జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చూసిన వారికి ఒక అరుదైన దృశ్యం కనిపించింది. పూర్తి కాషాయ వస్త్రధారణతో ఉన్న వందలాది మంది హిందూ సాధుసంతుల మధ్య ఒక వ్యక్తి కనిపించారు. తెల్లని గెడ్డం, తెల్లని దుస్తులతో ఉన్నారు. ఆయన ముస్లిం. పేరు ఉమర్ అహ్మద్ ఇల్యాసీ. ఆయన కూడా కార్యక్రమానికి వచ్చారు. ఆయన అఖిల భారత ఇమామ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు. అయోధ్య ప్రాణప్రతిష్ఠకు హాజరైనందుకు కొందరు ముస్లింలు ఇప్పుడు ఆయన మీద ఫత్వా జారీ చేశారు. జనవరి 22 సాయంత్రనికల్లా ఆయనకు ఫత్వా అందింది. దీనికి ఇల్యాసీ స్పందన అద్భుతం. సరైన సమాధానం కూడా. నన్ను ఎవరు ప్రేమిస్తారో వారు దేశాన్ని కూడా ప్రేమిస్తారు. దేశాన్ని ప్రేమించేవారు నాకు మద్దతుగా ఉంటారు. నేను ప్రాణప్రతిష్ఠకు హాజరైనందుకు నన్ను ఎవరు ద్వేషిస్తున్నారో వారు బహుశా పాకిస్తాన్ వెళ్లిపోతారు. ప్రాణప్రతిష్ఠకు ఆయనకు ఆహ్వానం అందినా రెండు రోజులు ఆలోచించి అప్పుడు కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారాయన.
ఇది తాను జీవితంలో తీసుకున్న చాలా కీలక నిర్ణయమని కూడా చెప్పారు. ఎందుకంటే, దేశంలో సామరస్యమే నాకు ముఖ్యం అన్నారాయన. తాను క్షమాపణలు చెప్పబోనని, అలాగే తన పదవికి రాజీనామా కూడా చేయనని ఆయన ప్రకటించారు. తాను అసలు ఏ నేరం చేయలేదని కూడా అన్నారు. తాను కేవలం ఒక ప్రేమసందేశం మాత్రమే ఇచ్చానని ఆయన వ్యాఖ్యానించారు. జనవరి 22 నుంచి 29వ తేదీ వరకు 19 లక్షల మంది బాలరాముడిని దర్శించుకున్నారు.
-జాగృతి డెస్క్