కనీవినీ ఎరుగుని రీతిలో 2024 సంవత్సరానికి గాను ఐదుగురుని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నకు ఎంపిక చేసింది. మొదట రెండు (కర్పూరి ఠాకూర్, లాల్ కృష్ణ అడ్వాణీ), కొద్ది విరామం తరువాత చౌధరి చరణ్‌సింగ్, పీవీ నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్‌లకు ఈ సమున్నత పురస్కారం ప్రకటించారు. ఆచితూచి తీసుకున్న ఈ నిర్ణయంతోనే దేశ రాజకీయాలలో సమీకరణలు మారిపోయాయి. చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవడమే మన తరం బాధ్యత అని ప్రధాని నిరంతరం చెబుతూ ఉంటారు. ఈ పురస్కారాలకు వ్యక్తుల ఎంపికలో చాలామంది రాజకీయమే చూసినా వాస్తవానికి దేశానికి కొందరు అందించిన విశిష్ట సేవలను విస్మరించకుండా గుర్తించడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ఈ అవార్డులు ఇచ్చిందని గమనించాలి.
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు
పాములపర్తి వెంకటనరసింహారావు స్వాతంత్య్ర సమరయోధులు. రచయిత. పీవీ(జూన్ 28, 1921-డిసెంబర్ 23,2004)గా ప్రసిద్ధుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన సేవలు భారత్‌కు కొత్త రూపాన్ని ఇచ్చాయి. ఆంధ్రదేశంలో భూసంస్కరణలకు ఆద్యుడు ఆయనే. జీవితాంతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. (1991`1996) వరకు పీవీ ప్రధానిగా వ్యవహరించిన కాలం ఆధునిక భారత చరిత్రకు గడ్డుకాలం. ఒక పక్క రాజకీయ అనిశ్చితి, మరొక పక్క అయోధ్య ఉద్యమం పతాకస్థాయికి చేరడం వంటి పరిణామాలు ఆ కాలంలోనే జరిగాయి.
కాంగ్రెస్ పార్టీలో పీవీ స్థానం ప్రత్యేకమైనదే. ఆ స్థానాన్ని ఛేదించడానికి చాలా కుయుక్తులే జరిగాయి. ఆయన నెహ్రూ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదిస్తూ ఉండేవారు. అదే బాధ్యతను ఇందిర పర్యటనలలోను నిర్వర్తించారు. విధానాలు, నిర్ణయాలకు సంబంధించిన తీర్మానాలను రాసే బాధ్యత ఇందిర, తరువాత రాజీవ్‌గాంధీ పీవీకి అప్పగించేవారు.
1991 నాటి లోక్‌సభ ఎన్నికలలో పీవీ నరసింహారావు పోటీ చేయలేదు. తన రాజకీయ జీవితం ముగిసిపోయిందని ఆయన గట్టిగా విశ్వసించారని సన్నిహితులు చెబుతారు. హైదరా బాద్‌కు మకాం మార్చివేద్దామని అనుకుంటున్న సమయంలో రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు. ప్రధాని పదవికి పీవీకీ, ప్రణబ్‌కుమార్ ముఖర్జీకీ జరిగిన పోటీలో పీవీ విజయం సాధించారు. ప్రధాని పదవికి చేపట్టడానికి ముందు ఆయన జీవితం మరొక మలుపు తీసుకోవలసి ఉంది. ఆయన ఒక మఠానికి అధిపతిగా వెళ్లవలసి ఉంది. కానీ చరిత్ర ఆయనను ప్రధాని గద్దె వైపు నడిపించింది. ప్రధానిగా ఆయన పదవిని చేపట్టిన కాలం చాలా కఠినమైనది. ఆయన మొదట ఆర్థిక సంస్కరణలు ఆరంభించారు. అందుకు రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్‌ను ఆర్థికమంత్రిగా నియమించుకున్నారు. విదేశాంగ విధానంలో కూడా తనదైన ముద్రను ఆయన వేశారు.
లుక్ ఈస్ట్ విధానం ఆయనదే. అంటరాని దేశంగా భావిస్తున్న ఇజ్రాయెల్‌తో ఆయన సంబంధాలు ఆరంభించారు. ఆ విధానంలోని వాస్తవికతను బట్టే తరువాత బీజేపీ ప్రభుత్వం కూడా యాక్ట్ ఈస్ట్‌గా ఇంకొక అడుగు ముందుకు వేసింది. అయితే దీనిని నెహ్రూ విధానాలకు అపచారంగా కాంగ్రెస్‌లో పీవీ వ్యతిరేకులు ప్రచారం చేశారు. ఆయన నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందనప్పటికీ ఐదేళ్లు పూర్తికాలం దేశ ప్రధానిగా పనిచేసిన తొలి కాంగ్రెస్ ప్రధాని. ఇలాంటి విశేషణం పీవీకి దక్కడం ఆ పార్టీ అధిష్ఠానదేవతలకి బొత్తిగా నచ్చలేదు. ఇంకా చెప్పాలంటే పీవీ మేధాశక్తిని గుర్తించడం కొత్త దేవతలకు ఇష్టమే లేదు. తమ కుటుంబీకులే కనుక అధికారంలో ఉంటే బాబ్రీ కట్టడం కూలేది కాదని రాహుల్ వాగాడంబరం కూడా ప్రదర్శించాడు. నెహ్రూ, ఇందిర కాలానికి మించి రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీల కాలంలో కాంగ్రెస్‌లో వ్యక్తి పూజ జుగుప్సాకర స్థాయికి చేరుకుంది. వీటి పతాకస్థాయి పీవీ మరణం తరువాత ఆయన భౌతిక దేహం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరించిన తీరు. దేశమే కాదు, ప్రపంచం మొత్తం ఆయన ఆర్థిక సంస్కరణలను ప్రశంసించినా, 1996 నాటి కాంగ్రెస్ ఓటమికి పీవీని బాధ్యులను చేశారు. పీవీ ఎంపిక చేసి తీసుకువచ్చిన మన్మోహన్ ప్రధాని అయిన ఎనిమిది మాసాలకే (2004) పీవీ కన్నుమూశారు. పీవీ మరణానంతరం ఆయన పట్ల కాంగ్రెస్ చూపించిన అనైతిక ధోరణి అత్యంత హీనమైనది. మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’లో ఈ వివరాలు ఉన్నాయి (ఆ యాక్సిడెంటల్ పీఎం మన్మోహన్ మాత్రమే). ఢల్లీిలోని ఎయిమ్స్‌లోనే పీవీ చనిపోయారు. ఆయన అంత్యక్రియలు ఢల్లీిలో జరగడం సోనియా, ఇతర కాంగ్రెస్ ప్రముఖులకు ఇష్టం లేదు. అవి హైదరాబాద్‌లో కానివ్వాలని వారి అభీష్టం. ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలిపే బాద్యతను బారు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా ఆయన భౌతికకాయానికి సరైన మర్యాద దక్కలేదు. దహనం కూడా పరిపూర్ణంగా జరగలేదు. ఆ దృశ్యాన్ని టీవీలలో చూసిన ఆయన అభిమానులు దహనం పూర్తిగా జరిగేటట్టు చేశారు. అదొక విషాద ఘట్టం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చరిత్రతో పాటు, పీవీ ఆత్మ కూడా కాంగ్రెస్ వైపు పరిహాసంగా నవ్వుతాయి.
ఆహార భద్రతకు అంకురార్పణ
వ్యవసాయశాస్త్రం క్షేత్రస్థాయిలో దుష్పరిణా మాలకు కారణమవుతుంటే, సంస్కరించడానికి వెనుకాడని వాస్తవిక దృష్టి ఉన్న శాస్త్రవేత్తగా స్వామినాథన్ దేశ ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. కోట్లాదిమంది ఆకలి తీర్చేందుకు మార్గాన్ని కనుగొన్న ఆ శాస్త్రవేత్తకు భారత ప్రభుత్వం ఇటీవలే భారతరత్నను ప్రకటించడం ఎంతైనా సమంజసం. దేశంలో ‘హరిత విప్లవానికి’ బీజాలు వేసిన కరువు, యుద్ధపరిస్థితుల్లో యువకుడుగా ఉన్న స్వామినాథన్ వాటి పరిష్కారం గురించి ఆలోచించారు. ఆ కృషి కారణంగానే పేద ప్రజలకు ఉచితంగా ఆహారధాన్యాలు ఇచ్చేంతగా పండిరచగలుగుతున్నాం. విదేశాల నుంచి ఆహార ధాన్యాలతో ఓడ వస్తేనే పొయ్యి మీదకు కుండ ఎక్కే పరిస్థితి నుంచి మిగుల ఉత్పత్తికి చేరుకునేటట్టు చేసిన ఘనత స్వామినాథన్‌దే. మనం పాకిస్తాన్‌తో నాడు యుద్ధాన్నీ గెలిచాం, కొద్ది సంవత్సరాలలో ఆహార భద్రతనూ సాధించాం. భారత ఆర్థిక చరిత్రలో ఇదొక ప్రత్యేక ఘట్టం. ఈ ఘట్టానికి కేంద్రబిందువుగా కనిపించే శాస్త్రవేత్త మాన్‌కొంబు సాంబశివన్ స్వామినాథన్ (ఆగస్ట్ 7, 1925`సెప్టెంబర్ 28, 2023). రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆయన రూపొందించిన సిఫారసులు కూడా చరిత్రాత్మకమైన పాత్రను నిర్వహిస్తున్నాయి.
డా॥ ఎం.ఎస్. స్వామినాథన్‌కు భారత ప్రభుత్వం భారత రత్న ప్రకటించిందని పేర్కొంటూ, ప్రధానమంత్రి మోదీ ఎక్స్‌పై పోస్ట్ చేశారు. ‘‘డా॥ స్వామినాథన్ వ్యవసాయం, రైతాంగ సంక్షేమానికి చేసిన చిరస్మరణీయ సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్నను ప్రకటించడం అత్యంత హర్షదాయకం. అత్యంత క్లిష్టమైన, సవాళ్లతో కూడిన సమయంలో వ్యవసాయంలో స్వావలంబన సాధించేందుకు భారత్‌కు తోడ్పడమే కాక, భారతీయ వ్యవసాయాన్ని ఆధునికం చేసే దిశగా ఆయన చేసిన విశిష్ట సేవలు, పోషించిన పాత్ర కీలకమైనవి. ఆవిష్కర్తగా, మార్గదర్శిగా, పలువురు విద్యార్ధులు అభ్యాసం, పరిశోధన చేసేందుకు ప్రోత్సహిస్తూ ఆయన అందించిన అమూల్యమైన సేవలను కూడా గుర్తిస్తున్నాం.
డా॥ స్వామినాథన్ దార్శనికతతో కూడిన నాయకత్వం భారతీయ వ్యవసాయ రంగాన్ని పరివర్తనకు లోను చేయడమే కాదు దేశ ఆహార భద్రత, సుభిక్షతను నిర్ధారించింది. నాకు అత్యంత సన్నిహితంగా తెలిసిన వ్యక్తి ఆయన. నేను ఎప్పుడూ ఆయన సూచనలకు, అంతర్దృష్టులకు విలువ నిచ్చాను,’’ అంటూ ప్రధాని మోదీ తన పోస్ట్‌లో కొనియాడారు.
నాటి భారత ప్రధానులు, లాల్ బహదూర్‌శాస్త్రి, ఇందిరా గాంధీ కాలంలోనే హరిత విప్లవ బీజాలు పడి మొలకలు వచ్చాయి. దానికి సూత్రధారులు నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్, ఎంఎస్ స్వామినాథన్. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 1968లో హరిత విప్లవం ప్రారంభమైంది. అత్యధిక పంట దిగుబడిని ఇచ్చే గోధుమ విత్తనాలతో ప్రారంభ మైన ఈ విప్లవం దేశంలో ప్రతి ఒక్కరి ఆకలినీ తీర్చే ప్రయత్నం చేసింది. అందుకే స్వామినాథన్‌ను హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తారు.
అధిక దిగుబడినివ్వగల విత్తన రకాలు, తగిన సాగునీటి సౌకర్యాలు, ఎరువులు ఇచ్చే అవకాశం హరితవిప్లవం కల్పించడంతో పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలోని సేద్యం నాటకీయంగా మెరుగుపడిరది. ఇది రైతులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఒకవైపు వరి, మరొకవైపు గోధుమల అధిక దిగుబడి రకాల రూపకల్పనపై స్వామినాథన్ సహా పలువురు పరిశోధకులు, శాస్త్రవేత్తలు పనిచేశారు. అయితే, భారతదేశంలో హరిత విప్లవానికి ఆధారభూతమైన ఎక్కువ నీరు, ఎరువులకు ప్రతిస్పందించే నూతన జన్యు రకం లేదా నారు రకాన్ని పరిచయం చేయాలన్న ప్రాథమిక వ్యూహాత్మక దార్శనికత మాత్రం స్వామినాథన్‌దేనని ఒక పత్రిక పేర్కొనడాన్ని ఎవ్వరూ కొట్టి పారేయలేరు. హరిత విప్లవం ప్రారంభమైన ఒక దశాబ్ద కాలంలోనే భారత్ ఆహార కొరత దేశం నుంచి ఆహారధాన్యాల మిగులు దేశంగా అవతరించింది.
ఇంత పురోగతి సాధించినా, వ్యవసాయ సంక్షోభం రైతాంగాన్ని వీడక, రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తోంది. వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణాలలో ` భూ సంస్కరణల అజెండా పూర్తి చేయకపోవడం, నీటి నాణ్యత, పరిమాణం, సాంకేతిక శ్రమ, అలసట, వ్యవస్థాగత రుణాలు తగినంతగా, సమయానికి అందుబాటులో లేకపోవడం, మార్కెటింగ్ అవకాశాలకు హామీ లేకపోవడం కారణం.
వీటితో పాటుగా వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని జాతీయ రైతాంగ కమిటీ (ఎన్‌ఎఫ్‌సి) తెలిపింది. దీనికి పరిష్కారంగా రైతులకు భూమి, జలం, జీవ వనరులు, రుణం, బీమా, సాంకేతిక, విజ్ఞాన నిర్వహణ, మార్కెట్లు వంటి ప్రాథమిక వనరుల అందుబాటుపై రైతులకు నియంత్రణ ఉండాలని సూచించారు. వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలని ఎన్‌సిఎఫ్ సూచించింది. ఔషధ మొక్కలు, చమురు దిగుబడినిచ్చే మొక్కలు, లాభదాయకమైన సూక్ష్మజీవులు సహా కలపయేతర అటవీ ఉత్పత్తులకు వంటి జీవవైవిధ్యంలో ప్రాముఖ్యం కలిగి ఉన్న సంప్రదాయ హక్కులను పరిరక్షించాలంటూ ఆయన అధ్యక్షతన పని చేసిన కమిటీ నొక్కి చెప్పింది.
భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా మన్ననలు అందుకున్న స్వామినాథన్ 1987లో మొట్టమొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సహా పలు అవార్డులను, రివార్డులను అందుకున్నారు.
ఆకలితో పడుకోకూడదన్నవాడు
సాధారణ కుటుంబం నుంచి స్వతంత్ర భారతంలో అత్యున్నత పదవికి ఎదిగిన చౌధరి చరణ్‌సింగ్ దేశ వెన్నెముక అయిన గ్రామీణ సమాజాలకు అందించిన సేవలు చిరస్మరణీయం. దేశ ఐదవ ప్రధానమంత్రిగా రైతుల సమస్యల పట్ల ఆయన నిబద్ధత, వారి సంక్షేమం, భూసంస్కరణల కోసం ఆయన చేసిన పోరాటం చరణ్‌సింగ్ (డిసెంబర్ 28, 1902`మే 29, 1987) రాజకీయ జీవితంలో కీలకమైనవి. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తిస్తూ ఇటీవలే దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన సేవలను స్మరించుకోవడం ఉచితం.
‘దేశ మాజీ ప్రధానమంత్రి చౌధరి చరణ్ సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం మన ప్రభుత్వానికి దక్కిన గౌరవం. దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలకు ఈ గౌరవం అంకితం’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌పై అవార్డును గురించి ప్రకటించారు. తన మొత్తం జీవితాన్ని రైతాంగ హక్కులు, సంక్షేమం కోసం సింగ్ అంకితం చేశారని మోదీ కొనియాడారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా, ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూడా ఆయన దేశ నిర్మాణానికి ఉత్తేజాన్ని ఇచ్చారన్నారు. ఆయన ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించి నిలబడ్డవారని, ఆ సమయంలో ఆయన ప్రజాస్వామ్యం పట్ల చూపిన నిబద్ధత స్ఫూర్తిదాయక మన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవసాయ రంగంలోని సమస్యలను, గ్రామీణ సమాజాలను దుస్థితి నుంచి బయటకు తెచ్చేందుకు భూసంస్కరణలలో ఆయన కీలక పాత్ర పోషించారు. రైతాంగం, గ్రామీణ జనాభా హక్కుల కోసం ఆయన కృషి, పోరాటం ఆయనకు భారతీయ రైతుల పక్షపాతి అనే పేరు తెచ్చి పెట్టాయి.
తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌తోనే ప్రారంభించినప్పటికీ, 1967లో యూపీలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీకి ఆయన రాజీనామా చేయడం నాడు సంచలనం. జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే ముందు ఆయన ఆ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఈ క్రమంలోనే ఆయన భారతీయ క్రాంతి దళ్ (బీకేడీ) అనే పార్టీని ఏర్పాటు చేశారు. అయితే, 1974లో తన పార్టీని సంయుక్త (యునైటెడ్) సోషలిస్ట్ పార్టీలో విలీనం చేసి భారతీయ లోక్‌దళ్ (బీఎల్‌డీ)కి జన్మనిచ్చారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ బలమైన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ తదుపరి సంవత్సరంలో ఆమె ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు, ఇతర ప్రముఖ ప్రతిపక్ష నాయకులతోపాటు చరణ్‌సింగ్‌ను ఖైదు చేసింది. ఎమర్జెన్సీని ఎత్తివేసిన అనంతరం మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో బీఎల్‌డీ కీలక పాత్ర పోషించింది. కాంగ్రెస్ (ఒ), బీఎల్‌డీ, జనసంఫ్‌ు, సోషలిస్టు పార్టీలతో మార్చి 1977లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో మార్చి 24, 1977 నుంచి 1978 జులై 1వరకు కేంద్ర హోంమంత్రిగా వ్యవహరించారు. పార్టీలో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో సింగ్‌ను డిప్యూటీ ప్రధాని, ఆర్ధికమంత్రిగా జనవరి 24, 1979న దేశాయ్ నియమించారు. ఆ ఏడాది జులై వరకు పదవిలో ఆయన కొనసాగారు.
ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కడా చల్లపడే సంకేతాలు కనిపించకపోవడంతో దేశాయ్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. జనతాపార్టీ రెండుగా విడిపోయి, జనతా పార్టీ (సెక్యులర్) కొత్తగా ఏర్పడిరది. ఇదే జనతా ప్రయోగ క్షీణతకు ఆది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటూ ముందుకు వచ్చిన సింగ్, జులై 28, 1979న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే, తన ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను, తమ ప్రాధాన్యతలను గురించి దేశానుద్దేశించి ప్రసంగించారు. తాను ముందుగా ప్రజా సేవకుడిగా ప్రజలతో మాట్లాడుతున్నానని, దారిద్య్రాన్ని నిర్మూలించి, ప్రతి పౌరుడికి కనీస మౌలిక సదుపాయాలు అందు బాటులో ఉండేలా చూడాలని ఆయన అన్నారు.
ప్రజలు తమ ఉనికి కోసం చేసే పోరాటాలను మించి మన విలువలను, స్వప్నాలను వెక్కిరించేది మరేదీ ఉండదనే విషయాన్ని దేశ రాజకీయ నాయకత్వం గుర్తు పెట్టుకోవాలని ఆయన నాడే హెచ్చరించారు. ఏ పసివాడూ కూడా ఆకలితో నిద్రపోయే పరిస్థితి రాకుండా చూడడమే రాజకీయ నాయకులకు దేశభక్తితో కూడిన లక్ష్యమంటూ ఆయన అన్న మాటలు నేటికీ సత్యాలే. దానితో పాటుగా ఆయన దేశంలోని నిరుద్యోగిత పెరగడాన్ని గురించి మాట్లాడుతూ, మంచి ఉపాధిని పొందేందుకు అన్ని అర్హతలూ ఉన్న యువత పనీపాటా లేకుండా కూచోవలసి రావడం శోచనీయమని అన్నారు.
ఆయన పార్లమెంటులో తమ మెజారిటీని రుజువు చేసుకోలేకపోయారు. ఆరవ లోక్‌సభ 1981 మార్చిలో పూర్తవ్వవలసి ఉన్నప్పటికీ, నాటి అధ్యక్షుడు నీలం సంజీవరెడ్డి ఆగస్టు 22, 1979న సభను రద్దు చేశారు. దీనితో సింగ్ జనవరి 14,1980 వరకు తాత్కాలిక ప్రధానిగా పని చేశారు. మొత్తం 170 రోజులపాటు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన, ఆయన పార్టీ కూడా మంచి స్థానాలనే సంపాదించి, పార్లమెంటులో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించినా, కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ గెలవడంతో ఆయన ప్రభుత్వంలో చేరలేదు. ప్రధానిగా ఉన్న ఇందిర 1984లో హత్యకు గురైన అనంతరం జరిగిన ఎన్నికలలో కూడా ఆయన కాంగ్రెస్ ప్రత్యర్ధిని ఓడిరచి తన స్థానాన్ని నిలుపుకున్నప్పటికీ, ఆయన పార్టీ ఘోరపరాజయం పాలైంది. ఏ విధంగా చూసినా భారతదేశంలో రైతాంగ ఉద్యమాలు బలపడడంలో, వాటికి రాజకీయ ప్రాధాన్యం చేకూర్చడంలో చరణ్‌సింగ్ పాత్ర కీలకమైనది.