంటున్నారు’ అని చెప్పారు. నేను వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారమిచ్చాను. అప్పుడు ఖాన్‌తో మాట్లాడేందుకు ప్రధాని మోదీ అందుబాటులో లేరని అధికారులు చెప్పారు. పాక్‌కు ఏదైనా అత్యవసరమైతే హైకమిషనర్‌ (‌నా) తోనే మాట్లాడాలని చెప్పాలని సూచించారు. ఆ తర్వాత పాక్‌ అధికారులు మళ్లీ నాతో సంప్రదించలేదు’ అని బిసారియా కథనం.

‘తర్వాత కొన్ని రోజులకు ఇమ్రాన్‌ ‌ఖాన్‌ అత్యంత సన్నిహితుడు ఒకరు నన్ను సంప్రదించారు. ఆ ఏడాది కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌ ‌మధ్య భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఉగ్రవాద కట్టడిపై వారి విధానాలను ఖాన్‌.. ‌మోదీకి వివరించి సర్దిచెప్తారని చెప్పారు. కానీ ఆ భేటీకి ప్రధాని హాజరుకాలేదు’ అని అజయ్‌ ‌వెల్లడించారు. పాకిస్తాన్‌ ‌నేరుగా తమ ఆందోళనలకు భారత్‌కు వివరించాలని సమాచారం అందుకున్న దేశాల్లో ఒకటి సూచించినట్లు బిసారియా తన పుస్తకంలో రాశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో అప్పటి పాక్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌మాట్లాడడానికి చేసిన ప్రయత్నం విఫలమైందని తెలిపారు.

చైనా సాయం కోరిన ఇమ్రాన్‌..

ఈ ‌క్రమంలో ఇమ్రాన్‌ఖాన్‌ ‌చైనా సాయం కోరారని తనకు తెలిసినట్లు బిసారియా తెలిపారు. భారత్‌కు అమెరికా మద్దతిస్తున్నందున చైనా తమ వెంటే ఉండాలని ఆయన కోరినట్లు చెప్పారు. కానీ, షీ జిన్‌పింగ్‌ ‌దీన్ని తిరస్కరించారు. భారత్‌పైకి పాక్‌ను ఎగదోసేందుకు చైనా సహకరించబోదని స్పష్టం చేశారు. భారత్‌తో అమెరికాకు సన్నిహిత సంబంధా లున్నందున.. పాక్‌ ‌నేరుగా అగ్రదేశంతోనే సంప్రదిం పులు జరపాలని జిన్‌పింగ్‌ ‌హితవు పలికారని బిసారియా చెప్పారు.

ప్రధాని మోదీతో అప్పటి పాక్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌మాట్లాడడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో పాకిస్తాన్‌ అధికారులు అమెరికా, యూకే రాయబారులు అదేరోజు రాత్రి భారత విదేశాంగశాఖ కార్యదర్శిని సంప్రదించారని వెల్లడించారు. ‘ఘర్షణపూరిత వాతావరణం నుంచి వెనక్కి తగ్గేందుకు పాక్‌ ‌సిద్ధమైంది. భారత్‌ ఇచ్చే సమాచారం ఆధారంగా దర్యాప్తు జరిపేందుకు అంగీకరించింది. ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి చర్యలు తీసుకుంటామంది. ఇమ్రాన్‌ఖాన్‌ ‌స్వయంగా ఈ ప్రకటనలు చేయడంతో పాటు అభినందన్‌ను కూడా విడిచి పెడతారు’ అని వారు చెప్పినట్లు బిసారియా వెల్లడించారు.

మోదీ చేసిన వ్యాఖ్యలు అవేనా?

అయితే అభినందన్‌ను విడిపించుకునేందుకు పాక్‌వైపు భారత్‌ ‌క్షిపణులు సిద్ధం చేసినట్లు ఎక్కడా ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదని.. కానీ దాని వల్లే అప్పటి ఇమ్రాన్‌ఖాన్‌ ‌ప్రభుత్వం భయపడిందని వివరించారు. అప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలకు అజయ్‌ ‌బిసారియా తన పుస్తకంలో రాసుకొచ్చిన విషయాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. అభినందన్‌ను తీసుకురావడానికి భారత్‌ ‌సైనిక విమానాన్ని పంపేందుకు సిద్ధం కాగా పాకిస్తాన్‌ ‌నిరాకరించిందని బిసారియా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత వాయుసేన విమానం పాక్‌ ‌భూభాగంలోకి అనుమతించడాన్ని వారు ప్రమాదంగా భావించారని వివరించారు.

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ‌కాళ్లు వణికాయి

అభినందన్‌ను పట్టుకున్న సమయంలో భారత్‌ ‌దాడి చేస్తుందని పాక్‌ ‌భయపడి పోయింది. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌కమర్‌ ‌జావేద్‌ ‌బాజ్వా కాళ్లు వణికిపోయాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ ‌ముస్లిం లీగ్‌ (ఎన్‌) ఎం‌పీ అయాజ్‌ ‌సాదిక్‌ ‌మూడేళ్ల క్రితమే బహిర్గతం చేశారు.

ఆ రోజు పాకిస్తాన్‌ ‌విదేశాంగ మంత్రి షా మొహమ్మద్‌ ‌ఖురేషీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధికార పార్టీకి చెందిన నేతలతో పాటు ప్రతిపక్షాలకు చెందిన నేతలు కొందరు హాజరయ్యారు.‘అభినందన్‌ను వదిలిపెట్టకపోతే ఈరోజు రాత్రి 9 గంటలకు భారత్‌ ‌మనపై దాడి చేస్తుంది.’ అని ఖురేషీ చెప్పిన సమయంలో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ‌కమర్‌ ‌జావేద్‌ ‌బాజ్వా కాళ్లు వణికి పోయాయి.

‘నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు షా మొహమ్మద్‌ ‌ఖురేషీ సమావేశం నిర్వ హిస్తున్నారు. ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌సమావేశానికి రావడానికి ఇష్టపడలేదు. ఆర్మీ చీఫ్‌ ‌కమర్‌ ‌జావేద్‌ ‌బాజ్వా సమావేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన కాళ్లు వణుకుతున్నాయి. దేవుడి మీద భారం వేసి అభినందన్‌ ‌వర్థమాన్‌ని వదిలిపెట్టండి. లేకపోతే రాత్రి 9 గంటలకు పాకిస్తాన్‌ ‌మీద భారత్‌ ‌దాడి చేస్తుంది.’ అని ఖురేషీ చెప్పినట్టు సాదిక్‌ ‌తెలిపారు.

తుడుచి పెట్టాలనుకున్నాం: ధనోవా

బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ ‌వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్‌ ‌దుస్సాహసం చేస్తే, వారి సైనిక విభాగాల్ని తుడిచి పెట్టేద్దామనుకున్నామని నాటి వైమానిక దళాధిపతి బి.ఎస్‌.‌ధనోవా చెప్పారు. అందుకు మన సేనలు అప్పటికే సిద్ధమయ్యాయని ఆయన మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దౌత్యపరంగా, రాజకీయంగా పాకిస్తాన్‌ ‌విపరీతమైన ఒత్తిడికి లోనైందని ధనోవా వివరించారు. భారత్‌తో పెట్టుకోవడం ఎంత ప్రమాదకరమో ముందే పసిగట్టారని తెలిపారు.

అభినందన్‌ను అప్పగించడం తప్ప అప్పుడు పాక్‌కు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. భారత బలగాల సామర్థ్యాన్ని చూసే నాడు పాక్‌ ‌నాయకుల కాళ్లు వణికి ఉంటాయని పరోక్షంగా ఆ దేశ ప్రతిపక్ష నాయకుడి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ విషయం ప్రస్తావించారు. బాలాకోట్‌పై ఐఏఎఫ్‌ ‌వైమానిక దాడుల తర్వాత పాక్‌ ‌చేసిన దుస్సాహసంలో ఏ ఒక్క భారత స్థావరం దెబ్బతిన్నా.. పాక్‌ ‌స్థావరాల్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు సిద్ధమయ్యామని నాటి సన్నద్ధతను వివరించారు.

అభినందన్‌ను వదిలేయటానికి మరో ప్రత్యేక కారణం ఉంది. ఆయనకు ఏమైనా అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రీసెర్చ్ అం‌డ్‌ అనాలిసిస్‌ ‌వింగ్‌(‌రా) చీఫ్‌ అనిల్‌ ‌ధస్‌మనా పాక్‌ను గట్టిగా హెచ్చరించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు.. ఐఎస్‌ఐ ‌కౌంటర్‌ ‌పార్ట్ ‌లెఫ్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌ ‌సయ్యద్‌ అసిమ్‌ ‌మునిర్‌ అహ్మద్‌ ‌షాకు రేర్‌ ‌ఫోన్‌ ‌కాల్‌, ‌రహస్య లేఖ ద్వారా ఈ హెచ్చరికలు చేశారు. అనంతరం చోటు చేసుకున్న మరికొన్ని పరిణామాలతో పాక్‌ ‌వెనక్కు తగ్గి అభినందన్‌ను వదిలిపెట్టడానికి నిశ్చయించుకుంది.

అభినందన్‌ ‌మనోనిబ్బరం

ఏడాదిన్నర క్రితం వచ్చిన ‘సీతారామం’ సినిమా చూసిన వారు అందులోని రామ్‌ ‌పాత్ర దేశభక్తిని గమనించే ఉంటారు. ప్రాణాలు పోగొట్టుకోవడానికి అయినా సిద్దపడతాడు కానీ దేశ రహస్యాలు పెదవి దాటనివ్వడు రామ్‌. ఇది ఐదేళ్ల క్రితం నిజంగా ఇలాంటి ఘటనే జరిగింది. అభినందన్‌ ‌భారత్‌ ‌రహస్యం పాక్‌ ‌చేతులలో పడకూడదనే ఉద్దేశంతో తనదగ్గరున్న పత్రాలను నమిలి మింగేశాడు. పాకిస్తానీలు అభినందన్‌ ‌మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాతే సైన్యానికి అప్పగించారు. మొత్తం పాక్‌ ‌నిర్బంధంలో 60 గంటల పాటు ఉన్నారు. పాకిస్తాన్‌ అధికారులు విచారించినప్పుడూ ఆయన ఎంతో నిబ్బరంగా సమాధానమిచ్చారు. అవసరమైనంత వరకే జవాబిచ్చి రహస్యాలను దాట వేశాడు. ఆ వీడియా అప్పట్లో సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారింది. పాక్‌ అధికారి అభినందన్‌ను అడిగిన ప్రశ్నలివే…

పాక్‌ అధికారి: నీ పేరు ఏంటి?

అభినందన్‌: అభినందన్‌.

‌పాక్‌ అధికారి: నీకు ఈ రోజు బాగా గడిచిందని అనుకుంటున్నాను.

అభినందన్‌: అవును… నేను స్టేట్‌మెంట్‌ ‌రికార్డ్ ‌చేస్తున్నాను. నేను నా దేశానికి వెళ్లినా కూడా ఇది మారదు. పాక్‌ ఆర్మీ అధికారులు నన్ను బాగా చూసుకున్నారు. నన్ను స్థానిక మూకల నుంచి పాక్‌ ‌కెప్టెన్‌ ఒకరు రక్షించారు. పాక్‌ ఆర్మీని చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యాను.

పాక్‌ అధికారి: అయితే నువ్వు వింగ్‌ ‌కమాండర్‌వా? ఇండియాలో ఎక్కడి వాడివి?

అభినందన్‌: ‌క్షమించండి… నేను చెప్పలేను… దక్షిణ భారతావనికి చెందిన వాడిని.

పాక్‌ అధికారి: నువ్వు దక్షిణ భారతానికి చెందిన వ్యక్తివా? సరే… నీకు పెళ్లయిందా?

అభినందన్‌: అవును, అయింది.

పాక్‌ అధికారి: నీకు మేమిచ్చిన టీ నచ్చినట్లుంది.

అభినందన్‌: ‌టీ చాలా బాగుంది… కృతజ్ఞతలు.

పాక్‌ అధికారి: నువ్వు ఏ విమానాలు నడపగలవు?

అభినందన్‌: ‌క్షమించండి… ఈ విషయాన్ని నేను చెప్పలేను.

పాక్‌ అధికారి: నీ కార్యక్రమం ఏమిటి•?

అభినందన్‌: ‌నేను చెప్పలేను.

పాక్‌ అధికారి: ఓకే థ్యాంక్యూ…

అభినందన్‌ ‌తండ్రి రిటైర్డ్ ఎయిర్‌ ‌మార్షల్‌. ‌తల్లి డాక్టర్‌. అభినందన్‌ ఎన్‌డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2004లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపిక య్యారు. ఇంతకుముందు సుఖోయ్‌-30 ‌స్క్వాడ్రన్‌కు పైలట్‌గా పనిచేశారు. ఆ తర్వాత మిగ్‌-21 ‌స్క్వాడ్రన్‌లో చేరారు.

అభినందన్‌ ‌పాకిస్తాన్‌ ‌నుండి తిరిగి వచ్చాక పదోన్నతి పొంది గ్రూప్‌ ‌కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2021 నవంబర్‌లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నుంచి వీర చక్ర అవార్డు అందుకున్నారు. శత్రువు చేతికి చిక్కి ప్రాణాలతో బయటపడిన భారతీయ వీరులు బహు అరుదు. అందునా పాకిస్తాన్‌ ‌సగౌరవంగా అభినందన్‌ను అప్పగించడంతో భారత్‌ ‌శక్తి ప్రపంచానికి అర్థమైంది.

– క్రాంతి

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE