వాకాటి పాండురంగరావు  స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన

– విహారి

‘‌రాత్రి రెండవ జాము జరుగుతోంది. శాస్త్రి ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా- గురువు గారు- జగన్నాథుని గది చీకటిగా ఉంది. వెళ్లాడు. అతని వెనగ్గా వచ్చింది భార్య సుభాషిణి. నడవాలోని దీపం తెచ్చి జగన్నాథుని గదిలో మలిగిన దీపాన్ని వెలిగించింది. జగన్నాథుడు గది పైకప్పుని చూస్తూ పడుకుని ఉన్నాడు. కళ్లు ఎర్రబడి విచ్చుకుని అగ్నిగోళాల్లా ఉన్నాయి. భార్యాభర్తలకు మనసులో చాలా బాధనిపించింది. జగన్నాథుడు మానసికంగా నిస్పృహలో ఉన్నాడు. ఈవేళ పాదుషా సమావేశం ఆయనకి ఒక అశనిపాతం. శాస్త్రికీ, సుభాషిణికీ తెలుసు. ఔరంగజేబు పాదుషా మాటలు గురువు గారి గుండెకు శూలాల్లా గుచ్చుకున్నాయి!

సుభాషిణి పెదవి కదల్చబోయేటంతలో -జగన్నాథుడే-నిశ్చేష్టతతోనే- ‘‘కన్ను మూసినా, తెరచినా-దారావారి శిరస్సే కనిపిస్తున్నది శాస్త్రీ’’ అన్నాడు. కళ్లల్లో నీరు చిప్పిల్లి స్వరం గద్గదికమైంది. ‘ఆ ఖండిత శిరస్సు ఛిద్రమై విచ్చాయ తిరిగిన మోము, తెగీతెగని మెడపై వేలాడుతున్న హారాలూ, పగిలి ఛిద్రుపలైన పగ్రీ రూపు-ఎలా మరపునకు వస్తుంది?

………13. 6-1659న ఢిల్లీలో పట్టాభిషిక్తుడైనాడు ఔరంగజేబు. దారామీది కక్షతో, షాజహాన్‌ ‌పాదుషాపై ప్రతీకారేచ్ఛతో ఔరంగజేబు దారాని ముసలి ఏనుగు మీద నగరవీధులలో ఊరేగించి, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశాడు. ఆ దృశ్యం చూసిన దారా మిత్రులూ, అభిమానులూ తన ముందు రోదనతో ఘూర్ణిల్లారు. ఆ తర్వాత, ఏకంగా దారా తల నరికించి కసికొద్దీ బల్లెంతో దాన్ని ఛిద్రం చేయించి, ప్రజల ముందు ప్రదర్శించి, పాశవిక ఆనందాన్ని పొందాడు. ఈ దారుణాలన్నీ చూసి తన మనసు వికలమైపోయింది.

కవి, పండితుడు, విద్వాంసుడు, సర్వమత సౌభ్రాతృత్వాన్ని అణువణువునా జీర్ణించుకున్న ఉత్తముడైన దారా మరణం తన జవసత్వాల్ని నీరుకార్చింది. నిస్సహాయతతో విలపించాడు. పిచ్చివాడిలా దుఃఖించాడు.

గొంతు పెకల్చుకుని అన్నాడు శాస్త్రి, ‘‘అవును. ఏ మానవ మాత్రుడికీ జరుగ•రాని ఘోరం-మన దారా వారికి జరగటం నిజంగా దుర్భరమూ, దుస్సహమే’’ నిశ్శబ్దంలో క్షణాలు గడిచాయి. ‘‘మీరు వెళ్లి పడుకోండి’’ అని గోడవైపు తిరిగాడు జగన్నాథుడు. భార్యాభర్తలు మొహామొహాలు చూసుకుంటూ బయటికి కదిలారు.

కళ్లు మూసుకున్న జగన్నాథుని మనోయవనికపై ఔరంగజేబు పాదుషా రూపం ప్రత్యక్షమైంది. ఆయన మాటలు చెవుల్లో గింగురు మనసాగాయి.

కవి, పండిత సమావేశానికి రమ్మని ఆజ్ఞ!… వెళ్లాడు. చాలామంది కవులూ, పండితులూ చేరారు. పాదుషా గురువు ముల్లా సలేహ్‌ ‌కూడా ఉన్నాడు. సంక్షిప్తంగా పరిచయాలు అయినై.

ఔరంగజేబు ముల్లా సలేహ్‌పై చాలా అభియోగాల్ని తీవ్రమైన పదజాలంతో చెప్పాడు. ‘‘మీరు నాకు ప్రపంచంలోని ఇతర దేశాల ప్రభుత్వ రూపం గురించీ, వారి బలాలూ బలహీనతల గురించీ, వారి యుద్ధ సామర్థ్యం వ్యూహాలూ పద్ధతుల గురించీ, ఏమి చెప్పారు? చరిత్ర అధ్యయనం  చేశారా మీరు? లేదు. నాకేం చెబుతారు? అంతెందుకూ-మనదేశంలో ఏయే సంస్థానాలూ, రాజ్యాలూ ఏయే రీతుల్లో పాలింపబడుతున్నాయో, ప్రజల జీవన విధానం ఏమిటో తెలిపారా? లేదు. భౌగోళిక శాస్త్రం తెలియని రాజు రాజ్యపాలనేం చేస్తాడు?’’ అని ఆగి తలవంచి, ఓరకంటితో పండితరాయల వంక చూస్తూ ‘‘ఏమి పండితరాయల వారూ చెప్పండి. మీ దారాకి మీరేం నేర్పారు? ఉపనిషత్తులూ, యోగవాసిష్టమూ, భగవద్గీతా? దేనికి అవన్నీ? వారు తమ కొత్త మతాన్ని కనిపెట్టు కోవటానికా? చివరికేం జరిగింది? సమూఘర్‌ ‌చేరే సైన్యానికి ఆయన సరియైన పథనిర్దేశం చేయలేక పోయాడు. అక్కడే గదా మీరు గురుకులం పెట్టించింది?’’ అని అడిగాడు.

మందిరమంతా గాలి బిగదీసినట్లున్నది. కూర్చున్నవారు స్తంభీభూతులైనారు. తాను నేలచూపులతో నిస్సహాయశ్రోత అయినాడు. కన్నీళ్లని రెప్పల మాటున బిగబట్టాడు.

కొద్ది విరామం తర్వాత మళ్లీ అందుకున్నాడు పాదుషా, ‘‘పండిట్‌ ‌జీ… మీరు చెప్పండి… షాజహాన్‌ ‌వారు కళాపోషకులు కావచ్చు. కానీ, వారు చేసిన సన్మానాలూ, సత్కారాల ఖర్చు ఎంత?- ఒక్కరికోసం అందరి సొమ్మూనా? అందరికోసం అందరి సొమ్మూనా? పాలకుడు ఏ విధానాన్ని అనుసరించాలి’’ అని ‘‘ఒక్కటే మాట. ఇకనుంచీ ఇవేమీ సాగనివ్వము. అయితే మా కారుణ్యం వలన మీకు జీవనభృతి లోటు చేయము. మీ శిష్యులకు భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యల్ని బోధించటం ప్రారంభించండి’’ అంటూ దివాన్‌ ‌రఘునాథరాయ్‌ ‌వైపు చూశాడు. ఇక చాలు నడవండన్న సూచన! నోరు కట్టేసినట్లయింది. కదిలాడు.

అయితే, ‘తాను చదివిన చదువూ, శాస్త్రాలూ, సాహిత్యం, వేదవేదాంత తర్క మీమాంస వ్యాకరణాది వాఙ్మయం-సర్వమూ అర్థ్ధరహితమైనవేనా? ఎన్నో భాషల నుండి తాను నేర్చుకున్న దాని సంగతి సరే, శిష్యులకు నేర్పినదీ వ్యర్థపద వ్యాయామ క్రియయేనా? పండితరాయ పదవిలో ధర్మ నిర్ణయం చేస్తూ, న్యాయమార్గాన్ని సూచిస్తూ క్లిష్ట సమయాల్లో పాదుషా వారిని ఆదుకోలేదా? ప్రజలంతా ఆ నిర్ణయాల్నీ, మార్గాల్ని ఔనన్నారు కదా!’ ప్రశ్నలు భూతాల్లా నిలిచాయి.

కేవలం శాస్త్రాలూ, సాహిత్యమూ చదివి, సిద్ధాంత ప్రవచనాలతో సరిపెట్టుకున్నాడా తాను? లేదే. చేసిన ప్రతి పనిలోనూ- సామాజికత- సమన్యాయం, వసుధైక కుటుంబ భావనల్ని ఆచరణాత్మకం చేసి మరీ కర్మిష్టిగా అంతో ఇంతో పేరు తెచ్చుకున్నాడే! జంతుబలి మూఢాచారాన్ని నిరసించటం, ముస్లిం బాలునికి వేదాలు చెప్పటం, ముస్లిం యువతీ యువకులకు స్త్రీ స్వేచ్ఛా స్వావలంబనల ప్రాధాన్యతని బోధించటం, చివరికి ప్రయాణాల్లో కూడా మత ఘర్షణల్ని వారించటం – ఇవన్నీ తన ప్రమేయంతో అంతో ఇంతో సాంఘిక మార్పుకి అదనపు చేర్పులూ, కూర్పులే కదా?

అయితే, ఇలా సమాధానపడితే, అది ఏ వ్యక్తిత్వానికి చిహ్నమౌతుంది? ఈ పాదుషా నీడన కొలువు సాగిస్తే అది ఏ నైతిక విలువలకి తార్కాణ మవుతుంది? తన ఆత్మగౌరవ దాసోహానికి నిదర్శనం కాబోదూ?

ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు దేహమంతా కంపించింది.

ఉన్నట్టుండి ఆగ్రా కోట కనుల ముందుకొచ్చింది. అందులో షా బురుజు ఖైదు! అక్కడి నుంచీ షాజహాన్‌ ‌చూపులు దీనంగా తాజమహలును చూస్తున్నాయి. చక్రవర్తి దీనముఖం! దయనీయమైన దృశ్యం!

జగన్నాథుని మేధ ఒక ఉన్మత్తస్థితిలో యోచనాయోచనల సంధిలో కొట్టుమిట్టాడ సాగింది.

                                                                                                           *       *       *

అన్ని ఆలోచనల తర్వాత శాస్త్రిని, సుభాషిణిని కాశీకి పంపించేశాడు జగన్నాథుడు. తాను మిగిలాడు! -ఈవేళ పగలంతా తన ఉనికీ, మనుగడల గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఢిల్లీలో ఉండే అవకాశం లేదు. అవసరమూ లేదు. మరి, తర్వాతి మజిలీ?

ఎప్పుడో చదరంగం ఆడే సమయంలో షాజహాన్‌ ‌ప్రసక్తానుప్రసక్తంగా ప్రాణనారాయణుని గురించి ప్రస్తావించారు. కామరూపం తలపుల్లోకి వచ్చింది. అదే తన భవిష్యత్‌ ‌మజిలీయా?

జగదాభరణం కావ్యాన్ని తీశాడు. మార్పులూ, చేర్పులూ కొన్ని చేసి, గ్రంథనామాన్ని ‘ప్రాణాభరణం’ అన్నాడు.

నిద్ర ప్రయత్నం ఫలించలేదు జగన్నాథుడికి. మంచం మీద పొర్లటమే మిగిలింది. బుర్ర అనేక ద్వంద్వాల మధ్య గిరికీలు కొడుతోంది. ప్రాణ నారాయణుని ప్రాపు కోరటం. షాజహాన్‌ ‌పేరు ఆ పాలకుని ముందు తనకు ఆపన్న ప్రసన్న హస్తం కావచ్చు. కానీ ‘ఢిల్లీశ్వరోవా…!’’ అన్న అంతటి దీమసాన్నీ పాతరేయటమేనా? ‘ఆకాశంబున నుండి…’ గంగావతరణం దృశ్యం కళ్లకు కట్టింది! ఎక్కడో దూరంగా తీతువు కూసింది. లేచి పడక మధ్యగా కూర్చున్నాడు. నీళ్లు తాగాడు. తలగడ పక్కగా ‘ప్రాణాభరణం’ కనిపించింది. చేతిలోకి తీసుకున్నాడు. పేరే వెక్కిరించింది. ఏమిటి-తాను చేసింది? ‘రసగంగాధరం’ మొదట్లో చేసిన బాస ఏమిటి? మరి ఇప్పుడు పూనుకున్న ఈ చర్య ‘కక్కుర్తి’ కాదూ? ఎంగిలి పదాలు కాదూ ఈ గ్రంథంలో కూరినవి? ‘ఎందుకూ-మనసు వంకరగీతలు గీస్తోంది? ఎందుకూ బుద్ధి ఇంకా ఏవో భూములేలాలను కుంటున్నది? దేనికోసం? రేపోమాపో కాబోయే ఊపిరి లేని కట్టెకోసమా?’

హఠాత్తుగా భగవానువాచ ‘అక్షర’ ప్రబోధనం పెదవులపై జాలువారింది. ‘సకల శాస్త్ర నిగమాగమ సారం’ ఏదో దీపకళికలా కనులముందు నిలబడింది. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఒక్కసారిగా మనసు నంతా వింత హాయి కమ్ముకుంది. గ్రంథాన్ని పక్కన పడేసి ఠక్కున లేచి గబగబా ఆవరణలోకి వచ్చేశాడు.

చల్లగాలి వీచింది. కర్తవ్య స్పృహలో ఇంతటి మహత్వం ఉన్నదా? అనిపించింది. చిరునవ్వు విరిసింది. ఆనందంతో చుట్టూ చూశాడు… ఇప్పుడు కాశీ గంగా తీర ప్రభాతరేఖలే స్వాగతమంటున్న ట్లయింది!

జగన్నాథుడు కాశీ వచ్చేశాడు. పూర్వ విద్యార్థి చక్రపాణి ఆనందం అనిర్వచనీయమైంది. అతని భార్య రమాదేవికి భర్త ఆనందమే తన ఆనందం. ముగ్గురు పిల్లల్నీ పరిచయం చేశాడు. నాలుగు రోజుల్లోనే వారూ వీరూ బాగా కలిసిపోయారు. మనసులూ కలిసిపోయాయి.

చక్రపాణికీ, గురుకులంలోని శిష్యులందరికీ పండితరాయలవారి బోధన ఒక వరమయింది. ‘మనోరమా ఖండనమ్‌’‌నీ, ‘రసగంగాధరం’నీ-పూర్తి చేయటం, ‘భామినీ విలాసం’లో చివరి భాగాన్ని సరిచేయటం- ఇవీ మిగిలిన పనులు. ఆ పనుల్లో పడ్డాడు పండితరాయలు.

                                                                                                                 *       *       *

గంగాతీరం! సూర్యాస్తమయ కిరణాలు గంగా స్వాదుతరంగాలపై వింతవింత వర్ణాల్ని ప్రసరిస్తున్నాయి. నదిలో నావలు… నావల్లో సందర్శకులు. ఘాట్‌ అం‌తా కోలాహలంగా ఉంది. ఘాట్‌-‌పైమెట్టు మీద సమితి వారి వేదికలు. వాటిపై నగర ప్రముఖులు కొలువుతీరి ఉన్నారు.

చేతిలో పూలదండలతో ఎదురొచ్చారు కార్యకర్తలు. ‘పండిత్‌ ‌రాజ్‌కి జయహో’ అంటే ‘జయహో’ అంటూ నినాదాలతో జనం మూగారు. అధ్యక్ష కార్యదర్శ లిరువురూ జగన్నాథుని వేదిక మీదికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి పుష్పమాలాంకృతుని చేశారు. చక్రపాణి బృందానికీ సాదర స్వాగతం.

అధ్యక్షుడు నిలబడి, ‘‘మహాజనులారా -భక్తులారా… ఈరోజు మన అందరికీ ఒక ప్రత్యేక శుభదినం. ప్రతిరోజూ గంగాహారతి సందర్భంలో మనం పాడుతూ పరవశిస్తున్న ‘గంగాలహరి’ శ్లోకాల కర్త జగన్నాథ పండితరాజ్‌ ‌వారు ఈ మహానుభావులే! గంగాహారతి చరిత్రలో ఇదొక మహత్తరమైన రోజు’’ అంటూ అందరికీ పండితరాయల్ని చూపించాడు. అందరూ ఆనందంతో కరతాళధ్వనులు చేశారు. జగన్నాథుడు లేచి ముకుళిత హస్తాలతో శుభాకాంక్షలూ, ధన్యవాదాలూ చెప్పాడు.

ముందు గంగాస్తోత్రంతో హారతి మొదలైంది. తర్వాత ‘గంగాలహరి’ నుండి ఐదు శ్లోకాలు పఠించారు అపూర్వమైన దృశ్యం. దివ్యమైన అనుభూతి. అర్ధనిమీలితనేత్రాలతో, భక్తి పారవశ్యంతో తన్మయుడైనాడు జగన్నాథుడు. అక్కడున్న వారంతా-ఏదో తెలియరాని ఆత్మ చేతనత్వంతో పులకరించిపోయారు.

హారతి అయిపోయింది. ప్రసాద వితరణ జరిగింది. ప్రసాదాల్నీ, సేవా సమితి జ్ఞాపికనీ, విశ్వనాథ రూపునీ, ఇతర కానుకల్నీ ఇచ్చి వీరికి వీడ్కోలు పలికారు – సమితి అధ్యక్షుడూ, కార్యదర్శులూ.

గురుకులానికి చేరారు. ‘‘గురువుగారూ! మీరు ఢిల్లీ వెళ్లిన తర్వాత జరిగిన అపూర్వమైన శుభ పరిణామం ఇది. చాలా ఏళ్ల నుంచీ జరుగుతున్న నిత్య కార్యక్రమం ఇది. తెలుగు వారిగా మనకందరికీ ఇది గర్వకారణం.

‘గంగాలహరి’ పుణ్య గంగానదీ తీరంలో నిత్యం స్మరింపబడటం కన్నా మహద్భాగ్యం ఏమున్నది? మీరు పుణ్యులు. మన ‘తెలుగువారంతా ధన్యులం’ అని కైమోడ్చాడు చక్రపాణి.

జగన్నాథుని అంతర్ముఖీనతని భౌతిక స్థితికి లాగుతూ, బిలబిలమంటూ చాలా పెద్ద సమూహం గురుకులంలోకి ప్రవేశించింది. వారికి నాయకుని వంటి యువకుడు చెప్పాడు. ‘‘గురువుగారూ మేము 60 మందిమి. కన్నడ దేశం మైసూరు నుండి వస్తున్నాం. రుక్‌ ‌శాఖీయులం. మీ వద్ద వేదాధ్యయనం చేయటానికి వచ్చాము. మా గురువు బాల సుబ్రహ్మణ్యభట్టు గారికి జగత్సింహ మహారాజు గారి ఆస్థానంలోని కవిపండితులు-విశ్వనాథ వైద్యా గారు గురువులట. వారు మీ ప్రతిభా విద్వత్తు గురించి చెప్పటం వలన- మీ శిష్యరికానికి పంపారు. మీరు అనుగ్రహించాలి’’

జగన్నాథుడు మారుపలికేలోగానే చక్రపాణి ‘‘ఇది దైవసంకల్పం. చాలా సంతోషం’’ అన్నాడు. జగన్నాథుడు చిరునవ్వుతో తల పంకించాడు. ఆలోచనా క్రమం అంతర్వీక్షణంగా సాగింది.

అవును. ఎక్కడి నుండీ ఎక్కడి వరకూ సాగిందీ తన జీవన ప్రస్థానం-? ఎక్కడ ముంగండ? ఎక్కడ కాశీ, జయపురం, ఢిల్లీ, ఆగ్రా?! మజిలీలన్నీ దాటుకుని మళ్లీ కాశీ చేరడం! గంగా హారతి-గంగాలహరి!

నిన్న-నేడు ఎన్నో పరిణామాలు? ఎన్నెన్నో విపరిణామాలు? సరి, మరి-రేపు?

‘కానున్నది-రానున్నది’ ఎవరికెరుక? ఆ వెంటనే ‘బ్రహ్మ వేదాప్నోతిపరమ్‌’ (ఆత్మజ్ఞానంతో బ్రహ్మైకత్వం సాధించటమే అమరత్వం) అన్నది మననస్థితి! సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. తెమ్మెర తనువుని చల్లగా తాకింది! అది ‘గంగాలహరి’ శాశ్వత స్పర్శ!!

వచ్చేవారం కథ

సుమిత్ర

– ఎం. హనుమంతరావు

About Author

By editor

Twitter
YOUTUBE