రెండేళ్ల తర్వాత రైతులు మళ్లీ ఉద్యమబాట పట్టారు. కనీస మద్దతు ధర (ఎం.ఎస్‌.‌పి)కు చట్టబద్ధత కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు ఇతర అంశాలపైనా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. పంజాబ్‌, ‌హరియాణా, ఉత్తరప్రదేశ్‌ ‌లకు చెందిన రైతులు దాదాపు 200 యూనియన్లతో దేశ రాజధాని ఢిల్లీపైన దండ యాత్రకు సిద్ధమైన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం చండీగఢ్‌లో రైతు నాయకులతో చర్చలకు వచ్చింది. నాలుగు దఫాలుగా సాగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఎంఎస్పీపై రాజీ ప్రసక్తిలేదని ప్రభుత్వం నుంచి తమకు స్పష్టమైన హామీ లభించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే రైతు ఉద్యమం మళ్లీ గతంలోని ఆరోపణలనే ఎదుర్కొంటున్నది. అది ఖలిస్తానీవాదుల అల్లరనే చాలామంది అభిప్రాయపడుతున్నారు.

కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వాల వ్యవసాయ ధరల నిర్ణయ విధానంలో భాగం. ప్రొఫెసర్‌ ‌స్వామినాథన్‌ ‌నేతృత్వంలో ఇద్దరు పూర్తికాల సభ్యులు, నలుగురు తాత్కాలిక సభ్యులతో కూడిన నేషనల్‌ ‌కమిషన్‌ ఆన్‌ ‌ఫార్మర్స్ (ఎన్సీఎఫ్‌) ‌బృందం పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని సిఫార్సు చేసింది. రైతుల పట్ల తీవ్రమైన సానుభూతిని ప్రదర్శిస్తూ అనేక ప్రతిపాదనలు చేసింది. డిసెంబరు 2004 నుంచి అక్టోబరు 2006 మధ్య మొత్తం 1946 పేజీలతో ఐదు నివేదికలు సమర్పించింది. స్వామినాథన్‌ ‌కమిషన్‌ ఎక్కడా కూడా రైతు నేతలు చెబుతున్నట్టు ఎంఎస్పీకి చట్టబద్ధత, లేదా దాని లెక్కింపునకు ఫార్ములా అన్న అంశాన్ని ప్రతిపాదించ లేదు. ఎంఎస్పీ అనేది వెయిడ్‌ ఏవరేజ్‌ ‌కాస్ట్ ఆఫ్‌ ‌ప్రొడక్షన్‌ ‌కంటే 50 శాతం అధికంగా ఉండాలని మాత్రమే సూచించింది.
అమలు చేయటం కష్టమే
రైతులు కోరుతున్న విధంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌ ‌పి)కు చట్టబద్ధత, అమలు కష్టమని నిపుణుల అభిప్రాయం. కారణం- ఆర్థికరంగంపైన అది చూపించే ప్రభావం. ఇంకా అన్ని పంటలకు ఒకే విధానం అమలు చేయటం అసంబద్ధం కూడా. ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలంటే, ప్రభుత్వం ఏటా రూ. 17లక్షల కోట్ల అదనపు వ్యయాన్ని భరించవలసి వస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాద•ని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వం గనక ఎంఎస్పీ ప్రకటించిన 23 పంటలను మొత్తం కొనేసినట్టయితే అనేక అంశాల పైన దాని ప్రభావం ఉంటుందని క్రిసిల్‌ ‌మార్కెట్‌ ఇం‌టెలిజెన్స్ అం‌డ్‌ ఎనలటిక్స్ ‌డైరక్టర్‌-‌రీసెర్చి పుషాన్‌ ‌శర్మ పేర్కొన్నారు. ‘కనీస మద్దతు ధర కంటే తక్కువగా మండీలలో ట్రేడ్‌ అయ్యే పంటలను మాత్రమే ప్రభుత్వం ప్రొక్యూర్‌ ‌చేసినా, మా లెక్కల ప్రకారం, ప్రభుత్వం ఈ వ్యవసాయ సంవత్సరంలో (2023)లో 6లక్షల కోట్ల వర్కింగ్‌ ‌కేపిటల్‌ అవసరం అవుతుంది. మొత్తం 23 పంటల్లో 16 పంటల్ని, మొత్తం ఉత్పత్తి అయ్యే పంటల్లో 90 శాతం ఉత్పత్తిని ఏజెన్సీ పరిగణనలోకి తీసుకుంది’ అని ఆయన వివరించారు. కనీస మద్దతు ధరకు, మండీ ధరలకు మధ్య వ్యత్యాసం రూ 21వేల కోట్లుగా అంచనా వేసినట్టు చెప్పారు. కనీస మద్దతు ధర కంటే ధరలు తక్కువ స్థాయికి చేరినప్పుడు రైతులకు ఆర్థిక సాయం అందించటం, తమకు నచ్చిన పంటలను సాగు చేసే అవకాశాన్ని ఇవ్వటం అనేది రైతుల డిమాండ్‌.
‘ఎంఎస్పీ ఆదర్శవంతమైన మద్దతు ధర గానీ అది మొదటి ఎంపిక కాదు. అది చివరికి ఎంచుకోవలసిన అంశం. కానీ ఏటా అది పెరుగుతూ రావటం వల్ల కాలగమనంలో అది మొదటి అంశమై పోయింది’ అన్నారు బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ఎకనమిస్ట్ ‌మదన్‌ ‌సబ్నావిస్‌. ‌ధాన్యం, గోధుమలను ఏటా ప్రొక్యూర్‌ ‌చేయటం సాధ్యం అవుతుంది గానీ ఇతర పంటలకు సాధ్యం కాదు. ‘ఎంఎస్పీని ఒక చట్టంగా చేస్తే, ప్రభుత్వం తన ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా దాన్ని అమలు చేయటానికి ఏటా కొంత మొత్తాన్ని పక్కన ఉంచుకోవలసి వస్తుంది. వేతనాలు, పెన్షన్ల మాదిరిగా’’ అన్నారు ఇండియా రేటింగ్స్ అం‌డ్‌ ‌రీసెర్చి సీనియర్‌ ‌డైరక్టర్‌, ‌ప్రిన్పిపల్‌ ఎకనమిస్ట్ ‌సునీల్‌ ‌సిన్హా,. వ్యవసాయం అనేది తగినంత ప్రతిఫలాన్ని అందించకపోవటంతో, ఎంఎస్పీని చ•ర్చల ద్వారా నిర్థారించవలసిన పరిస్థితి అన్నారు.
కమిషన్‌ ‌ఫర్‌ అ‌గ్రికల్చరల్‌ ‌కాస్టస్ అం‌డ్‌ ‌ప్రైసెస్‌ (‌సీఏసీపీ) సంస్థల ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం కనీసమద్దతు ధరను ప్రకటిస్తుంది. 2018-19 సంవత్సరం కేంద్ర బడ్జెట్లో సగటు ఉత్పత్తి ధర కంటే 50 శాతం అధికంగా కనీస మద్దతు ధరగా నిర్ణయిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఆహార ధాన్యాల సేకరణ 2014-15లో 761.40 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల నుంచి 2022-23 నాటికి 1062.69 లక్షల మెట్రిక్‌ ‌టన్నులకు చేరింది. 16 మిలియన్ల కంటే ఎక్కువ మంది రైతులు దీని వల్ల లబ్ధి పొందుతున్నారు. ఆహారధాన్యాల సేకరణకు అయ్యే ఖర్చు రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 2.28 లక్షల కోట్లకు పెరిగింది’ అని లోక్‌సభలో వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ‌ముండా ప్రకటించారు. ప్రస్తుతం 22 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించారు.
ఆందోళనలలో తేడా ఏమిటి?
1. 2020 లో రైతుల ఆందోళన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగింది. దానిని కేంద్ర ప్రభుత్వం ఏడాది తర్వాత 2021లో తొలగించింది. అవి ఫార్మర్స్ ‌ప్రొడ్యూస్‌ ‌ట్రేడ్‌ అం‌డ్‌ ‌కామర్స్ (‌ప్రమోషన్‌ అం‌డ్‌ ‌ఫెసిలిటేషన్‌) ‌యాక్ట్, ‌ది ఫార్మర్స్ (ఎం‌పవర్‌మెంట్‌ అం‌డ్‌ ‌ప్రొటెక్షన్‌) అ‌గ్రిమెంట్‌ ఆఫ్‌ ‌ప్రైస్‌ ఎస్సూరెన్స్ అం‌డ్‌ ‌ఫార్మ్ ‌సర్వీసెస్‌ ‌యాక్ట్, ‌మూడోది.. ది ఎస్సెన్షియల్‌ ‌కమోడిటీస్‌ (ఎమెండ్‌ ‌మెంట్‌) ‌యాక్ట్. ఇప్పుడు ఢిల్లీ చలో ఆందోళన.. అన్ని పంటలకు కనీసమద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, రైతులకు రుణహామీ, పెన్షన్‌ ‌సదుపాయాలు కల్పించాలని, స్వామినాథన్‌ ‌కమిషన్‌ ‌ఫార్ములాను అమలు చేయాలని, 2020లో ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను తొలగించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. అలాగే లఖింపుర్‌ ‌హింసలో బాధితులకు న్యాయం చేయాలని, 2013 భూస్వాధీన చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని, 2020-21 ఆందోళనల్లో మృత్యువాత పడిన రైతులకు పరిహారం అందించా లని కూడా కోరుతున్నారు.
2.2020 ఆందోళనలకు భారతీయకిసాన్‌ ‌యూనియన్‌, ‌సంయుక్త కిసాన్‌ ‌మోర్చాలు నాయకత్వం వహించాయి. ఢిల్లీ చలో ఆందోళన వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో సాగుతోంది. యూనియన్ల స్వరూపంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం సంయుక్త్ ‌కిసాన్‌ ‌మోర్చా (రాజకీయేతర), కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌మోర్చాలు ఇప్పటి ఆందోళనను ముందుండి నడిపిస్తున్నాయి.
3.రాకేష్‌ ‌తికాయిత్‌, ‌గుర్నామ్‌ ‌సింగ్‌ ‌చారుని, 2020 రైతుల ఆందోళనల్లో ప్రముఖ పాత్ర పోషించారు.ఇప్పుడు సంయుక్త్ ‌కిసాన్‌ ‌మోర్చా (రాజకీయేతర) కు చెందిన జగ్జీత్‌ ‌సింగ్‌ ‌దల్లేవాల్‌, ‌పంజాబ్‌ ‌కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌సంఘర్ష్ ‌కమిటీ జనరల్‌ ‌సెక్రటరీ శర్వాన్‌ ‌సింగ్‌ ‌పాంథర్‌ ‌నాయకత్వ బాధ్యతలు చూస్తున్నారు.
4. అప్పట్లో ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయటానికి ప్రభుత్వం అంగీకరించింది. కానీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధతకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ ఈ ధఫా ఢిల్లీ చలో ఆందోళనకు ముందే ఈ అంశం మీద చర్చించటానికి కేంద్రం సిద్ధమైంది.
5. 2020లో రైతులను ఢిల్లీ చేరటానికి అనుమతించారు. ఈ సారి అధికార యంత్రాంగం కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టింది.రోడ్లమీద బార్బ్ ‌డ్‌ ‌వైర్లు, సిమ్మెంట్‌ ‌బారికేడ్లు, మేకులు ఉంచి ఢిల్లీలోకి అడుగుపెట్టటాన్ని అడ్డుకుంది. ఢిల్లీ ప్రభుత్వం 144వ సెక్షన్‌ ‌విధించింది. హర్యానా ప్రభుత్వం పంజాబ్‌తో ఉన్న సరిహద్దును మూసి వేసింది. 2021 ఆందోళనలు పునరావృతం కాకుండా సరిహద్దుల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది. మొబైల్‌ ఇం‌టర్నెట్‌, ‌బల్క్ ఎస్‌ఎమ్‌ఎస్‌ ‌సర్వీసులపై నిషేధాన్ని విధించింది.
సరిహద్దుల్లో ఉద్రిక్తత
సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (రాజకీయేతర), కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌మోర్చా ‘ఢిల్లీచలో’ ఆందోళనకు పిలుపు మేరకు ఢిల్లీ బయలుదేరిన పంజాబ్‌ ‌రైతులను పంజాబ్‌ ‌హరియాణా సరిహద్దుల్లోని శుంభు, ఖానౌరి వద్ద భద్రతా సిబ్బంది నిలిపివేశారు. దాంతో బోర్డర్‌ ‌పాయింట్ల దగ్గర ఆందోళన చేసే రైతులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులతో చర్చలు ముగిసేదాకా, ఢిల్లీలో అడుగు పెట్టటానికి తాము ఎలాంటి ప్రయత్నాలుచేయమని చెప్పారు.ఇంకా పంజాబ్‌లో రైలు ట్రాక్‌లపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. రైతులు ఇచ్చిన భారత్‌ ‌బంద్‌ ‌పిలుపు నేపథ్యంలో పంజాబ్‌, ‌హర్యానాల్లో పలు చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. రైతుల ఆందోళన నాలుగో రోజున, 63 ఏళ్ల జియాన్‌ ‌సింగ్‌ ‌మరణించారు. రైతుల ఆందోళన సాగుతున్నతీరు, దాని ఖర్చవుతున్న తీరు, ట్రాక్టర్ల స్థానంలో కోట్లాది రూపాయల విలువైన వాహనాలు అక్కడకు రావటం వంటివి చూస్తుంటే, ఈ ఆందోళనకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు అని రాజస్థాన్‌ ‌మంత్రి జబర్‌ ‌సింగ్‌ ‌ఖర్రా వ్యాఖ్యానించారు. వివాదాస్పదమైన సట్లజ్‌- ‌యమున నీటి అంశాన్ని ఆయన ముందుకు తెచ్చి భారత్‌ ‌జలాలు పాక్‌కి మళ్లటం గురించి ఆలోచించాలని కోరారు.
ఈ ఆందోళన నేపథ్యంలో హర్యానా పోలీసులు అనేక వీడియో క్లిప్‌ ‌లను విడుదల చేశారు. శుంభు సరిహద్దు ప్రాంతాల్లో రైతులు ఉద్దేశపూర్వకంగా రాళ్లు విసురుతూ, భద్రతా సిబ్బందిని రెచ్చగొడుతున్న దృశ్యాలు ఇందులో కనిపించాయి. 25 మంది భద్రతా సిబ్బంది, 18 మంది హర్యానా పోలీసులు, ఏడుగురు పారామిలటరీ ఫోర్స్ ‌జవాన్లు ఈ ఘర్షణల్లో గాయపడినట్టు ‘ఎక్స్’ ‌వేదిక ద్వారా ప్రకటించారు. హరియాణా పోలీసులు ఆందోళనకారులపైన టియర్‌ ‌గ్యాస్‌ ‌షెల్స్, ‌రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి ‘బలవంతపు చర్యలకు’ పాల్పటంతో అనేక మంది గాయపడ్డారని రైతు నేతలు ఆరోపించారు.
చర్చల పర్యవసానం
పంజాబ్‌- ‌హర్యానా సరిహద్దుల్లో రైతులకు, భద్రతా సిబ్బందికి మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు దఫాలుగా చర్చలు నిర్వహించింది. రైతు నేతలు కేంద్రమంత్రుల మధ్య మొదటి సమావేశం ఫిబ్రవరి 8న, రెండో సమావేశం ఫిబ్రవరి 12న, మూడో సమావేశం15న, నాలుగో సమావేశం 18న సాగాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ‌ముండా, వాణిజ్య మంత్రి పియూష్‌ ‌గోయెల్‌, ‌హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ‌కేందప్రభుత్వ ప్రతినిధులుగా పాల్గొన్నారు. పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగ్వంత్‌ ‌మాన్‌, ‌వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్‌ ‌సింగ్‌ ‌కూడా పాల్గొన్నారు. ఈ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆందోళనను మరింత తీవ్రతరం చేసేందుకు రైతులు సిద్ధమవు తున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ‌వచ్చినా కూడా తమ ఆందోళన కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వంతో ఈ దఫా గానీ చర్చలు విఫలమైతే హరియాణా రైతుసంఘాలన్నీ ఆందోళనలో పాల్గొంటాయని భారత కిసాన్‌ ‌యూనియన్‌ ‌జాతీయ అధ్యక్షుడు గుర్నామ్‌ ‌సింగ్‌ ‌చారునీ పేర్కొన్నారు.
రైతు కమ్యూనిటీ నుంచి లభించే మద్దతు దృష్ట్యా పంటలకు కనీస మద్దతు ధర అన్న అంశం నుంచి ఏ ప్రభుత్వం వైదొలగదు. ప్రతిపక్షాలు కూడా దీని నుంచి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తాయి. రైతుల ఆందోళన నేపథ్యంలో తాము అధికారం లోకి వస్తే స్వామినాథన్‌ ‌సిఫార్సుల మేరకు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పటికే హామీ ఇచ్చింది. రాజకీయ అంశాలను పక్కనపెడిత, సన్న,మధ్య తరమా రైతులకు వ్యవసాయం అంతగా లాభసాటి కాకపోవటం, పెట్టుబడి ఖర్చు నానాటికి పెరిగి పోవటం, మార్కెట్‌ ‌శక్తులు, ప్రయివేటు ఆపరేటర్ల చేతిలో రైతులు బందీలు కావటం అనేది వాస్తవం. ప్రభుత్వం ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొని రైతు బతుకుల ముఖచిత్రాన్ని మార్చాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE