లోక కల్యాణం కోసం మానవులు యజ్ఞం జరుపుతుంటే దాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించే దానవులు ఉంటారు. మహర్షులు యాగాలు చేస్తున్న సమయంలో రాక్షసులు ఎన్నో ఆటంకాలను సృష్టించేందుకు ప్రయత్నించడం, రామలక్ష్మణులు అడ్డుకొని వారిని సంహరించడం రామాయణంలో చూశాం. ఆధునిక కాలంలోనూ రాక్షసుల వారసులు కనిపిస్తున్నారు. తాజాగా అయోధ్యలో భవ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని చూసి ఓర్వలేక తమ దానవ ప్రవృత్తిని బయటపెట్టుకున్నారు.
ఐదువందల ఏళ్ల పోరాటాల తరువాత సాధ్యమైన ఒక మహోత్సవానికి గుర్తుగా హిందువులు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసుకున్నారు. వాడవాడలా శ్రీరామ శోభాయాత్రలు భజనలు, పాటలు, నృత్యాలు, మేళతాళాలతో వేడుకు చేసుకున్నారు. కొన్ని శక్తులు తమ శాడిస్టు, రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాయి. జనవరి 21, 22 తేదీల్లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా బయటపడింది. దాదాపు డజను ప్రాంతాల్లో ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో చెదురుమదురు అల్లర్లు జరిగాయి.
పాక్‌ను తలపించిన మీరా భయందర్
ప్రాణప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తుండగానే మహారాష్ట్రలో 36 గంటల్లో మూడు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముంబైలోని మీరా భయాందర్, పన్వెల్, శంభాజీనగర్‌లో కాల్పులు, రాళ్లదాడి జరిగాయి. వరుసగా మూడు రోజుల పాటు జరిన మీరా భయాందర్ అల్లర్లుపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన ఘటన దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రాంతాన్ని చూస్తే మనం భారత్‌లో ఉన్నామా పాకిస్తాన్‌లోనా అనే అనుమానం కలగడం సహజం. కొందరు స్థానికులు నయానగర్- మీరా రోడ్‌లో బారికేడ్లు ఏర్పాటు చేసి దారిన వెళ్లేవారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. హిందువులను ఈ ప్రాంతంలోకి అనుమతించలేదు. పోలీసులను కూడా అడ్డకున్నారు జనవరి 22 తేదీకి రెండు రోజుల ముందు నుంచే ఇక్కడ గొడవలు ప్రారంభ మయ్యాయి. శోభాయాత్ర ఏర్పాట్లను అడ్డుకుని, జెండాలు పీకేసి, వికృత చర్యలకు పాల్పడ్డారు
22వ తేదీన రామభక్తులు పెద్ద సంఖ్యలో ఈ మార్గంలో శోభాయాత్ర చేపట్టారు. మీరా భయాదర్ ప్రాంతానికి రాగానే పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. నాలుగు కార్లు, 14 మోటార్‌సైకిళ్లను ధ్వంసం చేయడంతో పాటు రామభక్తులను తీవ్రంగా కొట్టారు. మహిళలు, పిల్లలపై కూడా దాడులు జరిగాయి. విధ్వంసానికి దిగిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేశారు. మీరా భయందర్ అల్లర్లను మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో 64 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం వెతుకుతున్నారు. నయానగర్- మీరా రోడ్‌లో ఒక ఇరుకైన ప్రాంతం అల్లర్లకు కేంద్రంగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరహాలోనే బుల్డోజర్లను దింపారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఇక్కడ రోడ్డుకు రెండు వైపులా ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేశారు.
పదేగావ్ ప్రాంతంలో ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య భీకర పోరు, రాళ్ల దాడి జరిగాయి. హింసకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. పన్వెల్‌లో కూడా 2 రోజుల పాటు రచ్చ కొనసాగింది. సోలాపూర్‌లో శ్రీరామ శోభాయాత్రపై జిహాదీ శక్తులు రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డాయి. మౌలాలీ చౌక్, శాస్త్రీనగర్ ప్రాంతాలల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనల్లో నలుగురు హిందూ యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లో
ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్‌లో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బాణాసంచా కాల్చడం చూసి కొన్ని శక్తులు తట్టుకోలేపోయాయి. కస్య పోలీస్ స్టేషన్ పరిధిలోని బజార్ తోలా ప్రాంతంలో ఒక్కసారిగా వందలాది మంది ఊరేగింపుపై దాడి చేశారు. రాళ్లు విసిరి గాయపరచడంతో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. నలుగురిని అరెస్టు చేశారు. ముందుగానే హై అలర్ట్ ప్రకటించినా అజంగఢ్ జిల్లాలో అల్లర్లు చెలరేగాయి. జహానాగంజ్ పట్టణంలోని బాగైచా ప్రాంతంలో రామభక్తులు శోభాయాత్రకు కొందరు అడ్డు తగిలారు. డీజే వాహనాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువైపులా పెద్ద సంఖ్యలో మొహరించేసరికి పోలీసులు రంగంలోకి దిగారు. ఘాజియాబాద్‌లో ఓ వ్యక్తి తన కుక్కకి శ్రీరామ్ అనే బోర్డు తగిలించి నగరమంతా తిప్పాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఫిలిబిత్‌లో శ్రీరాముడి ప్రతిమను అవమాన పరిచినందుకు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బిహార్‌లో రాళ్లదాడులు
బిహార్‌లోని దర్భంగాలోను జిహాదీ శక్తులు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. భాపురా గ్రామంలో యాత్రపై రాళ్లదాడి జరిగింది. పలువురు గాయపడ్డారు. రెండు బైక్‌లతో పాటు డీజే వాహనం ముందు భాగాన్ని ధ్వంసం చేశారు. స్థానిక పోలీసులు హెడ్‌క్వార్టర్స్‌కు సమాచార అందించడంతో జిల్లా పోలీసులు బలగాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి.
ఎస్పీ సాగర్‌కుమార్ స్థానిక భర్హుల్లి, భవానీపూర్ గ్రామాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి శాంతి భద్రతలకు సహకరించాలని, అల్లర్లకు పాల్పడ్డ వారిని ఇప్పటికే కొందరిని గుర్తించామని తెలిపారు. ముజఫర్‌పూర్ లోని మజోలియాది ప్రాంతంలో కూడా సంఘ వ్యతిరేకులు రాళ్లు రువ్వారు. కత్తులతో చెలరేగి పోయారు. పోలీసులు వారిని చెదరగొట్టి ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తపై దాడి
శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా జార్ఖండ్‌లోని గిరిదిలో ఉద్రిక్త సంఘటనలు నమోదయ్యాయి. నగరంలోని లైన్ మసీదు సమీపంలో, పూర్ణానగర్‌లో జిహాదీ గ్రూపులు హిందువులపై దాడులకు పాల్ప డ్డాయి. ఊరేగింపులపై రాళ్లు రువ్వారు. తక్షణమే చర్యలు తీసుకున్న పోలీసులు మహ్మద్ జాబీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆజాద్ నగర్ సమీపంలోని బిర్నీకి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రోహిత్ మహతోపై దాడి జరిగింది. జార్ఖండ్‌లోనే లోహర్‌దగాలో హన్హాట్ గ్రామంలోని రామాలయంలో పాటలు, భజనలు ఆపేయాలంటూ కర్రలు పట్టుకొని వచ్చారు. పోలీసులు వచ్చి వారిని అక్కడిని నుంచి పంపేశారు. ధన్‌బాద్‌లోని తుండి కడైయాన్, ఛతాబాద్‌లో శ్రీరామశోభాయాత్రకు వ్యతిరేకంగా కొందరు రోడ్ల మీదకు వచ్చారు. జెండాలను తొలగించాలని గొడవపడ్డారు.
అడ్డుతగిలిన ఎస్‌ఎఫ్‌ఐ గుండాలు
కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ప్రాణ్ ప్రతిష్ఠ సందర్భంగా సీపీఎం విద్యార్థి సంఘం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) గూండాలు చెలరేగిపోయారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై యూనివర్సిటీ ప్రో-వైస్ ఛాన్సలర్ అమితవ దత్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్ప టికీ ఏబీవీపీ కార్యకర్తలు, కొందరు యూనివర్సిటీ సిబ్బంది రామనామస్మరణ ప్రారంభించారు. ఇంతలో ఎస్‌ఎఫ్‌ఐ గుండాలు వచ్చి దాడులకు పాల్పడ్డారు. భండారీ అనే విద్యార్థిని తీవ్ర గాయాలయ్యాయి.
బురఖా మహిళ నినాదాలు
కర్ణాటకలోని శివమొగ్గలో రామమందిర ప్రతిష్ఠాపన వేడుకలు జరుపుకుంటున్న హిందువుల మధ్యకు బురఖా ధరించిన ఓ మహిళ ప్రవేశించి ‘అల్లా-హు-అక్బర్’ అంటూ నినాదాలు చేసింది. జై శ్రీరామ్ నినాదాలు ఆపేయాలని గొడవకు దిగింది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమతో తీసుకుపోయారు. ఆమె తండ్రి మాత్రం తన కుమార్తె మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని చెబుతున్నారు.గుడుల మీద, హిందువుల మీద దాడికి దిగినవారు సాధారణంగా మతిస్థిమితం లేనివారుగా ఉంటారు కాబోలు. బెలగావి నగరంలో శోభాయాత్రపై రాళ్ల దాడి జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గుజరాత్‌లోనూ..
గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో శోభాయాత్రపై రాళ్లదాడి జరిగింది. ఖేరాలు బెలిమ్ వాస్‌లోని హటాడియా ప్రాంతం నుంచి ఊరేగింపు వెళుతుండగా కొందరు వ్యక్తులు అభ్యంతరం చెప్పారు. కొందరు ఇళ్లపై నుంచి రాళ్లు రువ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాడులకు పాల్పడ్డవారిని గుర్తించి తక్షణం 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని కొద్ది సేపట్లోనే అదుపులోకి తీసుకొచ్చారు. అటు వదోదర జిల్లా పాద్రాభోజ్‌లో కూడా శోభాయాత్రపై దాడులు జరిగాయి. రాళ్లదాడిలో 10 మంది మహిళా భక్తులకు గాయాలయ్యాయి. స్థానిక ముస్లింలు ఈ యాత్రకు అడ్డు తగిలారు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో కూడా అక్కడక్కగా గొడవలు జరిగాయి. హిందువులకు చెందిన దాదాపు 10 ఇళ్లను ధ్వంసం చేశారు.
తెలంగాణలోనూ దాడులు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తా బాద్‌లో శాంతియుతంగా సాగుతున్న శ్రీరాముని పల్లకి ఊరేగింపుపై దుండగలు పాదరక్ష విసిరారు. 22వ తేదీ సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో వీధుల్లో భక్తుల పాటలు, భజనలతో శోభాయాత్ర కొనసాగుతుండగా ఒక భవనంపై నుంచి ఒక్కసారిగా బూటు దూసుకొచ్చింది. ఈ ఘటనపై రామభక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ భవనం దగ్గర గుమిగూడి నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఆ కుటుంబాన్ని 108 వాహనంలో రక్షణ కల్పించి అక్కడి నుంచి తరలించారు. బూటు పడిన వెంటనే కొందరు భక్తులు ఆ ఇంట్లోకి దూసుకెళ్లారు. అక్కడ తనిఖీ చేస్తే విసిరిన షూతో జతయ్యే మరో షూ వాషింగ్ మెషీన్ కింద కనిపించిందని సంగారెడ్డి జిల్లా ఓబీసీ విభాగం అధ్యక్షుడు బి.మహేష్ తెలిపారు. ఈ ఘటనలో షేక్ నవాజ్, షేక్ జాఫర్‌ల ప్రమేయం ఉందని ఆరోపించించారు. బూటు విసిరిన వారిని శిక్షిస్తామని, నిందితులను అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో అక్కడక్క అసాంఘిక శక్తులు శ్రీరామ శోభాయాత్రలను ఆటంకం కలిగించే ప్రయత్నం చూశాయి.
ఎర్రగడ్డ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఇవి వెలుగు చేశాయి. మరోవైపు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రామభక్తులను ఇబ్బంది పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో పోలీసులు శోభాయాత్రను అడ్డుకున్నారు. సిద్దిపేట పట్టణంలో ఏసీపీ రామభక్తులను ఇబ్బంది పెట్టారు. ఈ ఘటనలపై విశ్వహిందూ పరిషత్ డీజీపీకి ఫిర్యాదు చేసింది.
అల్లర్లు తక్కువే..
ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తుంటాయి కొన్ని వర్గాలు.. 2022లో 60 అల్లర్లు, 2023లో 40 అల్లర్లు జరిగాయి. కానీ శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ రోజున చాలా తక్కువ ఘటనలు చోటు చేసుకోవడం ఊరటనిచ్చే అంశం.
-క్రాంతి
సీనియర్ జర్నలిస్ట్