లాల్‌కృష్ణ అడ్వాణీ నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు నన్ను వారికి సహాయకుడిగా నియమిం చారు. అలా ఆయనను దగ్గరగా గమనించే అవకాశం చిరకాలం కిందటే కలిగింది. అప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వం నన్ను చాలా ఆకర్షించింది. గౌరవభావం పెంచింది. తర్వాత రాష్ట్ర పర్యటనకు వస్తే తరచు కలుస్తూ ఉండేవాడిని. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత మరింత సాన్నిహిత్యం వచ్చింది. ఆయన ఉపన్యాసాలు తర్జుమా చేయడం, వారితో పర్యటనలో పాల్గొనే అవకాశం వచ్చాయి.
అటల్‌జీ, అడ్వాణీజీ ఇద్దరికీ మొదట సహాయకుడిగా ఉండే అవకాశం రావడమే నా జీవితంలో పెద్ద మలుపు. అడ్వాణీ నన్నెంతో అభిమానంగా చూసేవారు. నేను శాసనసభలో మాట్లాడిన వాటి గురించి, పత్రికల్లో వచ్చిన విషయాలు పార్టీ సహచరులు చెప్పడంతో, ఆయనను కలిసినప్పుడల్లా చాలా సూచనలు చేసేవారు.
జనసామాన్యంలో ఉండాలనేవారు
నన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినప్పుడు, ఆంధప్రదేశ్ ప్రధమ రాష్ట్ర మహాసభలకు అడ్వాణీ హాజరయ్యారు. అటల్జీ నాయకుడేకాదు, ప్రజాకర్షణ ఉన్నవారు. అడ్వాణీలో నాయకత్వ లక్షణంతో పాటు కార్యకర్తలకు మార్గదర్శనం చేయడంలోను ప్రముఖ పాత్ర వహించేవారు. సిద్ధాంతంపైన సమగ్ర అవగాహన కల్పించడం కోసం శిక్షణ తరగతుల్లో, కార్యకర్తల సమావేశాల్లో ఆయన విస్తృతంగా మాట్లాడేవారు. కార్యకర్తలపట్ల ప్రేమ, ఆప్యాయతతో కూడిన అనురాగాన్ని చూపేవారు. ఆయన చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి, ‘బీజేపీ సఫేద్ కపడా పార్టీ హై’ అనేవారు. స్వచ్ఛమైన పార్టీగా మనకి పేరు. చిన్న సిరామరక అంటినా జనం గుర్తిస్తారు. కాంగ్రెస్ గురించి, డ్రైనేజీలో పడి బయటకు వస్తే ‘ఏక్ నయారంగ్ ఆయా’ అనేవారు. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలని సదా హెచ్చరించే వారు. మరొక్క విషయం చెప్పేవారు. ప్రతి ఒక్కరూ, మమేకం అయ్యే విధంగా మనం పర్యటనలు రూపొందించుకోవాలి. తద్వారా మనం జనానికి మరింత దగ్గర కావచ్చు. పర్యటనలకు వెళ్లినప్పుడు సాయంత్రం అయ్యేసరికి మనం కేంద్రానికి వెళ్లిపోదాం అని కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటనలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల ఇళ్లల్లో నివాసముండాలి, తద్వారా కార్యకర్తలకు పార్టీతో, పార్టీకి కార్యకర్తలతో అనుబంధం పెరుగుతుందని చెప్తుండేవారు. ఆయన నిరంతరం పర్యటించే వారు. దేశవ్యాప్త పర్యటనలతో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నమది. ఈ విషయాలే నేను జీవితంలో పైకి రావడానికి ప్రధాన కారణ మయ్యాయి. దానిని ఆచరించాను. ప్రవర్తన విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. మన ప్రవర్తన ఇతరులకు భిన్నంగా, ప్రత్యేకంగా ఉందనే సంకేతాలు ఇతరులకు ఇవ్వాలి. మాటల్లో కాదు చేతల్లో. ‘డీడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వర్డస్’ అని చెప్తుండేవారు.
పార్టీని జనం దగ్గరకు తీసుకువెళ్లాలి
ఆయన కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రచార, ప్రసార సాధనాలు ఎలా పనిచేయాలి, పార్టీని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లడం కోసం ఏమిచెయ్యాలని చాలా చక్కగా చెప్పారు. ఆదర్శాల కన్నా ఆదర్శ ఆచరణ ముఖ్యమని చెప్పేవారు. మనం ఎలాంటి పార్టీ వాళ్లమో, మన ఆచరణ చూసి ప్రజలు అంచనా వేసుకుంటారని ఆయన నమ్మకం. ఆయన ఉప ప్రధానమంత్రి అయిన తర్వాత నేను పార్టీ అధ్యక్షుడు కావడం, ఆ తర్వాత బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతే, నేను రాజీనామా ఇవ్వడం జరిగిపోయాయి. ఇప్పటి పరిస్థితులలో మీ నాయకత్వం తప్ప మరో మార్గం లేదని మేమందరం చెప్తే, అడ్వాణీ అధ్యక్షుడయ్యారు. పార్టీకి 1984లో 2 సీట్లే వచ్చాయి. అందుకని ఆయనను రెండవసారి అధ్యక్ష పదవి స్వీకరించమంటే, వెంకయ్యజీ నా టీంలో ఉండేటట్టు అయితే సరే అన్నారు. అలా నేను అధ్యక్షుడిగా పని చేసిన తర్వాత కూడా ఉపాధ్యక్షుడిగా పని చేయడానికి సిద్ధమయ్యాను. అక్కడ ఉన్నది అడ్వాణీ కాబట్టి.
వాజపేయి పేరు ప్రతిపాదించారు
మేమందరం ఆ రోజుల్లో అడ్వాణీ నాయకుడవు తారని భావిస్తుండేవాళ్లం. కానీ ఆయన అటల్‌జీ పేరు ప్రతిపాదించారు. ముంబై సమావేశాల్లో, శివాజీ మైదాన్‌లో జరిగిన బహిరంగ సభలో మొదటిసారిగా, రాబోయే ఎన్నికలు మేం వాజ్‌పేయి నాయకత్వంలో పోటీ చేస్తాం, ఆయనే మా ప్రధానమంత్రి అభ్యర్ధి అని అడ్వాణీ ప్రకటించారు. తర్వాత, నేను, సుష్మా స్వరాజ్, ప్రమోద్ మహాజన్, జైట్లీ లాంటి వాళ్లందరం దీని గురించి వారితో ప్రస్తావించాం. ఆయన చెపుతూ ‘పార్టీలో నాకు ఎంత పాపులారిటీ ఉన్నా ప్రజల్లో వాజ్‌పేయి అంటే ఆకర్షణ ఉంది. ఆయన్ని నాయకుడిగా పెట్టుకుంటే, పార్టీ విజయం సాధించడం సులభం’ అన్నారు.
రామరాజ్యం నుంచి ఉదాహరణలు
పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను మహామంత్రి, అంటే ప్రధాన కార్యదర్శిగా పని చేసే అవకాశం లభించింది. ఏ విషయం చెప్పినా తరచుగా శ్రీరామచంద్రుడు, రామరాజ్యం… అంటూ అక్కడి ఉదాహరణలు చెప్తుండేవారు. జాతీయ కార్యవర్గసమావేశాల ముగింపు ఉపన్యాసం, తీర్మానాల్లో జోక్యం చేసుకున్నప్పుడు కూడా అరటిపండు వలిచి పెట్టినట్టుగా వివరించేవారు. ఆయన తీర్మానాలు రూపొందించేవారు. వేరెవరైనా- సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లేదా నేను, పాతరోజుల్లో కైలాస్ జోషీ, మధ్యప్రదేశ్ రైతులకు సంబంధించిన కామత్ వంటివారు తయారుచేస్తే, తుదిమెరుగులు దిద్దేవారు.
అయోధ్య రథయాత్ర, ఇతర యాత్రలు
అయోధ్య రామమందిర నిర్మాణం కోసం అడ్వాణీ చరిత్రాత్మక రథయాత్ర జరిపి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టారు. ఆ సందర్భంలో నేను ఆంధప్రదేశ్ పర్యటన ఇన్‌ఛార్జిగా ఉన్నాను.ఆ రథయాత్ర కారణంగా రామజన్మభూమి ఉద్యమం మరింత ఊపందుకొని, మందిర నిర్మాణ స్వప్నం సఫలీకృతమయింది. ఆ తర్వాత స్వర్ణ జయంతి యాత్ర. మైసూరు నుంచి ఇంకో యాత్రను ప్రారంభించినప్పుడు ఆయనతో యాత్ర మొత్తం ఉండే అవకాశం నాకు ఇచ్చారు. దానితో ఆయన్ని మరింత నిశితంగా గమనించడానికీ, మరింత మార్గదర్శనం పొందడానికీ అవకాశం లభించింది. రాజకీయాల్లో విలువలు, సత్సాంప్రదాయాలను పాటించాలనే విషయం ఆయన ఎప్పుడూ నొక్కి చెప్తుండేవాళ్లు, అది కూడా మా అందరి మనసులో గట్టిగా నాటుకుపోయి ఉంది. పార్లమెంటులో కూడా ఎలా వ్యవహరించాలి? రాజకీయ ప్రత్యర్ధులను ప్రత్యర్ధులుగానే చూడాలి తప్పితే శత్రువులుగా చూడకూడదు, పరుషమైన పదాలు వాడకూడదు అనే విషయాన్ని కూడా నేను వారి దగ్గర నుంచే నేర్చుకున్నాను. మొత్తం మీద వ్యక్తిత్వం, వక్తృత్వం, కర్త•ృత్వం, మిత్రత్వం, నేతృత్వం ఇవన్నీ ఎలా ఉండాలనే విషయం ఎక్కువగా అడ్వాణీగారి దగ్గరి నుంచే నేర్చుకున్నాం. వారికి వీలు చిక్కినప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్లి, అనేక విషయాలు తెలుసుకునే అవకాశం లభించింది. నన్ను కానీ, మంచిగా పని చేస్తున్న ఇతరులను కానీ ఇష్టపడితే మరింత దగ్గరకు తీసుకునేవాడు. కుటుంబ వ్యవహారాలలో కూడా కుటుంబ సభ్యులతో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు. తద్వారా కుటుంబ వ్యవస్థలో మనం ఎలా ఉండాలనే విషయం తెలుసుకునేందుకు అవకాశం లభించింది. వారు మార్గదర్శకుడని చెప్పుకోడానికి నేను గర్వపడుతున్నాను.
మితాహారమే ఆరోగ్య రహస్యం
అడ్వాణీ అన్నిటా క్రమశిక్షణ పాటించేవారు. భోజన విషయంలో చాలా జాగ్రత్త. అటల్‌జీ అందరితో పాటు సరదాగా అన్నీ తిందామనుకున్నా, అడ్వాణీ సిద్ధపడేవారు కాదు. ఒకసారి ఎన్టీరామారావు అడ్వాణీని ఉపాహారానికి పిలిచి, రకరకాలు పెట్టినప్పటికీ కూడా అడ్వాణీ అన్నీ ముట్టలేదు. రామారావుగారిని మామూలుగా డిక్టేటర్ హోస్ట్ అంటారు. ఆయన ఏం చెప్తే అది అందరం తినాలి, బలవంతంగా అయినా తినాలి. ఎన్టీఆర్‌కు డయాబెటీస్. అయినా మంచిగా తినేవారు. కానీ అడ్వాణీ తన నియమాన్ని కాస్త కూడా అతిక్రమించలేదు. అసలు ఆయన ఆరోగ్య రహస్యమే అది అనుకుంటాను. చిన్న ఉదాహరణ, నవ్వు తెప్పించే ఉదాహరణ చెప్పారాయన. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎంత తినాలి అనే కోటా దేవుడు నిర్ణయిస్తాడు. కానీ ఎన్ని సంవత్సరాల్లో తినాలి అనే విషయాన్ని మనకు వదిలేశాడు భగవంతుడు. అది నువ్వు 30 ఏళ్లలో తింటావా, 70 ఏళ్లల్లో తింటావా అది నీ ఇష్టం అని నవ్వుతూ చెప్తుండేవారు.
సమున్నత వ్యక్తిత్వం
ఏ కోణం నుంచి చూసినా కూడా ఆయనది ఆదర్శవంతమైన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంతోనే ఆయన దేశంలో పేరెన్నికగన్న నాయకుడిగా మిగిలి ఉన్నారు. భా వ్యక్తీకరణలో, ఆలోచనలను ఇతరులతో పంచుకోవడంలో, పత్రికల్లో వ్యాసాలు రాయడంలో ఆయన ధోరణి విశిష్టంగా ఉంటుంది. రచనల ద్వారా ప్రజలను, వారి ఆలోచనలను ప్రభావితం చేయవచ్చునని ఆయన విశ్వాసం కూడా.
కమ్యూనిస్టు పార్టీ – అంటే సిద్ధాంతపరంగా మాకెవరికీ పడేదికాదు. కానీ అటల్‌జీ, అద్వానీజీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు నంబూద్రిపాద్ కేరళలో కన్నుమూశారు. బీజేపీ తరఫున ఎవరైనా వెడితే మంచిదనే ఆలోచన వచ్చింది. నంబూద్రి ప్రతిపక్ష ప్రముఖుడు. మాజీ ముఖ్యమంత్రి. చివరికి అడ్వాణీ నేను వెడతానని చెప్పి, స్వయంగా హాజరై నివాళి ఘటించారు. దాంతో అడ్వాణీ పట్ల ఇతర పార్టీలలో గౌరవభావం పెరిగింది. ఇలా ఎన్నో సందర్భాలు.
– ఎం. వెంకయ్యనాయుడు,
మాజీ ఉపరాష్ట్రపతి