‘జ్ఞానవాపి అడుగున భారీ ఆలయం ఆనవాళ్లు. దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో శాసనాలు. ఈ శాసనాల్లో జనార్దన, రుద్ర, ఉమేశ్వర వంటి దేవతల పేర్లు.’
జనవరి 26, 2024న అన్ని పత్రికలలోను ప్రముఖంగా వెలువడిన వార్త ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసిలో జ్ఞానవాపి మసీదుగా పిలుస్తున్న, ముస్లింలు నమాజ్ చేసుకుంటున్న కట్టడం నిజంగా ఎవరిదో, దాని చరిత్ర ఏమిటో నిగ్గు తేల్చాలంటూ మొదలైన న్యాయపోరాటం ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంది. జ్ఞానవాపి మసీదు అడుగున హిందూ దేవాలయం ఆనవాళ్లు సుస్పష్టం అంటూ సాక్షాత్తు భారత పురావస్తు పరిశోధన శాఖే కోర్టుకు తెలియచేసింది. కోర్టు కక్షిదారుల న్యాయవాదులకు అందించింది. ఆ అంశాలను హిందూపక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ పత్రికలకు వెల్లడించారు. ఇదొక చిదంబర రహస్యం మాత్రమే. 839 పేజీల పురావస్తు శాఖ జ్ఞానవాపి మసీదు హిందూ కట్టడాన్ని కూల్చి కట్టినదేనని బల్లగుద్ది చెప్పింది. జ్ఞానవాపి న్యాయపోరాటం కూడా శతాబ్దాల నాటిది. 1937లోనే ఈ వివాదం కోర్టు ముందుకు చేరింది. జ్ఞానవాపి అంటే జ్ఞానపు బావి. ఇప్పుడు చారిత్రక జ్ఞానాన్ని తోడిస్తున్న బావిగా కనిపిస్తున్నది.
జ్ఞానవాపి మసీదుగా పిలుస్తున్న ఆ కట్టడం హిందూ దేవాలయాన్ని కూల్చి, ఆ శిథిలాల మీద కట్టినదేనని అందరికీ తెలుసు. కానీ హిందువులు సహనశీలురు. శాస్త్రీయంగా చారిత్రక మూలాలను వెలికి తీయగలిగే భారత పురావస్తు పరిశోధన శాఖ, న్యాయ వ్యవస్థ ఇచ్చిన నివేదికలు, తీర్పుల ఆధారంగా మాత్రమే దానిని తమ పరం చేసుకోవాలని అనుకుంటున్నారు. దాదాపు 1990లో ప్రారంభమైన ఈ న్యాయపోరాటం ఇప్పటికీ కొనసాగుతున్నది. అంటే మూడున్నర దశాబ్దాల పోరాటం. ఎన్ని ప్రబల సాక్ష్యాలు ఉన్నా వాటిని నిరాకరిస్తూ, కోర్టులకు వెళుతూ వివాదాన్ని నాన్చే పక్రియనే ముస్లిం వైపు పక్షాలు అనుసరిస్తున్న మాట కూడా వాస్తవం. కోర్టులకు వెళ్లి అయోధ్య విషయంలో జరిగింది కూడా అదే. కానీ అయోధ్యకీ, వారణాసికీ పోలిక ఇంతవరకే. 2019లో సుప్రీంకోర్టు అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని తీర్పు ఇచ్చింది. ఈ సంవత్సరం జనవరి 22న అక్కడ ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కూడా పూర్తయింది. అయోధ్య, కాశీ, మధుర తమ పరం కావాలన్నదే హిందువుల అభిమతం. వా• •మీద జరుగుతున్న న్యాయ, ఆధ్యాత్మిక పోరాటాలు ఒక ప్రణాళికతో మొదలుపెట్టి జరుగుతున్నవి మాత్రం కావు. ఆయా ప్రాంత పోరాటం ఆ ప్రాంతం వారిదే. వారందరిని నడిపిస్తున్నది మాత్రం హిందూధర్మం విషయంలో చరిత్రలో జరిగిన ఘోర తప్పిదాలను సరిచేసు కోవాలన్న ఏకాత్మ సూత్రమే.
పురావస్తు శాఖ నివేదిక
జ్ఞానవాపి మసీదు ప్రాంగణం స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) నివేదిక స్పష్టం చేసింది. హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ జనవరి 24న వారణాసిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏఎస్‌ఐ నివేదికలోని అంశాలను చదివి వినిపించారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) సర్వేలో వెల్లడైన అంశాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. మసీదులో చేసిన మార్పులను ఈ సర్వే గుర్తించింది. పూర్వమున్న స్తంభాలను, ప్లాస్టర్‌తో చిన్న చిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు కనిపిస్తున్నాయి. హిందూ ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చి వేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించారు. స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు. దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిలలో వేయించిన మొత్తం 34 శాసనాలు ప్రస్తుత, పూర్వపు నిర్మాణాలపై ఉన్నాయి. ఇవన్నీ పూర్వం ఉన్న హిందూ దేవాలయంలో ఉన్న శాసనాలు. ఇవే ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోనూ మరమ్మతుల సమయంలో ఉపయోగించారు. దీనిని బట్టి పూర్వం అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి, దానికి సంబంధిం చిన భాగాలను తిరిగి వాడినట్లుగా రుజువవుతోంది. ఈ శాసనాల్లో జనార్దన, రుద్ర, ఉమేశ్వర వంటి దేవతల పేర్లు కూడా ఉన్నాయి.
తమ చుట్టూ నిర్మించిన అబద్ధాల కోటలను ఛేదించుకుని చారిత్రకసత్యాలు నేరుగా న్యాయస్థానాల ముంగిట నిలబడడం ఇవాళ్టి పరిణామం. ఈ మహా యజ్ఞమే సరికాదంటున్నాయి ఉదారవాద, వామపక్ష శక్తులు. అబద్ధాల కింద, వక్రభాష్యాల చాటున ఉండిపోయిన చరిత్రను ప్రపంచానికి తెలియ నీయడం దేశానికి శ్రేయస్కరం కాదట. మత సామరస్యానికి విఘాతమట. దానర్ధం హిందువులు రాజీ పడాలనే. మసీదుల కింద మగ్గుతున్న ఆలయాలు వెలుగు చూడకూడదనే. విదేశీ దురాక్రమణదారులు హిందూధర్మాన్ని నాశనం చేసి, ఆలయాలను నేలకూల్చిన మాట నిజమే కావచ్చు. కానీ దానిని మరచిపోవడం భవిష్యత్తుకు మంచిదన్నది సెక్యులరిస్టుల సూత్రీకరణ. వందా రెండు వందలా! 40,000 మసీదుల కింద ఉన్న దేవాలయాలను వెనక్కి ఇమ్మని కోరడం అంటే మైనారిటీల మనసుకు కష్టం కలుగుతుంది కదా పాపం అంటున్నారు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, స్వయం ప్రకటిత మేధావులు. ఫలితం ఏమిటి? జ్ఞానవాపి విషయంలోను ముస్లిం మతోన్మాదులు, ఆధిపత్య భావనను వీడని వాళ్లు భారత పురావస్తు శాఖ నివేదికను సైతం తప్పుల తడకగా చెప్పడానికి వెనుకాడడం లేదు. ఆ విధంగా పరోక్షంగా కోర్టులను కూడా అవమానిస్తున్నారు.
జ్ఞానవాపి ఉనికి ఎలాంటిది?
వారణాసిలో పురాణ ప్రసిద్ధమైన విశ్వనాథుని మందిరాన్ని కబళిస్తున్నట్టే ఉంటుంది జ్ఞాన్‌వాపి మసీదు. మసీదులో హిందూ ఆనవాళ్లు తిరుగులేని సత్యమని హిందువుల వాదన. ఒక సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత మే 19, 2022న వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశంతో ఈ మసీదు లోపలి భాగాలను వీడియో సర్వే చేసి, కోర్టుకు సమర్పించారు. కోర్టు నియమించిన ప్రత్యేక సహాయ కమిషనర్ ఈ కార్యక్రమం నిర్వహించారు. అయోధ్య తరువాత హిందువులు చేస్తున్న మరొక ఆత్మగౌరవ ప్రకటనగా ఇప్పుడు అంతా భావిస్తున్న ఈ సర్వే కార్యక్రమం ఐదుగురు సాధారణ గృహిణులు కోర్టుకు చేసుకున్న విన్నపం మేరకు పునఃప్రారంభమైంది. వీరంతా ఏ రాజకీయ దురుద్దేశాలు లేకుండా కేవలం ధార్మిక దృష్టితో తమ మత హక్కును నిలబెట్టి న్యాయం చేయవలసిందని కోర్టును అర్థించారు. జ్ఞానవాపి గోడను ఆనుకుని ఉన్న శృంగార గౌరీ అమ్మవారికి నిత్యం పూజలు చేసుకునే వెసులుబాటు కల్పించా లన్నదే ఆ విన్నపం అసలు ఉద్దేశం. తీరా తీగ లాగితే చరిత్ర డొంకంతా కదిలినట్టయింది. శృంగార గౌరీ నిత్య ఆరాధన అంశం 40,000 మసీదుల కింద ఉన్న పవిత్ర దేవాలయాల శిథిలాలకు గొంతును ఇచ్చింది. ఇది జ్ఞానవాపి మసీదు మీద తమకు ఉన్న హక్కు గురించి హిందువులు సాగిస్తున్న న్యాయ పోరాట స్వరూపం.
న్యాయపోరాటం
వారణాసి మాత్రమే కాదు, అయోధ్య, మధుర – ఈ మూడు పరమ పవిత్ర క్షేత్రాల మీద హిందు వులు తమ హక్కును నిరూపించుకోవడానికి న్యాయ స్థానాలనే ఆశ్రయించారు. దశాబ్దాలు, శతాబ్దాలు నిరీక్షించారు. అయోధ్య ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడే 1991లో, అంటే అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూలడానికి ఒక సంవత్సరం ముందే వారణాసికి చెందిన కొందరు అర్చక స్వాములు అక్కడి జిల్లా న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ దేవుళ్లకు నిత్యపూజలకు అనుమతించాలన్నదే వారి విన్నపం. కానీ వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణను మూడు దశాబ్దాల తరువాత అలహాబాద్ హైకోర్టు 2021లో నిలిపివేసింది. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారన్న ఆరోపణలో నిజమెంతో తేల్చడానికి తలపెట్టిన సర్వేను కూడా సస్పెండ్ చేసింది. ఇంకోపక్క, ఇలా సర్వే చేయించడం జూలై 11,1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి విరుద్ధమని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదించింది. ఈ చట్టం ప్రకారం 1947 నాటికి ఆలయాలు ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిని కొనసా గించాలి. ఇలా వివాదాన్ని త్రిశంకు స్వర్గంలో వదిలివేసిన సమయంలోనే మరొక పరిణామం జరిగింది. ఐదుగురు హిందూ సోదరీమణుల ద్వారా కేసు మళ్లీ పట్టాలెక్కింది. అంతకుముందే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్య, వాస్తవం మీద ముసుగును ఈ సర్వే తొలగిస్తుందని ప్రకటించి, దేశప్రజల దృష్టిని ఈ అంశం మీదకు మళ్లించారు. ఇక్కడొక విషయం గుర్తు చేసుకోవాలి. 1991 నాటి ప్రార్థనాస్థలాల పరిరక్షణ చట్టం చెల్లుబాటును పరిశీలించ వలసిందేనని 2021 మార్చిలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం ప్రకటించింది. సాక్ష్యాలు పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఒక కట్టడం మూలరూపాన్ని నిరాకరించడం తగదని చాలా మంది న్యాయ నిపుణులు అభిప్రాయ పడ్డారు కూడా.
నడం కట్టిన మహిళాలోకం
జ్ఞానవాపి గోడల మీద కనిపించే హిందూ దేవతా మూర్తులను నిత్యం పూజించుకోవడానికి అనుమతి మంజూరు చేయించవలసిందిగా ఢిల్లీలో ఉండే ఆ ఐదుగురు మహిళల విన్నపం. వీడియో సర్వే నిర్వహించి మే 10, 2022కు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ సర్వే జ్ఞానవాపి-శృంగార గౌరీ అమ్మవారి ప్రతిమ ఉన్న ప్రాంతంలో చేయాలి. కానీ కోర్టు ఆదేశాలను మొదట మసీదు నిర్వహణ సంఘం అనుమతించలేదు. కోర్టు నియమించిన కమిషనర్ అజయ్‌కుమార్ మిశ్రాకు పక్షపాత దృష్టి ఉందని, కాబట్టి వేరే కమిషనర్‌ను నియమించాలని కోరింది. ఆ విన్నపాన్ని కోర్టు పట్టించుకోలేదు. ప్రాథమిక సర్వే నిర్వహించిన మిశ్రా కొన్ని అంశాలను మీడియాకు వెల్లడించారన్న ఆరోపణతో ఆయనను తరువాత తొలగించవలసి వచ్చింది. మిశ్రా స్థానంలో విశాల్‌సింగ్‌ను నియమించారు. మే 17, 2022కు సర్వే పూర్తి చేయాలని మే 12న ఆదేశించింది. మే 13న అంజు మన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లి, సర్వే మీద స్టే కోరింది. కమిటీకి చుక్కెదురైంది. 14వ తేదీన సర్వే మొదలయింది. మొదటి రోజున నాలుగు గదులలో సర్వే జరిగింది. ఇందులో మూడు ముస్లింలవి, ఒకటి హిందువులది. రెండో రోజు సర్వేలోనే హిందూ ఆలయం ధ్వంసం చేసినట్టుగా చెప్పే ఆనవాళ్లు దొరికాయి. అంటే ఆనాడే అది హిందూ దేవాలయ మని రుజువైంది. మే 16న సర్వే పూర్తయింది. అప్పుడే హిందువుల తరఫున వాదిస్తున్న ఒక న్యాయవాది వజూఖానాలో శివలింగం ఉన్నట్టు బయటకు చెప్పారు. వెంటనే సుప్రీంకోర్టు ముస్లింల ప్రార్థనలకు అడ్డు లేకుండా, శివలింగం ఉన్న ప్రదేశాన్ని సీజ్ చేయవలసిందని ఆదేశాలు ఇచ్చింది. ఇది హిందువుల మనోబలాన్ని పెంచింది.
అయోధ్య, కాశీ, మధుర మాత్రమే కాదు, ఈ దేశంలో దాదాపు నలభయ్ వేల మసీదులు అలా హిందువుల ఆత్మగౌరవాన్ని తొక్కుతూ నిలబడినవే. సాకి మస్తాయిద్ ఖాన్ రాసిన ‘మాసీర్ ఇ అలంగిరి’ అనే గ్రంథం ఉంది. ఔరంగజేబ్ పాలనా కాలం మీద వ్యాఖ్యానం వంటి చరిత్ర గ్రంథం. ఇది కాశీ ఆలయం గురించి ప్రస్తావించింది. పర్షియా భాషలో ఉన్న ఈ గ్రంథాన్ని ప్రముఖ చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ అనువదించారు. ఆ పని బీజేపీ చేయించిందనుకుంటే పొరపాటు. బ్రిటిష్ ఇండియా కాలంలోనే సర్కార్ అనువదించారు. ‘మాసీర్ ఇ అలంగిరి’ చెబుతున్నదాని ప్రకారం పాదుషా ఆజ్ఞ మేరకు సెప్టెంబర్ 2,1669న మొగలాయిల అధికారులు విశ్వనాథుని ఆలయాన్ని నేలకూల్చారు.
రుజువులే ఒక ప్రార్థనాస్థలం ఎవరిదో చెబుతాయనుకుంటే వర్తమానకాలంలో జరిగిన దేమిటో కూడా చూడాలి. మే 19, 2022వ తేదీన కోర్టుకు సర్వే నివేదిక అందింది. మసీదు లోపల సనాతన ధర్మానికి చెందిన డమరుకం, త్రిశూలం, కమలం కనిపించాయి. మొదటిగా సర్వే నిర్వహించిన మిశ్రా కూడా పగిలిన హిందూ దేవతాప్రతిమలు మసీదులో ఉన్నాయని నమోదు చేశారు. అవి శేషుడు, దీపం. కానీ మసీదులోని వజూఖానాలో దొరికిన శివలింగాన్ని ఫౌంటేన్‌గా నమ్మించడానికి ముస్లింలు శతవిధాల ప్రయత్నించినా దానిని దేశం నమ్మలేదు.
ఇందుకు సంబంధించి కొన్ని అంతర్జాతీయ ఆధారాల గురించి చూద్దాం. అబుల్ ఫజల్ రాసిన ‘అల్ బేహకి’ గ్రంథం ప్రకారం భారత్‌లో గజనీ తరఫు పాలకునిగా ఉన్న అహ్మద్ నియాల్‌తిగిన్ క్రీస్తుశకం 1033లో ఆ పవిత్ర నగరాన్ని దోచుకున్నాడు. ఉదయం పూట ప్రార్థన సమయంలో మొదలైన దోపిడీ మధ్యాహ్న ప్రార్థనల దాకా సాగిందట. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ఔరంగజేబ్ కూల్చాడని చెబుతూ ప్రపంచ ప్రఖ్యాత ఇండాలజిస్ట్ జేమ్స్ ప్రిన్సిప్ చూపించిన సాక్ష్యాలు ఉన్నాయి. అయినా ముస్లింలు తమ పూర్వీకుల దురాక్రమణల మీద తమకే హక్కు ఉండాలనీ, అవి అలాగే ఉండాలని, దురాక్రమణతో కట్టిన మసీదులే అయినా అవి హిందూ ఆలయాల కంటే పవిత్రమైనవనీ చెబుతున్నట్టే ఉంది. పైగా ఒకసారి ముస్లింల అధీనంలోకి వచ్చిన స్థలం లేదా కట్టడం సూర్యచంద్రులు ఉన్నంత వరకు ముస్లింలకే అంటే తమ దైవానికే చెందుతాయని వాదిస్తున్నారు. నిజానికి ఇదే అసలు సమస్య. జ్ఞానవాపి సర్వేకు అనుమతి ఇచ్చిన నాడే, ‘మేం ఒక్క మసీదును కూడా వదిలిపెట్టబోమ’ని అసదుద్దీన్ ఒవైసీ యుద్ధభేరీ మోగించారు. గతంలో చట్టవిరుద్ధంగా అయోధ్యను (అది సుప్రీంకోర్టు తీర్పు కదా!) లాక్కున్నా, మరొక మసీదు ఏదీ అప్పగించడానికి సిద్ధంగా లేమని ముస్లింలు అంటున్నారు. తాజాగా పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక విషయంలో కూడా ఆయన ఇదే మాట్లాడారు. అది అభిప్రాయమే తప్ప, ఆధారం కాదని ఈయన తేల్చేశారు.
అయోధ్య తరువాత కోర్టుల మీద హిందువులు ఇంకాస్త నమ్మకం పెంచుకున్నారు.జ్ఞానవాపి మసీదును సర్వే చేయించడానికి కోర్టు ఆదేశించిన తరువాత దేశంలో పలుచోట్ల మసీదుల సర్వే కోసం విన్నపాలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో కుతుబ్ మీనార్ దాదాపు పాతిక హిందూ దేవాలయాలను కూల్చి కట్టినదని భారత పురావస్తు శాఖ నివేదిక ఇచ్చింది. ఇటీవల మంగళూరులో ఒక మసీదును పునర్ నిర్మించడానికి కూల్చితే దాని కింద, పక్కన హిందూ ఆలయాల ఆనవాళ్లు బయట పడ్డాయి. తాజ్‌మహల్‌లో కూడా సర్వే చేయించాలని కొందరు కోరారు. అది తాజ్ మహల్ కాదు, తేజో మహల్ అనే శివాలయమన్న వాదన ఇప్పటిది కూడా కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే 140 వరకు ఇలాంటి వివాదాలు ఉన్నాయి. కానీ ముస్లింలు వైఖరి ఏమిటి? కోర్టుల మాట పట్టదు. పురావస్తు శాఖ ఆధారాలు నమ్మమని చెబుతారు.
ఇప్పుడు హిందువులు మసీదు భూగృహంలోని పది ప్రాంతాల మీద కూడా సర్వే జరపాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది తప్పదు. హిందూ ఆలయాలుగా చెప్పే ఎన్ని ఆధారాలు ఉన్నా ఒక్క మసీదును కూడా వదలబోమని మొండిగా వాదిస్తున్న వర్గంతో హిందువులు తలొంచుకుని రాజీకి రావాలని మేధావులు, సెక్యులరిస్టులు ఎలా కోరతారు? కాబట్టి కోర్టుల నిర్ణయమే తుది నిర్ణయం కావాలి.
1236 నుంచి 2024 వరకు
జ్ఞానవాపి మసీదు హిందూ దేవాలయం స్థానంలో కట్టినదేనని అంతా విశ్వసించక తప్పడం లేదు. జ్ఞానవాపి మసీదులో ఉన్నట్టు చెబుతున్న హిందూ దేవాలయ ఆనవాళ్లలో ఇవి ఐదు శాతం కూడా కాదు. నమాజ్‌కు ముందు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునే చోటు (వజూఖానా) శివలింగం ఉంది. మసీదులో ఉన్నట్టు చెబుతున్న హిందూ దేవుళ్ల ప్రతిమల పట్ల హిందువులు సహజంగానే ఆసక్తిని పెంచుకున్నారు. అసలు ఈ వివాదం ఎప్పటిది?
1236లో విశ్వనాథ మందిరాన్ని అవిముక్తేశ్వరాలయం పేరుతో పునర్ నిర్మించారు. బానిసరాజుల కాలంలోనే దీని మీద దాడులు జరిగాయి.
1669లో ఔరంగజేబు ఆజ్ఞతో ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు.
1937: 1937లో అలహాబాద్ హైకోర్టు ఈ వివాదానికి సంబంధించి ఒక డిక్రీ ఇచ్చింది. ఇది దీన్ మహమ్మద్ వర్సెస్ రాష్ట్ర కార్యదర్శి కేసుగా ప్రసిద్ధి గాంచింది. దీని ప్రకారం జ్ఞాన్‌వాపిని వక్ఫ్ బోర్డు ఆస్తిగాను, మసీదు కింది భాగం వ్యాస్ కుటుంబీకులకు చెందినదిగాను ఆ డిక్రీ ప్రకటించింది.
1991: అయోధ్య వివాదం తారస్థాయికి చేరిన దశలో పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రార్థనాస్థలాల (స్పెషల్ ప్రావిజన్స్) చట్టాన్ని తీసుకువచ్చింది. అయోధ్యలోని రామజన్మ భూమి తప్ప దేశంలోని మిగిలిన అన్ని ప్రార్థనా స్థలాల విషయంలో ఆగస్ట్ 15,1947 నాటి స్థితిని యథాతథంగా కొనసాగించాలి. ఈ చట్టాన్ని చూపుతూ శృంగార గౌరీ మాత పూజకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని ముస్లింలు వారణాసి కోర్టుకు వెళ్లారు. అసదుద్దీన్ ఒవైసీ ఈ ఒక్క చట్టాన్ని అడ్డం పెట్టుకునే మొత్తం వ్యవహారం నడుపుదామని అనుకుంటున్నారు. అసలు ఈ చట్టాన్ని తొలగిస్తే సమస్య తీరుతుందని పలువురి వాదన.
అక్టోబర్ 15, 1991: జ్ఞాన్‌వాపిలో కొత్త ఆలయాన్ని నిర్మించుకుని, అక్కడ పూజాదికాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పండిత్ సోమ్‌నాథ్ వ్యాస్, డాక్టర్ రామ్‌రంగ్ శర్మ వారణాసి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును జిల్లా జడ్జీ ఆగస్ట్ 13, 1998కి వాయిదా వేశారు. అయితే వారణాసి కోర్టు ఆదేశాల మీద అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది.
మార్చి 2000: సోమ్‌నాథ్ వ్యాస్ మరణించారు. దీనితో ఆ కేసును నిర్వహించే బాధ్యతను 2018లో న్యాయస్థానం న్యాయవాది విజయ్‌శంకర్ రస్తోగికి అప్పగించింది. తరువాత రస్తోగి జ్ఞాన్‌వాపిలో సర్వే నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కేసును కోర్టు స్వీకరించడంతోనే జ్ఞానవాపి మసీదు నిర్వాహకులు సర్వేకు వ్యతిరేకంగా కేసు వేశారు.
ఆగస్ట్ 18, 2021: జ్ఞానవాపి గోడకు ఉన్న శృంగార గౌరీమాతనే కాకుండా అక్కడ మిగిలి ఉన్న హిందూ దేవతా ప్రతిమలకు పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీని ప్రాతిపదికగా మసీదులో సర్వే జరిపించాలని ఏప్రిల్ 26, 2022న కోర్టు ఆదేశించింది. మొదట ముస్లింలు ఇందుకు అంగీకరించక పోయినా తరువాత వెనక్కి తగ్గారు. ఎట్టకేలకు మే 14-16 తేదీలలో సర్వే పూర్తయింది.
మే 16: శివలింగం ఆకృతి బయటపడిందని ఆరోజు వెల్లడైంది. కానీ ఇది వజూఖానాలో ఏర్పాటు చేసిన ఫౌంటేన్ అని ముస్లింలు వాదించారు. దీనితో శివలింగం ఉన్న ప్రాంతానికి సీలు వేయవలసిందిగా వారణాసి కోర్టు ఆదేశించింది. మే 17న సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను చేపట్టింది.మసీదులో దొరికిన శివలింగం ప్రస్తుతం ముస్లింల అధీనంలోనే ఉందని, ఆకృతిని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హిందువుల తరఫు న్యాయవాది విష్ణు జైన్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అది శివలింగం కాదని, అది ఫౌంటేన్ అని చెప్పడానికి 60 సెంటీమీటర్ల రంధ్రం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణ ఉంది.
జనవరి 25, 2024: హిందూ ఆలయాన్ని కూల్చి దానిపైనే మసీదు నిర్మించారని బారత పురావస్తు శాఖ నివేదికలో తేలింది.
– జాగృతి డెస్క్