సినిమాల్లో చూసే కొన్ని భయానక దృశ్యాలు నిజంగా జరుగుతాయా? మాఫియా ముఠా ఊరి మీద పడి అత్యాచారాలు, అరాచకాలు చేయడం.. పోలీసులు చేష్టలుడిగి చూడటం సాధ్యమేనా?  ప్రభుత్వ వారి మానాన వారిని అలాగే దిలేసి చూస్తూ ఉంటుందా? అయితే పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటివి సర్వ సాధారణం. దీనికి సందేశ్‌ఖాలీ చిన్న ఉదాహరణ. ముఖ్యమంత్రి ఒక మహిళ అయినా ఇంతటి ఘోరకలి జరగడమే విషాదం.

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా, బసీర్‌హత్‌ ‌సబ్‌ ‌డివిజన్‌ ‌లోని ద్వీపగ్రామం సందేశ్‌ఖాలీ. బంగ్లాదేశ్‌ ‌సరిహద్దులో సుందర్‌బన్‌ అడవుల దగ్గర కాళిందీ నది మధ్యలో ఉంటుందీ ఊరు. గిరిజనులు, ఎస్సీలు, మత్స్యకారులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతం బంగ్లాదేశీ చొరబాటుదారుల కారణంగా జనాభా సమతౌల్యం దెబ్బతిన్నది. గతంలో 80 శాతం వరకూ ఉన్నవారు ప్రస్తుతం 8 శాతానికి చేరారు. ఇప్పుడు ఆ మారుమూల ప్రాంతం జాతీయ స్థాయిలో వార్తల్లోకి వచ్చింది. మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు గ్రామంలో వెలుగు చూడటం అక్కడి అధికార పార్టీ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి పెట్టింది. బాధిత మహిళలు వినిపించిన ఘోషతో సామాజిక మాధ్య మాలు సంచలనం సృష్టించాయి. తనదైన మొరటు శైలిలో ఈ సమస్యను పక్కతోవ పట్టించాలని చూసిన మమత వైఖరిని దేశం చీదరించుకుంది. దాదాపు పదిరోజుల తీవ్ర ఉద్రిక్తత, ఆందోళనల నడుమ ఎట్టకేలకు పోలీసులు కొందరిని అరెస్టు చేయక తప్పలేదు. అక్కడ ఎవరి మీదా అత్యాచారాలు జరగలేదని సాక్షాత్తు శాసనసభలో బొంకిన మమత విస్తుపోయేటట్టు కొన్ని నేరాలను అరెస్టయిన షాజహాన్‌ అనుచరులు అంగీకరించారు.

సందేశఖాలీ ప్రాంత తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత, జిల్లా పరిషత్‌ ‌సభ్యుడు షేక్‌ ‌షాజహాన్‌ ‌తనకు నచ్చిన వారిని పార్టీ ఆఫీసుకు తీసుకెళ్తారని, రాత్రంతా అక్కడే ఉంచి, ఉదయం పంపిస్తారంటూ ఓ మహిళ విలపిస్తూ చెప్పే దృశ్యాలు ప్రకంపనలు సృష్టించాయి. షాజహాన్‌ అతని అనుచరులు అత్యాచారాలు, లైంగిక దాడులే కాకుండా తమ భూములను సైతం లాగేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు

‘వారు (షాజహాన్‌ ‌సహాయకులు) సమావేశాలకు, ర్యాలీలకు పిలుస్తారు. పగలు లేదా రాత్రి. ఎప్పుడు పిలిచినా వెళ్లాలి. వారు చెప్పినవి చేయకుటే బెదిరించే వారు’ అని ఒక బాధిత మహిళ చెప్పారు. వెళ్లినవారు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు. తమ భర్తలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని మరికొందరు మహిళలు తెలిపారు. ‘మేము పార్టీ ఆఫీసుకు వెళ్లడానికి నిరాకరిస్తే మా భర్తలను ఎత్తుకెళ్లి కర్రలతో కొడతారు. కాబట్టి మేము బలవంతంగా వెళ్లాల్సి వస్తుంది’ మరో మహిళ చెప్పారు. బాధిత మహిళలు చెబుతున్న వారిలో షాజహాన్‌తో పాటు అతని సహాయకులు శంకర్‌ ఆద్య, శిబు హజ్రా, ఉత్తమ్‌ ‌సర్దార్‌ ‌పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో శంకర్‌, ‌సర్దార్‌లను హజ్రాలను అరెస్టు చేశారని తృణమూల్‌ ‌నాయకులు, పోలీసులు ధృవీకరిస్తు న్నారు. ఈ అరెస్టులు జరిగిన మరురోజే, ఫిర్యాదు చేసిన మహిళలపై దాడులు మొదలయ్యాయి. పోలీసు యూనిఫాంలో వచ్చిన వ్యక్తులు మద్యం మత్తులో వారిపై దాడి చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.

నిరసనల్లో పాల్గొన్న ఒక మహిళ మీడియాతో మాట్లాడుతూ,‘మీరే విచారించండి. వారు చెప్పేది నిజమా? కాదా? అనేది తెలుస్తుంది.మేము భయంతో జీవిస్తున్నాం. అందుకే మా ఇళ్ల నుండి బయటకు రావడం లేదు’ అని చేతులు జోడించారు. ఫిర్యాదు చేసినా పోలీసు యంత్రాంగం కూడా టీఎంసీ వారికే అనుకూలంగా వ్యవహరించినట్లు బాధితులు వాపోతున్నారు. స్థానిక పోలీసులు బాధితులను బెదిరించి విషయాలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. అధికార పార్టీ ఒత్తిడి కారణంగా నేరగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా బాధి తుల నోరు మూయించేందుకు సొంత వాళ్లను కూడా కేసుల్లో ఇరికిస్తున్నారని వారు ఆరోపించారు.

సందేశ్‌ఖాలీ భయానక చరిత్ర

‘జ్యోతిబసు- బుద్ధదేవ్‌ల కాలంలో సీపీఎం గుండాలు సాగించిన ఆగడాల కన్నా ఎక్కువే మేం మమతా బెనర్జీ తృణమూల్‌ ‌సర్కారులో చవిచూస్తున్నాం..’ సందేశ్‌ఖాలీ ప్రజల గోడు ఇది. ఇక్కడ బంగ్లా చొరబాటుదారులు స్థానికులను తరిమేసి,భూములను ఆక్రమించడం మొదలుపెట్టారు. గతంలో వామపక్ష ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతో నేరగాళ్లకు అండగా నిలిచింది. సీపీఎంకు చెందిన ఈసా లహకర్‌, ‌ముజీద్‌ ‌మాస్టర్‌ల గుండాగిరి చాలా బీభత్సంగా ఉండేది. ఇప్పుడు తృణమూల్‌ ‌వారు చేస్తున్నదీ అదే. పార్టీ మీటింగుల పేరుతో మహిళలను రప్పించి అత్యాచారాలు చేశారు. హత్యలు సరేసరి. ఓ కుటుంబంలోని 15మందిని ఈసా లహకర్‌ ‌సజీవ దహనం చేశాడు. ఇతడి అత్యాచారాలు, అరాచకాలు భరించలేక ప్రజలే తిరగబడి హత్య చేశారు.

వామపక్ష సర్కారు గుండాగిరితో విసిగిపోయిన సందేశ్‌ఖాలీ ప్రజలు మమతా బెనర్జీని ఆదరించారు. ఆమె కమ్యూనిస్టు గుండాలను చేరదీసింది. జెండా మారినా అరాచకాలు తగ్గలేదు. చొరబాటుదారుల సంతతికి చెందిన షాజహాన్‌ ‌తృణమూల్‌ ‌నాయకునిగా పట్టు సంపాదించాడు. 2019 ఎన్నికల్లో బీజేపీకి పని చేసిన ఐదుగురుని దారుణంగా హత్య చేయించిన చరిత్ర ఇతడిది.

రేషన్‌ ‌బియ్యం అవినీతిలో వేర్లు

కొద్ది నెలలుగా పశ్చిమ బెంగాల్‌కు కుదిపేస్తున్న రేషన్‌ ‌బియ్యం అవినీతి వ్యవహారం మూలాలు సందేశ్‌ఖాలీ వరకూ పాకాయి. కేంద్ర ప్రభుత్వం చౌక ధర బియ్యం కోసం ఇచ్చే నిధులను త•ృణమూల్‌ ‌సర్కారు బొక్కేయడం మొదలు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌బియ్యం అందడం లేదని ప్రశ్నించే ప్రజలపై టీఎంసీ కార్యకర్తలు దౌర్జాన్యాలు చేసేవారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డిపార్ట్‌మెంట్‌ (ఈడీ) దృష్టి సారించింది.

పశ్చిమబెంగాల్‌ ‌మొత్తానికి బకిబుర్‌ ‌రహమాన్‌ అనే వ్యక్తి బియ్యం సరఫరా చేసేవాడు. గత ఏడాది (2023) అక్టోబర్‌లో ఇతన్ని ఈడీ అరెస్టు చేయగా ఈ వ్యవహారం మొత్తంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి జ్యోతిప్రియ మాలిక్‌కు సంబంధం ఉన్నట్లు బయటపడింది. తీగ లాగితే డొంక కదిలినట్లు మంత్రికి సన్నిహితుడు షాజహాన్‌ ‌పేరు కూడా బయటకు వచ్చింది. రేషన్‌ అ‌క్రమాలలో షాజహాన్‌ ఏకంగా రూ. 9 వేల కోట్ల• ఆర్జించాడని గుర్తించారు.

ఈడీ అధికారులపై దాడి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గత నెల జనవరి 5న ఏక కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 15చోట్ల దాడులు జరిపారు. అప్పుడే సందేశ్‌ఖాలీ లోని షాజహాన్‌ ఇం‌టికి కూడా వచ్చారు. విషయం తెలుసుకున్న అతని అనుచరులు దాదాపు వేయి మంది లాఠీలు, కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో అధికారులు ఆటోలు, బైకులు ఇలా ఏది దొరికితే ఆ వాహనం ఎక్కి ప్రాణాలు అరచేత పట్టుకుని వెళ్లిపోయారు. తీవ్రగాయాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అధికారుల మొబైల్‌ ‌ఫోన్లు, ల్యాప్‌ ‌టాప్‌లు, వారి పర్సులను సైతం అల్లరిమూక ఎత్తుకు పోయినట్టు ఈడీ వెల్లడించింది. ఆ తరువాతే షాజహాన్‌ అరెస్టు భయంతో పరారయ్యాడు.

తిరగబడ్డ మహిళలు

అసలు కథ ఇక్కడ మొదలైంది. తమ సమాచారం ఈడీ అధికారులకు ఎవరు ఇచ్చారో తేల్చుకునేందుకు శంకర్‌ ఆద్యతో పాటు షాజహాన్‌ అనుచరులు అక్కడి ప్రజలపై అమానుషమైన దాడులు మొదలుపెట్టారు. దీంతో గుండాలపై చీపుర్లు, కర్రలతో జనం తిరగబడ్డారు. ఫిబ్రవరి 8న ఈ తిరుగుబాటు మొదలైంది. 9న మహిళలు, గ్రామస్థులు షాజహాన్‌ ‌సన్నిహితుడికి చెందిన కోళ్ల ఫారమ్‌కు నిప్పుపెట్టారు. షాజహాన్‌ను అరెస్టు చేయాలని మహిళలు ఆయన ఇంటి ముందు ఆందోళనలక• దిగారు.

బీజేపీ ఆందోళనలు

బాధిత మహిళలకు మద్దతుగా బెంగాల్‌ ‌బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. సందేశ్‌ఖాలీలో రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ ‌నేతృత్వంలో బీజేపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో మజుందార్‌కు గాయాలయ్యాయి. సందేశ్‌ఖాలీ సహా చుట్టుపక్కల గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్‌ 144‌ను అమలు చేసింది. బాధిత మహిళలను కలిసేందుకు సందేశ్‌ఖాలీ వెళుతున్న సుకాంత మజుందార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. విలేకరులతో మాట్లాడేందుకు కారుపైకి ఎక్కిన సుకాంతను పోలీసులు చుట్టముట్టిన క్రమంలో ఆయన కిందపడి గాయాలు కావడంతో, వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.మరోవైపు బీజేపీ మహిళా మోర్చా సందేశ్‌ఖాలీ ఘటనలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. మమత సర్కారు ను డిస్మిస్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. హైదరాబాద్‌ ‌ట్యాంక్‌బండ్‌ అం‌బేద్కర్‌ ‌విగ్రహం దగ్గర తెలంగాణ బీజేపీ మహిళామోర్చా నిరసన తెలిపింది

గవర్నర్‌ ‌బోస్‌ ‌పరామర్శ

ఫిబ్రవరి 12న ఆందోళనలు జరుగుతున్న సందేశ్‌ఖాలీ ప్రాంతాన్ని రాష్ట్ర గవర్నర్‌ ‌సి.వి.ఆనంద బోస్‌ ‌సందర్శించారు. బాధిత మహిళలతో మాట్లాడారు. ‘రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ‌పుట్టిన నేలపై ఇలాంటి ఘటనలను ఊహించలేదు. వేధింపులకు పాల్పడింది ఎవరో బాధిత మహిళలకు తెలుసు. చాలా దారుణమైన అంశాల గురించి నేను విన్నాను. అవి నాగరిక సమాజానికి సిగ్గుచేటు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో పోరాడతా. నేరగాళ్లకు శిక్ష పడేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తా’ అని గవర్నర్‌ ‌ప్రకటించారు. సందేశ్‌ఖాలీ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి మమత దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ వివరణ కోరుతానని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు ఆయన చేతికి రాఖీలు కట్టారు. బాధితులను కలిసే ముందు సీనియర్‌ ‌పోలీసు అధికారులతో సమావేశమై గవర్నర్‌ ‌పరిస్థితిని సమీక్షించారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో చట్టాన్ని అమలు పరిచేవారు గూండాలతో చేతులు కలిపారని కేంద్ర హోంశాఖకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. సందేశ్‌ఖాలీ ఘటనలపై ఫిబ్రవరి 15న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ అట్టుడికింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించాలంటూ బీజేపీ నిరసన చేపట్టింది. దీంతో సభలో గందరగోళం తలెత్తింది. అధికార పక్షం ఈ అంశంపై చర్చకు అనుమతించ లేదు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి డిమాండ్‌ ‌చేశారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సభలో ఆందోళనకు దిగిన సువేందు అధికారి సహా ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్‌ ‌చేస్తున్నట్లు స్పీకర్‌ ‌ప్రకటించారు. అనంతర బీజేపీ ఎమ్మెల్యేలు సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఎదురుదాడే మమత సమాధానం

మమతా బెనర్జీ తాను ఒక మహిళను అనే విషయాన్ని మరచిపోయినట్లున్నారు. తన పాలనలో సాటి మహిళలకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయడం వదిలేసి రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం శోచనీయం. సందేశ్‌ఖాలీలో ప్రతిపక్షం ఆందోళన లను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద తన అక్కసును వెళ్లగక్కారు. ‘సందేశ్‌ఖాలీలో అరెస్సెస్‌కు మూలాలున్నాయి. 7, 8 సంవత్సరాల క్రితం అక్కడ అల్లర్లు చెలరేగాయి. రాష్ట్ర మహిళా కమిషన్‌ను పంపాం. శాంతిని నెలకొల్పేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 17మంది నిందితు లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక పోలీసు బృందం ఇంటింటికీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తున్నది. వాటిని పరిశీలిస్తాం’ అని ప్రకటించారు. మరోవైపు బీజేపీని ఎదుర్కొనేందుకు వీధుల్లోకి రావాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడు అభిషేక్‌ ‌బెనర్జీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రాష్ట్రపతి పాలనకు సిఫార్సు

సందేశ్‌ఖాలి దురాగతాలు వెలుగులోకి రావడంతో జాతీ షెడ్యూల్డ్ ‌కులాల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీఎస్‌సీ), జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఆ ప్రాంతాన్ని సందర్శించాయి. బాధిత మహిళలు, ఆందోళనాకారులతో మాట్లాడాయి. జాతీయ మహిళా కమిషన్‌ ‌కలవరపరిచే సాక్ష్యాలను సేకరించింది. పోలీసులు, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌మద్దతుదారులు కలిసి శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని బాధితులు తమ వద్ద వాపోయినట్లు ఎన్‌సీడబ్ల్యూ ఓ ప్రకటనలో తెలిపింది. బాధిత మహిళల ఫిర్యాదులను నమోదు చేయకుండా, వారి బంధువులపైనే పోలీసులు కేసులు పెట్టారని జాతీయ మహిళా కమిషన్‌ ‌గుర్తించింది.ఆ సమయంలో స్థానిక పోలీసు అధికారులు ప్రదర్శించిన వైఖరిపై ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా ఖోంగ్‌డుప్‌ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌సహకరించడానికి నిరాకరించారని, ఎస్కార్ట్ ‌లేదా సహాయం అందించడంలో పోలీసు సూపరింటెండెంట్‌ ‌విఫలమయ్యారని ఆరోపించింది.

సందేశ్‌ఖాలీ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి వెళ్లిన జాతీయ షెడ్యూల్డ్ ‌కులాల కమిషన్‌ (ఎన్‌సీఎస్‌సీ) ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదికను అందచేసింది. షెడ్యూల్డ్ ‌కులాల హక్కులను కాపాడేందుకు ఆర్టికల్‌ 338 ‌ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నివేదిక సిఫారసు చేసింది. అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయిని ఎన్‌సిఎస్‌సి ఛైర్మన్‌ అరుణ్‌ ‌హల్దర్‌ ‌మీడియాకు తెలిపారు.

 సందేశ్‌ఖాలీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ ఘటనపై దర్యాప్తు చేసేందుకు కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ప్రతిమా భౌమిక్‌, ‌సునీతా దుగ్గల్‌, ‌కవితా పటీదార్‌, ‌సంగీత యాదవ్‌, ‌బ్రిజ్‌లాల్‌ ‌సభ్యులుగా గల బృందాన్ని రాంపూర్‌ ‌గ్రామం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. తాము నలుగురం మాత్రమే అక్కడికి వెళ్లి వస్తామని చెప్పినా పోలీసులు అంగీకరించలేదని అన్నపూర్ణాదేవి తెలిపారు. ఆ రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపులు, హింస హృదయవిదారకంగా ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆందోళన వ్యక్తంచేశారు.

పోలీసుల విచిత్ర వాదన

సందేశ్‌ఖాలీ ప్రాంతంలో విచారణలు జరిపించామని, లైంగిక వేధింపులు జరిగినట్లు ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయలేదని రాష్ట్ర పోలీసులు వాదిస్తున్నారు. ‘రాష్ట్ర మహిళా కమిషన్‌, ‌పదిమంది నిజనిర్ధారణ బృందం, జిల్లా పోలీసు యంత్రాంగం నిర్వహించిన విచారణలో మహిళలను టీఎంసీ నాయకులు లైంగికంగా వేధించినట్లు ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు’ అని రాష్ట్ర పోలీసులు ట్విటర్‌లో పోస్ట్ ‌చేశారు. జాతీయ మహిళా కమిషన్‌ ‌పర్యటన తర్వాత సందేశ్‌ఖాలీకి చెందిన వ్యక్తుల నుండి తమకు నాలుగు ఫిర్యాదులు మాత్రమే అందాయని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదులలో ఏదీ అత్యాచారం లేదా లైంగిక వేధింపుల సంఘటనలను ప్రస్తావించలేదని చెప్పారు.

 సుప్రీంకోర్టులో పిల్‌

‌సందేశ్‌ఖాలీ వ్యవహారంపై న్యాయవాది అలోక్‌ ‌శ్రీవాస్తవ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సిట్‌ ‌లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని, బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించి, బాధ్యులైన పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఈ వ్యాజ్యం విచారణ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్‌ ‌డి.వై.చంద్రచూడ్‌ ‌పేర్కొన్నారు. సందేశ్‌ఖాలీ వ్యవహారాన్ని కలకత్తా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. సందేశ్‌ఖాలీలో 144 సెక్షన్‌ ‌కింద నిషేధాజ్ఞల ఉత్తర్వులను పక్కన పెట్టింది. ‘జాతీయ షెడ్యూల్డ్ ‌కులాల కమిషన్‌’ ‌సైతం ఈ ఘటనలను సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే టీఎంసీ స్థానిక నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ఎం‌పీ, నటి మిమి చక్రవర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోపక్క ఇలాంటి తరుణంలో టీఎంసీ ఎంపీ, నటి నుస్రత్‌ ‌జహాన్‌ ‌భర్త యశ్‌దాస్‌ ‌గుప్తాతో కలిసి ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫొటోలు దిగి సోషల్‌ ‌మీడియాలో పోస్ట్ ‌చేవారు. దీన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది.

-మిత్ర

 సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE