హిందూ దేవాలయాలు పిక్నిక్ స్పాట్‌లు కావంటూ మద్రాసు హైకోర్టు అక్కడ దేవాదాయ శాఖకు మొట్టికాయలు వేయడానికి కారణం, తంజావూరులోని అతి గొప్ప ఆలయమైన బృహదీశ్వరాలయంలోకి అన్యమతస్తులు ప్రవేశించి, మాంసాహారాన్ని భుజించారంటూ పత్రికలలో వార్తలు రావడమే. మొదటి రాజ రాజ చోళుని కాలంలో నిర్మితమైన అత్యంత పురాతన ఆలయాలలో ఒకటైన తంజావూరులోని బృహదీశ్వరాలయం సహా అన్ని ఆలయాలను సరిగా పరిరక్షించి, నిర్వహించాలని కోర్టు చెప్పింది. కాగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ గోపురాన్ని కొందరు ప్రపంచంలోనే ఎతైన విమాన గోపురంగా అభివర్ణిస్తుంటారు. పర్యాటకు లను అచ్చెరువుకు గురి చేసే మరొక అంశం ఈ ఆలయం నీడ మధ్యాహ్న సమయంలో కూడా భూమిపై పడదు. సంవత్సరం పొడవునా ఇదే విధంగా ఉండేలా దీనిని డిజైన్ చేశారు.
చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీపై తంజావూరు ఉంది. చరిత్ర కారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది. చోళుల కాలంలో ఈ పురాతన ఆలయం నిర్మితమైనట్టు అక్కడి శిల్పకళా శైలి చెప్తుంది. సరైన నిర్వహణ లేక శిథిలమవుతు న్నందున దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా/ ప్రాంతంగా గుర్తింపు పొందింది.
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వ రాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం ప్రాచీన ఆలయంకన్నా చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతను తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరా లయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడుట. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం సహా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడి స్తాయి. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని నేటికీ• చాటుతున్నాయి.
వేయి సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యద్భుతంగా, కొత్తగా నిర్మించి నట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి.
ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. 13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో జరిగింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. ఇక్కడి శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు ఉంటుంది. ఇక ఈ ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం మరో విశేషం. ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
– జాగృతి డెస్క్