వైసీపీ ప్రభుత్వం విధానాలు నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అటు ప్రతిపక్ష నేతగా, ఇటు సీఎంగా 2.30 లక్షల ఉద్యోగాలను జాబ్‌  ‌క్యాలెండర్‌ ‌ద్వారా భర్తీచేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే దీనికి కారణం. ప్రభుత్వోద్యోగాల కోసం వేలకు వేలు ఖర్చుచేసి ఏళ్ల తరబడి కోచింగ్‌ ‌తీసుకుని ఆర్థికంగా కొందరు నష్టపోగా, వయసు పెరిగి కొందరు ఉద్యోగార్హతను కోల్పోయారు. పోనీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలైనా వస్తాయనుకుంటే అవికూడా రాక అభ్యర్థులు నిరుత్సాహానికి లోనయ్యారు. కొత్త పరిశ్రమలు కూడా రాకపోవడంతో ఈ రంగంలోనూ ఉపాధి కరవై కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.  డెలివరీబాయ్‌లుగా, ఆటోలు నడుపుకోవడం తప్ప ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.  ఇక ఎన్నికలు మరో రెండు నెలల్లో రానుండటంతో ప్రభుత్వం మరల నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. గ్రూప్‌ -2, ‌జూనియర్‌ ‌కళాశాలల లెక్చరర్లు, పాలిటెక్నిక్‌ ‌కళాశాలల లెక్చరర్లు వంటి కొన్ని ఉద్యోగాలకు అరకొర పోస్టులు ప్రకటించి వాటికి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన డీ•ఎస్‌సీ-24 పరిస్థితి కూడా ఇంతే. 25 వేల ఖాళీలుండగా కేవలం 6 వేల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు.

కొన్ని వారాలలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఎంపిక పక్రియను ప్రకటించింది. మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేస్తామని, దశల వారీగా టెట్‌, ఆ ‌తదుపరి డీఎస్సీ నిర్వహిస్తామని, ఒకట్రెండు రోజుల్లోనే నోటిఫికేషన్‌ ‌వెలువరిస్తామని తెలిపింది. ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ వార్త గొప్ప ఉత్సాహాన్ని కలిగించాలి. కానీ, అందుకు బదులు భారీ ఆశల మీద నీళ్లు కుమ్మరించి నట్లయింది. అభ్యర్థుల ఆశలకు తగ్గట్టుగా కాక అధికార పార్టీ ఎన్నికల అవసరాలకు తగ్గట్టుగా, తూతూ మంత్రంగా ఈ ప్రకటన ఉండటమే అందుకు కారణం. పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత ఉద్యోగ, నిరుద్యోగ బృందాల మీద ఎంతో ప్రేమ ఒలకపోశారు. రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా, వాటిని భర్తీ చేయకుండా చంద్రబాబు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చీ రాగానే మెగా డీఎస్సీని ప్రకటించి, అటు పాఠశాల విద్యను, ఇటు ఉపాధ్యాయ అభ్యర్థుల జీవితాలను ఉద్ధరిస్తామని హామీలు గుప్పించారు. కానీ, సీఎం అయ్యాక ఆ విషయం పూర్తిగా మర్చిపోయారు. పాఠశాల విద్యలో పెను మార్పులు తెస్తున్నామంటూ హడావిడి చేయటం నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. విలీనం పేరుతో వేలాది పాఠశాలలను మూసేసి, పోస్టులను కుదించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన, పాఠశాలలకు హంగులూ అలంకరణ అంటూ అర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. బోధనకు అవసరమైన పోస్టుల భర్తీని మాత్రం విస్మరించారు. దీంతో, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐదారు లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు మరో ఐదేళ్ల వయసు మీరింది. ప్రభుత్వ ఉద్యోగం పొందగలమన్న ఆత్మవిశ్వాసం వారిలో రోజురోజుకూ సన్నగిల్లు తోంది. ఈ దశలో ప్రభుత్వం ఉన్న ఖాళీలను దాచిపెట్టి, కంటితుడుపు చర్యగా పోస్టుల భర్తీని ప్రకటించటం నిరుద్యోగులను మోసగించటమే!

పలు జిల్లాల్లో ఆందోళన

ఎన్నికలకు రెండు నెలల ముందు అరకొర పోస్టులతో డీఎస్సీ ప్రకటించడంపై నిరుద్యోగులు ఉద్యమిస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను పెంచాలని, అసెంబ్లీ బడ్జెట్లో ఆ దిశగా ఆమోదించా లని డిమాండ్‌ ‌చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోచింగ్‌ ‌సెంటర్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థు లంతా రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినది స్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంత పురం, చిత్తూరు, కడప, ఏలూరు, కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభ మయ్యాయి. పలు జిల్లాల్లో కలెక్టరేట్‌ల ముట్టడికి నిరుద్యోగులు ప్రయత్నించారు. డీఎస్సీ అభ్యర్థుల నిరసనలకు నిరుద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలు సంఘీభావం తెలుపుతున్నాయి. రాష్ట్ర స్థాయి ఉద్యమానికి నిరుద్యోగ సంఘాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. గతంలో మెగా డీఎస్సీ ఇవ్వాలంటూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టాయి. ఇటీవల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం దిగివచ్చి మెగా డీఎస్సీ ఇస్తుందని నిరుద్యోగులు ఆశించగా, అందుకు విరుద్ధంగా మొక్కుబడిగా డీఎస్సీని ప్రకటించింది. నిరుద్యోగులంతా ఆగ్రహంతో ఉన్నారు. 2022 టెట్‌ ‌పరీక్ష 6.50 లక్షల మంది నిరుద్యోగులు రాశారు. ప్రస్తుత డీఎస్సీకి ఆ సంఖ్య ఏడు లక్షలకు చేరే అవకాశముంది. ఐదేళ్ల తర్వాత ప్రకటించిన డీఎస్సీలో కేవలం 6,100 ఉపాధ్యాయ పోస్టులు ఉండటంపై తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 25వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటినీ భర్తీ చేయ కుండా, కేవలం ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు మొక్కుబడిగా డీఎస్సీని ప్రకటించింది. ఈ విధానం ద్వారా జిల్లాల వారీగా డీఎస్సీ పోస్టులు కుదించుకు పోతాయి. అనంతపురం జిల్లాలో నాలుగున్నరేళ్ల నుంచి నాలుగువేల మంది డీఎస్సీ కోసం వేచిచూస్తుంటే, అక్కడ కేవలం నాలుగు ఎస్జీటీ పోస్టులను మాత్రమే ఖాళీలను చూపించారు. అతి తక్కువ పోస్టులను చూపించడంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఉన్న పోస్టులన్నీ పెంచి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

మరల అప్రెంటీస్‌ ‌విధానం

 అప్రంటీస్‌ ‌విధానం ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం పైనా నిరుద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తూర్పారబడుతున్నాయి. రెండేళ్లపాటు అప్రంటీస్‌ ‌విధానంతో ఉపాధ్యాయు లను ఎంపిక చేయడం వల్ల వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. గతంలోని అప్రంటీస్‌ ‌విధానంపై ఉపాధ్యాయ సంఘాల ఆందోళనతో రద్దయింది. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అప్రంటీస్‌ ‌విధానాన్ని తీసుకురావడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇదే విధానం రాబోయే అన్ని ఉద్యోగాలకు వర్తింపజేసే అవకాశముంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను పోటీ పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. ఆ తర్వాత వారికి ఉద్యోగాల క్రమబద్ధీకరించవలసి ఉండగా, రెండేళ్లు పూర్తయిన వారికి ఏపీపీఎస్సీ ద్వారా డిపార్టుమెంటల్‌ ‌పరీక్షలు రాయించేలా నిబంధన విధించారు. అందులో అర్హత పొందిన వారి ఉద్యోగాలనే క్రమబద్దీకరించారు. తాజాగా డీఎస్సీ పోస్టుల భర్తీలో ఈ అప్రంటీస్‌ ‌విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తేవడంతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తక్షణమే అప్రంటీస్‌ ‌విధానానికి స్వస్తి పలికి, ఉపాధ్యాయ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

నిరుద్యోగులకు నయవంచన

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ నోటికొచ్చిన హామీలు ఇచ్చుకుంటూపోయింది. అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌ ‌రద్దు, మద్యనిషేధం వంటి హామీలు అమలుచేయడం తమ వల్ల కాదని చేతులెత్తేసింది. అదే తరహాలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు అప్పట్లో జాబ్‌ ‌క్యాలెండర్‌ అని పెద్దఎత్తున ప్రచారం చేశారు. తాము అధికారంలోకి రావడమే ఆలస్యం ఉద్యోగాలన్నీ భర్తీ అయిపోతాయి అన్న స్థాయిలో హామీల వర్షం కురిపించారు. 2019 నాటికే 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని నమ్మించారు.

కానీ, అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీ ద్వారా పట్టుమని పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. చివరికి అటూ ఇటూగా 5వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు భర్తీచేసి, వలంటీర్లను నియమించి అవే ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకుని చెప్పినట్లుగా చూస్తే 2019 నాటికే 2.3 లక్షల ఖాళీలుంటే, ఈ ఐదేళ్లలో ఆ సంఖ్య ఇంకా భారీగా పెరిగి ఉంటుంది. కానీ, ఇప్పుడు అసలు ఖాళీలే లేవన్నట్టుగా ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం కొండెక్కించింది.

అన్ని అంశాల్లో అంతే…

 2022 నవంబరులో ప్రకటించిన 6 వేల పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీ పక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న యూనివర్సిటీల్లోని ఖాళీల విషయంలోనూ జగన్‌ ‌ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది. నాలుగేళ్లపాటు పట్టించుకోకుండా చివరి ఏడాది భర్తీ చేస్తామని ప్రకటించింది. గతేడాది జూలైలో నోటిఫికేషన్లు ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినా అది అమలు కాలేదు. పోస్టుల రేషనలైజేషన్‌ అం‌టూ ఉన్నత విద్యామండలి ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి, ఏడాది చివర్లో నోటిఫికేషన్లు ఇచ్చింది.

రేషనలైజేషన్‌ను గందరగోళం చేయడంతో అనేకమంది కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. చివరికి ఇది న్యాయస్థానం ఆదేశాలతో ఆగిపోయింది. సీఎం ప్రకటించినట్లుగా జూలైలోనే నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే న్యాయ వివాదాలు కూడా వీగిపోయి ఈ సమయానికి పక్రియ ప్రారంభమయ్యేది. ఉన్నత విద్యామండలి నిర్వాకంతో 3,200 పోస్టుల భర్తీ ఎటూ కాకుండా ఆగిపోయింది. పోనీ రేషనలైజేషన్‌ ‌సక్రమంగా చేసినా న్యాయ వివాదాలు లేకుండా పోస్టుల భర్తీ పక్రియ కొనసాగేది. పోస్టుల భర్తీ చేయడం ఇష్టంలేకే ప్రభుత్వం ఇలా చేసిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఎన్నికలకు ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట అన్న విధంగా నిరుద్యోగులను జగన్‌ ‌ప్రభుత్వం నిండా ముంచింది.

చివర్లో నోటిఫికేషన్లు

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకే ఒక్క గ్రూప్‌-1 ‌నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేసింది. 89 పోస్టులకు ఇటీవల మరో నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఇక, గ్రూప్‌-2 ఉద్యోగాల్లో ప్రభుత్వం నిరుద్యోగులను ఇంకా దారుణంగా మోసం చేసింది. నాలుగున్నరేళ్ల పాటు ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఎన్నికలు దగ్గరికొస్తున్నందున విమర్శలు పెరగడంతో 890 పోస్టుల ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చింది. తాజాగా డిగ్రీ, పాలిటెక్నిక్‌, ‌జూనియర్‌ ‌లెక్చరర్లు, ఇతరత్రా కొన్ని పోస్టుల భర్తీకి నెల ముందు నోటిఫికేషన్లు జారీచేసింది.

ఈ మొత్తం నోటిఫికేషన్లకు దరఖాస్తుల పక్రియ పూర్తయి, పరీక్షలు జరిగే సమయానికి ఎన్నికలు వస్తాయి. ఇక వాటి పక్రియను పూర్తిచేసి ఉద్యోగాలు ఇవ్వడం వచ్చే ప్రభుత్వంలోనే జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు నోటిఫికేషన్లు మాత్రమే మిగిలాయి.

టిఎన్‌. ‌భూషణ్‌

‌వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE