ఫిబ్రవరి 14 వసంత పంచమి

అఖిలవిద్యా ప్రదాయినిగా,జ్ఞానవల్లి సముల్లాసినిగా మాఘ శుద్ధ పంచమి నాడు సరస్వతీమాత అభివ్యక్తమైందని, మన కంటికి కనిపించే సుందరమైన జగత్తంతా ఆమె స్వరూపమేనని బ్రహ్మాండ పురాణం, ఆ దేవి మూర్తీభవించిన జ్ఞానాకృతి అని పద్మపురాణం పేర్కొంటున్నాయి. జ్ఞానాయుతమైన విద్యల సమాహారమే ‘సరస్వతి’ అని వేదం ప్రతిపాదించింది. త్రిమూర్తులు జ్ఞాన సంబంధిత కళలు, అంశాల్ని, దివ్యత్వాన్ని వసంతపంచమి నాడే సరస్వతి అమ్మవారికి సంక్రమింప చేశారని పద్మపురాణం పేర్కొంటోంది. శ్రీహరి భృగుమహర్షికి ఈ తిథినాడే సరస్వతీదేవి మూల మంత్రాన్ని ఉపదేశించారని చెబుతారు. వసంత పంచమిని ‘శ్రీ పంచమి’ అనీ వ్యవహరిస్తారు.

 ఈ జగత్తు ఒక దశలో నిస్తేజంగా, నిశ్శబ్దంగా మారడంతో ఆందోళన చెందిన దేవతలు విధాతను ఆశ్రయించగా, ఆయన తన దివ్య కమండలంలోని మంత్రపూరిత జలాన్ని భూమిపై చిలకరించాడట. దాంతో రెండు చేతులతో వీణ వాయిస్తూ, మరో రెండు చేతులలో జపమాల, పుస్తకాన్ని ధరించిన బ్రాహ్మీశక్తి ఉద్భవించిందని చెబుతారు. పుస్తకం సకల కళలు, విద్యలకు ప్రతీక కాగా, జపమాల పవిత్రకు చిహ్నం. ఆమె హృదయస్థానంలో వేదాలు, బుద్ధి స్థానంలో ధర్మశాస్త్రాలు, శ్వాసలో పురాణాలు, తిలకంలో కావ్యాలు, జిహ్వలో వాఙ్మయం, నేత్రాలలో ఆధ్యాత్మికత, లౌకిక విద్యలు, ఉదరంలో సంగీత నాట్య కళలు వికసిస్తాయని రుషులు శ్లాఘించారు. సరస్వతీమాత పరమ సాత్వికమూర్తి. అందుకే ఆమెను అహింసకు అధినాయకికగా బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది.

ధవళ వస్త్రధారిణియై, పద్మంపై ఆశీనురాలై, చిరునగవు మోముతో కాంతులీనుతూ జ్ఞానాన్ని అనుగ్రహిస్తుందంటారు. ఆమె శ్వేత వస్త్రం స్వచ్ఛతకు, వాహనం శ్వేత హంసను ఆత్మలన్నిటికి మూలమైన పరమాత్మకు సంకేతంగా చెబుతారు.

ప్రవాహరూపంలో ఉండే జ్ఞానానికి ప్రతీక సరస్వతీమాత. ఆమెను వాగ్దేవిగా అర్చిస్తారు. వాక్కు, ధారణ, మేధ, ప్రజ్ఞ, బుద్ధి , స్మరణ తదితర లక్షణాలు ఆమె శక్తులని చండీ సప్తశతి చెబుతోంది. విద్యవల్ల జ్ఞానం, దాని ద్వారా భుక్తి, ముక్తి సిద్ధిస్తాయి. ‘కేవలం చదవడం, రాయడమనే అక్షరజ్ఞానమే విద్యకాదు. మనిషిలోని వివేకం,కళలు, బుద్ధి(విచక్షణ) నైపుణ్యం, సృజన, విషయాల పట్ల అవగాహన, సమయస్ఫూర్తి వంటివీ చదువు కిందికే వస్తాయి’అని పెద్దలు అంటారు. ఈ సకల మేధో సంపదలకు ఆమెను అధిష్ఠానదేవతగా కొలుస్తారు.

సృష్టి నిర్మాణ నిర్వహణా శక్తులన్నిటిలో సర్వోత్కృష్ట మూలకారకశక్తి మహాసరస్వతి అని జగద్గురు శంకర భగవత్పాదులు ‘సౌందర్యలహరి’లో శ్లాఘించారు. తాము నెలకొల్పిన నాలుగు ఆమ్నాయపీఠాలలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం మొట్టమొదటిది. శంకరులు తాము నెలకొల్పిన పీఠాల ఉత్తరాధిపతులకు అనుగ్రహించిన పేర్లలో వాణి సంబంధితాలైన, ‘సరస్వతి,ఇంద్ర సరస్వతి, శారద, భారతి…’లాంటివి ఉండడాన్ని బట్టి వారికి ఆమె కటాక్షం పట్ట ఎంతప్రీతి పాత్రతో అవగత మవుతుంది.

సరస్వతి వాగ్దేవత. వాక్కు అంటే బ్రహ్మ. వాక్కు గొప్ప సంపద. దానిని సద్వినియోగపరచుకున్నవారు ధన్యాత్ములు. భావితరాలకు ఆదర్శమూర్తులు. అలాంటివారిలో వర్తమాన సమాజంలోని రామభద్రాచార్య స్వామీజీ పరమోదాహరణ. అయోధ్యలో దివ్యభవ్య రామమందిరం నిర్మాణం, బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సాకారం కావడానికి ముందు న్యాయస్థానంలో జరిగిన వాదోపవాదాల్లో ఆయన వాక్కు పరమ ప్రామాణికంగా నిలిచింది.

‘శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడనడానికి రుజువులు కానీ, ప్రామాణికం గ్రంథం కాని ఉన్నదా?’ అని ఆ అశంపై వాదప్రతివాదనల వేళ న్యాయమూర్తి వేసిన ప్రశ్నకు, ‘ఆధారం ఉంది రుగ్వేదంలో’ అని ఒక స్వరం పలికింది. అందుకు సంబంధించిన పుటలు సహా వివరాలను ఏకరవు పెట్టింది ఆ గళం. న్యాయమూర్తితో పాటు రామజన్మభూమి ట్రస్ట్ ‌తరపున వాదిస్తున్న ప్రఖ్యాత న్యాయవాది పరాశరన్‌ ఆ ‌గొంతును ఆలకించారు. ఆచార్యజీ వివరణతో, న్యాయమూర్తి రుగ్వేద ప్రతిని తెప్పించి ఆయన చెప్పిన వివరాలతో సరిపోల్చారు. అంధుడైన రామభద్రాచార్య స్వామీజీ, తన తండ్రి వల్లెవేస్తున్న వేదాలను బాల్యం నుంచి కంఠస్థం చేసిన పుణ్యం ఇప్పుడు ఉపక రించినట్లయింది. వాగ్దేవి ఆ రామభద్రుడి ఉనికిని ఈ రామభద్రుడి నోట ఇలా పలికించిదని, అదే వాక్కు గొప్పదనంగా భావించాలి.

చైత్రంలో వచ్చే వసంతశోభ మాఘం నుంచి మొదలవుతుందనే ఉద్దేశంతో ఈ రోజును ‘వసంత పంచమి’గా పిలుస్తారని శాస్త్రకారులు చెబుతారు. త్రినేత్రుడి కోపాగ్నికి భస్మమైన మన్మథుడు, రతీదేవి ప్రార్థనతో ఆమెకు మాత్రమే కనిపించేలా పున్జ•న్మ పొందిన రోజు ఇదే కావడంతో దీనిని ‘మదన పంచమి’ అంటారు.

శరన్నవరాత్రుల సందర్భంగా మూలానక్షత్రం నాడే కాకుండా శ్రీపంచమి నాడూ చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తారు. విద్యా సామగ్రిని అమ్మవారి సమక్షంలో ఉంచి ప్రత్యేకంగా అర్చిస్తారు. అమ్మవారికి పాయసం, చెరకు రసం, ఆవుపాలు, అరటిపళ్లు, చక్కెర, పటిక బెల్లం లాంటి సాత్విక పదార్థాలు నివేదించాలని పెద్దలు చెబుతారు.

సరస్వతి ఆరాధన సనాతన వైదిక ధర్మంలోనే కాకుండా బౌద్ధ జైనాలలోనూ కనిపిస్తోంది. బౌద్ధులు ‘మంజు పంచమి, మంజుశ్రీ’గా, జైనులు ‘శ్రుతవదన’గా వ్యవహరిస్తూ అర్చిస్తారు. రోమన్లు, గ్రీకులు శ్రీవాణిని ‘జ్ఞానదేవత’గా ఆరాధిస్తారు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE